” నేటి భారతీయమ్”

“పిల్లలు – ఆలోచనలు”

     డాక్టర్ మజ్జి భారతి

“నేటి భారతీయమ్ ” అనే శీర్షికతో డాక్టర్ మజ్జి భారతి గారు తరుణి పత్రిక పాఠకుల కోసం ప్రతి వారం ఒక చక్కని కాలమ్ ను అందించే బోతున్నారు. డాక్టర్ మజ్జి భారతి గారు MBBS , MD పూర్తి చేసారు.
మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు తీసుకుని రచయిత్రి డాక్టర్ గా , సమాజ పరిశీలకులుగా వారి అమూల్యమైన అభిప్రాయాలను, అనుభవాలను ఈ ” నేటి భారతీయం ” కాలమ్ ద్వారా తరుణి పాఠకులకు అందించనున్నారు.
– సంపాదకులు .

రచయిత్రి పరిచయం:
డా. మజ్జి భారతిగారు మజ్జి చంద్రినాయుడు, లోలాక్షి దంపతులకు 1965లో డోలపేట గ్రామంలో (శ్రీకాకుళం జిల్లా) జన్మించారు. ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసించాక, శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిగా పనిచేసి, సూక్ష్మజీవ శాస్త్ర విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఆంధ్ర వైద్యకళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా, ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రొఫెసరు & విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు.

తన సాహితీ ప్రస్థానం గురించి చెప్తూ “కవితలు, కథలు వ్రాయడానికి ప్రేరణ అంటూ ఎవరూ లేరు. కాని, వ్రాయాలనే ఆలోచన చిన్నప్పటినుండే ఉంది. నాకు పదకొండేళ్ళ వయసులో తొలిసారి వ్రాసిన కవిత దేశభక్తి మీద. అప్పటినుండి మనసు స్పందించిన ప్రతిసారి ఆ భావాన్ని అక్షరబద్ధం చేయటం అలవాటు.
ఆలోచనలలో ఏదో అంశం స్ఫురిించగానే, దాన్ని కథగానో, కవితగానో, పద్యంగానో మరల్చి, అక్షరరూపం ఇస్తాను” అనే డా.భారతిగారు విద్యార్థులకు వైద్యవిద్యా బోధనతోపాటు నైతిక విలువలనూ నేర్పించేవారిలో ముందుంటారు. వృత్తిపరంగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

వ్రాయడంతోపాటు ఆమెకు చిత్రలేఖనమన్నా, ఛాయా చిత్రగ్రహణమన్నా మక్కువ ఎక్కువ. తీసిన ఛాయాచిత్రాలపై కవితలువ్రాసి స్నేహితులకు పంపించడం ఆమెకు ఇష్టమైన వ్యాపకం.

ప్రముఖ రచయిత శ్రీ అట్టాడ అప్పలనాయుడుగారి ప్రోత్సాహంతో పత్రికలకు కథలను పంపించడం మొదలుపెట్టిన ఈ రెండు సంవత్సర కాలంలో సుమారు 40 కథలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం, మాతృక, భూమిక, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, ప్రసారిక మొదలైన మాస పత్రికలలో, కథామంజరి, మాధురి, సంచిక, విహంగ, సారంగ, కౌముది, గో తెలుగు. కామ్ మొదలైన అంతర్జాల పత్రికలలో, వైద్యకళాశాలల మేగజైన్లలో, ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల మేగజైన్లో) ప్రచురింపబడ్డాయి.
మరియు “ఆలోచనాతరంగాలు” కథల సంపుటి 2022లో విడుదలయింది. మరొక కథల సంపుటి “వేకువ” ప్రచురణకు సిద్ధముగా వున్నది.

“పిల్లలు – ఆలోచనలు”

పిల్లలు వాళ్లకేమి తెలుసు అని చాలామంది పెద్దలు, పిల్లల మాటలు కొట్టిపడేస్తూ వుంటారు. పిల్లలు పూర్తిగా, వారి ఆలోచనలను వ్యక్తీకరించలేకపోవచ్చునేమో కాని, వారి వయసుకు తగిన ఆలోచనలు వారికీ వుంటాయి. మంచేదో, చెడేదో గ్రాహ్యం వుంటుంది. వారి విషయంలో మిగిలినవాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారనే విషయం వారికి బాగా అవగతమౌతుంది. వారికి సంబంధించిన విషయాన్ని నిర్ణయం చేసేటప్పుడు, వారి ఆలోచనలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.

పిల్ల /పిల్లవాడు, అందరితోనూ బాగానే వుండి, ప్రత్యేకంగా కొంతమంది దగ్గరకే వెళ్ళము అన్నప్పుడు… ఉదాహరణకు ఒక ట్యూషన్ వద్దన్నప్పుడు కాని, పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్ళను అన్నప్పుడు కాని… పిల్లలు యెందుకలా అంటున్నారనే విషయాన్ని మనం గట్టిగా పట్టించుకోవాలి. అంతేగాని చిన్న పిల్లాడేదో అన్నాడులే! వాడి మొహం, వాడికేమి తెలుసు… అని కొట్టి పడెయ్యకూడదు. పిల్లలు యేదైనా ఒక విషయం మనతో చెప్పాలనుకున్నప్పుడు, చాలా సహనంగా వారి మాటలు వినాలి. వారి ఉద్దేశ్యమేమిటో గ్రహించుకోగలగాలి.

గాని దానికి ముందు పిల్లలకు ఒక విషయాన్ని స్పష్టం చెయ్యవలసి వుంటుంది. వాళ్లు అబద్ధం చెబితే, దానికి తగిన పనిష్మెంట్ వుంటుందనే విషయం వాళ్లకు సున్నితంగా తెలియజెప్పాలి. వాళ్లు చెప్పిందే నిజమైతే, వాళ్లకు మనముంటామనే భరోసాను పిల్లలకు కల్పించగలగాలి. అప్పుడే పిల్లలు వారి మనసులో వున్నది స్వేచ్ఛగా మనతో పంచుకునే అవకాశం వుంటుంది. ఆ రకంగా పిల్లలు యేమనుకుంటున్నారో… వ్యక్తుల గురించి గాని, పరిస్థితుల గురించి గాని, వాళ్ళ యిష్టాయిష్టాల గురించి గాని, మనకు తెలిస్తే, దానికి తగినట్టుగా మనము కార్యాచరణ చెయ్యగలము. పిల్లలను చాలా ప్రమాదాల నుండి కాపాడగలము.

నేను నిజమే చెప్తే, మా అమ్మానాన్నల మద్దతు నాకుంటుంది. లేకపోతే వుండదనే విషయం వాళ్లకు చిన్నప్పటినుండే గ్రాహ్యమైతే, జీవితంలో వాళ్ళెన్నడూ అబద్ధాలు చెప్పరు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతారు. ఆ రకంగా పెరిగిన పిల్లలు బాధ్యతాయుతముగా వుండి చీటికిమాటికి అబద్దాలు చెప్పకుండా, వాళ్లు చేసే పనులకు కట్టుబడి ఉంటారు.

ఈ రకంగా తప్పొప్పులు తెలుసుకునేలా పిల్లలను పెంచితే, గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా, హాయిగా మనము హాయిగా వుండగలుగుతాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

శతక పద్యాలు. జీవన మార్గ సూచికలు