నాన్నల పండుగ సందర్భంగా

వ్యాసం

ఈరోజు నాన్నల పండుగ..(ఫాదర్స్ డే.)
‘నాన్నల పండగ’. అమ్మల పండుగ,
(మదర్స్ డే,ఫాదర్సుడే) ఏమిటి? ఇవన్నీ వింత పోకడలు… అని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.మన దైనందిన జీవితంలో రోజూ దేవుళ్ళకు పూజలు చేయడం మరియు పండగ పబ్బాలకు ప్రత్యేకంగా పూజలు చేసి పండగలు జరుపుకున్నట్టే నిత్యజీవితంలో రోజూ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ఏడాదికి ఒక రోజు ప్రత్యేకంగా వేడుక చేసుకోవడంలో తప్పేమున్నది? తప్పకుండా ఉండాల్సిందే.. పిల్లల్ని కని పెంచడంలో అమ్మా నాన్నల త్యాగము అణువణువునా కనబడుతుంది. అందుకే ‘మాతృ దినోత్సవము’,’పితృ దినోత్సవము’ ఉండడము అత్యంత అనివార్యం,ఆవశ్యకరము మరియు వేడుక జరుపుకోవడము మన కనీస కర్తవ్యము అని నా గట్టివాదన.ఈ పితృ దినోత్సవము సందర్భంగా మా నాన్నగారి గురించి కూడా చాలా చెప్పాలని ఉంది.మా ముగ్గురు పిల్లల మీద నాన్నగారు చూపే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు అమూల్యము.మా బాల్యంలో కూడా మమ్మల్ని క్రమశిక్షణగా పెంచడంలో అమ్మతోపాటు,మా నాన్నగారి పాత్ర కూడా ఎంతో ఉంది. మాఅమ్మ లో కొంచెం క్రమశిక్షణ పాలు ఎక్కువగా ఉండేది. మేము కొద్దిగా భయపడేవాళ్ళం. అందువల్ల మా నాన్నగారి దగ్గర చనువెక్కువ. మా పిల్లల సిఫారసులు ఎన్నో నాన్న దగ్గర నడిచేవి. చిన్నప్పుడు పాఠశాలలో క్లాసు పుస్తకాలు పోగొట్టుకుంటే ఆ విషయము నాన్నకు చెప్పి అమ్మ చూడకుండా కొనుక్కొని తీసుకొచ్చి మా పుస్తకాల సంచిలో పెట్టమని చెప్పేవాళ్లం. (నాన్న ద్వారా అమ్మకు తెలిసినా తెలియనట్టు ఉండేది.అది వేరే విషయము) మా నాన్నగారు ఇంటి విషయాలలో చాలా శ్రద్ధ చూపించేవారు. ఆఫీస్ విషయాలలో మంచి బాధ్యతగా వ్యవహరించే అయన అలుపెరుగని శ్రామికుడు. ఆయన పనిలో క్రమశిక్షణ, బాధ్యత ,అంకితభావము, గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో”ఉత్తమ సేవా ప్రశంసా పత్రము” మన ప్రియతమ ముఖ్యమంత్రి’ శ్రీ ఎన్టీ రామారావు గారి చేతులమీదుగా లాల్ బహుదూర్ స్డేడియంలోఅందుకున్న రోజును మేము మర్చిపోలేము. అది మాకు ఎంతో గర్వకారణము,ఒక మధురమైన జ్ఞాపకం మరియు మా అందరికీ స్ఫూర్తిదాయకం. నాన్నగారు తన తల్లిదండ్రుల పట్ల చూపే గౌరవము,తోబుట్టువులు మరియు వాళ్ళపిల్లలపై చూపే ఆదరాభిమానాలు చాలా ప్రత్యేకం. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో మా తాత గారికి చేదోడు వాదోడుగా ఉంటూ,ఆఫీసు పని సిన్సియరు గా,ప్రతిభావంతముగా చేయడంలో మంచి పేరు సంపాదించుకున్నారు. వర్కింగ్ డేస్ తో పాటు,ఆదివారాలు కూడా ఇంట్లో ఉండకుండా ఆఫీసుకు వెళ్లేవారు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చేవరకు రోజు రాత్రి 9, 10గం. అయ్యేది. ఆయన ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చేవరకు మేము నిద్రపోతుండే వాళ్ళం. మేము బడికి తయారై బయలుదేరే సమయానికి నాన్న నిద్రలేచేవారు కాదు. ఇలా ఎన్నో వారాలపాటు ఒకర్ని ఒకరు చూసుకోవడము కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఒక్క ఆదివారం మాత్రమే నాన్నకు మాతో మాట్లాడడానికి సమయం దొరికేది. ఆదివారం కూడా ఆఫీస్ పనితో చాలా బిజీగా ఉండేవారు, అయినా మాతోటి కాసేపు ముచ్చట్లు పెట్టేవారు. ఆ టైములో ఆ వారం రోజుల్లో మేము పిల్లలం ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకున్న, గిచ్చుకున్నా కంప్లైంట్లు ఏమైనా ఉంటే అవన్నీ ఎకరువు పెట్టేవాళ్ళం. మా నాన్నగారు ఎవరి తప్పయితే వాళ్లను ప్రేమతో మందలించేవారు. ఆ విధంగా మా ఆదివారం (భేటీ)
మీటింగు నాన్నతో సరదాగా జరిగేది.ఆ తర్వాత కొంచెం ఆలస్యంగా ఆఫీస్ కి వెళ్లేవారు. రోజు ఆఫీస్ నుంచి ఎంత అలస్యంగా వచ్చినా సరే చలికాలం వచ్చిందంటే ఒళ్ళు పగలకుండా మేము నోవా వ్యాస్లేన్(Nova vaselene) రుద్దుకొని, స్వెటర్ వేసుకొని పడుకున్నామా లేదా అని శ్రద్ధగా చూసి, ఏ రోజైనా బద్దకించి పడుకుంటే నిద్రలేపి మరీ ఆ రెండు పనులు చేయించేవారు. నాన్న రోజు ఉపయోగించే వస్తువులు కూడా మాటిమాటికి మార్చడానికి ఇష్టపడరు.ఫోర్ హాన్స్ టూత్ పేస్టు,మైసూర్ శాండల్ సబ్బు,అశోకా సాండల్ పౌడర్ ల వాడకం మా బుద్ది తెలిసి నప్పటినుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 5-6 దశాబ్దాలకు పైగా కంటిన్యూ అవుతున్నాయి.ఫోర్ హాన్స్ కంపనీ టూత్ పేస్ట్ తయారీ నిలిపివేయడము వలన విధిలేక వేరే పేస్టుకు మారాల్సివచ్చింది. నాన్నకు దువ్వెన,టవల్ లాంటి తన పర్సనల్ వస్తువులు వేరే వారితో షేర్ చేసుకోవడము నచ్చదు.ఇంట్లో తను పడుకునే మంచము, డైనింగ్ టేబుల్ కుర్చీ ,రోజు కూర్చునే సోఫా అసలు మార్చరు.ఇంకొక విషయము,మా నాన్న మితాహారి.అన్నము తినే టప్పుడు మూడు వాయిలు పప్పు/కూర , పులుసు, మజ్జిగ వాయి తప్ప తనకు ఎంత ఇష్టమైన కూర లేదా పులుసు ఉన్నా రెండోమారు కలపరు.మా ఇంట్లో బిస్కెట్లు, చాక్లెట్లు ఎప్పుడు స్టాక్ ఉండేవి. పిల్లల మయ్యే వరకు ఏమీ తోచక ఎన్ని తిన్నా ఇంకా ఏవో తినాలనిపించేది. రోజు మేము బడి నుంచి అన్నంబెల్లుకు ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ బడి కి వెళ్ళే సమయం లో నాన్న తన సైకిల్ మీద ఆఫీస్ నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వస్తూ మాకు ఎదురుపడేవారు.మేము మధ్యలో ఆపి పీచు మిఠాయి కొనుక్కుంటాము అని డబ్బులు అడిగే వాళ్ళం. ఆయన జేబులో చేయి పెట్టి చేతికి ఎంత చిల్లర వస్తే అంత చిల్లర మా ముగ్గురికి చేతిలో పెట్టేవారు. మేము రోజు బడి దగ్గర పీచు మిఠాయి కొనుక్కొని తినేవాళ్ళం. ఈ రహస్యం మా అమ్మ దాకా పోయేది కాదు. ప్రోగ్రెస్ కార్డులలో ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే కూడా బాగా చదవాలమ్మ అని సంతకం పెట్టేవారు గానీ, ఎప్పుడూ కోప్పడినట్టు మాకు గుర్తులేదు. మా నాన్నగారు స్థితప్రజ్ఞుడు. ఒకళ్ళను చూసి ఈర్షపడడం గాని, చులకనగా తక్కువచేసి మాట్లాడటం గానీ మేము ఎప్పుడు చూడలేదు.నాన్న గురించి ఒకళ్ళు పరుశంగా మాట్లాడటము కాని లేదా నాన్నఒకరి గురించి పరుశంగా మాట్లాడటము గాని ఇన్నేళ్ళ మా జీవితంలో చూచి ఎరుగము.సంతోషమైనా బాధైనా బయటికి వ్యక్తపరచకుండా ఒకే రకంగా కనపడతారు. కుటుంబం గురించి తప్ప వేరే వారి విషయాలలో వారు కోరుకుంటే తప్ప అంత ధ్యాస పెట్టరు. బంధుమిత్రులకు ఇష్టుడు. మేము పెరిగి పెద్దయినాక మాకు ఏమైనా సమస్యలు ,సందేహాలు వచ్చినా మంచి సలహాలు ఇవ్వడం, మా పిల్లల పెళ్లిళ్ళప్పడు పెద్దరికంగా వ్యవహరించడం, మాకు అండగా నిలబడి, నాన్న అన్ని విషయాలు చూసుకునేవారు. అలా నాన్న పెద్ద దిక్కుగా ఉంటే మాకు కూడా చాలా ధైర్యంగా, బేఫికర్ గా అనిపించేది.. మనవలు, మనవరాళ్లకు ప్రియమైన తాత. ముని మనవరాళ్లు, ముని మనవలకు పెద్దతాత. మా నాన్నగారు కొన్ని విషయాలలో చాలా ఖచ్చితంగా మాట్లాడుతారు. మనవలు, మనవరాళ్ళు ఆయనకు ముద్దుగా పెట్టుకున్న నిక్
నేమ్ లు(names) ‘భారతీయుడు,’ ‘టైగర్’. ప్రస్తుతం మా నాన్నగారి వయసు 87 సంవత్సరాలు. వయసు రీత్యా కొద్దిగా ఓపిక లేకున్నా తనకు చేతనైన పని సహాయం చేస్తారు. ఇప్పటికీ మేము
ముగ్గురు పిల్లలం మా నాన్న గారితో ఎప్పుడు నిర్లక్ష్యంగా మాట్లాడము. ఆయన మాటను ఇప్పటికి ఎంతో గౌరవిస్తాం.మా నాన్నగారు అంటే మాకు విపరీతమైన ప్రేమ,గౌరవం.ఫలానా ‘సత్యనారాయణ రావు గారు లేదా మిత్రులు,ఆఫీస్ కొలిగ్స్ఆప్యాయంగా పిలిచే BS Rao గారు మా నాన్నగారు అని చెప్పడానికి మాలో రవంత గర్వం కనిపిస్తుంది.అయన మాకు ఒక రియల్ హీరో.
(16.06.2024. ఫాదర్స్ డే సందర్భంగా)

Written by Jyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాన్న

మంగు కృష్ణకుమారితో ముఖాముఖి