ఓటు

కథ

                    విజయ గోలి

రండి ..రండి …లోపలికి రండి అంటూ ఎవరినో ఆహ్వానిస్తున్న కొడుకు గొంతులో ఆనందం తో కూడిన హైరానా వినిపించింది .
గదిలో పడుకున్న సౌభాగ్యమ్మకు.
అవతల వారెవరో అర్ధం కాలేదు .హాలులో చాలా మంది గొంతులు వినిపిస్తున్నాయి .అందులో కొడుకు రమణ స్నేహితుడు సారధి గొంతు కూడాఉంది .
ఒక సంవత్సరంగా ఆరోగ్యం బాగుండక పోయినా …తన పని తను చేసుకు పోయేది ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా …ఆరు నెలలుగా మనిషి సాయం లేకుండా లేవ లేకపోతుంది. దాదాపుగా మంచం పట్టినట్లే వుంది పరిస్థితి.ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా …అన్నీ బాగానే వున్నాయంటారు ..అంతు పట్టని రోగం అల్లాడిస్తుంది .
కొడుకు కోడలు బాగానే చూసుకుంటారు .తన పనులు చూడటానికి ప్రత్యేకంగా
ఒక మనిషిని కూడా పెట్టారు .
లక్ష్మమ్మా…అమ్మను మెల్లిగా లేపి కూర్చో పెట్టు. పనమ్మాయికి చెపుతున్న కొడుకు గొంతు .
“అలాగే సర్…అంటూ రూమ్ లోకి వచ్చింది లక్ష్మమ్మ…
మెల్లిగా సౌభాగ్యమ్మను లేపి కూర్చో పెడుతుంటే అడిగింది సౌభాగ్యమ్మ
“ఎవరు వచ్చింది …
“ ఓట్ల వాళ్ళంట సారధి బాబు గారు తీసుకొచ్చారు లక్ష్మమ్మ.
ఆ మాట పూర్తి కాక ముందే…రమణ ,సారధి లోపలకు వచ్చారు .వెనుక ఇంకెవరో ఉన్నారు .
“అమ్మా…మన సారధి వాళ్ళ బాబాయి మన నియోజక వర్గం ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు “ రమణ
“అవును అమ్మా …చాలా మంచి మనిషి ,పైగా మన మనిషి .మీ ఓటు కూడా బాబాయికి వెయ్యాలి “సౌభాగ్యమ్మ చేతిని పట్టుకుని అడుగుతున్నాడు సారధి.
“ మంచం మీద నుండి లేవలేని దాన్ని నేనేమి వేస్తాలే …నాన్నా…రమణ వాళ్ళు వేస్తారు లే “ సౌభాగ్యమ్మ
“అలా కాదు అమ్మా…ఇవాళ రేపు మీ లాంటి లేవలేని సీనియర్ సిటిజన్స్ కి మీ ఓటు మీ ఇష్టంగా వేసుకునే సదుపాయం కల్పించింది ప్రభుత్వం .
ప్రభుత్వ ఉద్యోగులు వారే ఇంటికి వచ్చి మీ ఓటు వేయించుకు వెళ్తారు . .
నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు . మీ ఓటు వేయించుకోవటానికి “ సారధి చెప్తున్నాడు .
సౌభాగ్యమ్మకు అర్ధం అయ్యే లోపు రమణ వచ్చి పక్కనే కూర్చొన్నాడు .
ఆ వచ్చిన వాళ్ళు ..ఏవోకాగితాలు ఇచ్చారు .అవి పూర్తిచేసి సౌభాగ్యమ్మను సంతకం పెట్టమన్నారు .
“అమ్మ చెయ్యి వణుకుతుంది …సంతకం పెట్ట లేదు .వేలి ముద్ర వేస్తుంది “రమణ
అలా …సౌభాగ్యమ్మ వేలు తనే పట్టుకుని వేలి ముద్ర వేసి …వాళ్ళు తెచ్చిన
బ్యాలెట్ పేపర్ పై సారధి బాబాయి ఎన్నికల గుర్తుపై ఓటు ముద్ర వేయించాడు .(తనే వేసేసాడు ) వేలి పై ఇంకు గుర్తు కూడా వేసారు .
“మీ ఇష్ట ప్రకారమే వేసారు కదమ్మా.. వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు
“చిరునవ్వుతో తల ఊపింది సౌభాగ్యమ్మ .
ఫొటోలు తీసుకున్నారు ..అందరూ బయటకు వెళ్ళి పోయారు.
“ కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా…గది తలుపు దగ్గరకు వేసి బయటకు వెళ్తూ …
రమణ .
పడుకున్న సౌభాగ్యమ్మ కాళ్ల పై దుప్పటి కప్పి లక్ష్మమ్మ కూడా బయటికి వెళ్లింది.

కళ్ళు మూసుకున్న సౌభాగ్యమ్మ కళ్ళముందు గతం కదలాడింది.
తనకు ఊహ తెలిసినప్పటినుండి ఎన్నికలు ,ఓట్లు చూస్తూనే ఉంది .
పుట్టి పెరిగింది పల్లెటూరే… ఆ ఊరి పెద్దగా తన తండ్రికి రాజకీయాల్లో పెద్ద పాత్రనే ఉండేది.
ఓట్లు వేసే రోజు ,ఫలితాలు తెలిసిన రోజు ఊరంతా ఒక పండుగే…తనకు బాగా గుర్తు
ఊరి మధ్యలో వున్న గవర్నమెంటు స్కూల్ పోలింగ్ సెంటర్ .అందరికీ వీలుగా ఉండేది .
ఎపుడూ బయటకు రాని ఆడవాళ్ళందరూ చక్కగా ముస్తాబై ఓటు వెయ్యటానికి వెళ్ళేవారు . వాళ్ళ చేత ఓటు వేయించి మళ్ళీ వాళ్ళను ఇంటి దగ్గర దించే బాధ్యతను ఇంట్లో చిన్నవాళ్లైన మగవాళ్లకు …అంటే అపుడు ఉమ్మడి కుటుంబాలు కదా…ఏ బాబాయిలో ,మామయ్యలకో ఎవరికో ఒకరికి అప్ప చెప్పే వాళ్ళు . నడవలేని నానమ్మలను ,అమ్మలను మెల్లిగా రిక్షా ఎక్కించి తీసుకెళ్లి ఓటు వేయించి జాగర్తగాతీసుకొచ్చే వాళ్లు . ఇంట్లో అందరి చేత వాళ్ళు చెప్పిన గుర్తు పై ఓటేసి వేలికి ఇంకు చుక్క పెట్టించుకుని వచ్చేవాళ్ళు .వచ్చే దారిలో ఒకళ్ళొకళ్ళని పలుకరించుకుంటూ చాలా సరదాగా ఉండేది .
స్కూల్ గేటు దగ్గర ఇద్దరు పోలీసులు తుపాకులు పట్టుకుని నిలబడేవారు .ముందు వాళ్ళని చూడగానే భయమేసేది .కానీ వాళ్ళేమీ అనే వాళ్ళు కాదు .పిల్లలని చూసి చిన్నగా నవ్వే వాళ్ళు.గేటుకు పది అడుగుల దూరంలో చెట్లకింద పోటీ చేసే అభ్యర్థులు …
కూర్చొని ఉండేవాళ్ళు …ఓటు వేయటానికి వచ్చే వాళ్ళకు వరుసలతో పిలుస్తూ నమస్కారాలు పెడుతూ ..తమకే వేయమని గుర్తు చేస్తుండే వాళ్ళు .
మా ఇంట్లో ఆ బాధ్యత మా నాన్నది …ఆయనే అందరినీ వెంట పెట్టుకు తీసుకెళ్ళేవాడు . నానమ్మ ,బామ్మ , చిన్న పిన్ని , పెద్ద పిన్ని చిన్నఅత్త ..అత్తవాళ్ళ అత్త గారు ఇలా ఇంట్లో వున్న ఓటువున్న ఆడవాళ్ళందరినీ వెంట తీసుకెళ్లి ఆయన చెప్పిన వాళ్ళకే ఓటు వేయించి తీసుకొచ్చేవారు .అమ్మా వాళ్ళు ఏ సినిమాకో వెళుతున్నట్లుగా భలే తయారయ్యేవారు . అమ్మల వెనుకే పిల్లలు మేము కూడా వెళ్ళేవాళ్ళం .
సరదాగా వేలి పై ఇంకు కూడా వేయించు కొచ్చేవాళ్ళం .తెల్లవారి స్కూల్ లో అందరికీ చూపించుకుంటూ నెలకానీ ఆ బాక్స్ లో వేసే కాగితం మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు.
ఇంకొక విషయం బాగా గుర్తు …తాతమ్మ అసలు మంచం మీద నుండి లేచేది కాదు .ఆమెను పొలం లో పనిచేసే వీరడు ,సుబ్బడు ఒక కుర్చీలో కూర్చోపెట్టి మోసుకెళ్శి ఓటు వేయించు కొచ్చారు .అలా ఎందుకో తెలియదు. కానీ ఓట్ల పండుగంటే అదొక సరదా. అంతే. ..గూడు రిక్షాలో గ్రామ్ ఫోను పాటలు వేస్తూ. మధ్యలో ఫలానా వాళ్ళకి ఓట్లు వేయండి అంటూ మైకుల్లో ప్రచారం .ఆ బండ్ల వెనుకే కొద్ది దూరం ఆ పార్టీ జెండాలు పట్టుకుని పరుగెత్తటం గమ్మత్తుగా ఉండేది.
మొత్తానికి ఓట్ల కార్యక్రమం అంతా ఒక నెల రోజులు చాలా సందడిగా వుండేది.
సౌభాగ్యమ్మకు ఓటు హక్కు రాకుండానే పెళ్ళి చేసారు . భర్త మన్మథరావు పక్కనే ఉన్న పల్లె టూరు లో ఎలిమెంటరీ స్కూలు టీచరు .దగ్గరి సంబంధం .మంచి మోతుబరి కుటుంబం . పక్క ఊరే కాబట్టి .దూరమనే సమస్య కూడా లేదు .
అలా సౌభాగ్యమ్మకు పదిహేను సంత్సరాలకే పెళ్ళి
జరిగింది . అత్త వారింట్లో కూడా ఆమెను చాలా బాగా చూసుకునే వారు.
తన ఓటు ఓటర్ల లిస్టులో నమోదయింది .
మొదటి ఓటు వేసే సమయానికి రమణ కూడా పుట్టాడు.
ఆ సంవత్సరం మన్మథరావు స్కూల్ హెడ్మాస్టర్ బావమరిది ఎన్నికల్లో నిలబడ్డాడు . వారం రోజుల ముందే వాళ్ళు ఇంటింటికీ వచ్చి పేరు పేరునా అందరికీ తమకే ఓటేయమని చెప్పి వెళ్ళారు .
మన్మధ రావు ముందునుండి అందరికీ చెప్తూనే వున్నాడు ఇంటిల్లిపాదీ అందరూ హెడ్ మాస్టర్ బావమరిది కే వేయాలని ,ఎందుకంటే తనది అసలే గవర్నమెంట్ ఉద్యోగం .బదిలీలు ఉంటాయి .
అలాంటి సమయం లో ఆయన మనకు ఉపయోగ పడతాడని చెప్పాడు.
మన్మథరావు సర్వీసంతా పుట్టిన ఊరిలోనే పూర్తయింది . అది వేరే విషయం .
ఓటు వేసే రోజు వచ్చింది . .తన చిన్నప్పటినుండి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది . మొదటి ఓటు వెయ్య పోతున్నానని. సౌభాగ్యానికి చాలా సంతోషంగాఉంది.చక్కగా ముస్తాబయింది .
“అమ్మా…భాగ్యం చేత ఓటు వేయించి వచ్చి మిమ్మల్ని తీసుకెళుతాను .ఎండలో పసివాడు ఎందుకు …వాడిని మేము వచ్చే వరకు మీరే చూసుకోండి.ఒక అరగంటలో వస్తాము రెడీ గా ఉండండి .” మన్మథరావు .
“అలాగే…అలాగే ..వెళ్ళిరండి” ..మన్మధ రావు తల్లి .
భర్త వెనకాలే బయలుదేరింది ..మనసంతా చాలా గమ్మత్తుగా ఉంది.మన్మథరావు స్కూల్ లోనేపోలింగ్.
దారి పొడుగునా అందరినీ పలుకరించుకుంటూ వెళ్ళారు.
దారి లో వచ్చినంత సేపు ఓటు ఎలా వెయ్యాలో చెప్తూనే ఉన్నాడు మన్మథరావు.
ముందు గా మన్మథరావు వెళ్ళాడు .తరవాత సౌభాగ్యం వెళ్ళి సంతకం చేసి ,వేలిపై ఇంకు చుక్క పెట్టించుకుంటుంటే ఏదో గొప్ప ఫిలింగ్ .. తొలిసారి రమణను ఎత్తుకున్నపుడు ..వీడు నా సొంతం అనే ఒక భావన .అది అనిర్వచనీయం . ఇపుడు కూడా అదే భావన అలాగే అనిపించింది . ఇద్దరు ఓటు వేసాక. స్కూలంతా తిప్పి చూపాడు తన క్లాసు చూపాడు. వస్తూ వస్తూ రామయ్య చిల్లర కొట్టు దగ్గర
ఆగి తనకిష్టమని నూగుండలు కొనిపెట్టాడు.
అలా తన మొదటి ఓటు ప్రహసనం జరిగింది .అప్పటినుండి ప్రతిసారీ ఇద్దరు కలసి వెళ్ళి ఓటు వేసేవారు. ప్రతిసారీ మన్మథరావు చెప్పిన వారికే వేయించే వాడు.
ఓటు గురించి కొద్దిగా అవగాహన వచ్చిన దగ్గరనుండి , తనకు తను సొంతంగా తనకు ఇష్టమైన వారికి వెయ్యాలని చాలా పెద్ద కోరిక . పోలింగ్ బూత్‌కు వెళ్ళేవరకు నా ఇష్టం వచ్చిన వాళ్ళకే వేస్తాను మనసులో అనుకుంటూ వెళ్లేది కానీ అక్కడకు వెళ్ళాక మన్మథరావు చెప్పినట్లే చేసేది .అలా జరిగి పోయేది .
ఆఖరి సారి ఓటుకూడా ఇద్దరు కలిసే వేసారు . ఆతర్వాత ఆరునెలలకే మన్మథరావు గుండె పోటుతో మరణించాడు.
ఆ తర్వాత అక్కడ ఒక్కతే ఉండలేక విజయవాడ కొడుకు రమణ దగ్గరకు వచ్చేసింది .కొడుకుకు ,కోడలికి ఇద్దరికి ఉద్యోగాలు .ఇంట్లోనే పనమ్మాయి ఉంటుంది అన్నీ చూసుకుంటుంది .రమణ పిల్లలిద్దరు అమ్మాయి ,అబ్బాయి బెంగుళూరులో ఇద్దరు ఏవో కంప్యూటర్ కోర్సులు చదువుతున్నారు.
రమణకు అమ్మంటే చాలా ఇష్టం. కోడలు పద్మ కూడా బాగా చూసుకుంటుంది .
మన్మథరావు లేడనే లోటు తప్ప ఏ దిగులు లేని జీవితం ..కానీ అనారోగ్యం బాగా కుంగతీస్తుంది.
ఎన్నికల సంగతి విన్నప్పటినుండి .వెళ్ళి ఓటు వేయలేనని నిరాశ పడింది .
“ ప్రభుత్వం మంచం మీద వున్న వారికి వారి దగ్గర కే వచ్చి ఓటు వేయించుకునే సదుపాయం కల్పించటం ఓటు విలువను పెంచింది .
ఓటు వేసినపుడు వాళ్ళు
“మీ ఇష్ట ప్రకారమే వేసారా …అన్నపుడు పెద్దగా నవ్వాలనిపించింది . కానీ తమాయించుకుని చిరునవ్వు తో సమాధాన మిచ్చింది .
ఇక ఈ జీవితానికి ఆఖరి ఓటు వేయడం కూడా అయిపోయింది .నిర్లిప్తతంగా నవ్వుకుంది సౌభాగ్యమ్మ .
“ అమ్మా…భోజనం తెమ్మంటారా అంటూ లక్ష్మమ్మ తలుపు తీసుకుంటూ వచ్చింది ..
ఆ చప్పుడుకు కళ్ళు తెరచిన సౌభాగ్యమ్మ
“నా తరం అలా గడిచింది…ఈ తరం అలాకాదు .”అంటూ …చిరునవ్వుతో లక్ష్మమ్మ వంక చూసింది.
“అమ్మగారు ఏమంటున్నారో అర్ధం కాని లక్ష్మమ్మ అయోమయంగా చూసింది.
“ఏ తరమైన ఆడతరం అంతే నేమో …

Written by Vijaya Goli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాత కొత్తల కలయిక

“జయహో!