పాత కొత్తల కలయిక

కథ

    కామేశ్వరి వాడ్రేవు

వేసవి సెలవులకు అమ్మమ్మ గారి ఇంటికి వచ్చారు వసంతా పిల్లలు. అదీ నాలుగేళ్ల తర్వాత. ఒకసారి సైట్ సీయింగ్కి కేరళ, మరోసారి బొంబాయి పెదనాన్న గారి ఇంటికి, మరోసారి మేనత్త కూతురు పెళ్లికి వైజాగ్ వెళ్లడం వల్ల తాతగారింటికి రాలేకపోయారు వేసవి సెలవులలో .క్రితం సారీ వచ్చినప్పుడు ఇంకా చిన్న వాళ్లు. ఇప్పుడు అమ్మాయి 7వ తరగతికి అబ్బాయి 5తరగతిలోకి వచ్చారు.అంతా ఇంగ్లీషు చదువులే. గ్రేటర్ కమ్యూనిటీలో నివాసాలు. సంపాదనలు ఎక్కువ. స్టేషన్లో దిగిన తర్వాత తాతగారు పంపిన కారులో అమ్మమ్మ గారి ఇంటికి చేరుకున్నారు. కూతురు, మనవాళ్లు వచ్చారని ఎంతో సంతోషించారు కామాక్షమ్మ గారు, శివరామయ్య గారు. అమెరికాలో ఉన్న కొడుకు రావడానికి ఈసారి కుదరలేదు. కూతురు ఒక్కతే వచ్చింది. పిల్లలు ఎంతో ఆత్రుతతో ఆ మండువా ఇల్లుని చుట్టి చూసి వచ్చారు. పెద్ద పెరడులో అన్ని రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి. చెట్టుకు ఉయ్యాల కూడా కట్టుబడి ఉంది. పిల్లలు కాసేపు సంతోషంగా ఊగారు. ” స్నానాలు చేసి రెండర్రా టిపేన్లు తిందురు గాని ” కామాక్షమ్మ గారు పిలిచా రు. అప్పుడే స్నానాలా…బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత చేస్తాం.., అయినా అప్పుడే ఎందుకు… సెలవులే కదా.. కాసేపు ఆగి చేస్తామన్నారు. ” అదేమిటి వసంత స్నానం చేయకుండా తింటారా. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా అలా తిన్నారా? ” అన్నారు కామాక్షమ్మ గారు. ” అమ్మ ఇది నా చిన్ననాటి రోజులు కావు. నేటి పిల్లలకు నిజజీవితంలో కొంచెం కూడా కాళీ లేని పరిస్థితి. స్కూలు, ట్యూషన్లు ఇవే కాక ఎక్స్ట్రా ఆక్టివిటీస్ చాలా ఉన్నాయి. వాడికి క్రికెట్, కెరటా దీనికి డాన్స్ సంగీతం.ఇక ఆయన చూస్తే వర్క్ ఫ్రం హోం. వాళ్లతో పాటు నాకు కూడా ఖాళీ ఉండటం లేదు. ” అంది వసంత.” కానీ అమ్మాయి స్నానానికి ముందు ఏది తినకూడదు. దానివల్ల అరుగుదల తగ్గి ఆకలి మందగిస్తుంది. ఆకలి తగ్గితే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇద్దరు ఎలా ఉన్నారు చూడు బక్క పల్చగా. అసలే ప్రయాణం చేసి వచ్చారు… కానీయండి పెందరాళే. కాసేపు విశ్రాంతి తీసుకుందురు గాని. ఇలాగా నేను వంటకు ఉపక్రమిస్తాను ” అని వంటింట్లోకి దారి తీశారు
12 గంటల అయ్యేసరికి శివరామయ్య గారు పొలం నుంచి వస్తూ తాజాకూరలు మోసుకొచ్చారు పాలేరుతో. మనవల్ని పిలిచారు మురిపెంగా ” రండిరారండి మీకోసం ఏమి తెచ్చానో చూడండి… పనస పండు, మగ్గపెట్టిన మామిడిపళ్ళు, సపోటాలు చూపించారు. ముంజులు కొబ్బరి బొండాలు సాయంత్రం తోటలో తిందురు గాని” అన్నారు. ఇలోగా కామక్షమ్మ గారు వచ్చి ” మీరు కాళ్లు చేతులు కడుక్కురండి. మీకు, మీ మనవలకు వడ్డిస్తాను. అమ్మాయి నేను తర్వాత తింటాం తీరికగా ” అంటూ లోపలికి దారి తీశారు. పిల్లలు వంటింట్లోకి వచ్చేసరికి శివరామయ్య గారు గంధం బొట్టు పెట్టుకుని పీట మీద కూర్చుని ఉన్నారు. కామాక్షమ్మ గారు వారిని చూసి ” రండి వచ్చి మీరు కూడా కూర్చోండి “అని చెరొక వెండి కంచం పెట్టారు. తాత గారి ముందు మాత్రం అరిటాకు వేసి ఉంది. పిల్లలు తెల్ల మొహం వేసుకుని చూస్తున్నారు ఎక్కడ కూర్చోవాలి అని. డైనింగ్ టేబుల్ కుర్చీలు లేవు. అది గ్రహించిన కామాక్షమ్మ గారు ” మాకు భోజనాలు బల్ల అదీ లేవు రా. మాకు ముందు నుంచి కూర్చుని తినటమలవాటు. మావన్ని ఇంకా పాత పద్ధతి లే. వచ్చి కూర్చోండి ” అని వడ్డించడం మొదలుపెట్టారు. ముందు ముద్దపప్పు అన్నం పెట్టారు. కొత్త ఆవకాయ కూడా వడ్డించారు. కానీ పిల్లలకు ఎలా తినాలో అర్థం కాలేదు. “అమ్మ వసంత ఇలా ఒకసారి వా … మీ పిల్లలు ఏదో ఇబ్బంది పడుతున్నారు” అని కేక వేశారు. వసంత వచ్చి పిల్లల పరిస్థితి గమనించి ఎలా తినాలో చూపించింది. కానీ ఇలా తినడం పిల్లలకి ఇబ్బందిగా ఉంది. అది చూచి కామాక్షమ్మ గారు ” ఇబ్బంది పడకండర్రా ….. వంగి తినటం వల్ల పొట్టకి కావలసినదే వెడుతుంది. మితిమీరి తినలేరు. అందువలన తొందరగా జీర్ణమై మరల ఆకలి వేయడానికి దోహద పడుతుంది. ఊబకాయం కూడా రాదు. మీరు భోజనాలు బల్లమీద తినడం అలవాటు పడిపోయారు. మీ తాత గారిని చూడండి 70 సంవత్సరాలు దాటిన ఎలా పీట మీద కూడా కూర్చుని వంగి తింటున్నారో… అలా చేయడం వలన పొట్ట పూర్తిగా నిండక భుక్తాయాసం రాదు. ” అని విడమర్చి చెప్పారు. పిల్లలు7,5 తరగతులు చదువుతుండడం వలన దానిలోని సైన్స్ కొద్దిగా అర్థం చేసుకున్నారు. అమ్మమ్మ మాటలకు” థమ్స్ అప్ “చిహ్నం చూపారు బొటన వేలు ఎత్తి .
రాత్రి అయింది. పిల్లల భోజనాలు, పెద్దల భోజనాలు ఏడు గంటలకే ముగించారు. ఆరు బయట పక్కలు వేశారు. ఇంతలో కరెంటు పోయింది. లోపల ఆడుకుంటున్న పిల్లలు ఇద్దరు భయంతో కేకలు పెట్టారు. వసంత పరిగెత్తుకొని వెళ్లి ఫోను లోని లైట్ సహాయంతో బయటకు తీసుకొచ్చింది. అప్పటికే పడక మీదకి చేరిన శంకరయ్య గారు ” ఎందుకురా అలా కేకలు పెట్టారు. చీకటి అంటే భయం ఎందుకు? ఇప్పటివరకు ఉన్న వెలుగు లేకపోవడమే కదా. రాత్రి వస్తే చీకటి వస్తుంది కదా. పగలు పనిచేయడానికి…రాత్రి విశ్రాంతి తీసుకోవాడానికి…. భగవంతుడు ఏర్పరిచిన విధి ఇది. ఇందాకే కదా పొలం నుంచి వచ్చాను. అక్కడంతా చీకటే. చీకటిని ఎక్కువగా చూడటం వలన మన కళ్ళకు వెలుగు తొందరగా కనిపిస్తుంది. ఓసారి మీరు పరిశీలించి చూడండి. ” అన్నారు.” అది కాదు తాతయ్య… చీకట్లో దెయ్యాలు భూతాలు ఉంటాయని అంటారు కదా మేము సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోను చూశాము చాలా భయం వేసింది. “అన్నారు. దానికి తాతగారు “దెయ్యాలు భూతాలు ఏమీ ఉండవు. పెద్దలు కథల రూపంలోనూ, సినిమాలులేని భూతాలని.. కథల ఆధారంగా తీసి భయంకరంగా చూపించి మిమ్మల్ని భయానికి గురి చేశారు. నీకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇదంతా భ్రమేనని. కొందరికి పెద్దయిన పోదు అనుకోండి…. ఇది ఒక మానసిక దౌర్భాల్యం. ఆంజనేయ దండకం చదువుకోండి…! పడుకునేటప్పుడు అని మా పెద్దవారు అనేవారు. అసలు భయం నేర్పడడం ఎందుకు, దానికి ఉపశమనాలు చెప్పడం ఎందుకు? సత్యాన్ని బోధించవచ్చు కదా.” అన్నారు. భయం పోవడానికి నీకు మంచి మంచి కథలు చెప్తాను రండి అంటూ వారి దృష్టిని మరచారు. “ఒకసారి ఆకాశంలో నక్షత్రాలు చూడండి, చందమామను చూడండి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాయి అంటూ” చందమామ కథలు చెప్పి నిద్రపోయేలా చేశారు.
తెల్లవారింది బ్రష్ మీద పేస్టు వేసుకుని వచ్చారు పళ్ళు తోముకోవడానికి పిల్లలు. తాతయ్య మాత్రం నోట్లో పుల్ల పెట్టుకుని నములు తున్నారు.ఆశ్చర్యంగా తన కేసి చూస్తున్న మనవలను ” ఇది మా పల్లెటూరి దంతావదానం రా, వేప పుల్లలు నమిలి బ్రష్ గా చేసి పండ్లు తోముకుని తర్వాత ఆ పుల్లని చీల్చి నాలికని శుభ్రం చేసుకుంటాం. రెండు పనులు ఒకదానితోనే అయిపోతాయి. వేపపుల్ల లోని చేదు చెడు బ్యాక్టీరియాని చంపి దంతాలు ఊడకుండా కాపాడుతుంది. నా పళ్ళు చూడండి ఇంత వయస్సు వచ్చిన కదలలేదు, ఊడలేదు. మేము మీ అంత ఉన్నప్పుడు బొగ్గు ఉప్పు కలిపి చేసిన పొడితో పళ్ళు తోముకునేవాళ్ళం. ఇప్పుడు ఇవే మీ పేస్టు లో కూడా కలిపి వాడండి అంటూ వ్యాపారం చేస్తున్నారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు.మీ పేస్ట్ లో ఉప్పుందా… విటమిన్ ఉన్నాయా అంటూ…ప్రకృతి మీద ఆధారపడటం మాన్పించి వారి ప్రోడక్ట్లను కొనేలా అబద్ధపు ప్రచారాలుతో ముంచేత్తుతున్నారు. ఇలా ప్రతిదానిలో కలబడి వస్తువులన్నిటిని బ్రష్టు పట్టిస్తున్నారు నేటి బడా వ్యాపారులు. ప్రపంచం కూడా దాన్నే అనుసరిస్తుంది తందాన తానా అని. ఇది భావితరాల వారికి ఎంత చేటు చేస్తుందో తెలియటం లేదు. ” అంటూ ముఖం కడుక్కోవడానికి వెళ్లారు
తర్వాత స్నానాలు ఘట్టం మొదలైంది. అటాచ్ వాష్ రూమ్ లేవు సరి కదా బయలుదొడ్డికి వెళ్లాలి అవసరం తీర్చుకోవడానికి. ఇది చాలా వింతైన… సిగ్గుచేటు.. అయిన విషయం అనుకున్నారు పిల్లలు. స్నానాలు చేయించడానికి వసంత పిల్ల లిద్దరిని నూతి పళ్ళెం దగ్గరికి తీసుకెళ్లంది. కట్టెల పొయ్యి మీద నీళ్లు తాగుతూ ఉన్నాయి ” ఇక్కడ ఇలాగే స్నానాలు చేస్తారు నూతిలో నీళ్లు తోడుకుని. చూడండి తాతగారు ఎలా బావిలో నీరు తోడుకుని స్నానం చేస్తున్నారో . చేతులతో సూర్య భగవానునికి అర్గ్యాలు అర్పిస్తూ మంత్రాలు చదువుతున్నారు అంటే అన్నిటికీ కారణమైన సూర్యనారాయణమూర్తికి థాంక్స్ చెప్తున్నారన్నమాట . మా ఇంట్లో చిన్నప్పటినుండి ఇదే పద్ధతి. మాది ఉమ్మడి కుటుంబం. మా పెదనాన్న పిల్లలు బాబాయి పిల్లలు మేము అందరం కలిసి 30 మంది దాకా ఉండేవాళ్ళం. “అంది. పిల్లలకి ఇదంతా వింతగా ఉంది. అప్పటికే అమ్మమ్మ స్నానం చేసి కాళ్లకు పసుపు, ముఖానికి బొట్టు, తలలో పువ్వులతో పార్వతి దేవిలా ఉంది. పిల్లలు తప్పక ఎలాగోలాగా ఇన్నర్స్ తోనే స్నానం ముగించారు.
అసలే మంచి ఎండాకాలం కనుక పిల్లలకు ఉదయపు ఆహారంగా చద్దన్నం, పెరుగు,మాగాయ ఏర్పాటు చేశారు. అలవాటు లేని ఈ మెట్రో పిల్లలకి వింతగా ఉంది.” “ఇదేంటి…జాము బ్రెడ్ లేవు, పూరి కూర లేదు, కనీసం దోశలు కూడా లేవే. ఏం తింటాం” అన్నారు. దానికి అమ్మమ్మ ” మా టిఫిన్ ఇవే రా బాబు. మీ తాత కూడా ఇవే తిని పొలానికి వెళతారు. పెరుగు,చద్దిఅన్నం తింటే చలవ చేస్తుంది దీనిలో పచ్చి ఉల్లిపాయ కూడా కొరుక్కు తింటే ఇంకా బాగుంటుంది . మీరు కూడా నాలుగు ముద్దలు తిని..తాత గారితో తోటకు వెళ్లి కూరగాయలు అవి తెండి. నేను పూజ కానిచ్చి వంట మొదలు పెడతా ” అని లోపలికి వెళ్లారు కామాక్షమ్మ గారు.
తాత గారితో పొలానికి వెళుతుంటే ఎంతోమంది ఆప్యాయతతో పలకరించారు. అమ్మాయి గారి పిల్లలా అని అడిగి తెలుసుకున్నారు. ఆగమని కొన్ని పళ్ళు కవర్లో వేసి ఆప్యాయంగా వారికి ఇచ్చారు. కొంతమంది జంతికలు, మిఠాయిలు ఇచ్చారు. పిల్లలకు ఇదంతా కొత్తగా ఉంది. తోటలో పనిచేసే కూలీలు, పాలికాపు సంతోషంతో ఎదురు వచ్చారు. కూర్చోవడానికి మంచం వేశారు. కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చారు తాగడానికి. స్ట్రాల్ లేకపోతే ఏదో చెట్టుకొమ్మతుంచి ష్ట్రాలగా ఇచ్చారు. తాటికాయలు దింపి వాటిలోనుంచి ముంజలు తీసి ఇచ్చారు. పిల్లలకి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. తమ ఊరిలో రోడ్డు పక్క కొబ్బరిబండాలు ముంజులు అమ్మడం చూశారు కానీ అవి ఎక్కడ నుండి ఎ లా వస్తాయో తెలియదు. పాకలోని పాలికాపు రంగయ్య భార్య జామకాయలు కోసి ఉప్పు కారం వేసి ఇచ్చింది. తినమని ఆప్యాయంగా. ఈ హడావిడిలో వాళ్లకి ఎంత దూరం నడిచామో తెలియలేదు. ఇంటికి వచ్చి తల్లి వసంతకు ఎంతో ఆశ్చర్యంగా అన్ని వివరించారు.
పిల్లలకు అర్థమైంది పల్లెటూరు జీవనం ఎంత ఆరోగ్యంతో ముడిపడి ఉందో! కాలుష్యం లేని నీరు,గాలి, చెరువు, చెరువు లోని తామర పూలు ఎంతో బాగానచ్చాయి. అందరూ స్నేహం బంధంతో ఏరమరికలు లేక జీవిస్తున్నారు. కానీ తమ మెట్రో నగరంలో ఎవరికి వారే యమునా తీరే. ఎవరు ఎవరిని గమనించే తీరిక ఉండదు. ఆఖరికి ఫ్యామిలీలో కూడా ఎవరికి వారే. అమ్మానాన్నలకు ఉద్యోగాలు. వాళ్లు ఎప్పుడూ ఏదో టెన్షన్ తో ఉంటారు. పిల్లలను పట్టించుకుని, బోధించే టైమే ఉండదు. దానికి తోడు నేటి ఇంటర్నెట్, సెల్ఫోన్లు వచ్చి బంధాల్ని ఇంకా దూరం చేస్తున్నాయి. అందుకే గాంధీ గారు అన్నారు” పల్లెటూళ్ళే దేశానికి వెన్నెముక ” అని. తాత చెప్పిన ప్రతి మాట నిజమే అనిపించింది పిల్లలకు. వీలున్నప్పుడల్ల ఈ ఊరు వచ్చి గడపాలని నిశ్చయించుకున్నారు. మన సాంప్రదాయాలను, సంస్కృతులను, అలవాట్లను మార్చుకోకూడదని తాతగారు మరీ మరీ చెప్పారు బయలుదేరేముందు.అందరికీ కొత్త బట్టలు పెట్టారు నాన్న గారితో సహా. అమ్మమ్మ ఎన్నో పిండి వంటలు అవి చేసి ఇచ్చింది. కాయలను పళ్ళను కూడా ప్యాకేజ్ చేయించి ఇచ్చారు . నేటి భావితరాలైన మీరే దీనిని ముందుకు తీసుకువెళ్లాలి అని ఉద్బోధ చేశారు తాతగారు బయలుదేరేముందు . పిల్లలు ఎంతో ఆనందంగా టాటా చెబుతూ రైలు ఎక్కారు.
లోకా సమస్త సుఖినోభవంతు

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గోరింక చెప్పిన బాల్కనీ కధ     

ఓటు