గోరింక చెప్పిన బాల్కనీ కధ     

స్య కధ

పద్మావతి నీలంరాజు

     ఒక గోరింకా, ఒక చిలకమ్మా ఒక పెద్ద భవంతి ముందున్న మామిడి చెట్టు మీదకు వచ్చి వాలాయి. గోరింకా అలసినట్లు కళ్ళు మూసుకొని కూర్చుంటే, చిలకమ్మ మాత్రం చుట్టుపక్కల చూడ్డం  మొదలెట్టింది తన అందమయిన మెడను అటు ఇటు తిప్పుతూ. అలా చూస్తున్న చిలకమ్మా చూపు ఆ భవంతి గవాక్షం , అదేనండి బాల్కనీ వైపు పడింది. కాస్త తేరిపారా చూసింది. ఎవరో ఒక మధ్య వయస్కుడు అక్కడ నిలబడి రోడ్డు మీద పోతున్న జనాలందరినీ చూస్తున్నాడు. చిలకమ్మ కు ఆ వ్యక్తి మధ్య మధ్య చిరునవ్వులొలికించటం చూసి, “అంత ఏముందబ్బా రోడ్డు మీద!” అని ఒక కన్నేసి ఉంచింది. అప్పుడు దానికి అర్ధమయింది ఆ సమయంలో చాల మంది అమ్మాయిలు, అమ్మాయిలంటేనే అందంగా ఉంటారు మరి, అలా రోడ్డు మీద వెళుతున్నారు. బహుశా ఆ అమ్మాయిలందరూ కాలేజ్ గోయింగ్ లేక కమింగో  ఏమో అనుకొంటు, అంత ఎండగా ఉన్న ఆ బాల్కనీలో వెన్నెట్లో నిలబడినట్లు తెగ ఆనందపడిపోతున్న ఆ వ్యక్తిని చూసీ, “మావ! ఎటి ఆ మడిసి అట్టా ఎండలో నిలబడి  అలా రోడ్డుకాలకేసి సూస్తానే ఉన్నాడు. అంత ఎత్తుగా నిలబడ్డాడే,అదేటి మావ?”అని గోముగా అడిగింది చిలకమ్మ. తన మాట వినిపించుకోలేదేమో అన్న అనుమానంతో  నిద్ర మత్తులో ఉన్న గోరింకను టప టప మని రెక్కలతో కొట్టి, కాస్త కోపంగానే అదే ప్రశ్నను మళ్ళి  అడిగింది చిలకమ్మ. 

   ఈసారి ఆ దెబ్బకి లేవక తప్పలేదు హస్బెండ్ గోరింక గారికి. “అదా! దానిని బాలకని అంటారు, పూర్వపు రోజుల్లో అయితే గవాక్షము అని,” చెప్పాడు వివరంగా, మళ్ళి ఎక్కడ కొడుతుందోనన్నభయం తో.  

    “ఏటేటి గవకశమున’” అంది పలకడం చేతకాక. 

   “ నా ముద్దు  చిలకమ్మా ! బాల్కనీ అను చాలు,” కరెక్ట్ చేసాడు గోరింకా మావ. 

  “కాసంత వివరంగ సెప్పొచుకంద,” అంటూ మరోసారి రెక్కలు రెపరెపలాడించింది. సెప్పక పోతే మళ్ళి  కొడుతుందేమో అనుకోని,“అదా! దానిని బాల్కనీ అంటారు. ఇంటాయన ఇంటిదానికి  తెలియకుండా సరదా సరదాగా సూట్టానికి, కొన్ని పనులు చేయటానికి రోడ్డు  మీద యవ్వారాలను తెలుసు కోవడానికి,రగస్యంగా ఫోన్లలో మాట్లాడానికి కట్టించుకుంటారులే. అయినా ఈ బాల్కనీ  ఈనాటిదా. మన శీకుష్ణుల వారి కాలం నుండే ఉంది,” అంటూ జ్ఞానిలా ఫోజ్ పెట్టింది. . 

 “అదేటి మావ! ఈ బాల్కనీ అప్పటినుంచే అలాగే పడిపోకుండా ఎలాగుంది, సిత్రంగా లేదు!”అంటూ కళ్ళు తిప్పుతూ అమాయకంగా అడిగింది. 

   “ఓసి నీ! అది ఆ  శీకుష్ణుల వారు కట్టించింది కాదే, అది కట్టు కొనే  విధానం సెప్పింది, దాని అవసరం ఎంత అన్న విషయం జనానికి సెప్పింది ఆ ఆదిపురుషుడే,” అంటూ గోరింకా అంతా  తనకే తెలిసినట్లు చెప్పింది. 

  “బాగుంది వరస! అదేదో కాస్త ఇవరంగా సెబితే నీ సొమ్మేం పోయెను,”అంటూ చిలకమ్మా చిరుకోపం చూపె ట్టింది.

  

   “ ఓహో! నా చిన్నారి చిలకమ్మా ! అది భారత కాలంలో కట్టింది కాదే.  ఆ కాలం నుండి శీకుష్ణుడు ఆ బాల్కనీని కట్టించుకునే సాంప్రదాయాన్ని మొదలెట్టిన ఆదిపురుషుడు,” తనకే అంతా తెలిసినట్టు చెప్పింది. 

  “బాగుంది వరస! తెలవకనేగందా అడిగాను. అదేదో ఇవరంగా సెప్పరాదేటి,” అంటు చిలకమ్మ బుంగమూతి పెట్టింది. 

     వెంటనే గోరింక చిలకమ్మ వంక ప్రేమగా చూస్తూ కథ చెప్పడం మొదలుపెట్టాడు. మహాభారతం అనే పెద్ద కథని వ్యాసుడు అనే ముని రాశాడు. ఆయన తన కథలో  శీకుష్ణుడు భగవానుడిని సృష్టించి తన కథకు హీరోని చేసుకున్నాడు అయితే వ్యాసుడెమో  సన్యాసి. ఆయనకు భార్యాబిడ్డలు, కుటుంబము అలా ఏమి లేదు. అయినా తన హీరోకి మాత్రం 16,000 మంది స్త్రీ జనాన్ని, ఎనిమిదిమంది  భార్యలను కట్టబెట్టాడు. అది కాకుండా గోపికలను కొంతమందిని.  అయితే వ్యాసుడు తన హీరో శీకుష్ణుడికి  గరల్ దోస్తులని కూడా పెట్టాడు. అయితే వ్యాసుడు తన హీరోకి రాబోయే కష్టాలను మాత్రం ఊహించుకోలేకపోయాడు.”

 “అదేటి మావ కష్టాలేటి,” అంటూ చిలకమ్మ మధ్యలో అందుకుంది. 

     “ చిట్టి చిలకమ్మా ! కష్టాలు కాక మరేటి ఒక భార్యకే నేను ఇట్టా సత్తున్నాను. పదహారువేల మందిని సూసుకోవాలా! ఆయన ఎట్టా సావాలో సెప్పు,” అంది  గోరింక కొంటెగా కన్నుకొడుతూ.   

   “సాల్లే సంబడం! నేనేదో నిన్ను కట్ట పెట్టినట్టు! ఆ కథ కాస్త ఇవరంగా సెప్పు,” అంటు  చిలకమ్మ గోరింకను విదిలించి కొట్టింది కాస్త పెంకిగా. కథ సెప్పయినా చిలకమ్మ పొందు పొందాలని గోరింక శీకుష్ణుడు రూపకల్పన చేసిన బాల్కనీ గురించి కథ సెప్పడం మొదలుపెట్టాడు. 

***********************

 అది ద్వారకా పట్టణం.దేదీప్యమానంగా చుక్కలంటుకుంటున్న భవనాలతో వెలిగిపోతోంది. సాయంత్రం  దీపాలు పెట్టె వెళకల్లా కృష్ణుడు తన రాచకార్యాలని ముగించుకొని బంగారు రథం మీద దేవి రుక్మిణి మందిరానికి చేరుకున్నాడు. సారధిని వెళ్లిపొమ్మని చెప్పాడు. స్వామి వారి రాక పరచారికలు దేవేరికి చేరవేసి, వారు తలుపుల చాటుకు తప్పుకున్నారు. రుక్మిణి పతిదేవునికి  సాదరంగా చిరునవ్వుతో ఎదురేగి,  స్వామిని తోడుకొని తన శయన మందిరానికి వచ్చింది. స్వామివారు  వస్తూనే దేవేరి చేతిని మరింత గట్టిగా పట్టుకొని ఎడమ చేతితో శయనాగారం తలుపులను చేరవేశారు. దేవేరి  స్వామి వారి చిలిపి పనికి  ముసిముసిగా నవ్వుతూ పండ్లు ఫలాలు, రసాలు అందించింది. స్వామివారు  చిలిపిగా సగం కొరికిన యాపిల్ పండును దేవెరీ నోటిలో పెట్టారు. దేవీ రుక్మిణి సిగ్గు పడుతూనే ఆ యాపిల్ పండుని  మొత్తం తినేసారు.  

   “అబ్బా యాపిల్ పండే!  నువ్వు ఎప్పుడైనా ఒక ముక్క ఆపిలు పండు నాకు తెచ్చిపెట్టినావా?” అంటూ చిలకమ్మ నోరు చప్పరించింది. 

   “మంచి రసపట్టులో మూడు చెడగొడతావు,” అని కసురుకొంటూ గోరింక కథ చెప్పడం మొదలుపెట్టింది.  అలా స్వామి వారు దేవి రుక్మిణి దగ్గరకు చేరగానే, ఆమె ఆయనకి   జామపండు నోటికి అందించింది. జామ పండు పేరు వింటూనే చిలకమ్మా నోరూరింది. ఏదయినా అడిగితే మూడ్ పోయిందని అంటాడేమో అని నోరూరుతున్న, గమ్ముగా ఖాళీ నోటిని చప్పరిస్తూ కథను వింటున్నది. 

    పాపం!  శ్రీకృష్ణుడు పండుని కొరికే లోపే, “కృష్ణ నేను నీ దాన్ని! ఇంకా ఎంతసేపు నీ దర్శనంకోసం ఇలా ఎదురు చూడమంటావు ? నువ్వు రాకపోతే నేను అనాథనయిపోతాను. నువ్వు ఎక్కడ ఉన్న, నీకు నా బాధ వినిపిస్తుందని అనుకుంటున్నాను,” అంటూ కొన్ని వేల మంది మగువల పిలుపులు వైర్లెస్ ద్వారా కృష్ణునికి వినిపించాయి. 

    “మావ  కొన్ని వేలు అంటే ఎంత? అంటూ 16,000 మంది దాకా ఉన్నారు కదా?” అంటూ ధర్మ సందేహం వెళ్ళిబుచ్చింది. 

   గోరింక తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. వెంటనే కృష్ణునికి అన్ని వేల కంఠాలలో ఒకే ఒక కంఠం బాగా బిగర్గా వినిపించింది. “రారా! స్వామి రారా, యదువంశ సుధాంబుధి చంద్ర….,”అంటూ అత్యంత మధురంగ పిలుస్తున్నట్టనిపించింది. ఆ కంఠం రుక్మిణి దేమో,అని ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు కృష్ణుడు. వెంటనే రుక్మిణి, “స్వామి! మీరు అన్యాపదేశంగా ఉన్నారేంటి? ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డారేంటి?” అంటూ అడిగింది.  

   “ఏం లేదు దేవి!  వేగిరమే ఒక రాచ కార్యానికి పిలుపు వచ్చింది, అక్కడకు  వెళుతు  దారిలో మీ వద్దకు వచ్చాను. నీ సాన్నిధ్యం లో నన్ను నేనే మర్చిపోతాను కదా,చెలి!” అంటూ ప్రేమ చూపించి, గబగబా రుక్మిణి శయన మందిరానికి అనుకొని  ఉన్న బయట ప్రదేశానికి వెళ్లి గరుత్మంతుని తలుచుకోగానే గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు.  ఆ పచ్చి రాజు మీద ఎక్కి, “భామా మందిరం,” ఆజ్ఞాపించాడు. 

  “గరుత్మంతుడిని ఎక్కడం ఏటి మావ? మన పచ్చిరాజు గంద,” అంటూ అనుమానంగా చూసింది చిలకమ్మ. 

“నువ్విట్ట అడుగుతా ఉంటే నా కధ ఎట్టా సాగేది,”  అంటూ  చిరాకుని ప్రదర్శిస్తూ పక్కకు జరిగింది. వెంటనే చిలకమ్మ గోరింకను బతిమిలాడి కథ చెప్పమని వేడుకొంది. 

      గోరింక తిరిగి కథ చెప్పడం మొదలుపెట్టింది భామా మందిర ఉద్యానవన లోకి గరుత్మంతుడు కృష్ణుడిని దించాడు.  శ్రీకృష్ణుడు తన ప్రేయసి  సత్యభామ దేవి శయన మందిరంలోకి వెళ్తూనే అక్కడ పరిచారికలకు సెలవిచ్చ దేవి సేవభాగ్యం తాను పుచ్చుకున్నాడు. తన చెలికత్తే ప్రియ అనుకొని కళ్ళుతెరిచి చూడకుండానే, “ ప్రియా! ఆ మాయదారి కృష్ణుని కోసం ఎదురుచూస్తూ ద్వారం దగ్గర నిలిచి,నిలిచి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి కాసేపు కాళ్లు పట్టు,” అంటూ కాళ్లు జాడించింది. 

     కాళ్ల దగ్గర కూర్చుని విసురుతున్న శ్రీకృష్ణుడు దబీమని పట్టే  మంచాని కున్న కోడుకు పొడుచుకున్నాడు. భుజకీర్తులున్నందువలన భుజం గీరుకుపోకుండా చప్పుడు మాత్రమే అయింది.  ఆ చప్పుడుకు సత్యభామ కళ్ళు  తెరిచి కృష్ణుని చూసి ఆనందించి, ఆనందంతో స్వామివారికి పరిచర్యలు చేసింది. తర్వాత స్వామివారిని శయనింప చేసి “స్వామి! నేను ఇప్పుడే అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను మీరు విశ్రమించండి,” అంటూ మరో మాటకు తావివ్వకుండా చక చక బయటకు నడిచింది.  

     “చెలులు! నా స్వామి ఉదయం వెళ్ళాక ఇప్పుడే రావడం. ఏ సవతి ఎలా పిలిచినా నా కళ్ళు కప్పి పోవటం ఆయనకి బాగా అలవాటు. అందుకనే మీరు ఇప్పటినుండి అన్ని రహస్య స్థలాలలో, దొడ్డిదారుల్లో వేగుల వల్లే కాపులా కాయండి.  నా స్వామి నన్ను విడిచి వెళ్ళితే వెంటనే తెలియజేయండి,”అంటూ తలుపు చాటున నిలుచుని ఉన్న పరిచారికలను ఆజ్ఞాపించి సత్యభామ దేవి చక చక తన శయన మందిరంలోకి వెళ్లి ద్వారాన్ని బంధించి తాను నిద్రకుపక్రమించింది.  

    ‘పాపం! కృష్ణుని పని బోనులో పడ్డ ఎలుక వల్లే తయారయింది. ఈ రాత్రికి జాంబవతి  దగ్గరకు వస్తానని చెప్పాడు ఎలాగా?’అని కృష్ణుడు తెగ మధన పడిపోసాగాడు. సత్యభామ బాగా నిద్రపోయిందని తెలుసుకున్నతర్వాత కృష్ణుడు మందిరం చివరన కిటికీ వద్దకు పోయి జాంబవతి మందిరం వైపు చూసాడు. స్వామి కోసం ఎదురుచూస్తూ ఉద్యానవనంలో ఒంటరిగా తిరుగుతూ కనిపించేసరికి కృష్ణుని మనసు కరిగిపోయింది.  

    గరుత్మంతుని తలుచుకున్నాడు. గరుత్మంతుడు ప్రత్యక్షమై గాలిలోనే ఎగురుతూ,“స్వామి మీరు బయటకు రానిదే,  నేను మిమ్మల్ని ఎక్కించుకోలేను.  సత్యభామ దేవి మందిరానికి అన్ని కిటికీలే స్వామి.  మీరు నన్ను ఎక్కాలనుకుంటే  బయటకు రావాల్సిందే,” అన్నాడు. 

  “గరుత్మంతా బయటకు వచ్చే ఉపాయం నీవే చెప్పాలి,” అంటు  కృష్ణుడు నిస్సహాయంగా చూశాడు. 

   గరుత్మంతుడు మందిరాన్ని చుట్టి వచ్చి,  “స్వామి గవాక్షం పైభాగం నుండి ఏత్తుగా, బలంగా పెరిగిన మాధవిలతను పట్టుకొని కిందకు దిగితే మీరు ఉద్యానవనం లోకి దిగుతారు,” అంటు  సలహా చెప్పాడు. 

     కిష్ణులవారు చిన్నప్పుడు వెన్న దొంగతనం ఎలా చేశాడో గుర్తు తెచ్చుకొని నెమ్మదిగా పెద్ద కిటికీగుండా  బయటకు దూరి మాధవి లతని పట్టుకొని ఉట్టికేగ బాకినట్టు కిందకి జారేడు. వెంటనే గరుత్మంతుడు రావటం దానిమీద కృష్ణుడు ఎక్కి పైకి వెళ్ళటం ఒకేసారి జరిగాయి. పాపం! కృష్ణుడు మాత్రం సత్యభామ వేగులు చూపు నుండి మాత్రం తప్పించుకోలేకపోయాడు. 

   కృష్ణుల వారు సరాసరి జాంబవతీ మందిరానికి చేరుకున్నారు. గరుత్మంతుని ఉద్యానవనంలోనే ఆగమని  జాంబవతిని చేరుకున్నారు.  జాంబవతి స్వామి వారిని చూసినా కూడా చూడనట్టు మొహం తిప్పుకొని ఇంకా ముందు ముందుకి వెళ్లి ఒక లతని ఆనుకొని చాలా వయ్యారంగా నుంచొని స్వామివారిని క్రీ గంట చూడటం మొదలు పెట్టండి. స్వామివారు  ప్రేమగా జాంబవతి  సమీపానికి చేరి దేవి ఇక్కడ ఇంత చలిలో ఒక్కదానివి నుంచున్నావేమిటి?నేను వచ్చేవాడిని కదా లోపలే ఉండవలసింది!” అని చెప్పి ఆమెని సముదాయించపోయాడు.

        కానీ ఆమె చిరాకుగా మొహం పెట్టి,” చాల్లే స్వామి! మిమ్మల్ని మీ సత్యాభామాదేవి పంపించేసిందా? లేక ఆమె అలిగి మిమ్మల్ని తన్ని పంపించిందా?” అంటూ కాస్త విరహ కోపాన్ని చూపించింది.

కృష్ణులవారు  చిలిపిగా , “అలా ఏమీ లేదు దేవి.  సత్య కోపం మీ అందరికీ తెలియనిది కాదు కదా! అలా అని కూడా కాదు, ఆమెకు మీరంటే గౌరవం కూడా. అయినా నా ప్రేయసి జాంబవతి ని చేరుకోవడానికి నాకు మరొకరి సమ్మతి ఎందుకు?” అంటూ నవ్వాడు . “నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆమెకు చెప్పే వచ్చాను,” అని చెప్పి చాలా నమ్మ పలికాడు. 

  చాలా సంతోషంతో అమాయకురాలు జాంభవతి స్వామి వారిని తన శయన మందిరంలోకి తీసుకువెళ్లి సపర్యలు  చేసి స్వామివారి తోటి అచ్చక బుచ్చకలాడుతూ  ఆయన ఒడిలో తలపెట్టి విశ్రమించింది. ఆమె అలా విశ్రమించగానే స్వామివారు  మాయతోటి ఆమెని నిద్రలోకి జారవేసి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుని మరొక మందిరానికి చేరుకున్నారు. 

     అలా ఆరోజు రాత్రి పాపం అందరినీ శాంత పరచడానికి స్వామివారికి చాలా కష్టమే అయింది. అప్పుడు ఆయన చాలా తీవ్రంగా ఆలోచిస్తూ , ‘ఎలాగైనా సరే ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం ఆలోచించాలి! ఎవరికీ తెలియకుండా నేను ఒకరి మందిరం నుంచి మరొక మందిరానికి వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి!’ అని అనుకుంటూ బయటకు వచ్చి గరుత్మంతుడి తోటి అదే విషయం చెప్పారు.  ఆయన  గరుత్మంతుడిని కూడా ఆలోచించమని కోరాడు. 

      గరుత్మంతుడు కూడా తన మెడని అటూ ఇటూ తిప్పుతూ తెగ ఆలోచిస్తున్నట్టు తెగ నటించేసి కొద్దిసేపు అయిన తర్వాత, “స్వామి నా బుర్రకి ఏమీ త ట్టడం లేదు.  నాకు దూరంగా నిలబడి లేక ఎగురుతూ, మీ ఆజ్ఞలను వినటమే తప్పనాకు ఇలాంటి వ్యవహారాలు ఏమి తెలియవు స్వామి! నేను వివాహం చేసుకోలేదు కదా! కనుక మీరు ఇంకెవరైనా సరే సంప్రదించండి,” అని చెప్పి తప్పుకున్నాడు.  

    అప్పుడు శ్రీకృష్ణుల వారికి ఇంద్రప్రస్థ నగరం గుర్తొచ్చింది.  ఒకరోజు ఇంద్రప్రస్థం లో అర్జునుల వారితో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు అందమైనటువంటి భవంతులకి ముందు వెనక చక్కగా నులుచుని బయట వారిని అటూ ఇటూ చూస్తూ చేసేటువంటి చర్యలకు సరిపడే ఒక సరైనటువంటి ఎత్తైన కట్టడం భవంతి పై అంతస్తు బయట భాగానికి ఆనుకొని నిర్మించబడి కనిపించింది. దానిని కృష్ణుల వారు అర్జునుడిని అడిగారు “అరే అర్జున!  ఇదేం నిర్మాణం? చాలా అందంగా ఉన్నది. ఎంత హాయిగా ఉన్నది.అక్కడ నుంచొ వచ్చు!” అని కూడా అన్నారు. దానికి అర్జునుడు “నాకు తెలియదు శ్రీకృష్ణ, అది  మన విశ్వకర్మ నిర్మించాడు. దాని పేరు గవాక్షము అని,అక్కడ మనం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చును, కసరత్తులు చేసుకోవచ్చు.  మనకు కావాల్సిన పనులన్నీ  అక్కడ  నుంచి చేసుకోవచ్చు. అందుకని మేము కూడా ఆ గవాక్షమును మా అందరి మందిరాలకి కట్టించుకున్నాము” అని చెప్పాడు. 

    మరునాడు  సాయంత్రానికి రాచ కార్యాలను  ముగించుకొని కృష్ణుడు సత్యభామ దేవి మందిరానికి విచ్చేశాడు.  స్వామి వారి రాక సత్యభామ దేవికి తెలియపరచబడింది.  స్వామి వారు  మొదటి ద్వారంలోకి రాగానే స్వామివారి ముందు విసురుగా ఒక పూలమాల వచ్చి పడింది.  ఇదేంటని విస్తుపోతూనే స్వామి వారు రెండోద్వారం లోకి వచ్చారు.  అంతే శిఖలో  అందంగా ఉండేందుకు పెట్టుకున్నబన్ను,పిన్నులు వచ్చి స్వామివారి యెదను గాఢంగా గుద్దుకున్నాయి.  స్వామివారికి పరిస్థితి కొంత అర్థమయింది. మూడో ద్వారంలోకి అడుగుపెట్టగానే వెంటనే శిరోమణి సూటిగా వచ్చే స్వామివారి విశాల నుదురుని తాకి గాయపరచి కిందపడింది. స్వామివారు  శయనాగారంలోకి అడుగుపెట్టగానే కలహంతరితలాగా సత్యభామ దేవి ఎర్రని కన్నులతో కృష్ణుని వంక చూడసాగింది.

“దేవీ నేను చేసిన అపరాధం ఏమిటి? నీ కోపకారణం ఏమిటి? తాపమున నిన్ను చూడట అలవాటు పడిన నేను, కోపముగా ఉన్న నిన్ను చూడలేకున్నాను. శాంతించు దేవి,” అంటూ బ్రతిమలాడసాగాడు.  

     అసలే కోపంలో ఉన్న భామ ఒక్కసారిగా పెద్దగా వెక్కుతూ ,” మిమ్మల్నిగమనించటానికి వేగుల్ని కూడా పెట్టుకున్నాను. అయినా నన్ను మాయ చేసి పోయారు కదా నాధ! మీకు నా సవతులే ముఖ్యం, నేను కాదు.  మీరు ఇక   వెళ్ళవచ్చు,” అంటూ గట్టిగ ముక్కు చీదుతూ  సత్యభామ ఏడవ సాగింది. 

    స్వామి వారి మొహంలో నెత్తురు చుక్క లేదు.  ఏమిటి! తాను జాంబవతి దగ్గరికి వెళ్ళిన సంగతి భామకు తెలిసిందా! అదీ  వేగుల ద్వారా! ఈ సత్యభామను, ఆమె వేగుల సమస్యను ఎలా పరిష్కరించాలి? వేగుల నుండి ఎలా తప్పించుకోవాలి?” అని కృష్ణుడు ఆలోచనలో మునిగిపోయాడు.  

       ముందు సత్యభామ కోపాన్ని ఉపశమింప  చేయాలి అనుకొంటూ “సతీసత్య! నేను సత్యాపతి నామధెయుడను అనే కదా జగమెరిగిన సత్యం.  నీవేల అలా పలికేదవు. నీ తరువాతనే నాకు మరి ఎవరైనా. నీవేది కొరితే  అదే చేస్తాను, కోరుకొమ్ము,” అని కృష్ణపరమాత్మ పలకగానే సత్యభామ “ఇంకనుంచి  మీరు నన్ను విడిచి ఎవరి మందిరానికి పోను  వీలు లేదు.  ఇదే నా కోరిక,” అని ఒక పిడుగు లాంటి కోరిక కోరింది. వెంటనే కృష్ణుడు గట్టిగా తలూపి ఆమె వద్దనే ఉంటున్నాడు. 

      ‘ప్రతిరోజు మధురానగర సమీపంలో,మలయామారుత సమీరంలో,అర్ధనిమీళిత దృక్కులతో ఎదురుచూసే రాధ కృష్ణుడికి గుర్తుకోస్తున్నది, ఆమెను చేరుకోవాలంటే ఎలా? అది భామ కు తెలియకుండ. ఏదోక మార్గం  ఉండాల్సిందే రావాలన్నా, పోవాలన్నా?  ఒక రహస్య స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. అది ఇతరులకు ఎవరికి కనిపించకూడదు.’ కృష్ణుడు ఆలోచించసాగాడు. అలా మదన పడుతున్న మాధవునికి వెంటనే ఇంద్రప్రస్థం లోని గవాక్షం సంగతి గుర్తొచ్చింది. విశ్వకర్మను పిలిపించి “విశ్వకర్మ పాండవుల ఇంద్ర ప్రస్తాన్ని నువ్వే కదా నిర్మించావు.  ప్రతిభవనానికి వెనుక వైపునపై అంతస్తుకి  ఒక ఖాళీ ప్రదేశాన్ని నిర్మించావు దానిని ఏమంటారు?” అని అడిగాడు.  

    “అదా స్వామి!  దానిని ‘బాల్కనీ’ అంటారు,”  అని జవాబు ఇచ్చాడు. 

     “బాల్కనీ  అంటే?” 

   “బాల ను + కని =  బాల్కనీ.  అంటే అదొక రహస్య స్థలం. మనం చేసే పనులేవీ ఎవ్వరికి తెలియకుండా ఉండడానికి వెనుక వైపు, ఇంద్రప్రస్థ ప్రకృతి సౌందర్యం తిలకించడానికి ముందు వైపు ఆ బాల్కనీని నిర్మించాను, స్వామి! అది మీ లాటి ప్రభువులకు నచ్చే ప్రదేశం!” అన్నాడు విశ్వకర్మ. 

    వెంటనే కృష్ణుడు తన అష్టభార్యలు మందిరాలన్నిటికీ అటాచ్డ్ బాల్కనీలను  ఎంతో సుందరంగా అతి రమ్య హర్మాలతో కట్టమని విశ్వకర్మను  ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ సుందర శిల్ప సంపదలతో భామ మందిరానికి వెనుక ముందు బాల్కనీ నిర్మించి ఇచ్చాడు. అది  పతిదేవుని ప్రియమయిన  స్థలం  కావడం చేత భామాదేవి అక్కడ వేగులను నిషేధించి కృష్ణునికి సులువుగా తప్పించుకునే అవకాశం ఇచ్చింది, ఆ అమాయకురాలు! విన్నావా చిలకమ్మా! అప్పటినుంచి మనం ప్రతి ఇంటికి ఒకటో రెండో బాల్కనీలు కట్టుకోవడం ఆచారంగా వచ్చింది.  అయినా ఖర్చు పెరగడంతో ఈ రోజుల్లో ఒక బాల్కనీతోనే సరిపెట్టుకొని సౌందర్యరాధన  చేస్తున్నారు అదుగో ఆయన లాగ,”అంటూ గోరింక ఎదురుగ ఉన్న బాల్కనీ లో నుంచున్న పెద్ద మనిషి ని చూపెడుతూ,  బాల్కనీ కధ  చెప్పడం ముగించింది. 

   చిలకమ్మా అటుఇటు చూస్తూ, తమ గూడు చుట్టూ ఒక సారి ఎగిరి చూసి వచ్చి  “అయితే ఇంతకీ మావ!  మన గూటికి కూడా బాల్కనీ కట్టా వన్నమాట!” అంటూ చిలకమ్మ కోపంగా ఎగిరిపోయింది.  బాల్కనీ కధ  చిలకమ్మకు ఎందుకు చెప్పానా అని గోరింక నాలుక  కర్చుకుంది.

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

పాత కొత్తల కలయిక