దొరసాని

ధారావాహికం -33 వ భాగం

ఇల్లంతా సందడిగా ఉంది నీలాంబరి క భూపతికి ఎంతో సంతోషంగా ఉంది.. కొడుకు కూతురు సరదాగా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే చూడముచ్చటగా ఉంది…

తెల్లవారి నామకరణం అనగా అన్ని తయారు చేసుకున్నారు… దగ్గర బంధువులంతా ముందు రోజే వచ్చి ఉన్నారు… ఇల్లంతా చక్కగా పూలతో అలంకరించారు…ఉయ్యలకు చుట్టు పట్టుచీరతో అలంకారం చేసి ఉయ్యాల లోపల అలేఖ్య పుట్టినప్పుడు నీలాంబరి కట్టుకున్న చీరను పరిచింది… ఆపైన అలంకారానికి అలేఖ్య మధుపర్కం చీరను కూడా జోడించారు….

” అమ్మా! పూలదండలు ఉయ్యాలకు కూడా కట్టనా!” అన్నది మహేశ్వరి.

” వద్దు వద్దు పూలలో చిన్న చిన్న పురుగులు ఉండడం కానీ లేదా ఇంకా ఏదైనా ఎలర్జీ కలిగించే విషయం ఉండొచ్చు అందులో చిన్న పాప కదా పూలకు దూరంగా ఉంచడమే నయం” అని చెప్పింది నీలాంబరి.

ఊళ్లోనే దిష్టి పూసలు తీసుకొని వచ్చి చేతులకు రెండు దండలుగా గుచ్చారు… పాపకి చేతులకు వేసుకోవడానికి బంగారు వత్తులు ( చిన్న గాజులు) మెడలో గొలుసు చేయించింది నీలాంబరి.

పాప నాయనమ్మ తాతయ్య పాప కోసం కాళ్ళ కడియాలు చిన్న ఒడ్డానం తీసుకొని వచ్చారు…

” అసలు పిల్లలకు ఏ
నగలు వేయడం నాకు ఇష్టం లేదు ఏదో ఆనవాయితీ అని తీసుకున్నాను కానీ వాళ్లకు ఏవి పెట్టినా చిరాకు చిరాకుగా ఉంటుంది ..చక్కని కాటన్ బట్టలు వేసి హాయిగా పడుకోబెడితే వాళ్లకి ప్రశాంతంగా ఉంటుంది” అన్నది నీలాంబరి.

“ఆ ఒక్క పూటకి వేసి తీసేద్దాం అమ్మ” అన్నది అలేఖ్య.

అరటి పండ్లు, శనగలు, తమలపాకులు తెచ్చి ఉంచుకున్నారు అందరికీ తాంబూలం ఈయడానికి కొన్ని గద్వాల్ చీరలు తెప్పించింది నీలాంబరి.

అలేఖ్యకు పాపకి కూడా పట్టుచీర పట్టు పావడ తీసుకుంది…

అందులో ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆనవాయితీగా వస్తుంది.

ఉదయం సత్యనారాయణ వ్రతం కోసం అన్ని తయారు చేసుకున్నారు… పొడి ప్రసాదం, సిరా ప్రసాదం ( రవ్వ కేసరి) పులిహోర భక్ష్యాలు గుత్తి వంకాయ కూర టమాట పప్పు ఆలూ వేపుడు పప్పుచారు చల్ల మిరపకాయలు అప్పడాలు చేయించారు…

సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అలేఖ్య సుధీర్ మరియు నీలాంబరి భూపతి పీటల మీద కూర్చున్నారు…

అరటి ఆకులతో అలంకరించిన పీట లోపల సత్యనారాయణ స్వామి పటము, తెల్లని బట్టమీద బియ్యం పోసి దానిపై కలశం నుంచి అందులో సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని పెట్టి అభిషేకాలతో పూజలు చేయించారు పూజారి గారు…

పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టీ.. చక్కని మంగళహారతులు పాడుకున్న తర్వాత సత్యనారాయణ వ్రత కథలు చెప్పారు పూజారి గారు…

అందరూ భక్తి భావంతో సత్యనారాయణ స్వామి వ్రత కథలు అన్ని విన్నారు… అందులోని సారాంశాన్ని వివరించారు పూజారి గారు…

“మొదటి కథలో విష్ణుమూర్తి నారదనికి చెప్పే అద్భుతమైన విషయం..

భూలోకం లోపాప భారం పెరుగుతుంది అని నారదుడు విన్నవించుకున్నప్పుడు… విష్ణుమూర్తి చెప్తాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడమే దీనికి పరిష్కారం అని.

ఎలాంటి వారైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అని చెప్పడానికి ఉదాహరణ కట్టెలమ్మ వాడు కథ విని వ్రతం చేసుకోవడం… గొప్పధనికా బేధం లేకుండా చేసుకునే వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం రెండవ కథలో మనం తెలుసుకుంటాము.

ఎవరైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకొని కృతజ్ఞతా భావంతో ఉండాలని సందేశం మూడవ కథ. ..స్వామిని మరచిపోతే దరిద్రం ఎప్పుడూ తెచ్చి పెట్టడు కానీ మనసులో కృతజ్ఞతా భావం ఉండాలనేది మూడవ కథలో సారాంశం…

నాల్గవ కథలో స్వామిని తలుచుకున్నందుకు మళ్లీ అన్ని వైభవాలు వస్తాయి అంటే మన మనసులు స్వచ్ఛమై పని పట్ల మనకు ఏకాగ్రత ఉండి మనకు మేలు చేసిన వారిని స్మరణ చేసుకొని కష్టపడే తత్వం ఉండటం వల్ల అన్ని తిరిగి వస్తాయి ఇదే నాల్గవ కథలో సారాంశం….

ఇక ఐదవ కథలో ఒకరిని కించపరచకూడదు అనే సారాంశం ఉంటుంది గొల్లలు చేసిన ప్రసాదం తీసుకోకుండా రాజు వెళ్లిపోవడం వల్ల ఎంతో అనర్థం జరుగుతుంది.. అంటే అందరం సమభావంతో ఉండాలని అంతరార్థం ఇందులో ఉంటుంది…

అందుకని వ్రతంలో సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని బంగారము వెండి ఇత్తడి లేదా రాగి అని చెప్తారు కాబట్టి ఇది అందరూ చేసుకోదగ్గ వ్రతం ఇందులో అంతరార్థం మంచి లక్షణాలు కలిగి ఉండాలని….

సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి అదంతా చేశాడు అనేది మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలిఅనే కోణంలో ఆలోచించుకోవాలి…” అని పూజారి గారు కథలు తెలియజేశారు…

పూజ అయిన అనంతరం అందరూ తీర్థప్రసాదాలు తీసుకున్నారు.. పీటల మీద కూర్చున్న వారికి బట్టలు పెట్టారు…

అందరికీ అరిటాకులు పరిచి భోజనం వడ్డించారు..

అందరి భోజనాలు అయిన తర్వాత సాయంకాలం 6 గంటల సమయంలో నామకరణోత్సవానికి ఏర్పాటు చేసుకున్నారు..

ముందుగా సుధీర్ అలేఖ్యలను కూర్చోబెట్టి వారికి బట్టలు పెట్టి.. కొత్త బట్టలు ధరించమన్నారు.. ఇంట్లో ఉన్న పెద్ద ముత్తైదువ అంటే నీలాంబరి తల్లి అఖిలేశ్వరి పాపకు కొత్త బట్టలు వేసి కాళ్ళకి కడియాలు చేతులకు దిష్టి పూసలు బంగారు గొలుసు వేసి బొట్టు పెట్టి బుగ్గకి అరికాలిలో చుక్క పెట్టింది.

ఊయలలో నాలుగు వైపులా తమలపాకులు పెట్టి అందులో శనగలు పోసి ఉంచారు తర్వాత ఉయ్యాలలో దేవుడి విగ్రహాన్ని పెట్టారు… ఉయ్యాలకు అటువైపు అలేఖ్య మరొకవైపు అలేఖ్య అత్తగారు నిలబడి ఉన్నారు అలేఖ్య చేతిలో పాపని తీసుకొని పైనుండి వాళ్ళ అత్తగారికి అందిస్తూ ” లక్ష్మీదేవిని తీసుకోండి” అని అంటుంది…

అప్పుడు అలేఖ్య అత్తగారు…పాపని చేతిలో తీసుకొని ఊయల కింద నుండి మళ్లీ అలేఖ్యకు అందిస్తుంది. “పార్వతీదేవిని “తీసుకో అని.. ఇలా దేవుళ్ళ పేర్లు చెబుతూ మూడు చెట్లు ఊయల పైనుండి క్రిందికి తిప్పి తర్వాత ఊయల్లో పడుకోబెడతారు…

ముందుగా తల్లి తండ్రి పేరు పెట్టిన తర్వాత ఇంటి పెద్దలందరూ చెవిలో బంగారు ఉంగరం చెవి దగ్గర పెట్టి పేరు పెడతారు…

అందరూ పాప చెవిలో ముందు అనుకుంటున్నట్లుగానే “సౌందర్యలహరి” అని పెట్టారు..

వియ్యంపులు ఒకరికొకరు పేర్లు పెడుతున్నప్పుడు వీపుల మీద చరుచుకుంటారు.. ఇదంతా ఒక సరదాకు మాత్రమే ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండడానికి ఇది ఒక వేదిక…

తర్వాత ఊయల కింద ఐదు చెంబులకి సున్నం జాజుతో అలంకరణ చేసి పూల దండ చుట్టి ఉంచుతారు… ఆ చెంబులను ఐదుగురు ముత్తైదువలు చేతిలో పట్టుకుంటారు ..ఇంటి ఆడపడుచు హారతితో ముందు నడుస్తుండగా బాలింతరాలు ఈ ఐదుగురు ముత్తైదులు బావి దగ్గరికి వెళతారు (ఈ మధ్యకాలంలో బావులు లేవు కాబట్టి ఒక పెద్ద బిందెలో నీళ్లు పోసి పని కాని చేస్తున్నారు..)….

బాలింతరాలి చేతిలో ఒక కొడవలి వేప కొమ్మలు పట్టుకొని ఉంటుంది మరో చేతిలో నూనె పావు నెయ్యి పావు .. పసుపు కుంకుమ పత్తి గింజలు పెట్టిన ఒక ప్లేట్ పట్టుకొని బావి దగ్గరికి వచ్చి బావిలో.. పసుపు కుంకుమ వేసి తర్వాత నూనె వేస్తూ “నూనె ధార నీకు పాలధార నాకు” అని గంగమ్మను ప్రార్థించాలి ఇలాగే నెయ్యి వేస్తూ కూడా తర్వాత పత్తి గింజలను కూడా బావిలో వేసి తర్వాత చేదబావిలో నీళ్లు ఐదుసార్లు తోడి బిందెలలో నింపాలి ఆ రోజుల్లో అయితే బిందెలే తీసుకొని వెళ్లేవారు బాలింతకు మరొకరు సహాయం చేస్తారు… ఇలా నీళ్ల బిందెలు ముత్తైదువలు పట్టుకొని లోపలికి రావాలి అంతకుముందే వదిన మరదలు వరుసైనవాళ్లు తాంబూలం తీసుకొని లోపలికి వెళ్లి తలుపు పెట్టుకుంటారు…

” నీ భర్త పేరు చెప్తేనే లోపలికి రానీస్తాము” అంటారు…

సిగ్గుపడుతూ అమ్మాయి భర్త పేరు చెప్తే అప్పుడు తలుపు తీసి లోపలికి రానీస్తారు… ఆ తాంబూలం తీసుకున్న అమ్మాయి పెళ్లి అయిన అమ్మాయి అయి ఉండాలి ఆమెకు అదే నెల తప్పుతుందని పెద్దవాళ్ల ఆలోచన… ఇలా అన్నీ కార్యక్రమాలు పూర్తి అయ్యాక అందరూ భోజనాలు చేసి సౌందర్యలహరికి దృష్టి తీసి విశ్రాంతి తీసుకున్నారు..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లాలిపాట

ఎడారి కొలను