ఈరోజు సరళాదేశ సంధికి గసడదవాదేశ సంధికి భేదాలు తెలుసుకుందాం!
చిన్నయ సూరి సరళాదేశ సంధిని రెండు సూత్రాలతో వివరించారు.
అందులో మొదటిది.
“ద్రుత ప్రకృతికము మీద పరుషములకు సరళములగు” అని సూత్రీకరించారు.
క, చ, ట, త, పలను పరుషములు అంటారు.
గ, జ, డ, ద, బలను సరళములు అంటారు.
న , ని, ను, న్ అనే వాటిని ద్రుతము అంటారు. ఈ నాలుగు ప్రత్యయాలు చివర గల పదాలను ద్రుత ప్రకృతికములు అంటారు.
ఉదాహరణకు
దేశమున
రాముని
పూచెను
వచ్చెన్ మొదలగునవి.
ఈ నాలుగు ప్రత్యయాలు చివరిలేని పదాలను కళలు అంటారు.
ఉదాహరణకు :-సీత, గోడ, అల్లము, సున్నము, ఆవు, పులి మొదలైనవి.
మొదటి పదం చివర న, ని,ను, న్ ఉంటే రెండో పదం పరుషముతో మొదలైతే ఆ పరుషములకు బదులుగా సరళములు వస్తాయి.
ఉదాహరణకు
పూచెను+ కలువలు… పూచెను గలువలు
తోచెను +చుక్కలు…. తోచెను జుక్కలు
చేసెను +టక్కులు….. చేసెను డక్కులు
నెగడెను+ తమములు…. నెగడెను దమములు మొగిడెను+ పద్మము… మొగిడెన బద్మము.
ఇక రెండవ సూత్రం చూద్దాం!
“ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు”
వివరణ:- సహజసిద్ధంగాని అంటే పరుషములకు బదులుగా వచ్చిన సరళములకు ముందున్నటువంటి ద్రుతమునకు పూర్ణ బిందువు గానీ లేదా అర్ధబిందువు గానీ వస్తుంది. అలాగాక సంశ్లేము కూడా రావచ్చు. సంశ్లేము అనగా ముందున్న హల్లుతో కలుస్తుంది. సూత్రంలో విభాష అని చెప్పడం వలన పై మూడు రూపాయలు రాని పక్షంలో స్వత్వం అంటే ముందున రూపం వస్తుందని సూత్రార్థం.
పూచెను + కలువలు ముందు చెప్పిన సూత్రం ప్రకారం పరుషానికి సరళం రాగా
పూచెను గలువలు అవుతుంది.
ఈ సూత్రం ప్రకారం నిండు సున్న వస్తే
పూచెంగలువలు అవుతుంది.
ఒకవేళ అరస్తున్న వస్తే
పూచఁ గలువలు అవుతుంది.
అలాగాక సంశ్లేషం వస్తే
పూచెన్గలుగులు అవుతుంది.
ఇవి ఏవి రాని పక్షంలో మొదటి రూపమైన పూచెను కలువలు అనే రూపం వస్తుంది. ఇలాగే మిగిలిన రూపాలను సాధించాలి.
గసడదవాదేశ సంధి :- గసడదవాదేశ సంధి మనకు రెండు సందర్భాలలో వస్తుంది.
“ప్రథమ మీద పరుషములకు గసడదవలు బహుళముగా నగు” అని సూరి సూత్రం.
అనగా ప్రథమా ప్రత్యయాలైన డు,ము,వు, లు పూర్వ పదంలో ఉంటే దానికి పరుషములు అనగా క చ ట త పలు పరమైతే దానికి బదులుగా బహుళంగా గ,స, డ, ద,వ లు ఆదేశంగా వస్తాయని సూత్రార్థం.
వాడు+ కొట్టె… సంధి జరిగితే వాడుగొట్టె సంధి జరగకపోతే వాడుకొట్టె అని రెండు రూపాలు వస్తాయి.
ధర్మము+ చేయక… ధర్మము సేయక లేదా ధర్మము చేయక
నీవు+టక్కరి…. నీవుడక్కరి లేదా నీవు టక్కరి
పఱియలు+ పాఱు….. పఱియలువాఱు లేదా పఱియలు పాఱు
వారు+ పోరు… వారు వోరు లేదా వారు పోరు
ఈ కార్యము క్రియా పదముల మీద కూడా వస్తుంది
రారు+ కదా.. రారుగదా లేదా రారుకదా
వత్తురు+ పోదురు… వత్తురువోదురు లేదా వత్తురుపోదురు
అయితే కొన్ని చోట్ల పూర్వపదంలో డు,ము,వు ,లు లేకున్నా పరుషములకు గసడదవలు ఆదేశంగా వస్తున్నాయి.
చిచ్చు+ పోలె… చిచ్చువోలె లేదా చిచ్చు పోలె
తాత+ కదా.. తాతగదా, తాతకదా
ఇక్కడ చిచ్చు, తాత అనేవి స్త్రీసమ పదాలు. అంటే ప్రథమా విభక్తి లోపించిన పదమని గ్రహించాలి.
ఇక రెండవ సూత్రాన్ని చూద్దాం!
“ద్వంద్వమునందు పదంపై పరుషములకు గసడదవులగు”
ద్వంద్వ సమాస పదాలపై పరుషములకు సరళములు నిత్యంగా వస్తాయని సూత్రార్థం.
కూర+ కాయ… కూరగాయలు
కాలు+ చేయి…. కాలు సేతులు
టక్కు+ టెక్కు…. టక్కుడెక్కులు
తల్లి +తండ్రి….. తల్లిదండ్రులు
ఊరు+పల్లె…. ఊరు వల్లెలు
కూరగాయలు అనేది ద్వంద్వసమాసం కాబట్టి పరుషములకు సరళములు వచ్చాయి. ద్వంద్వ సమాస పదాలు కలిసినప్పుడు బహువచనాంతంగా ఉంటాయి. విడదీసినప్పుడు ఏకవచనాంతంగా ఉంటాయి.
కూరగాయలు… కూర +కాయ
తల్లిదండ్రులు… తల్లి+ తండ్రి
అన్నదమ్ములు అన్న+ తమ్ముడు
సరళదేశసంధికి గసడదవాదేశసంధికి బేధాలు చూసినప్పుడు సరళాదేశసంధిలో మొదటి పదం చివర న, ని,ను,న్ అనేవి ఉంటాయి. దానికి పరుషం పరమైతే సరళము అవుతుంది.
పూచెన్+కలువలు…. పూచెంగలువలు
గసడదవాదేశ సంధిలో పూర్వపదం డు, ము, వు, లు ఉంటాయి. దానికి పరుషములు పరమైతే వరుసగా గసడదవలు ఆదేశంగా వస్తాయి అప్పుడు +చనియె… అప్పుడు సనియె
గసడదవాదేశ సంధిలో ద్వంద్వసమాసం ఉంటే పరుషాలకు బదులుగా గసడదవలు ఆదేశంగా వస్తాయి
కూర+కాయ… కూరగాయలు
రంగరాజు పద్మజ