మనిషి సామాజిక జంతువు. మానవుల సాంస్కృతిక మరియు మతపరమైన పాత్రను పోషిస్తాయి ఆచార వ్యవహారం. ఆచారం అంటే గుర్తు చేసేది. ప్రాంతం ఏదైనా మతం ఏదైనా ఆచారాలు పురాతన కాలం నుండి ఔన్నత్యం మరియు ఆనందానికి బాధ్యత వహిస్తున్నాయి. కుటుంబము మరియు సమాజంలో సమతుల్యతను కొనసాగించేలా చేస్తున్నాయి . ఆచారాలు జీవితాలను సంస్కరిస్తాయి. భౌతిక వాతావరణమానికి అనుగుణంగా జీవించడానికి ఆచారాలు ఏర్పడ్డాయి . ఈ ఆచారాలలో కొన్ని మతపరమైనవి మరియు సాంఘికపరమైనవిఉన్నాయి. కొన్ని ఆధ్యాత్మిక పర మైనవి , కొన్ని జీవనపరమైనవి, ఇవి సందర్భాన్ని బట్టి ఉంటాయి.సామాజిక ఐక్యతను బలోపేతం చేయడానికి దోహ పడే ముఖ్య కారణాల్లో ఒకటి ఆచార వ్యవహారాలు.
ఆచారాలు పరస్పర ప్రయోజకమైన ప్రయోజనం కోసం ఒక విధంగా, మరో విధంగా వ్యక్తులను ఒక చోట చేరుస్తాయి. ఒక సాధారణ ఉదాహరణను పరిగణలోకి తీసుకుంటే ఒంటరిగా తినటంలో పోలిస్తే సమూహంతో కలిసి భుజించడం అనేక సానుకూల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సాంఘిక ఆచారాలు ఐక్యతను సృష్టించడం, సమస్యలను చర్చించడం, స్నేహాలను బలపరచడం మొదలైనవి. మతపరమైన ఆచార ప్రవర్తన అనేది సమాజం యొక్క మానసిక శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. మంత్ర జపం, పూజ యజ్ఞయాగాదులు,ధ్యానం ధర్మం మొదలైన ఆచారాలన్నీ ఆ దృష్టితో వచ్చినవే. అన్ని మతాల వారికి, జాతుల వారికి వారికి సృష్టించబడిన ఆచారాలు ఉన్నాయి. అందరూ అన్నిటినీ గౌరవించవలసిందే.
భౌగోళికంగానూ, ప్రాంతాలవారీగాను, ఆచారలనేవి మారుతూ ఉండవచ్చు కానీ అది క్రమశిక్షణతో కూడిన జీవనం కోసమే. నీ దారి నీది నా దారి నాది అన్నట్టు కాకుండా అందరినీ ఒక చోట కలిపి ఉంచడానికే.పెద్దలు ఆచరించి పిల్లలను ఆచరించేలా చేయడం వలన ఆచారాలు కొనసాగుతూ వస్తున్నాయి. సహజంగా ఆచారాలన్నీ ధర్మాలతోనే ముడిపడి ఉంటాయి. ఈ పని చేస్తే ఇది తప్పు ఈ పని చేస్తే లాభం అని అంతర్లీనం గా చెపుతాయి ఆచారాలు. ప్రతి ఆచారం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే సంజీవి. భక్తి,ఉపవాసాలు, ధ్యానం వీటికి సంబంధించినవే. అది కాక కట్టుబాట్లు అని ఆచారాలను ఇంటి నుండే ప్రారంభించాలి.
నేటి ఆధునిక కాలంలో మార్పు లేకపోవడం విసుగును కల్పిస్తోంది నవతరానికి. ఆచారాలుఉపేక్షులో పడిపోతున్నాయి. ఇంత విలువైన ఈ ఆచారాలను ప్రతి కుటుంబము తమ పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పాలి. నేర్పడం అంటే వాటి గురించి ఓర్పుతో మంచి చెడ్డలను వివరించడమే కాక తీసుకెళ్లి చూపించాలి ఆ ఆచార విధిని . తమ వారసులకు ఆచారం వ్యవహారాల ఔన్నత్యాన్ని తెలియజేయాలి. ఉదాహరణగా తీసుకోండి…. ముస్లిం మతస్తులు ఉన్నారు కదా వారికి కూడా ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఐదు సార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ సమయానికి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్న వెంటనే కూర్చుని నమాజ్ చేస్తారు. నేడు అన్నిచోట్ల పనిచేసే ప్రదేశాలలో కూడా వారికి ఈ ఏర్పాట్లు చేశారు. ఇక రంజాన్ లో వచ్చేఉపవాస దీక్షలు కూడా ఎంతో నియమంగా చేస్తారు. ఉపవాసం చేసేటప్పుడు ఆహారంలో ,సెక్స్, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటారు. వారి క్యాలెండర్ ప్రకారం “షాబాన్ ” నెలలో ఈ రంజాన్ ఉపవాసాలు చేస్తారు. ఇఫ్తార్ విందులను సామూహికంగా కూడా చేసుకుంటారు. బీద సాదలకు ఎన్నో దానధర్మాలు కూడా చేస్తారు. సాంప్రదాయ దుస్తులు తప్పక ధరిస్తారు. ఆధ్యాత్మిక శుద్ధి కరణ మరియు క్రమశిక్షణకు సాధనంగా ఈ ఉపవాసం ఆచరిస్తారు. ఏసుక్రీస్తు బోధనల ప్రకారము జీవించేవారి క్రైస్తవుల అని అంటారు. వీరికి ప్రార్థనలే ముఖ్య ఆచారం. హోలీ బైబిల్ మత గ్రంధము. క్రీస్తుపుట్టిన దినముగా భావించి క్రిస్మస్ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆరోజు దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు.మతకర్మ అనేది క్రైస్తవ ఆచారము. దీనిని దేవుని దయ కోసం ఒక ఛానల్ గా భావిస్తారు. ఇక సిక్కు మతం గురించి చెప్పాలంటే ఇది సిక్కు మత గురువు గురునానక్ ప్రబోధనల ఆధారంగా ఏర్పడిన మతం. ఏకేశ్వరూపాసన వీరి అభిమతం. వీరి దేవుని పేరు ” వాహ్ గురు “.వీరి పవిత్ర గ్రంథం “గురు గ్రంధ సాహిబ్ “. ప్రతి గురుద్వారా లోను సందర్శకులకు మతంతో సంబంధం లేకుండా ఆశ్రయము, సౌకర్యం మరియు ఆహారం ఉచితంగా అందిస్తారు. దీనికోసం ఉచిత “కమ్యూనిటీ కిచెన్లను ” నిర్వహిస్తారు ప్రతి ఒక్కరూ పక్క పక్కన కూర్చుని కలిసి తినేలా ఏర్పాటు చేస్తారు. అదే కాక వచ్చిన వారి పాదరక్షలను, తిన్న పాత్రలను శుభ్రం చేయడం కూడా ఒక సేవగా భావిస్తారు. ఇంచుమించు అన్ని గురుద్వారాలను ఈ సేవలు కనిపిస్తాయి. హిందూ దేవాలయాల కూడా ప్రసాద వితరణ రోజు జరుగుతుంది. పూర్వపు రోజుల్లో రాజులు వీటి కోసం మణి మాన్యాలు ఇచ్చేవారు. కొన్ని దేవాలయాలలో నిత్యాన్నదానాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నేటి తరం కూడా ఈ అన్నదానాలకు, సేవలకూ, డొనేషన్ల పేరుతో ధనాన్ని అందిస్తూనేఉన్నారు. ఈ ఆచారాలన్నీ కాలానుగుణంగా చాలా మార్పులకు లోనయ్యాయి. కానీ మూలాలు చెడలేదు. ఈ ఆచారాల ముఖ్య ఉద్దేశం మాత్రం సౌబ్రాతృత్వమే. ఇలా అన్ని విషయాలను పెద్దలు పిల్లలకు బోధిస్తూ, అవకాశాన్ని బట్టి ఆ ప్రదేశానికి తీసుకువెళ్లి చూపిస్తూ వివరించండి. ఉన్నదానికంటే చూసినది మనసుకు బాగాఎక్కుతుంది. వినడం ద్వారా మనసులోకి వచ్చేది బావన మాత్రమే. అందుకే పెద్దలు తీరిక చూసుకొని ప్రతిదానిని ప్రత్యక్షంగా దర్శింపజేయండి.
సదాచారాలతో పాటు దురాచారాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రతి దానిని లాజిక్( తర్కం ) తో ఆలోచించి తెలుసుకొని ఆచరించడం నేటి తరానికి మంచిది. నేటి తరం అంతా విద్యాధికులే కదా… మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆచారం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం చూపించే మానవత్వం ఉంది. ఎవరైనా సరే తమ ఉన్నతమైన గతాన్ని మర్చిపోతే తమ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆచారాలను వ్యవహరించడంలో మార్పులు రావచ్చు కానీ మూలాలను మర్చిపోవద్దు. మన హిందువులలో ఆచారాలు ఇంటి ముందు ముగ్గు వేయడం నుంచి,శవ దహనం వరకు ప్రతిదీ తర్కంతోనే ముడిపడి ఉంటుంది. అందులో ఆరోగ్య శాస్త్రం ముఖ్యంగా కనిపిస్తుంది. ఉపవాసాలు ఉండటం, మండల దీక్షలు తీసుకోవడం, గిరి ప్రదక్షిణాలు, పొర్లు దండాలు, సాష్టాంగ నమస్కారాలు, గుంజీలు తీయడం మొదలైన ఆచారాలందు అంతర్లీనంగా ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అలాగే ముస్లింలు రంజాన్ లో ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఇవి అన్ని మతాలలో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి.నేటి యువత వీటిని లాజిక్ గా ఆలోచించకుండా పెడచెవిన పెడుతున్నారు . వారిని దారిలో పెట్టడం పెద్దలుగా మన వంతు. ఈ ఆచారాలు కూడా కాలానుగుణంగా ఎన్నో మార్పులు చెందాయి కానీ మూలాలు చెడలేదు. ఈ ఆచారాల ముఖ్య ఉద్దేశ్యం మాత్రం సౌబ్రాతృత్వమే.
సర్వేజనా సుఖినోభవంతు.
కామేశ్వరి వాడ్రేవు