అనురాగాల అంకురం
గర్భగుడిలో తపస్సు
నవమాసాల నిరీక్షణ
మాసానికో అనుభూతి
ఎన్నో పరిణామాలు
మరేన్నో వికారాలు
అంతులేని యాతన
తల్లి బిడ్డల పోరాటం
చీకటి దారిలో
రక్తసముద్రంలోంచి
ఉదయించిన జాబిలి
కూన
ప్రతిధ్వనిస్తుంది కెవ్వున
వెలుగు కేక
ప్రతిఫలిస్తుంది
అందరిలో ఓ వెలుగు రేఖ
అంతా ఆనందావరణం
నక్షత్రాల్లా కళ్ళు
మల్లె మొగ్గలా ముక్కు
ఎర్రని మందారం నోరు
ముట్టుకుంటే
కందిపోయే మృదువైన
దేహం..
దోసిట్లో ఒదిగిన
గులాబీ
ఉంగాఉంగా రాగాలు
అమ్మకు తెలిసే స్వరాలు..
నిద్రలోన నవ్వులు ఉలికిపాట్లు..
వెచ్చని అమ్మబడి
ఎంతో భరోసా..
మెత్తని బిడ్డ హాయి
స్పర్శ..
ఇద్దరూ ఒకటే
అవిభాజ్యం అద్వైతం
కుతితీరా పాలు తాగి
అలా అమ్మనే
చూస్తుంటాడు..
అమ్మ కూడా అంతే!
మౌన ఆలాపనగా
మమతా గీతం..
సుందర దృశ్యం
అంతా ప్రేమావరణం
వాడు పుట్టుకతోనే జ్ఞానీ
సర్వ స్వతంత్రుడు
ఏదైనా అప్పటికప్పుడే!
భూత భవిష్యత్తులతో
పనేలేదు..
ఆకలి అమ్మలాలనా
ఇవే వాస్తవాలు..
ఎప్పుడంటే అప్పుడు
బజ్జుంటాడు..
అంతా స్వేచ్ఛావరణం
అందర్నీ ఆకర్షిస్తాడు
కాలాన్ని ఆపేస్తాడు
నవ్వులు కురిపిస్తాడు
వాడితో కాస్త గడిపితే
ఎంత ప్రశాంతత
మనలోనూ చైతన్య
దీప్తులు..
అంతా ధనావరణం
అవును
మన మూలమిదే కదా! మరిచినామేమో..!?