తెలివి The intelligence

2-6-2024 తరుణి పత్రిక సంపాదకీయం

అప్పుడే పుట్టిన బిడ్డ కెవ్వున కేకేసి ఏడ్చిస్తేనే ప్రాణం ఉన్నట్టు, బ్రతికినట్టు అంటారు. కొన్ని తడవలు అలా ఏడవని పిల్లలను డెలివరీ చేయించిన డాక్టర్స్ ఏడ్చేలా చేస్తారు. ఇది వేరే విషయం. ఈ ఏడుపు అనేది దుఃఖానికి,కష్టానికి, బాధకు ఏడ్చిన ఏడుపు కాదు. కొత్త జీవితానికి పునాది, బ్రతుకు వెలుగు దారి. పుట్టినప్పుడు ఏడుస్తారు అని పోయేటప్పుడు ఏడిపిస్తారు అని ఒక మాట వాడుకలోని మాట. పుట్టుక చావుల మధ్యన అంతులేని జీవితం ఉంటుంది. ఈ జీవిత ప్రయాణంలో ఎందరో వ్యక్తులు కలుస్తారు,ఎన్నో సంఘటనలు అనుభవిస్తారు.
బస్సులో ప్రయాణిస్తున్న పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఎటువంటి వాడు తెలియదు కానీ కొన్ని గంటలు కలిసే వెళతారు. ట్రైన్లో ప్రయాణిస్తున్న వ్యక్తి కొంతమందితో కలిసి కూర్చుని ప్రయాణిస్తాడు. వాళ్ళు ఎవరో తెలియదు ఎక్కడినుంచి వస్తున్నారో ఇక్కడికి వెళ్తున్నారో తెలియదు. కానీ ఈ రెండు ప్రయాణాలను లెక్కలోకి తీసుకుంటే తన గమ్య స్థానం లో దిగిపోయేసరికి ఎంత కొత్త తెలుసుకుంటాడు. వాళ్ళతో మాట్లాడకున్నా కొన్ని విషయాలు అర్థం అవుతాయి. ఇది ఎలా సాధ్యం? అంటే , ఒక గమనింపు అనేది ఉంటుంది. ఈ ప్రకృతి నుండి నేర్చుకున్నది,సహజ సిద్ధంగా వచ్చినటువంటి తెలివి. భూగోళం పై సంచరించి ప్రతి జీవికి ఈ తెలివి అనేది ఉంటుంది. ఆకలి, నిద్ర, కోరిక, కోపం ,సంతోషం, నిస్తేజం, భయం, ధైర్యం ఇవన్నీ అవసరాన్ని బట్టి మనిషిలో కలుగుతాయి. ప్రతిదానికి ఏదో ఒక రసాయన చర్య అనేది ఉంటుంది. ఇవి ఎందుకు ఇలా వచ్చాయని తెలియకున్నా. ఇవి ఏవో ఎందుకో ఏం చేస్తాయో తెలుస్తుంది. ఇదంతా నాచురల్ ఇంటెలిజెన్స్. ప్రకృతి సిద్ధమైన తెలివి. ఈ తెలివితో మంచి ఏదో చెడేదో తెలుసుకోగలుగుతారు. ఉచ్ఛ, నీచాలు తెలుస్తాయి. పాపమని పుణ్యమని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని మంచి భావనలు ఉంటాయి, సంతృప్తినిస్తాయి. ఇటువంటి తెలివి మనుషులకు కావాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. దేశం బాగుంటుంది. ప్రపంచమూ బాగుంటుంది. ఇది వక్రీస్తే? పాలు విరిగినట్టు చెట్టు ఎండినట్టు సముద్రాలు పొంగి, భూమిని కోసినట్టు …. ఇలా అన్ని చెడు మాత్రమే చూస్తాం. ఇప్పుడు జరుగుతున్నది అదే!
అసలు ఇంటిలిజెన్సీ పోయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇంటెలిజెన్స్ శాస్త్ర సాంకేతికతతో సిద్ధం చేసిన ఇంటెలిజెన్స్ గురించి కాదు, మనిషి తన లోపల వికృత తత్వానికి రూపమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇన్స్టిట్యూషన్స్ లలో టెక్నాలజీ తో, బయోమెట్రిక్స్ తో, మెడికల్ ఇమేజింగ్ లతో, కంప్యూటర్ బిజినెస్ విజనైజేషన్తో కాదు ఏం పరిచిన డెవలప్డ్ ఇంటెలిజెన్సీ కాదు. ఇది మనిషి లోపల స్వార్థం దుర్మార్గం అత్యాశ వంటి దుర్గుణాల వల్ల ఏర్పడిన కృత్రిమ తెలివి. మనుషులలోనే ఉంటారు మృగాలుగా ప్రవర్తిస్తారు. మంచి గురించి చెప్తూనే ఉంటారు, లోలోపల చెడు ఆలోచిస్తూ ఉంటారు. మాటలతో సుధలు కురిపిస్తూనే ఉంటారు మనసులో విషయాన్ని దాచుకుంటారు. ఈ తెలివిని గురించి ఇంటెలిజెన్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి.
ప్లాస్టిక్ డబ్బు అంటారే….. అదే….. చేతిలో డబ్బు పట్టుకోకుండా, కార్డుతో గీకిస్తున్న కాలం లో ఉన్నాం. సౌకర్యాలు అనుభవిస్తూనే సైన్స్ ను విమర్శిస్తే ఎట్లా? ఇంటిలిజెన్స్ ట్రెండింగ్లో ఉన్న కాలంలో ఉంది మానవాళి మొత్తం పెను ప్రమాదంలో పడిపోతుందని భయపడితే ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సృష్టికర్త జెప్టీన్ కూడా ఇప్పుడు AI వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు వస్తాయని బాధపడిపోతున్నాడే!! పడనీయండి…. ఏదైనా పెరుగుట విరుగుట కొరకే కదా! దీనికి విరుగుడు ఏదో కనుక్కుంటారు లేండి.
బయోమెట్రిక్ భద్రతలైతే ఏంటి వాయిస్ గుర్తింపైతే ఏంటి ఇవన్నీ మరింత కొత్తదనంతో వస్తాయి. దుర్వినియోగం చేయనివ్వని కట్టడి అవసరం. అలా నష్టం చేసేలా సైన్స్ ఉండదు. శాస్త్రవేత్తలు తప్పకుండా ఏదో ఒకటి కనుక్కుంటారు.
మనిషిని పట్టిన ఈ కృత్రిమ తెలివి ఎలా? …. ఎలా ఏం చేస్తే పోతుంది? ప్రేమలు బంధాలు స్నేహాలు అనురాగాలు మనుషులు మానవత్వం అన్నదమ్ములు ఆప్యాయతలు ఇటువంటి మంచి మాటలు కనుమరుగవుతూ ఉంటే ఈ చట్టాల గురించి కాదు కానీ, ఏ చట్రంలో ఏకైకృతం చేయగలం?
పచ్చని మైదానాలను, చక్కని పూల మొక్కలను, వినీలాకాశాన్ని, విశాల హృదయంలో బంధించగలగాలి. ఎక్కడైతే నష్టం జరుగుతుందని గ్రహిస్తారు వెంటనే ఎదుర్కొని పోరాడి నచ్చజెప్పి మంచిదారికి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. చిన్నప్పుడే విద్యాబుద్ధులు నేర్పించి సరైన మార్గం చూపించి మానవత్వం పునాదులపై నిర్మాణం చేసుకోవాలంటే నేను సైతం అనుకోవాల్సిందే.
తరాలు మారుతుంటే, అవసరాలు పెరుగుతుంటే, మమకారాలు తగ్గుతున్నవి. ఈ నిచ్చెన మెట్ల బ్రతుకు ఇచ్ఛ తప్పకుండా సన్మార్గంలో వెళ్లే ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆకాశవాణి తో మన అనుబంధం

నాన్నా