ఆకాశవాణి తో మన అనుబంధం

రేడియో ఒక వినోద, విజ్ఞాన ప్రసార సాధనం.
ప్రస్తుత కాలము నుండి ఒక 50 సంవత్సరాల వెనకకు వెళితే….ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని ఆ కాలంలో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు అందుకుంది. . రోజూ నాలుగు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే, పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ, లలిత సంగీతం వ్యవసాయ కార్యక్రమాలు, క్విజ్, కథానికలు,సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది.ఓ నాలుగు దశాబ్దాల క్రితం వరకు పెద్దా, చిన్నా అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం. అసలు రేడియో ఒక వింత సాధనం …. అందులోకి మనుషులు ఎలావెళ్లి మాట్లాడుతారా! పాటలు ఎలా పాడుతారా? అని ఆశ్చర్యంతో కూడిన అమాయకత్వం చాలా మందికి ఉండేది. ప్రతి ఇంట్లో పెద్దదో,చిన్నదో…. ఏదో ఒక రేడియో తప్పకుండా ఉండేది. వివిధ కంపెనీల రేడియోలు అంటే మర్ఫీ, బుష్ ,ఫిలిప్స్, నేషనల్ పానసానిక్ మొదలగునవి….. మా చిన్నతనంలో మా ఇంట్లో బుష్ రేడియో ఉండేది. దానిలో వచ్చే కార్యక్రమాలు నాకు ఇప్పటికే జ్ఞాపకమే. ఉదయం 6 గంటలకు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయము 6 గంటలు అని చెప్పేవారు. రేడియో వింటున్న ప్రతి ఒక్కరు గడియారంలో సమయాన్ని (టైం ని) సరిచేసుకునేవారు. వందేమాతర గీతంతో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యేవి. 6.10 నిమిషాలకు ప్రసారకర్త (అనౌన్సర్) ఆ రోజు కార్యక్రమాల వివరాలు తెలిపేవారు.6.30 నిమిషాలకు… సంస్కృతం నేర్చుకుందాము అనే కార్యక్రమం ‘బర్తృహరి’ శ్లోకముతో మొదలయ్యేది.
“కేయూరాణి న భూషయంతి పురుషం, హారాణ చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్దజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృత ధార్యతే, క్షీయంతేఖిల భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం.” 6.45 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు… ‘ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాహః శుయంతాం ప్రవాచకః బలదేవానంద సాగరః’ అని మొదలయ్యేవి. 7.10 నిమిషాలకు ఢిల్లీ నుండి తెలుగులో వార్తలు ‘అద్దంకిమన్నార్’ చదివేవారు. మధ్యాహ్నం ఢిల్లీ నుండి ‘ప్రాంతీయ వార్తలు’ అద్దంకిమన్నారు, కందుకూరి సూర్యనారాయణ ,పార్వతీ ప్రసాద్ వీళ్లలో ఎవరో
ఒకరు చదివేవారు. తర్వాత కార్మికుల కార్యక్రమం… చిన్నక్క ఏకాంబరం, పీతాంబరం నిర్వహించేవారు.ప్రభుత్వ పథకాలు,కార్మికులు-వారి హక్కులు,బాధ్యతలను తెలియజేస్తూ మధ్య మధ్యలో చిత్ర గీతాలు ప్రసారం చేసేవారు.ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు ప్రయాగ రామకృష్ణ లేక తిరుమల శెట్టి శ్రీరాములు వారిలో ఎవరైనా ఒకరు చదివేవారు.సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకి ‘పాడి-పంటలు’ కార్యక్రమం మొదలయ్యేది. పాడిపంటల కార్యక్రమము తర్వాత ‘మనోరంజని’ మీరు కోరిన పాటలు వింటారు అని మీనాక్షి (లేక )ఏవీఎస్ రామారావు ప్రకటించగానే ఇంట్లో అందరం ఎంతో శ్రద్ధగా ఆ పాటలు చెవులు రిక్కించి వినేవాళ్ళం. అరగంట ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలు వేసేవారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఢిల్లీనుండి వార్తలు అని చెప్పేవారు. ఇంగ్లీషులో వార్తలు ఢిల్లీనుండి ప్రసారమయ్యేవి. స్పష్టమైన ఇంగ్లీషులో వార్తల ప్రసారం సాగేది.సాయంత్రం 6 గంటలకు’ఉర్దూలో వార్తలు,ఏడు గంటలకు ‘ఇల్లు- వాకిలి’ కార్యక్రమము,7.30 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యేవి.ఇక రాత్రిపూట చిత్రలహరి ‘మధురిమ’ అంటూ పాటలు వేస్తుండేవారు. ఆ తర్వాత ఢిల్లీ నుండి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారుల స్వర విన్యాసాన్ని సంగీతాభిలాషులు ఎంతో శ్రద్ధా,భక్తులతో ఈ కార్యక్రమాన్ని ఆలకించేవారు. ఇక రాత్రి 10 గంటలకు హరికథలు, నాజర్ బృందంచే బుర్రకథలు, సాంఘిక నాటకాలు, నాటికలు, ప్రసారమయ్యేవి.
ఇక ‘సిలోను’లో హిందీ పాటలు వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు, సాయంత్రం 5గంటలకు దక్షిణ భారతదేశపు ప్రాంతీయ భాషలలో పాటలు వచ్చేవి, (కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం )వాళ్లు ప్రసారం చేసే ఒక తెలుగు పాట కోసం పడిగాపులు పడి అన్ని భాషల పాటలు వినేవాళ్ళం. సిలోన్ రేడియోలో ప్రసారమయ్యే ‘బినాకా గీతమాల’ అంటే అందరికీ ఇష్టమే. సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు. చెవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినే వాళ్ళము. పండగలప్పుడు ప్రత్యేక ‘జనరంజని’ ఉండేది. దానిలో ఆయా పండుగలకు సంబంధించిన పాటలు ప్రసారమయ్యేవి. పండుగలప్పుడు సినిమానటులతో
గాని,గాయకులతో గాని ప్రత్యేక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం మధ్యలో వాళ్లు నటించిన లేక, పాడిన సినిమా పాటలు వేసేవారు. ఇవే కాకుండా ‘పుష్పాంజలి’ భక్తి సంగీత కార్యక్రమం, ప్రతి శనివారం ‘శ్రీవెంకటేశ్వర సుప్రభాతం’, ఉషశ్రీ ‘రామాయణ,మహాభారతాలు’,వినోదవల్లరి,ఇక తెలుగు పాటలలో… ఏకచిత్రా గానమని, మీరు కోరిన పాటలని, చిత్రతరంగిణి అని ప్రసారం చేసేవారు. సైనిక సోదరుల కొరకు ప్రత్యేక ‘జయమాల’ హిందీ సినిమా పాటల కార్యక్రమం వచ్చేది. ఇంట్లో ఆడవాళ్లు రేడియోలో పాటలు ,ఇతర కార్యక్రమాలు వినుకుంటూ ఇంటి పని, వంటలు చేసుకునేవారు.రేడియోలో ఏమైనా ఇష్టమైన సినిమా పాటలు వస్తే పిల్లలు గానీ,పెద్దలు కానీ ఆ పాట తో శృతి కలిపేవారు.వాళ్ళ గొంతు బాగుందా లేదా అనేది తర్వాత సంగతి.అది వారికి సంతోషాన్ని కలిగించేది.రాగ యుక్తంగా పాడటమే కాకుండా కొందరు ఔత్సాహికులు అవి నేర్చుకోవాలనే తాపత్రయంతో రాసుకోవాలని పెన్ను, పుస్తకం తయారుగా పెట్టుకొనేవారు.రేడియో పుణ్యాన మా తరం వారికి మరియు మా కంటే ముందు తరాల వారికి కూడా పాటలన్నీ చాలావరకు నోటికి వచ్చేవి. పిల్లల పరీక్షల టైములో రేడియో వినడానికి పెద్దల ఆంక్షలు కొద్దిగా కఠినంగానే ఉండేవి. పరీక్షలు అయ్యేదాకా రేడియో విననిచ్చేవారు కాదు. ప్రజా ప్రతినిధులు అంటే… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ముఖ్యమంత్రి, గవర్నర్, స్పీకర్లు, మంత్రులు…వీరిలో ఎవరు అస్తమించిన రేడియోకి సంతాపదినాలు ప్రకటించేవారు. వాళ్ళ పదవిని బట్టి సంతాపదినాలు ఉండేవి. మొదటి 2,3 రోజులు విషాదసంగీతము,చివరికి వచ్చేవరకు భక్తిగీతాలు మొదలయ్యేవి. మా అందరికీ సంతాపదినాలలో ఏమి తోచనట్టు, కాలం చాలా భారంగా గడిచేది. ఆదివారం వచ్చిందంటే పిల్లలకు,పెద్దలకు పండుగే. మధ్యాహ్నము 2గంటలకు ఢిల్లీ నుండి ఆంగ్లవార్తల తర్వాత 2.10 నిమిషాల నుండి 3 గంటల వరకు బాలానందము…. అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. పిల్లలందరము రేడియో చుట్టూ కూర్చుని ఎంతో శ్రద్ధగా,ఇష్టంగా బాలానందం కార్యక్రమాన్ని వినేవాళ్ళం.ఎంతో సరదాగా అనిపించేది మాకు.1950 నుండి ప్రసారం చేయబడిన బాలానందం వినని వారు ఉండరు. న్యాయపతి రాఘవరావుగారు రూపొందించిన ఈ కార్యక్రమము చాలా ఉత్సాహంగా నిర్వహించ బడేది.బాలానందం కార్యక్రమం మొదట పిల్లల పాటతో మొదలయ్యేది. అది ఈ విధంగా…. ‘రారండోయ్- రారండోయ్ పిల్లల్లారా- రారండోయ్, పిల్లల్లారా- రారండోయ్, బాలబాలికలు -రారండోయ్ బాలవినోదం వినరండోయ్. రారండోయ్-రారండోయ్.
హైదరబాదు బాలలము జైహింద్ అంటూ పిలిచాము. జై జై మంటూ రారండోయ్ రేడియో ప్రోగ్రాం వినరండోయ్… రారండోయ్- రారండోయ్’. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య కార్యక్రమానికి వచ్చిన పిల్లలతో చిన్న పిల్లల పాటలు, శ్లోకాలు, పద్యాలు, సామెతలు, పొడుపు కథలు , క్విజ్, జనరల్ నాలెడ్జ్ విషయాలు ఎన్నో చెప్పించి ఆ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా నడిపేవారు.మూడు గంటలకు నిమిషం ఉందనగా కార్యక్రమం అయిపోయేది.ముగింపు పాటకూడా ఈవిధంగా ఉండేది.’చాలు ఇంకా ఆటలు, మన పాటలు… మన మాటలు, చక చక చక చక పోదామా…
.ఇండ్లకు మనఇండ్లకు,బిర బిర బిర బిర పోదామా….బిర బిర బిర బిర పోదామా…..
సరిగ్గా 3గంటలకు సంక్షిప్త శబ్దచిత్రం మొదలయ్యేది. మూడుగంటల నిడివి ఉన్న సినిమాని ఒక గంట సినిమాగా కుదించి ప్రసారం చేసేవారు.ఎంతో ఆసక్తికరంగా పిల్లలు, పెద్దలు రేడియో చుట్టు చేరి కూర్చొని ప్రసారమవుతున్న సినిమాని వినేవారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బజారులో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడేవి. అంటే…అందరూ ఆ సమయములో రేడియోకి అతుక్కుపోయేవారు అన్నమాట…. ఇంకేముంది సినిమా అయిపోయిన తర్వాత మళ్లీ ఆదివారం ఎప్పుడొస్తుందా?అని మా లాంటి పిల్లలందరూ ఎదురుచూపులు.ఆదివారం సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారమయ్యేవి. ఆ నాటకాలలో నండూరి సుబ్బారావు, వీ.వీ. కనకదుర్గ ,పాండురంగ విఠల్, ఏ.వీ.ఎస్. రామారావు వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించేవి. అచ్చమైన తెలుగు ఉచ్చారణతో నాటకాలు చాలా ఆసక్తికరంగా సాగేవి.రేడియోలో క్రికెట్ కామెంటరీ,వాతావరణ విశేషాలు కూడా ప్రసారమయ్యేవి. రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వారు సూచిస్తే…. బాగాఎండలు కాస్తాయని, ఒడియాలు ఎండ పెట్టుకోవచ్చని హాస్యంగా మాట్లాడుకునే వాళ్ళు లేకపోలేదు….. ఎందుకంటే వాతావరణ కేంద్రంవాళ్ళు సూచించిన విధంగా వర్షాలు పడేవి కావు.
కాలక్రమేణా రేడియో కార్యక్రమాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త, కొత్త కార్యక్రమాలు వచ్చాయి. మేము హై స్కూల్ చదువులకు వచ్చాక… 1977 నుండి ‘వివిధ భారతి’ వాణిజ్యప్రసార విభాగం మొదలైంది. ప్రతిరోజు ఉదయం 8గంటలకు భక్తి సంగీతాల కార్యక్రమం ‘అర్చన’ తర్వాత, 8:30 కి ‘వివిధ భారతి ‘వాణిజ్య ప్రసార (పాటల) కార్యక్రమం మొదలవుతుంది. మంచి, మంచి సినిమాపాటలు వేస్తూ.. పాటలమధ్యన ప్రకటనలు వేస్తారు. ‘వివిధ భారతి’ ప్రసారం మధ్యలో సమయం 9 గంటలు కాగానే ‘హోటల్ మమత’ విజయవాడ వారి సమయం 9 గంటలు అనే ప్రకటన వచ్చేది. అమ్మో! 9గంటలు అయింది అని మేము పాఠశాలకు వెళ్లేవాళ్ళం. ప్రస్తుతం అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా ‘ఎఫ్.ఎం రేడియో’ ఛానళ్ళ ను ప్రారంభించాయి.రేడియో కార్యక్రమాలలో ఎన్ని మార్పులు వచ్చినా… మనకు గుర్తొచ్చేది ఆ నాలుగు దశాబ్దాల కాలం నాటి రేడియో కార్యక్రమాలు మరియు అంకితభావంతో పనిచేసిన ఆకాశవాణి ఉద్యోగులు మాత్రమే.వారికి ధన్యవాదములు తెలుపుకుందాం. నానా విధాలుగా ఆనందాన్ని, వినోదాన్ని అందించిన రేడియో మనకు ఒక అపురూపమైన కానుక. ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నప్పటికీ… రేడియోకి ఆదరణ తగ్గలేదు.ఇప్పటికీ రేడియో కార్యక్రమాలు అంటే ఇష్టపడే రేడియో ప్రియులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రేడియో అభిమానులలో నేను కూడా ఒకదాన్ని.ఆ అభిమానమే రేడియో గురించి రాయాలనే ప్రేరణ నాకు కలిగించింది.మనకు, విజ్ఞాన,వినోదాలను అందించిన రేడియోను కనిపెట్టిన ‘మార్కోని’ కి మనం ఎంతో ఋణపడి ఉన్నాము అని చెప్పక తప్పదు.

Written by Jyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా ట్రైన్ కథ

తెలివి The intelligence