సుమనా ! ఎందుకు నువ్వీరోజు పదే పదే నా మనసు సముద్రం పై అల లా నీ జ్ఞాపకాలతో ఎగిసెగిసి పడుతున్నావు ..? అసలు ఇన్ని సంవత్సరాల జీవితం గడిచిపోయి బలిపీఠం పై ఉన్నట్టున్న నన్ను ఇప్పుడు ఎందుకు కలవర పెడుతున్నావ్ …? ప్లీజ్ ! జరిగిన దానిలో నీ కెంత భాగముందో నాకూ అంతే భాగం ఉంది. మరి నన్నోక్కడినే ఎందుకు నువ్వు సమాజం ముందు దోషిలా నిలబెట్టావ్ ..? కనీసం ఒకే సారి ఉరి శిక్ష కూడా విధించకుండా మరణానంతరం వరకు శిక్ష అనుభ వించ మని శిక్షించిన ఖైదికి మల్లే నన్ను ఖైదును చేశావ్ …? నీకెందుకింత కాఠిన్యం …? అంటూ గాఢ నిద్రలోనే ఉండి సుమన తన ఎదురుగా ఉన్నట్టే భ్రమిస్తూ కలవరిస్తున్న భర్త యశస్వీని ,
ఏమండి ! మిమ్మల్నే …. అంటూ తట్టి మరీ లేపింది స్నిగ్ద .
మేల్కున్న యశస్వీ ఏంటి ..? స్నిగ్ద ! ఏంజరిగింది..? ఏమైనా కావాలా ? వాటర్ తేచ్చివ్వన ? పిల్లలేమైనా లేచారా ? అంటూ ఆగకుండా టప టపా కురుస్తున్న చినుకులకు మల్లే ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ప్రశాంతంగా పడుకున్న తన ఇద్దరు పిల్లలకు కప్పిన దుప్పటి చెదిరిపోగా సరి చేస్తూ అడిగాడు యసస్వీ .
లేదండి! మీరే ఏదో కలవరిస్తున్నారు . అని అడగాలనుకుంది . కానీ దాని వల్ల తనే ఆయనకు సుమనను గుర్తు చేసినట్టవుతుందని అనుకొని
నాకు ఓ కల వచ్చిందండి , అందులో యెవరో ఒక ఆవిడ నా చేతుల నుండి మిమల్ని విడిపించుకొని తన కొంగుకు ముడి వేసుకొని నేనెంత అరుస్తూ ప్రాధేయపడుతున్నా విడిచిపెట్టక తీసుకెళ్తుంటే మీరేమో దీనంగా నా వైపే చూస్తున్నారు . ఈ భయంకరమైన కల నిజమనుకొని నేను కంగారుగా లేచి మిమల్ని లేపానండి అంది . అబద్ధాన్ని నిజమని నమ్మేంత నిజంగా చెప్తూ ,
స్నిగ్ద ! నువ్వు వట్టి అమాయకురాలవు . కలలన్ని కల్లలని నీకు మాత్రం తెలియదా ..?
నేను అమాయకురాలిని కాబట్టే మిమ్మల్నెవరైనా …. సందేహంగా ఆగి పోయింది .
ఛ ….ఛ ….ఏమిటా పాడు మాటలు ..?
ఇప్పుడు సమయం అర్ధ రాత్రి రెండు గంటలు . అంటూ గడియారం వంక చూపించి , లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ లోని వాటర్ బాటిల్ తెచ్చి స్నిగ్ద కు తాగించి , మళ్ళీ అక్కడ పెట్టి వచ్చి , రెండు అరా చేతుల్లో స్నిగ్ద ముఖాన్ని తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టుకొని ,
నా బంగారు కొండ నుండి నన్నెవరైనా వేరు చెయ్యాలని చూస్తే వారిని చీల్చి చెండాడను ..?అన్నాడు.
తెల్లవారు ఝామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు . ఈ రోజుకు రెండు గంటలంటే తెల్లవారు ఝామేకదా…..! అంది మరింత అమాయకాన్ని జోడించి
అట్లైతే దేపతలు కూడా ఇదే సమయంలో ప్రసన్నులై ఉంటారట. ఇప్పుడు నేన్నమాటలకు ‘తథాస్తు’! అనే ఉంటారు.
నిజంగా అని ఉంటారా? ప్రశ్నార్థకంగా అడిగింది.. .
సందేహమే లేదు .మన ఇద్దర్నీ ఎవరైనా వేరు చేయాలని చూస్తే ‘ఎంతటి వారైనా సరే! త్రినేత్రుడి లా
నేను తెరిచే కోపమనే మూడోకన్నుకు భస్మం అయిపోలసిందే , అన్నాడు.
అబ్భ …ఛ ..తమరు ఉగ్రనేత్రుడు అన్నమాట …
మరి, నా దేవి కోసం ఉగ్రనేత్రడేమిటి? ఉగ్రనరసింహాన్నే అవుతా ! అంటూ పౌరాణిక నాటకంలో డైలాగులు చెప్పనట్టుగా చెప్తున్న భర్తను నవ్వుతూ చూస్తుండి పోయింది. స్నిగ్ధ .
చూడు… నువ్వప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. నువ్వు నమ్ముతావో లేదో కానీ నువ్వు పిల్లలు ఏ కొంచెం బాధ పడినా ,నేను తట్టుకోలేను.మీ ఆనందం లోనే నేను బతికున్నానన్న సంగతి మరిచిపోవద్దు.ఇక పడుకో.పిచ్చి పిచ్చి ఆలోచన లు మాని ప్రశాంతంగా నిద్ర పో! అని తనను పడుకోబెట్టి తనూ నిద్ర పోయాడు.
పక్కకు తిరిగి పడుకున్న స్నిగ్ధ కళ్ళలో కన్నీరు జల జలా కార సాగింది . ఇలాంటి ఉత్తమునికా ..? తను కల పేరుతో పరీక్ష పెట్టింది . అబద్దం అని చెప్పి , కాసేపు , మరి మనసులో మా మీద ఇంత ప్రేమ గూడుకట్టుకున్న ఈయన ఎందుకు ఆ సుమనను మర్చిపోలేక పోతున్నాడు అని కాసేపు , భర్త మరో స్త్రీని కలవరిస్తుంటే ఏ భార్య మాత్రం స్థిమితంగా ఉండగలదు . మనసులో తన స్థాన మేమిటో తెలుసుకోవడానికే కదా ..! కల పేరుతో నటించింది అని కాసేపు , అయినా సుమన గురించిన ఆలోచనే ఉంటే ఆయన ఇంత స్వచ్చంగా ఉండే వాడు కాదు . అంత అనురాగం గా ప్రవర్తించే వాడు కాదు . కానీ ఎందుకో ఆమె స్థానాన్ని కూడా తానే ఆక్రమించుకోవాలని అత్యాశ తనను ఇలా ఆలోచింప చేస్తున్నది . కానీ ఈ రోజు ఈ రాత్రే కాదు యశస్వీ తనను పిల్లలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు . ఇంటికి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలన్నీ తనే చూసుకోవాలి . ఆస్తులన్నీ తన పేరు మీదుగానే ఎక్కడా కాస్తంత కూడా అనుమానం లేదు . అయినా , తెలియని భయం . కానీ సుమనను గురించి కలవరించడం ఈ మధ్య కలం లో తరచుగా జరుగుతుండడం తన ఆనందాన్ని హరించి వేస్తున్నది . దీనికి పరిష్కారం కనుక్కోవాలి . లేకుంటే తన మనసు దారం తెగిన గాలిపటం లా ఎక్కడెక్కడో తిరుగుతూ , తట్టుకోలేక ఆత్మహత్య కయినా రెడీ గా ఉంది . ఎవరితో చెప్పుకోవాలి ?
అమ్మానాన్నలు ? అమ్మో ..! వయసు మీద పడిన వారిని ఈ వయసులో బాధ పెట్టడం సరి కాదు. మరి ఎవరూ..? బంధువులలో ఎవరరైనా బాగుంటుందా ..? అమ్మో ! బంధువులు రాబంధువుల వంటి వారు . విషయం ఉన్నా లేకున్నా చిల్లరగా తన భర్త మీద చెప్పుకోవడం తనకు ఇష్టం లేదు . పరి పరి విధాలా తనను తానే ప్రశ్నించుకుంటూ , సమాధాన పడుతూ ఆలోచిస్తుండగా తీరం చేరిన పడవలా , తన ఆలోచన తన ప్రాణ మిత్రుడు ఆదిత్య అయితే కరెక్ట్ అని పించి , అవును తనే కరెక్ట్ అని నిశ్చయానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయింది .
***************
తెల్లవారింది . యశస్వీ ఆఫీసుకు , పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయారు . ఆదిత్యకు ఫోన్ చేసింది .
హలో ! స్నిగ్దా ..! ఎలా ఉన్నావ్..? ఏమిటి సంగతులు ..? చాలా రోజులైనట్టుంది ..? ఫోన్ చేయక అన్నాడు .
తమాషా చేయకు ఆదీ ..! రోజుకొకసారైనా ఫోనులో పలకరించుకుంటూనే ఉంటాం కదా..! అంది .
అయినా , ఏ రోజుకా రోజు కొత్తదే . నిన్న సోమవారం , ఇవాళ మంగళవారం లా అలా అన్నమాట .
అబ్బబ్బ … ఆపు ,ఆది ..! నేను బాగానే ఉన్నాను . నీతో కాస్త మాట్లాడాలి . యెప్పుడు వీలవుతుంది ..? అడిగింది.
వీలేమిటి..? అందునా … నేను నీకు టైం ఇవ్వడమా ? నేనే నిన్ను అడిగి తీసుకోవాలి . చెప్పు . యెప్పుడు రమ్మంటావ్..?
ఇంటికి మాత్రం రావద్దు . బయట ఎక్కడైనా…
ఓహ్ ! ఇదేమిటి..? వింతగా అనిపిస్తున్నది . యశస్వీ , ఏమైనా …
ఛి …ఛి ఆయన అలాంటి మూర్ఖుడు కాదు .
మరేంటి..? ప్రాబ్లం ..?
ప్రాబ్లమే , యెప్పుడు కలుస్తావ్ ..?
నువ్వే చెప్పు ఎక్కడికి రావాలో , సాయంత్రం ఏడు గంటల తరువాత నేను ఫ్రీ .
సరే, అయితే ఈ రోజు సాయంత్రం వేణు గోపాల స్వామి గుడికి రా ..! ఎదురు చూస్తుంటాను.
ఆ టైం లోనా ..? గుడి తెరచి ఉంటుందా..?
ఉంటుంది .అక్కడ భగవత్గీత పారాయణం తొమ్మిది గంటల వరకు జరుగు తున్నది కూడా .
అయితే సరే , అని ఆదిత్య అనడంతో ఫోన్ పెట్టేసింది .
సాయంత్రం ఆరుగంటల కల్లా పిల్లలు , భర్త రాగానే వారికి స్నాక్స్ ఇచ్చి డిన్నర్ రెడీ చేసి తానూ ఫ్రెష్ గా తయారైంది .
ఏమిటోయ్ ..! ఈవేళప్పుడు ఎక్కడికి ..? ఇంత ఫ్రెష్ గా తయారయ్యావ్..? ఏదైనా ఫంక్షనా ? అడిగాడు యశస్వీ .
లేదండి , గుడికి వెళ్తున్నాను.
అయితే పద , నేనూ పిల్లలు కూడా వస్తాము . అంతా కలిసి కారులో వెళ్దాం అన్నాడు .
అబ్బే ..! వద్దండి మీకెందుకంత శ్రమ. పైగా ఆది నన్నొక్కదాన్నే రమ్మని మరీ మరీ రిక్వెస్ట్ చేశాడు .
ఓ హో! అలాగా ! పాపం మళ్ళీ ఏం సమస్య వచ్చి పడిందో . ఏమిటో నువ్వైతేనే ఒక మంచి సలహా ఇవ్వగలవని అతని నమ్మకమనుకుంటా కదూ ..ఇలా ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు హెల్ప్ చేశావు కదా ! నీ వంటి మంచి మిత్రురాలు దొరకడం అతడి అదృష్టం .
అంతే నంటారా ..?
నిజంగా అంతే , సరే నేను తనని అడిగానని చెప్పు. ఆర్థికపరమైననది ఏమైనా ఉంటే మరింకేం ఆలోచించకు. తప్పక సాయం చేస్తానని చెప్పు అన్నాడు.
మళ్ళి అబద్దం చెప్పినందుకు క్షమాపనలతోను , భర్త అనురాగం అంతా ఎప్పటికీ తన ఒక్కదానికే సొంతం కావాలన్న స్వార్థం తోనూ కళ్ళు నీటి తడితో ఊరగా మనసులోనే అతడిని ఆరాదిస్తూ ఇంటి నుండి బయలుదేరింది .
గుడికి చేరుకుంది .
గుడిలో జనం పలుచగానే ఉన్నారు . మంటపం లో జరుగుతున్న పారాయణం వద్ద మాత్రం పదుల్లో ఉన్నారు . చలి కాలం సాయంత్రం చల్ల చల్ల గానే ఉన్నా , గుడిలో వెచ్చ గానే అనిపించింది. బహుశా దేవుడి సన్నిధి కావడం వల్ల కాబోలు .
దర్శనం చేసుకోవడానికి వెళ్తే పూజారి గారడిగారు . పరిచయం వల్ల .
ఏమ్మా ..? యశస్వీ గారు రాలేదా ..? అని
లేదండి , ఒక్కదాన్నే వచ్చాను .
అందరూ క్షేమమే కదా ..! అని అడిగి , క్షేమాన్నే కోరుతూ ఆశీర్వదిస్తున్నట్టుగా శఠ గోపం పెట్టి మంత్రం చదివి దీవించి ప్రసాదం పెట్టారు .
చుట్టూ చూస్తుండగా, మళ్ళి అయ్యవారే,
అమ్మా ! మీ స్నేహితుడు ఆదిత్య ఇందాకే వచ్చాడు . అదిగో, అక్కడున్నాడు అని చూపించగా ,
చాలా సంతోషమండి అని చెప్పి ఆదిత్య కనిపించడంతో అక్కడికి వెళ్ళి పక్కనే కూర్చొని,
హాయ్ ! ఆది ! చాలా సేపైందా ? అని పలకరించింది.
లేదు …లేదు… ఇందాకే, చెప్పు ఎందుకు రమన్నావ్ ..?
నుదటన బొట్టు పెట్టి ప్రసాదం ఇవ్వబోయింది . ఇందాకే పూజారిగారు నాకూ పెట్టారు . అయినా నువ్విస్తుంటే ఎందుకు కాదనాలి ? అంటూ తీసుకొని కళ్ళ కద్దుకొని తిన్నాడు .
ఆది ! నాకొక సమస్య వచ్చింది . యశస్వీ ఈ మధ్య తరచూ నిద్రలో కలవరిస్తున్నాడు .
అవునా ! ఏమని ?
ఏమనంటే ఏం చెప్పను ? ఒక అమ్మాయి దూరమైందన్న విరహ బాధలో…
అమ్మాయా ? అది విరహం తోనా ?
అవును అమ్మాయినే , విరహం తోనే
అయినా , కలవరింతలన్ని నిజాలేనంటావా ?
సైకాలజీ ప్రకారం ఏదైనా తీరని కోరికలుంటే ఇలా చేస్తారనిరని చదివినట్టు గుర్తు . పైగా తను కలవరిస్తున్నది తన పాత స్నేహితురాలు సుమనని. బతికున్న అమ్మాయిని. ఇంతకు ముందు చాలా ఇష్టపడి పెళ్ళి దాకా వెళ్ళిన అమ్మాయిని .
ఆశ్చర్యంగా ఉందే , ఇంతకు ముందెప్పుడు నీవు గాని యసస్వీ గాని చెప్పినట్టు లేదే నాతో , తన గురించి.
అవును,చెప్పలేదు అనవసరం అనిపించింది . కానీ ఇన్నేళ్ళ తరువాత ఈ మధ్య తరచుగా ఆమె పేరునే కలవరిస్తున్నాడు . ఎందుకో అర్థం కావడం లేదు .
మరి నిన్నేమైనా అశ్రద్ధ చేస్తున్నాడా ? నీకెందుకంత భయం ?
అశ్రద్ధ చేయక పోయినా భయం కాక ఇంకేమిటి ?ఈ సుమన ఇంతకు ముందే కులం కాదని నా వాళ్ళను ఎదురించలేనని చెప్పినప్పటికీ యశస్వీ ఆమెను వాళ్ళ కుటుంబాన్ని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించడంతో వేరే దారి లేక ఆమె ఇతని బారి నుండి తప్పించుకోవడానికి వేధింపుల కేసు పెడతానని బెదిరించడంతో , యశస్వీ ఎప్పటికైనా మంచి మిత్రులుగా మిగిలి పోదామని ఇంకెప్పుడూ పెళ్ళి మాట ఎత్తనని అనడంతో ఆ గొడవ సద్దుమణిగింది .
తను తన వాళ్ళు చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా ఉందటా .
ఇదెవరు చెప్పారు ?
యశస్వినే !
మరిక సమస్యేముంది ? నీ దగ్గర ఏదీ దాచలేదు కదా !
కావచ్చు కానీ , ఆమెను ఎందుకు మరువలేక పోతున్నాడో అర్థం కావడం లేదు . పైగా ఇద్దరి ఇష్టాలు ఒకటే , కవిత్వం చదవడం రాయడం. సాహితీ విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ . అంతకు ముందైతే గంటలు గంటలు ఫోన్ లో చర్చలు జరిపే వారు .
మరి ఎలా విడిపోయారు ?
విడిపోవడం కాదు విడగొట్ట బడ్డారు.
ఎవరి ద్వారా ? కొంపదీసి నువ్వైతే కాదుకదా !
ఖచ్చితంగా నేనే !
ఎందుకు ? ఎలా విడగోట్టావ్ ?
ఆమె మాటి మాటికి ఫోన్లు చేస్తూ , చర్చలు పెట్టడం నాకు నచ్చలేదు అందుకే ఇంకెప్పుడూ ఫోన్ చేయకండని , అది నాకు ఇష్టం లేదని , మీకూ మీ వారికే కాక మాకూ మా వారికీ మధ్య గొడవలు తెచ్చిపెట్టవచ్చునని సున్నితంగా స్పష్టంగా చెప్పాను అన్నది .
స్నిగ్ద! యశస్వీ మంచి సాహితీ ప్రేమికుడు కదా! మంచి కవిత్వం కూడా రాస్తాడు కదా!
అవును .
నువ్వెప్పుడైనా చదివావా ? పోనీ , తనే చదివి వినిపిస్తానంటే విన్నావా ?
అయ్య బాబోయ్ ! వినడమే , భావ కవిత్వంలో దిట్ట అయిన కృష్ణ శాస్త్రి లా పెద్ద పెద్ద భావాలతో ఆయన రాసే కవిత్వం నాకెందుకో చదవడానికి , వినడానికి ఇష్టం ఉండదు . ఆసక్తి అసలే లేదు . అయినా , నన్నెందుకు ఇప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నావ్ ?
కారణం ఉంది స్నిగ్దా ! ఏ కవికైనా తను రాసింది ఎవరైనా చదవాలని లేదా వినాలని ఉబలాటం ఉండడం సహజం . పైగా తప్పొప్పులు విశ్లేషిస్తే మరింత బాగా ఎదగాలనే కోరిక ఉంటుంది . ఇవి సుమనలో యశస్వీకి బాగా నచ్చాయ్ . ఆవిడ కూడా అలాంటిదే కావడం వల్ల ఇద్దరూ మంచి సాహితీ మిత్రులు కాగలిగారేమో .
అంటే ….,
అంటే …., ఏమీలేదు . రాయప్రోలు గారి “తృణకంకణం” లో చెప్పిన అమలిన శృంగార తత్వ్తమే వారిద్దరి మధ్య ఉన్నది .
నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు ఆది!
ఏమీ లేదు స్నిగ్దా ! సుక్ష్మంగా చెప్పాలంటే నువ్వు వారి పవిత్ర స్నేహాన్నీ అపార్థం చేసుకున్నావు. యసస్వీ , ఈ గుడి పూజారి , సుమన భర్త వీళ్ళందరూ సంస్కారాన్ని చూపిస్తే నువ్వు మాత్రం స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఉండటాన్ని అంగీకరించ లేక మాట్లాడుతున్నావ్ . అదే భ్రమలో భయ పడుతున్నావ్ . ఒక్కటి చెప్పనా , నువ్వూ నేనూ రోజూ ఎన్నో సార్లు ఫోన్ లో పలకరించుకుంటుంటాం . ఏప్పుడైనా నిన్ను యశస్వీ గానీ , నన్ను మా ఆవిడ కానీ అనుమానించిందా ? లేదే ,
యశస్వీ సుమనలో ఒక మంచి విమర్శకురాలు, పాఠకురాలు కనిపిస్తూ ఉండ వచ్చు . అలా ఇంకెవ్వరూ ఆయనకు నచ్చలేదేమో ! ఎలాగయితే పిల్లలు ఎన్నో బొమ్మలు ముందు వేసినా , తనకు నచ్చిన బొమ్మను ఏప్పటికి వదలనట్టుగా ,
ఉదయం నుండి ఆఫీసులో ఏంతో పని ఒత్తిడిని తట్టుకొని వచ్చి కాస్త రిలాక్స్ అవ్వడానికి తను కవిత్వం రాయడం , రాసినదాన్ని సుమనతో పంచుకోవడం . ఇదీ జరిగింది . అంతే తప్ప నువ్వనుకుంటున్నట్టు గా వారిద్దరి మధ్య ఏమీ సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు .ఇంకో ముఖ్య విషయం అతను మనిద్దరి లోనూ అదే పవిత్ర స్నేహాన్నే చూస్తున్నాడు . కాబట్టే ఒంటరి గా నిన్ను ఈ సమయంలో నా దగ్గరికి పంపించాడు . నీవు కంగారు పడేదేమీ లేదు . అనవసరంగా అపార్థమనే మసి పూసుకొని మనసును చీకటి చేసుకోక పవిత్ర భావన అనే స్వచ్ఛత తో చూడు . మనసు అద్దం లా నీలోని సంశయాలన్నీ తొలగించి వేస్తుంది . అని ఆది చెప్పిన మాటలు
స్నిగ్దను ఆలోచింప చేశాయి . తన తప్పేమిటో తెలిసి వచ్చింది . నిజమే కదా ! నేను , ఆదిని ప్రాణ స్నేహితుడిగా భావించు కోవచ్చును కానీ యశస్వీ , సుమనను భావించకూడదా! ఇదెంతవరకు సమంజసం ? తనలో జ్ఞానోదయం కలిగింది.
మరునాడే సుమనకు మెయిల్ పెట్టింది . యశస్వీ కవితలన్నటినీ తానే బుక్ చేయబోతున్నానని ఎడిటింగ్ బాధ్యత మీదేనని , ప్లీజ్ హెల్ప్ మీ అని .
స్నిగ్దకు గట్టి నమ్మక ముంది. సుమన తన లాగా మసక బారినది కాదని మనసుటద్దంలో యశస్వీ ఆమెకు మంచి సాహితీ మిత్రుడు లాగా తప్ప ఇంకా ఏ విధంగాను కనిపించడం లేదని ఊరట చెందింది . నిజమైన స్నేహమే జీవితాలకు బాసట గా నిలుస్తుందని అపార్థాల , అనుమానాల కుళ్ళు ఎప్పటికీ దానికి అంటనీయ కూడదని తన మిత్రుడు ఆదిత్య చెప్పిన మాటలు ఆమె మనసుటద్దంలో ప్రతిబింబించాయి.
*************** .