ఇంటిదేవత

కథ

పోతుల ఉమాదేవి

గంపకింద కోడి కొక్కొరొక్కో కొక్కొరక్కో అనికూస్తుంది పందిరి కింద గడెoచెల పoడుకున్న సిరిలచ్చిమికి మేల్కొచ్చింది కానీ లేవబుద్దికాలేదు మళ్లోసారి కొక్కరొకో కొక్కరొకో అన్నదికోడి. ఇగ లేసి శిఖ ముడుసుకొని బొట్టు సరిజేసుకొని చీపురుకట్ట పట్టింది. ఊడువoగ ఊడువoగ యాప చెట్టుకింద నాలుగు తట్టల కసువుఎల్లిoది నిన్న పొద్దుగూకి ఊడ్చిన కుప్పతోటి. ఎత్తి పెoట మీదపోసొచ్చి రోటి మీద కూసున్నది సిరిలచ్చిమి.

అంతలోనే బర్రెనుగొట్టొచ్చిన భర్త మల్రెడ్డి
ఏoదే చిన్నబోయికూసున్నవు లచ్చిమి అన్నడు.
నాతోటైతలేదయ్య ఊడిసిఊడిసీ నా రెక్కలుబోతానయి అన్నది లచ్చిమి
మొన్న యాకన్నకిద్ధామంటే నువ్వే వద్దంటివి ” మొదలు మంచిగా ముదిరింది కోస్తే తలుపు చెక్కలెల్తయ్ నాకీయమని ఒక్క తీరుగా బతిలాడితె నువ్వే వద్దంటివానాడు”… ఇచ్చేయనామరి ? అన్నడు మల్రెడ్డి. “ఇగ ఇయ్యిమరి నాతోటైతలేదు నీడ ఉంటదిగదా అనుకున్నగని” ఇగ ఇయ్యిమరి అని లేసి ఇంట్లోకి బోయింది
సిరిలచ్చిమి.

పన్నెండుగొట్టంగా సిరిలచ్చిమి చిన్న బిడ్డ లలిత ఉరికొచ్చి అమ్మా….. యాకన్న మామ మన యాపచెట్టు కొడ్తాండు వద్దని చెప్పవే…. నా బొమ్మరిల్లుoదాడ… అన్నది
అవును బిడ్డా “మీ బాపూ…చెట్టు అమ్మిoడు ఆ మావకు.” ఆళ్లదే… కొట్టుక పోనీ అన్నది. తల్లి మాటలకు గుడ్లల్ల నీళ్ళు చెంపల మీదికిగారతాoటే లలిత ఇంటిముందుకిపోయి కూసున్నది ఆసాంతం చెట్టు నరికి తీసుకు పోయే దాకా పానమంటి నేస్తాన్ని తీసుకో పోయినట్లు చూస్తూ….

ఓ నాలుగు రోజులు గడిచినంక ఒక నాడు పొద్దుగూకి దిగులుతో కూర్చున్నది లక్ష్మి
అంతలోకే మల్రెడ్డి వచ్చి ఏమైంది లచ్చిమి అట్లున్నావ్? అన్నాడు ఇయాల పక్కూరి పార్వతమ్మ వచ్చి పోయింది నిరుడెండాకాలమంతా మన యాప కాయలు ఏరుకపోయింది మొన్న ఎన్నడో చేనుకు పురుగు పట్టకుండా వేయడానికి యాప గింజలు కావాలని ఎవరో వచ్చి 4000 రూపాయలు ఇచ్చి తీసుక పోయింరట. వద్దంటాంటె నా చేతుల 500 పెట్టి పోయింది ” మీ చెట్టు కాయలే కదా “అనుకుంటా… అన్నది సిరి లచ్చిమి బాధగా నిట్టూర్పుతో… దానికి మనకు రుణం తీరిపోయింది మనసు నిమ్మలం చేసుకో అన్నాడు మల్రెడ్డి.

చెట్టు పోయినా ఆ బొమ్మరిoట్లనే ఆడుతున్నది లలిత రోజూ.
వారం రోజులకు ఓనాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అడ్డం పడ్డది లలిత.
సిరిలచ్చిమి గాబరపడి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే అన్ని పరీక్షలు చేసి ,”పాపను ఎండలు తిప్పింరా వడ దెబ్బ కొట్టింది…ఎండల ఆడిందా? అని చెప్పి మందులు రాసిచ్చిoడు. పార్వతమ్మ ఇచ్చిన 500 పెట్టి మందులు తెచ్చిన… కసాయిదాన్నై చెట్టుకొట్టిచ్చినా కూడా ఇంటి దేవతై నా బిడ్డను ఆదుకున్నది పది రోజులకు గానీ లేవలేదు బిడ్డ.
అప్పుడు లచ్చిమి బాధతో తoడ్లాడుతూ కన్నతల్లిలాంటి చెట్టును పోగుట్టుకుంటినే…. అని వెంటనే ఒక యాపచెట్టు తెచ్చి మళ్లీ నాటిoది…. అప్పుడే వచ్చిన
లలిత అమ్మ కొంగు పట్టుకొని అమ్మా… ఈ చెట్టు ఎప్పుడు పెద్దగయితదే అని అడిగింది అమాయకంగా…పోయిందేదైనా తొoదరగారాదు బిడ్డా అన్నది తాను చేసిన తప్పుపనికి బాధపడుతూ…

Written by Pothula Umadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బావండీ!

యువత భవిత