ఈ భాగంలో మనం ము వర్ణకముతో సంబంధం ఉన్న పడ్వాదులు, పుంప్వాదేశం, లు,ల,న ల సంధి గురించి తెలుసుకుందాం!
1. పడ్వాదుల సంధి:-
పడ్వాదులు పరమగునప్పుడు ము వర్ణకమునకు లోప పూర్ణ బిందువులు విభాష నగు.
పడు, పాటు ,పుచ్చు, పెట్టు ,పోవు, పరుచు మొదలైనవి పడ్వాదులు. ఇవి పరమైతే దానికి ముందున్న ము అనే విభక్తి ప్రత్యయానికి లోపం కానీ లేదా పూర్ణ బిందువు గాని విభాషగా అంటే రావచ్చు లేదా రాకపోవచ్చు అని సూత్రార్థం. పూర్ణ బిందువు అనడం చేత అర్ధ బిందువు రాదని ఫలితార్థం.
భయము +పడు….భయపడు
భంగము+పాటు…భంగపాటు…
మోసము+పుచ్చు…. మోసపుచ్చు
కష్టము+పెట్టు……కష్టపెట్టు
నష్టము+పోవు……నష్టపోవు
నష్టము+ పరుచు…. నష్టపరుచు
భయము మొదలైన పదాలు చివరి ఉన్న ము
అనే ప్రత్యయానికి లోపం వస్తే
భయము+ పడు.. భయపడు…. అవుతుంది. ఒకవేళ పూర్ణ బిందువు అంటే నిండు సున్నా వస్తే భయం పడు అవుతుంది. భయఁపడు అనే అర్థ బిందు రూపం రాదు.
ఈ సూత్రంలో విభాష అని చెప్పడం వల్ల పై రెండు రూపాలు రాని పక్షంలో భయముపడు అని ఉంటుంది. ఇలాగే మిగిలిన రూపాలు ఏర్పడుతాయి.
అయితే ఈ సూత్రం కింద వివరణగా చిన్నయసూరి “ఈ కార్యము కర్తృవాచక మువర్ణకమునకు కలగదు” అని ఇచ్చారు. అంటే గజము, అశ్వము వంటి కర్త పదాలకు పడు మొదలైనవి పరమైతే ఈ సంధి కార్యాలు రావు గజము+ పడె… గజము పడె
అశ్వము+ పోవు… అశ్వము పోవు
శిరము+ పడె…. శరము పడె అవతాయే గాని గజపడె
అశ్వపోవు
శిరపడె అనే రూపాలు రావని తెలుస్తుంది.
2. పుంప్వాదేశ సంధి:-
సూత్రం:- కర్మధారములందు మువర్ణకమునకు పుంపులగు
ఒక నామవాచకము (విశేష్యము) ఒక విశేషణంతో ఏర్పడు సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు. ఇలాంటి కర్మధారయ సమాసంలో ము అనే విభక్తి ప్రత్యయానికి పు గానీ సున్నా పు గాని వస్తాయని సూత్రార్థం .
సరసము +మాట… సరసపు మాట, సరసంపు మాట
విరసము+ వచనము… విరసపు వచనము, విరసంపు వచనము
సారము+ధర్మము… సారపు ధర్మము, సారంపు ధర్మము
నీచము+ మాట… నీచపు మాట నీచంపు మాట
కాగితము+ పడవ… కాగితపు పడవ కాగితంపు పడవ మొదలైనవి
సూత్రంలో కేవలం కర్మధారయ సమాసం అని చెప్పారు సూరిగారు. ప్రయోగాల్లో షష్టీతత్పురుష సమాసాల్లో కూడా పుంప్వాదేశం కనబడుతుంది.
సింగము+ కొదమ… సింగపు కొదమ (సింగము యొక్క కొదమ)
ముత్యము+ చిప్ప… ముత్యపు చిప్ప… (ముత్యము యొక్క చిప్ప)
ఈ సంధి లో ముర్ణకాన్ని హల్లులు పరమైతే పుంప్వాదేశం వస్తుంది. అచ్చులు పరమైతే టుగాగమంతో పాటు పుంప్వాదేశం కూడా వస్తున్నది.
సముద్రము+ ఒడ్డు.. సముద్రపుటొడ్డు
మూర్ఖము+ ఆలోచన … మూర్ఖపుటాలోచన
3. లు,ల,న ల సంధి
లు, ల, న, లు పరమగునప్పుడు ఒకానొకచో ముగాగమమునకు లోపమును తత్పూర్వ స్వరమునకు దీర్ఘమును విభాషనగు.
లు అనేది ప్రథమా విభక్తి బహువచన ప్రత్యయం
ల అనేది ద్వితీయా విభక్తి బహువచన ప్రత్యయం
న అనేది సప్తమీ విభక్తి ఏకవచన ప్రత్యయం.
ఇవి పరమైతే దానికి ముందున్న ముగాగమునకు లోపం వస్తుంది మరియు దానికి ముందున్న హ్రస్వానికి దీర్ఘం విభాషగా వస్తుందని సూత్రార్థం
.
ఇక్కడ ము అనేది విభక్తి ప్రత్యయము కాదు. ఆగమంగా వచ్చిన ము. ఎందుకంటే ఒక విభక్తి ప్రత్యయం మీద మరొక విభక్తి ప్రత్యయం చేరదు. ఒక ప్రత్యయం మీద మరొకటి చేరాలంటే ఆగమంగా రావాల్సిందే.
వజ్రము+ లు… ఇక్కడ లు బహువచన ప్రత్యయం. దానికి ముందున్న ము ఆగమంగా వచ్చింది కాబట్టి సంధి కార్యాలు జరిగి
వజ్రాలు అవుతుంది. ఇది విభాష కాబట్టి సంధి జరిగిన పక్షంలో వజ్రములు అని అవుతుంది.
ఇలాగే
వజ్రము + ల…. వజ్రాల
వజ్రము+న….వజ్రాన
పగడము+ లు …పగడాలు
పగడము+ ల….. పగడాల
పగడము+ న… పగడాన.
ఇలా ము వర్ణానికి సంబంధించిన మూడు సూత్రాలు తెలుసుకోవచ్చు.