సీతా రాములు

కథ

ఎం బిందుమాధవి

ప్రమోషన్ పరీక్షకి చదువుకుందామని హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికొచ్చింది జానకి.

ఎండనపడి వచ్చిందేమో, చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని, గ్లాసెడు నీళ్ళు తాగేసరికి హాయిగా అనిపించింది.

జానకి వచ్చిన అలికిడికి నిద్రలేచి బయటికి వచ్చిన మామగారికి ఓ కప్పు టీ ఇచ్చి తను కూడా ఒకటి తీసుకుని గదిలో పుస్తకాలేసుకుని కూర్చుంది.

“ఈ రోజు త్వరగా వచ్చావేం” అన్నారు సుందర రామయ్యగారు కోడలితో.

“ప్రమోషన్ పరీక్ష ఉంది మామయ్యగారు…చదువుకుందామని హాఫ్ డే సెలవు పెట్టాను” అని పుస్తకంలో తల దూర్చింది.

“అమ్మాయ్ ఈ చానెల్ సరిగా రావట్లేదు, ఓ సారి వచ్చి చూడమ్మా” మామయ్యగారి పిలుపుతో విసుగ్గా లేచి వెళ్ళింది.

“అమ్మాయ్ పెరుగు తోడుపెట్టిన గిన్నె టేబుల్ మీద ఉంది, తోడుకుందేమో చూసి లోపల పెట్టమ్మా” అత్తగారి ఆర్డర్.

“ఏడ్చినట్టే ఉంది నా చదువు. ఇంతకంటే ఆఫీసే నయం” అనుకోకుండా ఉండలేకపోయింది.

“హాయ్…మమ్మీ ఇవ్వాళ్ళ నువ్వు తొందరగా వచ్చేశావా? అయితే పాలు నువ్వే కలిపి ఇవ్వాలి. బామ్మ వద్దు. తరువాత నాతో కాసేపు “లూడో” ఆడాలి అని నానిగాడొచ్చి ఒళ్ళో కూర్చున్నాడు.

వాడికి నచ్చ చెప్పి పంపేసరికి చదువు కాస్తా చంక నాకి పోయింది. జానకి విసుగ్గా మళ్ళీ పుస్తకం తెరిచేసరికి, “మా నాన్నగారికి ఇవ్వాళ్ళ డెంటిస్ట్ అప్పాయింట్మెంట్ ఉన్నది. నాకు ఆఫీసులో ఆలస్యమయ్యేట్టు ఉంది. నువ్వు తీసుకెళ్ళు” అని శ్రీవారి ఆర్డర్.

దేవుడా అని డెంటల్ హాస్పిటల్ కి మామగారిని తీసుకు బయలుదేరింది.

“ఈయనకి డయాబెటిస్ ఉందా” అన్న డాక్టర్ మాటలకి, అన్యమనస్కంగా ఉన్న జానకి లేదని తలూపింది.

జానకి సమాధానం విన్న డాక్టర్, భయం లేదన్నట్టుగా సుందర రామయ్య గారికి కింది వైపు నొప్పి పెడుతున్న  జ్ఞానదంతం పీకేశాడు.

తండ్రి హాస్పిటల్ నించి ఇంటికొచ్చే టైం కి ఆఫీసు నించి వచ్చిన రామారావు “జానకీ నాన్నకి డయాబెటిస్ ఉందని డాక్టర్ కి చెప్పావా? ఆ జాగ్రత్తలు తీసుకునే పళ్ళు పీకాలి. లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది” అన్నాడు.

అన్యమనస్కంగా ఉన్న తను యధాలాపంగా “లేదు” అనే సమాధానం చెప్పినట్టు గుర్తొచ్చి, రాత్రంతా ఆయన్ని కని పెట్టి చూస్తూ నిద్రకి దూరమయింది.

మరునాడు ఆఫీసులో జానకిని చూసి “ఏంటోయ్ అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా” అన్న కొలీగ్ వనజతో జరిగిందంతా చెప్పి, సారీ ఫేస్ పెట్టింది.

**

“నానిగాడిని ఓక్రిడ్జ్ స్కూల్లో వేద్దామండి. అక్కడైతే వాడి పై చదువుల గురించి మనం దిగులు పడక్కర లేదు. కేంబ్రిడ్జ్ లాంటి అంతర్జాతీయ స్కూళ్ళల్లో కూడా ఎడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుందిట” అన్నది భర్తతో జానకి.

“అంతంత ఫీజులు కట్టే స్థోమతు మనకి లేదని నీకు తెలియదా? ఒక సారితో అవదు. వాళ్ళ బస్సు రవాణాకే బోలెడు తీసుకుంటారు. ఇక పెద్ద క్లాసులకెళ్ళేకొద్దీ ఆ ప్రాజెక్ట్, ఈ ఫీల్డ్ ట్రిప్ అంటూ లక్షలు గుమ్మరించాలి. మనవల్ల ఎక్కడ అవుతుంది?” అని “మిషనరీ స్కూల్లో వేస్తే అటు కాన్వెంట్ చదువు లాగానూ ఉంటుంది, ఇటు ఫీజుల భారమూ ఉండదు” అని సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు రామారావు.

“అన్నయ్యా రమేష్ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. బావగారు క్యాంపుకెళ్ళారు. ఒకసారి వస్తావా” అన్న చెల్లెలు వాసంతి ఫోన్ తో వారింటికి పరుగెత్తాడు.

రాత్రి పదవుతుండగా ఇంటికి ఫోన్ చేసి “రమేష్ కి గుండె బలహీనంగా ఉన్నదిట. హాస్పిటల్లో చేర్చాము. నేను రాత్రికి వాసంతికి తోడుగా ఇక్కడే ఉంటాను, కంగారు పడకు” అని చెప్పాడు రామారావు.

“ఇప్పుడు ఈ ఖర్చంతా మా మీదే పడుతుందా? చెల్లెలికి కష్టం వస్తే తట్టుకోలేని తన భర్త ఖర్చంతా తన నెత్తినే వేసుకుంటాడు. అందులో ఏ సందేహమూ లేదు. ఈ పరిస్థితుల్లో నానిగాడి చదువు విషయంలో తను అనుకున్నది అస్సలు జరిగే అవకాశమే లేదు” అనుకుంటూ నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నది జానకి…మధ్య తరగతి జీవి..ప్చ్.

జానకి అనుకున్నట్టే రమేష్ ఆపరేషన్ బడ్జెట్ మూడు లక్షలు. రామారావు ఆఫీసులో పర్సనల్ లోన్ పెట్టి అవసరం గడిపాడు. “వదినా అన్నయ్యే నిలబడకపోతే మాకు పిల్లాడు దక్కేవాడు కాదు. అన్నయ్య ఋణం తీర్చలేనిది”అన్నది వాసంతి వదిన చేతులు పట్టుకుని. “అంటే ఆ అప్పు తీర్చరేమో” అనుకున్నది మనసులో!

పిల్లవాడు బతికి బట్ట కట్టాడన్న సంతోషం తనకీ ఉన్నా, మధ్యతరగతి మనుషులకి అది తీరని భారమైనందువల్ల జానకి మనస్ఫూర్తిగా స్పందించలేకపోయింది.

***

“చెల్లెలు… శిరీష పెళ్ళి కుదిరిందమ్మా. నువ్వు నాలుగు రోజులు ముందుగా రావాలి” అన్న తల్లి ఫోన్ తో ఆనంద పడిన జానకి…”మీరు కూడా ఓ వారం సెలవు పెట్టండి. మా తమ్ముడు, చెల్లి కూడా సంతోషిస్తారు… సరదాగా ఉంటుంది. పెళ్ళయి వెళ్ళాక మళ్ళీ అదెప్పుడు వస్తుందో? మన సమస్యలు ఎప్పుడూ ఉండేవే!” అన్నది.

“వాసంతిని వచ్చి అత్తయ్యగారు వాళ్ళకి తోడుగా ఆ వారం ఉండమందాము” అన్నది.

“మొన్నే హాస్పిటల్ నించి ఇంటికొచ్చాడు రమేష్. వాడి ఆరోగ్య విషయం చూసుకోవాలి. బావకెప్పుడూ క్యాంపులు! అదెలా వస్తుంది?” అన్నాడు.

“పోనీ అత్తయ్య గారు వాళ్ళని అక్కడ దింపుదాము. ఇక్కడ చేసినట్టే వంట వార్పులో అత్తయ్యగారు సహాయం చేస్తారు. పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే వేడుక కాదు కదా! నాకూ ఒక కుటుంబం, తల్లిదండ్రులు..తోబుట్టువులు ఉంటారు. మనం రావాలని వాళ్ళు మాత్రం కోరుకోరా?” అన్నది.

“ఏమో జానకి ఇదంతా అయ్యే పనిలాగా అనిపించట్లేదు” అని ఏ నిర్ణయమూ చెప్పకుండా ఆఫీసుకి వెళ్ళిపోయాడు.

***

మధ్యాహ్నం లంచ్ తినకుండా బాక్స్ లోకెలుకుతున్న జానకిని “మళ్ళీ ఏమయింది జానకీ. ఈ సారి ఏం ఖర్చు పట్టుకొచ్చాడు మీ ఆయన” అన్నది వనజ.

చెల్లెలి పెళ్ళి విషయం, కుడితిలో పడ్డ ఎలుక లాంటి తన మధ్య తరగతి జీవితం..అందులోని నిస్సహాయతలు చెప్పి “మా ఇద్దరిని పెళ్ళిలో ‘చక్కగా సీతా రాముల లాగా ఆదర్శ దాంపత్యంతో నూరేళ్ళు పచ్చగా బతకండి. పేర్లు కూడా చక్కగా కలిశాయి ‘ అని పురోహితుడు…ఇతర బంధువులు దీవిస్తే నిజంగానే అలా ఆదర్శంగా బతకచ్చు అనుకున్నాను.”

“కానీ మన బోటి మధ్య తరగతి జీవులకి అది సాధ్యమా? ఆ సీతా రాములంటే రాజులు! దేనికీ వెతుక్కోనక్కరలేకుండా చేతిలో పుష్కలంగా సిరి సంపదలు! అవసరాలని చంపుకుని బతకక్కర లేదు. ఇంకోటి కూడా ఉన్నది వారి విషయంలో..గమనించావా? సీతా దేవికి వీళ్ళ మీద ఆధారపడిన ఆడపడుచులు లేరు. అత్తమామలు ఉన్నా నా లాగా ఒక్కరే భరించక్కరలేదు. ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వారి బాధ్యతలు అంటూ ఇంటికే పరిమితమవ్వక్కరలేదు. ఇంటికి దూరంగా… ఎవ్వరికీ జవాబుదారీ కాకుండా అడవిలో వారికి నచ్చినట్టు బతికారు.”

“ఇక పిల్లల విషయానికి వస్తే వారిని ఇద్దరూ కలిసి పెంచలేదు. వారి చదువు సంధ్యల విషయంలో సీతా దేవిదే తుది నిర్ణయం! వారిని పెంచి ప్రయోజకులని చేశాక, తండ్రి వారి జీవితాల్లో ప్రవేశించాడు కనుక భార్యా భర్తల మధ్య ఏ రకమైన ఘర్షణకి తావే లేదు! పెంచి పెద్ద చేసిన తల్లికి సేవ చేసే అవసరమే వారికి పడలేదు. తల్లి దండ్రుల్లో ఎవరు ముఖ్యం, ఎవరి మాటని మన్నించాలి అనే ప్రస్తావనే రాలేదు.”

“వాళ్ళిద్దరి మధ్యలో అసలు మనస్పర్ధలకి కానీ, ఘర్షణలకి కానీ అవకాశమే లేదు”.

“ఇన్ని తేడాలున్న కలికాలపు మధ్య తరగతి భార్యా భర్తలని సీతా రాముల్లా ఆదర్శంగా జీవించండి అని దీవిస్తే ఏమిటర్ధం? అసలు అది సాధ్యమేనా? ఏ ఇబ్బంది లేకుండా అనుకున్నవన్నీ అందుబాటులోకి రాగలిగితే, అప్పుడు ఆదర్శాలు సాగుతాయి…అవునా” అన్నది చిన్నబుచ్చుకున్న ముఖంతో!

“ఎక్కడున్నా వీరి మనసెరిగి వారు, వారికినచ్చినట్టు వీరు బతుకుతూ వివాహేతర సంబంధాలకి పోకుండా, ఉన్నంతలో పొరపొచ్చాలు లేకుండా బతకమని ఆ దీవెనకి  అర్ధం. అంతే” అన్నది వనజ వాతావరణాన్ని తేలికపరచటానికి.

“ఏమోనే ప్రతి చిన్న దానికి సంఘర్షణకి లోనవుతున్న మనసుతో సరిగా ఆలోచించలేకపోతున్నానేమో. నేనేనా? మధ్య తరగతి దంపతులందరి పరిస్థితి..భర్తచెప్పటం, భార్య ఆయన్ని అనుసరించటతో సరిపోతుందా అనిపిస్తుంటుంది.”

“పెళ్ళిలో వరుడి చేత ‘నాతి చరామి’ అని వాగ్దానం చేయిస్తారు కదా! ఇంతకీ ‘నాతి చరామి’ అంటే భార్య ని అతిక్రమించను అని వరుడి చేత అనిపించటం కాదనుకుంటా! అసలు ఆ వాగ్దానం అన్యాపదేశంగా…’భర్త’ మాట అతిక్రమించద్దు అని ఆడపిల్లకి ఒక హెచ్చరిక ఏమో! మన జీవితాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది కదా! ఏదో అసంతృప్తి, నిరాశతో మనశ్శాంతి ఉండట్లేదు” అన్నది.

“మీ అత్తగారితో మీ చెల్లి పెళ్ళి విషయం చెప్పి వారి సహాయం అడుగు. ఆవిడ అర్ధం చేసుకోవచ్చు కదా! తల్లిని అడగటానికి మీ ఆయన మొహమాట పడచ్చు కానీ, రెండు కుటుంబాల మధ్య సంబంధాలు ఆరోగ్యంగా కొనసాగాలంటే వారి మధ్య అవగాహన అవసరం. అదే చెప్పి ఆవిడ సలహా తీసుకో” అన్నది వనజ అనుభవజ్ఞురాలిలాగా!

వనజ చెప్పిన సలహా నచ్చిన జానకి అత్తగారితో తన చెల్లి పెళ్ళి విషయం చెప్పి, వారం రోజులపాటు వాసంతి వాళ్ళింటికి వెళితే బాగుంటుంది అని సామరస్యంగా అడిగింది.

“దానికి నువ్వంత మొహమాట పడటం ఎందుకు? మా వాడు అలాగే అంటాడు. నువ్వేం బెంగ పడకు. నేను కూడా రమేష్ కి ఆపరేషన్ అయినప్పటి నించి  దాని దగ్గరకి వెళ్ళి నాలుగు రోజులు ఉండి వద్దామనుకుంటున్నాను. నువ్వొచ్చాక మళ్ళీ వస్తాము” అని వెన్నుతట్టి పంపించింది.

సమస్య తేలికగా పరిష్కారమైనందుకు గుండెల నిండా తృప్తిగా గాలి పీల్చుకుంది. తను ముందుగా పుట్టింటికి వెళ్ళే ప్లాన్ చేసి,భర్తని ఆ టైం కి రమ్మని చెప్పి బయలుదేరింది.

ఊహించుకుంటే ఏ సమస్య అయినా భయ పెడుతుంది, నిరుత్సాహ పరుస్తుంది. సులువైన పరిష్కారం ఉన్నా ఆ సమయానికి ఆ వైపు అడుగులు వెయ్యనివ్వదు. భర్త కలిసిరాకపోతే తనలో తనే మధన పడే బదులు పెద్ద వారయిన అత్తమామలతో  బేషరతుగా చర్చింటం మంచిది అని అర్ధం చేసుకోగలిగినందుకు..అలాంటి సలహా ఇచ్చిన స్నేహితురాలికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది.

Written by Bindu Madhavi

M Bindumadhavi Bank Officer (Retd) Published 4 books on సామెతలు, శతక పద్యాలు 1) తెలుగు సామెతలు (గల్పిక-కథా సంకలనం) (102 కథలు) 2) శతక పద్యాల కథా కదంబం (60) 3) సామెత కతలు (65) 4) క 'థ' న కుతూహలం (40)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిగురించిన జీవితం

మోడెకుర్తి రమ పాట