ఎలక్షన్స్ వస్తున్నాయి

కథానిక

మాధవపెద్ది నాగలక్ష్మి

హమ్మయ్య ఇక్కడ ఎలక్షన్స్ ప్రచారాలు అయిపోయినాయి. ఇక్కడ ఎంత వేడిగా, వాడిగా జరిగినాయి ప్రచారాలు. ఒక పార్టీవారు మరొక పార్టీవారిని అనేక రకాలుగా విమర్శిస్తూ, అనేక రకాలుగా వారి మానసిక ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తూ, అబ్బ ఎంత గోలగోలగా, ఎంత రంజుగా సాగినాయి. మరి అక్కడ ఇంకో తెలుగు రాష్ట్రం లో ఎలా సాగినాయో? వెళ్ళి కొన్నాళ్ళు ఉండి, చూసి వద్దామంటే ఈ సంసార బాధ్యతలతో కుదరదాయె. ఇలా ఆలోచిస్తూ పడుకున్నాను. గాఢ నిద్ర పట్టింది. ఆ నిద్రలో అనేక కుటుంబాలతో ఎన్నికల గురించి జరుగుతున్న చర్చలు సంభాషణలు నాకు వినపడ్డాయి. ఆ నిద్రలోనే నేను అన్నీ విని ఎంజాయ్ చేశాను. మరి అవి ఏమిటో మీరు తెలుసుకోండి.
రమా, రమా అంటూ గావు కేక పెట్టారు భూషయ్యగారు. ఏమిటండీ ఆ అరుపులు అంటూ పరుగు పరుగున వచ్చింది రమ.
ఏమీ లేదే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? బట్టలు ఇస్త్రీ చేయడం ఎలాగో నేర్పవే, అన్నారు భూషయ్యగారు.
అదేమిటండీ, ఎలక్షన్స్కు, బట్టలు ఇస్త్రీ చేయడానికి, సంబంధం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగిఁది రమాదేవి.
పిచ్చి ముఖమా, జనం ఓట్లు పడాలంటే, వాళ్లకు నచ్చేది, మెచ్చేది, ఏదో ఒకటి చేయాలి కదా? అదీగాక మా నాయకుడు అందరికి ‘వాషింగ్ మెషీన్’ బహుమతిగా ఇవ్వమన్నారు. అందుకని బట్టలు శుభ్రంగా ఉతుక్కోవడమే కాదు, అందంగ ఇస్త్రీ బట్టలు కట్టుకుని, మీరు అందంగ కనబడుతూ ఓటు హక్కు వినియోగించుకోవటానికి రండి, అని నేను వాళ్లకు చెప్పటానికి, ఇస్త్రీ చేసి చూపిదామని అడిగానే అన్నారు.
ఓహో, అదా సంగతి. తప్పకుండా నేర్పుతా. నాకు కూడా ఎమ్.ఎల్.ఏ భార్యగా ఉండాలని చాలా కోరికగా ఉందండి అన్నది రమ. ఇది ఒక ఇంట్లో సంభాషణ.
దివ్యా, నేను ఈ రాత్రికి ఇంటికి రాను. రైతులతోపాటు పొలాలలో పడుకుంటా. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. వాళ్ల కష్టసుఖాలు తెలుసుకోవాలి కదా మరి. ఓట్లు రావాలి కదా మరి అన్నాడు శేఖర్, దివ్యతో.
మీకు పాములంటే భయం కదా, పొలంలో చాలా పాములు ఉంటాయి, ఎలాగండీ, అన్నది దివ్య కాస్త కంగారుగా.
ఏం చేస్తాం, తప్పదు. వెంట రాజయ్యను తీసికెళ్తాలే. వాడికి అన్నీ తెలుసు. ఏ జంతువు ఎప్పుడు వస్తుందో, ఏ పాము కాటేస్తుందో, భయపడకు డియర్ అన్నాడు శేఖరం స్కూటర్ ఎక్కుతూ. అర్థమనస్కంగానే ఒప్పుకుంది దివ్య. ఇది మరొక ఇంట్లో ఘటన.
ఒసే రంగీ, నీకీసారి, బంగారు గొలుసు చేయిస్తానే. సంబరంగా అన్నాడు మాణిక్యాలు. ఆ, బాగానే ఉంది పగటి కల. ఏడ నుంచి తెస్తావు పైసలు? మూతి మూడువంకరలు త్రిప్పింది రంగి.
ఓసి, నీ జిమ్మడు, పలుకులుకుతావే. నీ మీద ఒట్టు తప్పకుండా చేయిస్తా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అన్ని పార్టీలవాళ్లు మన కాడికి వచ్చి, మాకే ఓటువేయమని పైసలు ఇస్తారు కదే. వాటితో కొంటాను సరే నా అన్నాడు దానివైపు మురిపెంగా చూస్తూ.
మామా, ఎంత మంచోడివి, తప్పకుండా కొనాలి. అని గారాలు పోయింది రంగి – దాని కళ్లల్లో మెరుపుచూసి మురిసిపోయాడు మాణిక్యాలు గాడు.
తరువాత కొన్ని రోజులకు టివిలో చూస్తే భూషయ్యగారు, ఒక గుడిశె ముందు బల్ల వేసుకుని బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు. జనం చుట్టూ మూగారు. కెమెరా వాళ్లు ఫోటోలు తీస్తున్నారు.
గోపాలంగారు వేరొకచోట అన్ని కులాలవారితో కలిసి క్రింద కూర్చుని, సత్తుపళ్లెంతో, రాగి జావ త్రాగుతున్రు. చుట్టూ జనాలు మెచ్చుకోలుగా చూస్తున్నారు.
సుబ్బారావుగారు అందరి స్త్రీల నెత్తిమీద చేయిపెట్టి, ముద్దులుపెట్టి, అక్కల్లారా, చెల్లెమ్మలారా, నాకే ఓటు వేయండని, తన పార్టీ కాగితము వాళ్ల గుడిశెలకు అంటిస్తున్నారు.
శేఖర్ రైతుల దగ్గర కూర్చుని వాళ్ల కష్టసుఖాలు తెలుసుకొని తన పార్టీకి ఓటువేస్తే, తప్పక రైతులకు సహాయం చేస్తానని హామీల మీద హామీలు ఇస్తున్నాడు.
రాధా, రేపు మన డ్రైవర్ మన ఇంటికి భోజనానికి పిలుస్తున్నా వాడితో కలసి క్రింద కూర్చుని భోంచేస్తా. నేను రాబోయే ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడబోతున్నా. అధిష్ఠానంను అడిగా, వాళ్ళు సరే అన్నారు. క్రింద కూర్చుని తినమంటే నాకు కష్టమవుతుంది. అందుకే ప్రాక్టీసు అవుతుంది అని వాడిని రేపు రమ్మని పిలిచాను. ప్రాక్టీసు కావడానికే రేపు వాడితో క్రింద కూర్చుని భోం చేస్తా అన్నాడు.
ఏమే, నా చెప్పులు ఎక్కడ పెట్టి చచ్చావ్? గావు కేక పెట్టారు సుబ్బారావుగారు.
తెస్తున్నానండీ, అంటూ వణుక్కుంటూ చెప్పులు చేతపట్టుకుని వచ్చింది సీతమ్మ. ఏ పనీ సరిగా చేసి చావవు.
చేయి ఎత్తాడు కొట్టడానికి.
అదేమిటండీ, కొడతారా ఏమిటి? నిన్ననేగా ప్రసంగంలో మీరు స్త్రీలు దేవతలు వాళ్లకు మనం గౌరవం ఇవ్వాలి, మనతో సమానంగా సమానంగా సర్వహక్కులు ఇవ్వాలి, అని అందరి ముందు మైకులో అరచి గట్టిగా చెప్పారు.
మరి ఇప్పుడు ఇదేమిటి? కాస్త ధైర్యంగానే అన్నది.
ఎంత ధైర్యం వచ్చిందే నీకు. నాకే ఎదురు చెపుతారా? ఉండు నీ పని చెప్తా అని కుర్చీలోంచి విసురుగా లేచాడు కొట్టడానికి.
ఇంతలో ఎవరో బయటి నుంచి రామయ్యగారూ, అని పిలిచారు.
బ్రతికిపోయావు. ఇంటికి వచ్చాక నీ సంగతి తేలుస్తా. అప్పుడుగాని నీ తిక్క క్రిందకు దిగదు అని అంటూ పళ్లు పటపట కొరుక్కుంటూ బయటికి వెళ్ళాడు. నిట్టూరుస్తూ చతికిలబడింది సీతమ్మ.
చెప్పేందుకే నీతులు అనుకుంటూ, ఇది మరొక ఇంట్లో సంఘటన.
ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా చాలా పార్టీలవాళ్లు వచ్చి ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. కొంతమంది చాటుగా డబ్బులు పంచుతున్నారు. బంగారాలు ఇస్తున్నారు. కొంతమంది బాహాటంగానే వస్తువులు ఇస్తున్నారు. ఇవన్నీ చాలా మటుకు గ్రామీణ ప్రాంతాలలో… కొంతమంది నోట్ల కట్టలు పంచుతున్నారు.
వీరిలో ఎవరికి ఓటు వెయ్యాలో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. అమాయక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు, ఆ, ఏముంది ఇంతగా ఆలోచించడానికి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్లకు వేద్దాం అన్నారు ఆడవాళ్లు. అందరూ తలలు ఊపారు.
ఒక్కరిద్దరేమో ” నోటుకు ఓటుకు వేయడం చాలా తప్పు” అంటున్నారు.
ఇలా నేను కలలు కంటూ, వింటుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. ఉలిక్కిపడ్డా కాని నిద్ర మత్తు వదలలేదు. ఆ నిద్రలోనే సర్వేజనా సుఖినోభవంతు అని అరుస్తున్నాను.
మా వారు తన దగ్గర తాళం చెవితో తలుపు తీసుకొని లోపలికి వచ్చారు. ఏమిటి అరుస్తున్నావు. పగటి కలలు కంటున్నావా? అని అడిగారు. నేను లేచి కూర్చుని నేను విన్నదంతా పూసగ్రుచ్చినట్లు చెప్పాను. ఆయన నవ్వి మన దేశంలో ఇవి ఏమీ వింతు కాదులే. రెడికా, సినిమా టికెట్లు తెచ్చాను. వెళ్దాము అన్నారు.
ఒక్కు ఉదుటున మంచం దిగాను తయారుకావటానికి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దృష్టి

ప్రేమ బంధాలు