టీ.వీ చూస్తున్న ప్రభాకర్, మాలతి పక్కన వచ్చి కూర్చుంది సుష్మిత.
“మీటింగ్స్ అయిపోయాయా అమ్మలూ?” అడిగాడు ప్రభాకర్.
అప్పుడే సాకేత్ కూడా గదిలో నుంచి వేళ్ళు విరుచుకుంటూ వచ్చి కూర్చొని “అమ్మయ్య ఈరోజుకి కతం. మూడురోజులు సెలవ్” అన్నాడు.
మాలతి లేచి నలుగురికీ టీ పెట్టుకొని వచ్చింది.
“ఈ లాంగ్ వీకెండ్ ప్రోగ్రాం ఏమిటి? ఆంటీ, అంకుల్ ని ఎటు తీసుకెళుతున్నాము?” సుష్మితను అడుగుతూనే, టీ ఓ సిప్ తాగి “సూపర్ ఆంటీ” అన్నాడు సాకేత్.
“మరిచిపోయావా? ఎల్లుండి శాటర్ డే మా ఫ్రెండ్స్ ను డిన్నర్ కు పిలిచాను” అంది సుష్మిత.
“ఓ అవును కదూ! గర్ల్స్ నైట్ ఏమో కదా? మరి మనమేమి చేద్దాం అంకుల్?” మామగారి వైపు చూస్తూ అడిగాడు.
“మనం పార్టీ చూస్తూ ఎంజాయ్ చేద్దాం” జవాబిచ్చాడు ప్రభాకర్.
“అదేం కుదరదు డాడీ. జంట్స్ ఆర్ నాట్ ఎలౌడ్. మిమ్మలిని బయటకు తోలేస్తాం” టీజింగ్ గా అంది సుష్మిత.
ఆ నెలలో సుష్మిత ఫ్రెండ్స్ ఇద్దరి బర్త్ డే ఉంది. అందుకనిసుష్మిత తన ఇంట్లో లేడీస్ retro theme పార్టీ అరేంజ్ చేసింది.
“ఇంతకీ తమరే కాలం లోకి వెళుతున్నట్లో” అంతకన్నా టీజింగ్ గా అడిగాడు సాకేత్.
“అసలుఈ retro theme party అంటే ఏమిటి?” కుతూహలంగా అడిగింది మాలతి.
“పాతకాలం డెకరేషన్, డ్రెస్ లు వేసుకోవటం అన్నమాట. మనం ఇప్పుడు 60, 70 లల్లోని హిందీ సినిమా హీరోయిన్స్ గెట్ అప్, మేకప్ చేసుకోవాలి”వివరించింది సుష్మితఅప్పుడే వచ్చిన ఏదో బాక్స్ ను లోపలికి తీసుకొస్తూ. అది విప్ప తీసింది. అందులో రకరకాల డెకరేషన్ ఐటంస్ ఉన్నాయి. అవన్నీ తీసి చూపిస్తూ “ఈ మెరుపు కాగితాలు అట్టలతో నక్షత్రాల షేప్ లో చేసి, దాని మీద హీరోయిన్ పేరు రాద్దాము. ఆ హీరోయిన్ లా డ్రెసప్ అయిన అమ్మాయి అది పట్టుకొని కాట్ వాక్ చేస్తుంది. ఇదేమో కింద వేసే కార్పెట్.ఇదేమో బాక్ డ్రాప్” ఒకటొకటిగా తీసి చూపించింది.అంతలోనే హటాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు “మమ్మీ నువ్వే హీరోయిన్ లాగా డ్రెసప్ అవుతావు?” అడిగింది.
అవన్నీ చూస్తూ కూతురి మాటలు వింటున్న మాలతి “నేనా? నేనెందుకులే. పిల్లలు మీరు అవ్వండి. నేను చూస్తాను” మొహమాటంగా అంది.
“అంత మొహమాటమెందుకు? మేమేమీ అనుకోములే! షర్మిళా, ముంతాజ్, ఆషాపరేక్ ఎవరిలాగైనా డ్రెసప్ అవచ్చు” అన్నాడు ప్రభాకర్.
“అవును మమ్మీ ఆషాపరేక్, షర్మీళా లాగా అవుతే, వేరే ఏమీ కొనక్కరలేదు కూడా. ఆ హేర్ స్టైల్స్, ఆ రకంగా సారీ కట్టుకోవటమూ కూడా నువ్వు అప్పట్లో చేసుకునేదానివి కదా. ఆషాపరేక్ అవుతే నీకిష్టమైన పాట కూడా ఉంది. నువ్వు ఆషాపరేక్ అనిభలే అయిడియా ఇచ్చావు డాడీ” సంబర పడిపోయింది సుష్మిత.
“నువ్వు ఎవరిలా డ్రెసప్ అవుతున్నావు?” అడిగాడు సాకేత్.
“ఉమరావ్ జాన్ లో రేఖాలాగా” జవాబిచ్చింది.
నలుగురూ కలిసి పార్టీ అయిటంస్ అన్ని చేసారు. ఇల్లంతా డెకరోట్ చేసారు.మాలతి, సుష్మిత కలిసి వంటలు చేసారు. కొన్ని బయట ఆర్డర్ ఇచ్చారు. అమ్మాయిలు పార్టీ చేసుకుంటుంటే మనమూ చేసుకుందాము మా ఇంటికి వచ్చేయండి అని సాకేత్ ఫ్రెండ్ నీరవ్ ఇంట్లో జెంట్స్ గెట్ టుగేదర్ అరేంజ్ చేసి, సాకేత్ ను, ప్రభాకర్ ను పిలిచాడు. పార్టీకి అంతా సెట్ అయ్యింది!
జూడా వేసుకునేందుకు జుట్టును బాక్ కోంబింగ్ చేసుకుంటూ “ఆ రోజులల్లో అంటే జుట్టు చాలా ఉండేది కాబట్టి బాక్ కోంబింగ్ అవసరం రాలేదు.అదే పెద్ద తట్టంత ముడి అయ్యేది. ఇప్పుడు బాక్ కోంబింగ్ చేయక తప్పటం లేదు. అంతా మీములానే” మురిపెంగా మొగుడిని చూస్తూ గొణుక్కుంటోంది మాలతి.
“నీ గొణుగుడు ఆపి కాస్త ఇటొచ్చి నా టై సరి చేయి” పిలిచాడు ప్రభాకర్.
ముడి వేసుకొని, కుడి చెంప పక్కగా గులాబీని స్టైల్ గా అమర్చుకొని వచ్చి, టై, వెనుక కోట్ కాలర్ సద్దుతూ “మీకు డ్రెస్ కోడ్ లేదు కాబట్టి బతికిపోయాము. మిమ్మలినీ రెట్రో డ్రెస్ వేసుకోమంటే, గొట్టాం పాంట్ ఎక్కించలేక చచ్చేవాళ్ళం” నవ్వుతూ అంది.
“చాల్లే నవ్వు. అయినా 70లకు గొట్టాం పాంట్ లు తగ్గి బెల్ బాటంస్ వచ్చాయనుకుంటా” అన్నాడు మాలతి నెత్తిన చిన్నగా దెబ్బ వేసి.
“యే షాం మస్తానీ” పాట ఈల వేసుకుంటూ డాడీ, డాడీ వెనుకే టైట్ గా కట్టిన చీర, నెత్తిమీద కాస్త ఎత్తుగా ఉన్న ముడితో మమ్మీ మెట్లు దిగి వస్తుంటే వావ్ భలే ఉన్నారు అంది సుష్మిత సెల్ లో ఫొటో తీస్తూ.
సుష్మిత ఎర్ర రంగు మెరుపుల గాగ్రా, పొడవాటి హాంగింగ్స్, పెద్ద పతకం ఉన్న పాపిడి చేరు తో అచ్చు రేఖలాగా తయారయ్యింది. సాకేత్ మటుకు తన మామూలు డ్రెస్ జీన్స్, టీ షర్ట్ తో వచ్చాడు. మామా అల్లుళ్ళిద్దరూ వాళ్ళ పార్టీకి వెళ్ళారు. సుష్మిత స్నేహితులు ఒకరోకరే వచ్చారు. ఒకరుజీనత్ అమన్ లా, ఒకరు పర్వీన్ బాబీలా, ఇంకోరు డింపుల్ కపాడియాలా ఇలా ఆనాటి హీరోయిన్స్ ను గుర్తు చేస్తూ డ్రెసప్ అయి వచ్చారు. ఇల్లంతా సందడిసందడిగా, వావ్… వావ్ అంటూ అమ్మాయిల కేకలూ, అల్లరులతోహోరెత్తిపోతోంది. ఇక హాల్ మధ్యలో పరచిన రెడ్ కార్పెట్ మీద ఒకరొకరుగా వారు డ్రెసప్ చేసుకున్న హీరోయిన్ పేరున్న స్టార్ కార్డ్ ను పట్టుకొని, బాక్ గ్రౌండ్ లో ఆ హీరోయిన్ పాట వినిపిస్తుండగా కాట్ వాక్ చేయటం మొదలు పెట్టారు.
“మైమైకే చలేజావూంగీ” అని డింపుల్ అదే లెండి డూప్లికేట్ అచ్చం డింపుల్ లా చేతులు విసురుతూ, నడుం తిప్పుతూ వచ్చింది.
“సలామీ ఇస్క్ మేరీ జాన్” పాట వస్తుంటే రేఖాలా డాన్స్ చేస్తూ వచ్చింది సుష్మిత.
“దమ్మొరే దమ్” అంటూ జీనత్ అమన్ వచ్చింది.
ఇల అందరూ ఆఅ హీరోయిన్స్ పాటతో వస్తుంటే ఒకటే చప్పట్లు, ఈలలు. అమ్మాయిల అల్లరిని ముచ్చటగా చూస్తున్న మాలతిని ఇప్పుడు మీ టర్న్ ఆంటీ అంది భాను. నేనా వద్దులే మొహమాటపడిపోయింది.
“అబ్బా లే మమ్మీ” లేపింది సుష్మిత.
ఇక తప్పదన్నట్లు లేచి, చీర సద్దుకొని, “యే షాం మస్తానీ” కిషోర్ కుమార్ ఈల వేస్తూ పాడుతున్న పాట వస్తుంటే, పాటకు తగినట్లుగా అడుగులు వేస్తూ వచ్చి, మోడల్ లా చీర కొంగుచేతిమీద వేసుకొని చుట్టూ తిరిగింది. అంతే అమ్మాయిల చప్పట్లతో, ఈలలతో హాల్ మోగిపోయింది.
వావ్ ఆంటీ సూపర్…..
వావ్ ఆంటీ అదుర్స్ …..
అందరూ గోలగోలగా అరిచేస్తూ మాలతి అడుగులో అడుగు వేసారు!