(ఇప్పటివరకు :కోర్టులో విచారణ మొదలయింది. ఆ రోజు వాదనలు పూర్తిఅయిన తరువాత కోర్ట్ లో తన కేసు తీర్పుకు మరొక డేట్ ఇచ్చారు. ఎదో తెలియని మానసిక వ్యధ తోటి ఇంటికి చేరుకుంది మైత్రేయి. కోర్ట్ నుండి వచ్చిన మైత్రేయికి చల్లనీళ్ల తో స్నానం చేయడంతో తీవ్రమయిన చలి జ్వరం పెట్టుకొచ్చింది. వరండా గదిలో అద్దెకున్న ప్రసాద్ అక్కమ్మ పిలుపుకి వచ్చి, మైత్రేయి ని హాస్పిటల్లో చేర్చి సపర్యలు చేసాడు.)
ఇంటికి రాగానే చనువుగా ప్రసాద్ హోటల్ నుండి మీల్స్ ప్యాక్ చేయించి తెచ్చిపెట్టాడు. అక్కమ్మ పనులు ముగించుకొని వచ్చింది. “ఆంటీ, వంటగదిలో మీల్స్ పాకెట్ ఉన్నది , మీరు మైత్రేయి గారు తినేసేయండి. ఆ తరువాత ఈ టాబ్లెట్ ఇవ్వండి ఆమెకి,” అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోయాడు ప్రసాద్. మైత్రేయికి తినాలనిపించక పోయిన, అక్కమ్మ బలవంతంగ రసం తోటి కొంచము, పెరుగుతోటి కొంచము అన్నము తినిపించింది.అలా కాస్త ఆహారం పడగానే మైత్రేయి కి నిద్దర ముంచుకొచ్చి పడుకుండి పోయింది.
వసుంధర పిలుపుతోనే మెలుకువ వచ్చింది తనకి.
“మైత్రేయి! అంటూ నాలుగు గంటల వేళ లోపల్లకి వచ్చింది వసుంధర. ఆమె వాలకం చూసి “ఒక్క రోజులోనే ఇలా అయిపోయావేంటే ?” అంటూ పరామర్శించింది.
“మైత్రేయి అమ్మగారు నిన్న కోర్ట్ నుండి వచ్చాక చాల పిచ్చిగా బకెట్లు బకెట్ల చన్నీళ్లతో తల స్నానం చేసారమ్మ. అంతే నేనొచ్చి చూసే సరికి చలితో వణికిపోతూ కనిపించారు. చాలా జ్వరం కూడా ఉన్నది. అదిగో! ఆ ప్రసాదు బాబు సాయంతో అమ్మగారిని ఆసుపత్రికి తీసుకు పోయిన. దేవుడి దయవల్ల అమ్మగారు తేరుకున్నారు” అంటూ మొత్తమంతా ఏకరువు పెట్టింది.
“నాకు ఫోను చేయాలిగదా అక్కమ్మ, వెంటనే.”
“నాకాడ ఫోను లేదమ్మా. అమ్మగారి ఫోన్ ఎందుకో నిన్నటినుంచి మోగటం లేదు,”
“అదా ! ఛార్జ్ అయిపోయుంటుంది”అని “డాక్టరేమన్నాడే?”అడిగింది.
“అంత భయమక్కర్లేదు వసుంధర! ఫీవర్ తగ్గిపోయింది. పదిరోజులకు మందులు ఇచ్చారు .
ఇప్పుడు నేను ఓకే! ఏంటి ఇటొచ్చావు. కోర్ట్ కి వెళ్ళావా, లేదా?”
“అక్కడినుంచే నేరుగా నీదగ్గరికె వచ్చాను చూసిపోదామని.” అంటూ చిరుకోపం ప్రదర్శించింది.
“నౌ ఐ యామ్ ఆల్ రైట్!” అంటూ నీరసంగా నవ్వింది
“ఓకే, అయితే విను !మన కేసు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ వీక్ లోనే డేట్ ఇచ్చారు. అదే ఫైనల్ హియరింగ్. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను వెంకటేశ్వర్లు గారు ఒక నెలకి లండన్ వెళుతున్నాం. నీకు తెలుసుగా! అయన చెల్లెలి కొడుకు పెళ్లి. అందుకనే. పెళ్లి కెళ్ళినట్లుంటుంది టూర్ కూడా చేసినట్లుంటుందని మేము లాస్ట్ ఇయరే ప్లాన్ చేసాము.
అది చెబుదామని వచ్చాను. రెండు రోజుల్లోనే మా ప్రయాణం. నువ్వు జాగర్త . నీకేం అవసరమున్న నా జూనియర్ రాజ్యలక్ష్మిని అడుగు. నేను చెప్పిపెడతాను. హెల్త్ జాగర్త. మన కేసు టైం కల్లావచ్చేస్తాను. అవసరమయితే నాక్కూడా ఫోన్ చెయ్యి ” అంటూ “అక్కమ్మ కాస్త దగ్గరుండి చూసుకో దాన్ని!” అని చెప్పి కొంచం బాధగానే వెళ్ళిపోయింది.
అలా వెళ్లి పోతున్న వసుంధరని చూస్తూ దీని ఋణం ఎప్పటిదో. ఈ బంధాలు ఎందుకు ముడిపడతాయో తెలియదు. రక్త సంబంధీకులు, కట్టుకున్న వాడికి కూడా లేని ప్రేమ, అభిమానం వీళ్లు చూపెడుతున్నారు. సముద్రం లో కొట్టుకు పోతున్న నాకు చుక్కాని లాగా వసుంధర ఎదురయింది. నన్ను ఒడ్డుకు చేర్చాలన్న తాపత్రయం అక్కమ్మలో కనిపిస్తున్నది. మరి ఈ ప్రసాదు నావికుడా! నన్ను ఏ వడ్డుకు చేర్చటానికి నాకు పరిచయమయ్యాడో! అంతా అయోమయం! అంధకారం. తెడ్డు లేని చిల్లిపడ్డ పడవలాంటి బ్రతుకు నాది. తీరమే చేరుతుందో. మధ్యలోనే మునిగిపోతుందో! ఎవరికీ తెలుసు.
‘అలా ఆలోచిస్తూ కూసుంటాది’ అనుకొంటూ రేడియో పెట్టింది అక్కమ్మ .
“ఎవరి కెవరు ఈ లోకంలో ఎవరికీ ఎరుక. ఏ దారెటు పోతుందో ఎవరికీ తెలియక….” పాట చాల భావయుక్తంగ మనసును పిండి వేస్తుంటే బాధగా కనులు మూసుకుంది మైత్రేయి తన కళ్ళ నీళ్లు కనిపించనీయకుండ.
కాఫ్కా రాసిన ”ది ట్రయల్” గుర్తొచ్చింది.
ఏ నేరం మీద తనకి శిక్ష పడుతున్నదో, ఎందుకు శిక్ష పడిందో, ఎంత కాలం అనుభవించాలో తెలియని కధానాయకుడు “K” లాంటి పరిస్థితి తనకు వచ్చింది. ఈ ఉచ్చు నుండి తాను బయట పడగలదా? తిరిగి తానెంతో అభిమానించే గౌరవ ప్రదమయిన అధ్యాపక వృత్తిని తలెత్తుకొని చేయగలదా? అవమానపడింది తాను, నిండునూరేళ్ళు గడపాల్సిన వైవాహిక జీవితంలో అన్ని అపస్వరాలే, సమాజం దృష్టిలో భర్త పైన తిరగపడిన స్త్రీ గ ముద్రపడింది, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది, కోర్ట్ లో డెఫన్స్ లాయర్ తననే దోషిగా మలచి మాట్లాడుతుంటే తనని తాను సమర్ధించుకోలేని నిస్సహాయస్థితి లో నిలబడింది, తల్లికి, తండ్రికి కాకుండా పోయింది. కుటుంబగౌరవం ముందు తన ఆత్మగౌరవం నిలబడలేదు, తనకే విధమయిన విలువకూడ లేదు. ఇలా నేనీ పోరాటం ఎంతకాలం చేయాలి? నా చదువు, ఆ చదువు మలచిన నా వ్యక్తిత్వం ఏమయిపోతున్నాయి? కళ్లనీళ్లు ఆగటం లేదు మైత్రేయికి.
“ముసురు పట్టిన ఆకాశం నుండి పడే వాన చినుకు కోసం
ఆశగా నిరాశగా
ఆశ నిరాశల మధ్య ఊగిసలాటగా!
శూన్యం లోకి చూ స్తూ ఉండి పోయింది ఆమె.
(ఇంకావుంది)