సీతారాములు ప్రాణిగ్రహణం

శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

మా ఆడపడుచు- కీ.శే. వెంకటమ్మ- భర్త మహారాజశ్రీ వేంకట్రామారావు గారి స్వగ్రామం రామవరంలో రామాలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం వచ్చింది.
కొంతకాలం క్రితం నేను- శ్రీమతి వేంకటలక్ష్మి రామాయణ పారాయణం పూర్తి చేసుకుని, మేమే పెళ్ళి పెద్దలుగా సీతారామ కల్యాణం చేసుకునే వాళ్ళం- పసందైన విందు భోజనాలూ అందరితో కలసిచేసేవాళ్ళం.. అదంతా ఓ అపురూపమైన కలగా దాచుకొమ్మని చెప్పి… ఆమె రామ పద సన్నిధికి చేరింది… ఆ వెలితి పూడ్చుకునేందుకేనేమో? మళ్ళీ ఆమె లేకుండానే ఈ అరుదైన విగ్రహ ప్రతిష్ట కనులారా వీక్షించడానికి వచ్చాను.

 

రామ పరివారాన్ని బాలాలయం నుండి- ముఖ్యమైన పెద్ద ఆలయంలోనికి చేర్చడానికి త్రయాహ్నిక పాంచరాత్ర ఆగమోక్త ప్రకారం విధివిధానంగా కార్యక్రమాలు ప్రారంభం చేసారు. ఇదివరలో పూర్వాచారం , పెద్దలు చెప్పినట్టు శ్రీరామ నవమి వరకు రామాయణ ఘట్టాలను మననం చేసుకుంటున్నాం..
నవరాత్రులలో భాగంగా రామ నామము ,రామ భజనలు, రామ సంకీర్తనము, మాటల ద్వారా రామాయణం చెప్పుకోవడం, రాముని యొక్క ఆవశ్యకత పెద్దవాళ్లు చెప్పడము- మేము వినడం సంప్రదాయంగా సాగుతున్న ఈ నేపథ్యంలో… అనుకోకుండా ఈ గ్రామానికి ప్రయాణమై వెళ్లడం జరిగింది. కార్లో కూర్చున్నప్పటి నుండి కూడా ఒక విధమైన అనుభూతికి లోనయ్యాను… ఎందుకంటే? వరుసకు ఆడపడుచైనా నా ప్రాణమిత్రురాలు శ్రీమతి వెంకటలక్ష్మి -నేను చాలా సంవత్సరాల స్నేహంలో, పొల్లు ముచ్చట్లు లేని, కేవలం భగవద్విషయాలు మాత్రమే ముచ్చటించుకున్న సందర్భాలన్నీ ఒక్కొక్కటిగా.. ఆ సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి… కాస్త కళ్ళల్లో నీరు చిప్పిల్లినా…బంధుత్వాన్ని కొనసాగించే దిశగా అన్నీ అదుపులో పెట్టుకుని, జనగామ జిల్లాలోని కఠారి రామవరం గ్రామంలోని సీతారామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి మనసును ఆయత్తం చేసుకున్నాను.
తీరా కోవెల ప్రాంగణంలోకి తరవాత… ఆ పరిచయం ఉన్న పరిసరాలలో… ఆత్మీయులతో కలసి , శ్రీ సీతారామ సమేత లక్ష్మణ, ఆంజనేయ ( రామపరివారంతో) ధాన్యావాసం, జలావాసం, పుష్పావాసం, ధ్వజస్తంభ ప్రతిష్టకు కావలిసిన ఆగమోక్తమ విధులు, సంప్రోక్షణ, పవిత్ర జలాలలతో ధ్వజస్తంభాన్ని అభిషేకించడం మొదలైన ఎన్నో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమ గ్రామవాసుల కీర్తి నలుదెసలా ప్రసరించాలనీ, ఆ ధ్వజ స్తంభ రూపమైన మయూర ధ్వజుని వేడుకొని, ఆ స్తంభం మీద గరుడుడి సేవా భావం తెలుసుకొని, భక్తిభావం- భక్తులు అలవర్చుకునేలా ఒక సంకేతంగా నిలుపుకోవాలనే వేదవచనం సరిగ్గా పాటించారు.

        
సశాస్త్రీయమైన రామలక్ష్మణ సీతా హనుమత్సమేత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పోల్గొనే అవకాశమూ, అక్కడ ప్రధానాచార్యులైన కృష్ణమాచార్యుల పరిచయంతో, రామ భక్తురాలైన శబరి గురించి ముచ్చటించుకునే అవకాశం కలగడం నా పూర్వ జన్మ సుకృతంగా భావించి, రెండో రోజు కార్యక్రమాలకై కోవెలకు రావడం భక్తజన సందోహంతో నిండిన ప్రాంగణంలోని ప్రతీ ప్రాణం లేని వస్తువులు సైతం చైతన్యం కలిగినట్టు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తూ… పండితోత్తముల సేవాకాలం ఒకవైపు, సహస్రనామ పారాయణ చేస్తూ కొందరు సాంప్రదాయ మహిళలు, ఏర్పాట్లు చేస్తూ మరికొంత మందిచిన్నా- పెద్దా ; యువక- వృద్ధులతో కోవెల ముఖ మండపం నిండిపోయింది.
ఇక ఋత్విక్కుల వేద ఘోష ప్రారంభం కాబోతున్న సూచనగా మంగళ వాయిద్యాలు మ్రోగాయి., 108 కలశాలలో గంగా, గోదావరీ, కావేరీ పుణ్య నదుల సంగమ జలాన్ని నింపారు. వాటితో పుణ్యాహ వాచనం చేయ సంకల్పం చెప్పి, గోత్ర నామాలతో అందరూ సభక్తిక ప్రణామాలు చేస్తూ మంగళ వాయిద్యాలతో అభిషేకం చేసారు… రామునికున్న సమతాభావమే అక్కడ ప్రతిబించేలా అన్ని వర్ణాల ప్రజలు ఒకే మండపంలో సంఘటిత, భావం కనబరుస్తూ .. కూర్చుని మంగళహారతులిస్తూ… పూజ చేస్తూ .. రామ పరివారానికి ఒక్కక్కరికీ పూజ చేయడానికి ముందు విశ్వక్సేన ఆరాధనం చేసారు.ఆ విధి విధానమంతా కన్నుల పండుగగా ఉంది.. పాలు- నీరు , సుగంధ ద్రవ్యాలతో, నవధాన్యాలతో తడిపిన పాలకీ మూకుళ్ళు సస్య ప్రాధాన్యతను తెలుపుతున్నది. ఇదంతా లోక కల్యాణంకోసమే జరిగే సీతారామ కల్యాణ వైభోగమే.
స్వస్తి కల్యాణంలో భాగంగా ఐదు యజ్ఞ వేదికలను – వాటిముందు హోతలు- ఉద్గాతలూ, ఋత్విక్కులూ, వేద మంత్ర పఠనంతోనూ.. స్వాహా కారాలతో చక్కగా యజ్ఞ పురుషుడిని ఆహ్వానించడమూ- అర్చనలు చేయడం, పూర్ణాహుతి చేయడం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి , సామగాన, యజుర్వేద , ప్రబంధాలను, రామాయణం, భగవద్గీతలను వినిపించి, స్వస్తి వాచకాలు పలికారు. మంగళాశాసనంతో ఈ పూట కార్యక్రమం ముగించి, నిర్వాహకులు సాయంకాల తర్వాతి కార్యక్రమాల ఏర్పాట్లలో మునిగారు. ఆ యజ్ఞ ధూమం, వేదమూర్తుల శాంతి వచనం ఆ ప్రాంత మంతా ఎంతో పవిత్రంగా మారింది.
సీతారాముల కల్యాణం అనేది రావణ వధ కోసం అన్యాయ దుర్మార్గ విధానాలను రూపుమాపడం కోసం… నారాయణుడు- రాముడిగా అవతరించి జగత్కల్యాణం కోసం లక్ష్మి అంశతో ఉద్భవించిన సీతమ్మతో కల్యాణం… ఎంత ఎండ మండించినా, రామాలయాలు దూరాలలో ఉన్నా , పట్టపగలు జరిగే సీతారామ కల్యాణం చూతము రారండీ అంటూ శ్రమకోర్చి వెళ్ళడం…
అయితే ఆ కల్యాణం ఎలా జరిగింది? ఎందుకు జరగాల్సి వచ్చింది? అంటే…
దశరథ మహారాజు తన నలుగురు పిల్లలకి వివాహం చేయదలచి ఒక పెద్ద సమావేశం జరిపి పెద్దలను సంప్రదిస్తున్న సమయంలోనే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు… వచ్చీరావడంతోటే.. రాముడిని నాతో అడవికి పంపించు !అని అడుగుతాడు.


ఆ మాట విని దశరథుడు విచారంలో మునిగి పోతాడు.. తానేమో తన కుమారులకు వివాహం చేయదలచాడు…ఈ విశ్వామిత్రుడేమో తన వెంట అడవులకు పంపమంటాడేమిటీ?
కానీ కోపిష్ఠి మహర్షి ఏం శపిస్తాడోనని ఒక పక్క భయపడుతూనే… రాముడు సుకుమారుడు, ఇంకా చిన్నవాడు. అడవులకు ఎలా పంపను? అల్లారు ముద్దుగా పెంచానని, పంపనంటాడు.
దశరథుని కోప్పడి, వశిష్టుల వారితో చెప్పించి, రాముడిని తనతో తీసుకొని వెళ్ళిపోతాడు.
ఎందుకంటే? మనం ముందే అనుకున్నట్టు శ్రీమహావిష్ణువు- రాముడిగా; లక్ష్మీదేవి – సీతమ్మగా అవతరించిన సంగతి దశరథునికి తెలియదు. అందుకే అడవులకు పంపనని అంతగా వాదించాడు.
కానీ వారిద్దరి కల్యాణం జరగాలి! అది వైకుంఠంలోనే నిర్ణయించబడింది. అలా వెళ్లిన రామలక్ష్మణులు లోక కంటకులను రాక్షసులను తుద ముట్టించడానికి అతని వెంట మిథిలానగరం చేరుకున్నారు. అలా మిథిలా నగరానికి చేరడం జనక మహారాజును కలవడం అక్కడ సీతను పరిచయం చేయడంలో రాముని గొప్పతనం గురించి ” మా రాముడు తాటకను వధించాడని, అహల్యకు శాప విమోచనంచేసాడనీ, ఇంకా ఆయన గుణగణాలు ” ఇలా చెబుతుంటే…
మధ్యలో జనకుడు తన కూతురైన సీతమ్మ కూడా తక్కువ గుణగణాలున్నదేమీ కాదనీ, ఆమె ఎంత శక్తిమంతురాలో చిన్నప్పటి ఒక సంఘటన చెప్తాడు. అదేమిటంటే….?
ఈ ధనస్సును దేవతలు శివునికిచ్చారనీ, శివుడు వరుణినికి ఇచ్చాడనీ, ఆయన జనకుని వంశమూల పురుషుడైన దేవరాతునికిచ్చాడనీ, ఆయన జనకునికిచ్చాడనీ దానిని తన దగ్గరకు తేవడానికి
ఐదు వేల మంది బలవంతులు శివధనస్సు పేటికను తీసుకరావడానికి కష్టపడిన ఆ పేటిక కింద సీతమ్మ ఆడుకుంటున్న బంతి పడితే అవలీలగా పక్కకు జరిపి తీసుకుందనీ, తన కూతురి శక్తియుక్తులను చెప్పాడు. తను స్వయంవరం ప్రకటించింది కూడా ఆ విల్లు ఎక్కుపెట్టిన వానికే ఇస్తానని అనడం… అప్పటికే ఆ విల్లు ఎక్కుపెట్టలేక ఎందరో రాజులు వెళ్ళిపోయారని చెప్పాడు.
రాముడు ఆవిల్లును ఎక్కుపెట్టగలడు… కానీ విరిచేసాడు.. ఎందుకంటే అది అలా ఉంటే ఏ రాక్షసుడో వచ్చి దాన్ని ఎక్కుపెట్టి, సీతను ఇవ్వమంటే?? చాలా కష్టం అనుకొని పెళపెళ విరిచేసాడు.
ఇంతలో రావణుడు వచ్చి విరవకుండా మరో చిన్న కిటుకు చేసారు దేవతలు… శివుని విల్లు ఎక్కుపెట్టడానికి రావణునికి శివునిపై గల భక్తి అడ్డువస్తుంది కదా! అందుకే ఆ ఉపాయం.
చక్రవర్తి కూతురైన సీతమ్మ ధైర్యవంతుడైన వరుడినే భర్తగా కోరుకుంటుందికదా! అందుకే అందరు సీతారాములు తగిన జంట అనుకున్నారు… అప్పుడు జనకుడు రామునితో

*ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ!
ప్రతీచ్ఛ దైవం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా॥
*
అని చెప్పి, రామా! ఈ పెళ్లి పందిరిలో ఎందరో అందమైన కన్యలున్నారు… వీరందరిలో సీత ఎవరు? అని అనుకుంటున్నావా? ఇదిగో ఈమె నా కూతురు సీత ఈమె అందరి వలె గర్భవాస కష్టాలతో పుట్టలేదు. అయోనిజ! అయినా ఏమాత్రం గర్వం లేకుండా నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. అని సీతను పరిచయం చేశాడు.

శ్రీమహావిష్ణువే రామునిగా ఈ నేలలో అవతరించిన వారిద్దరి కళ్యాణం లోకహితం కోసం జరిగింది… ఎటువంటిది లోకహితం అంటే? సమాజ కట్టుబాట్లకు వ్యతిరేకంగా పరాయి స్త్రీ, అందునా ఇంకొకరి భార్యను చేపట్టిన రావణునికి ఇది తగదని గుణపాఠం చెబుతూ లోకవిరుద్ధంగా నడుచుకొనే ఎవరికైనా ఇలానే శిక్షించే హక్కు రాజుకుంటుందని, ధర్మరక్షణ చేసి ఇలానే నడుచుకోవాలని, మానవ లోకానికి మార్గదర్శకత్వం చేసిన రాముడుతో సీతా కళ్యాణం ఇది లోక కళ్యాణం కోసం జరిపించే కళ్యాణమే కదా!!
ఈమె కూడా దుష్ట శిక్షణ- శిష్టరక్షణ అనే జీవిత పరమావధిగా ఉన్న నీకు ఎప్పుడూ సహకరిస్తుందని
ఆ చేయి పట్టుకో… అని అంటాడు.
అంతా విని రాముడు ముసిముసి నవ్వు నవ్వాడు. ఈ జనకుడు ఒట్టి అమాయకుడు. ఈమెతో ఇప్పుడే నా పెళ్ళి ఔతున్నదా?
ఎన్ని అవతారాలలో మేము భార్యాభర్తలమో? ఈయన ఇప్పుడు వివాహం చేస్తాననడం ఏమిటో? అని నవ్వుకున్నాడు.
తాను శివుడినెంత ఇష్టపడతాడో కదా! ఆ శివుడి రూపంగా నేను- శక్తి రూపంగా సీత.. మేమిద్దరం కలసి లోక కంటకుడిని తెగటార్చాలనే విశ్వామిత్రుడు మా వివాహం చేయిసున్నాడని.. రాముడు అనుకున్నాడు.
ఇలా ధర్మరక్షణ కొరకు చేయి విడువని జంట ఈ కాలంలోనూ పట్టిన పట్టు వదలకుండా…
కుటుంబ విలువలను ఎలా కాపాడుకోవాలని చెప్తూ, స్నేహితాన్ని ఎలా నిలుపుకోవాలనీ, తన దగ్గర పనిచేసేవారిని ఎలా చూసుకోవాలనే మానవ నిత్య జీవితంలో అవసరపడే ప్రతీవిషయాన్నీ తాను వైకుంఠం నుండి దిగి వచ్చి మానవుడై, మనకు మార్గదర్శకుడైన రాముడి కల్యాణం…. మనందరికీ జీవన పథ గమనం…
ఇన్ని మంచి విషయాలు చెప్పిన మర్యాదా పురుషోత్తముడి కల్యాణం చూడడమంటే ఆ గుణాలన్నీ గుర్తుకు వచ్చి, మనమూ ఇలా ఉండాలనే స్థిర నిశ్చయానికి రాగల ప్రేరణనిచ్చే కల్యాణం చూసి, వ్యక్తిత్వ వికాసం పొందడమే శ్రీరామనవమి…

ఇదంతా నా ప్రియ నేస్తానికి ఇష్టమైన కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళి అందించడమూ… సర్వకాల సర్వావస్థల యందు ఆనందంగా ఉండే మనస్తత్వ మున్న ఆమెకు ఇప్పుడ ఏ లోకాన ఉన్నా ఆమె సదా సంతోషాంతరంగితయై ఉండాలనే ఆకాంక్ష యే ఈ నా నాలుగు మాటలు…

రంగరాజు పద్మజ

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్వయంకృతం

జై శ్రీరామ్