వంశోద్ధారకుడు

కథ

మాధవపెద్ది ఉష

చేతిలో స్వీట్‌ ప్యాకెట్తో మెటర్నిటీ వార్డ్‌ లేబర్‌ రూం బయట మగపిల్లవాడు పుట్టాడన్న శుభవార్త వినడం కోసం, ఎంతో ఆత్రుతతో ఇటూ అటూ పచార్లు చేస్తున్నాడు రాకేష్‌!

ఇంతలో లేబర్‌ రూంలోంచి ఓ నర్సు బయటకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్‌ మిస్టర్‌ రాకేష్‌ మీకు ఆడపిల్ల పుట్టింది అని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.

ఆ వార్త విన్న రాకేష్‌ షాక్‌ తిన్నాడు. ఒక్కసారిగా అతని కోపం నషాళానికి అంటింది. చేతిలో ఉన్న స్వీట్‌ ప్యాకెట్ని విసిరి గోడకేసి కొట్టాడు. అయినా అతని కోపం చల్లారలేదు. ఎప్పుడెప్పుడు డాక్టర్‌ సవిత బయటకు వస్తుందా? ఎప్పుడెప్పుడు ఆవిడని నాలుగూ దులిపేద్దామా అని అసహనంగా ఎదురు చూస్తున్నాడు.

ఓ పావు గంట తరువాత డాక్టర్‌ సవిత లేబర్‌ రూం నుంచి చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. ఆమెను చూస్తూనే ఆమె పై ఒక్కసారిగా విరిచుకుపడ్డాడు రాకేష్‌. ”ఎందుకిలా చేసారు డాక్టర్‌?” అంటూ ఏదో అనబోయేంతలో ”చూడండి మిస్టర్‌ రాకేష్‌ మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే నాతో పాటు నా రూంకి రండి అక్కడ మాట్లాడుకుందాం ఓకే” అనేసి విసవిసా నడుచుకుంటూ తన రూంకేసి వెళ్ళిపోయింది డాక్టర్‌ సవిత, చేసేది లేక ఆమెను అనుసరించాడు రాకేష్‌ కోపంతో కుతకుతలాడిపోతూ!

స్ప్రింగు డోర్‌ తెరుచుకుని డాక్టర్‌ సవిత తన రూంలోకి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. వెనకాలే వచ్చిన రాకేష్‌ ను కూడా కూర్చోమని సంజ్ఞ చేసింది. అతను కూర్చున్నాక ”ఊఁ..ఇప్పుడు చెప్పండి రాకేష్‌ ఏంటి మీ ప్రాబ్లమ్‌?” అంది ఎంతో శాంతంగా.

”చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్లు మాట్లాడతారేంటి డాక్టర్‌ ? పుట్టబోయేది ఆడపిల్లన్న విషయాన్ని దాచిపెట్టి, మగపిల్లవాడని అబద్ధం చెప్పి పరిస్థితి డెలివరీ దాకా తీసుకు వస్తారా? నాకు ఆడపిల్ల అక్కర్లేదు. అని కచ్చితంగా చెప్పానా లేదా మీకు…వంశోద్ధారకుడు కావాలని తపించిపోతున్న మా పేరెంట్స్‌ కి నేను ఏమని సమాధానం చెప్పుకోను?” అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ.

‘మిస్టర్‌ కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ఎవరైనా వింటే మీరూ నేనూ కూడా కటకటాలు వెనుక ఉంటాం. ఎందుకంటే మన దేశంలో పుట్టబోయే బిడ్డ ఆడా మగా అన్న విషయం బయట పెట్టడం చట్ట విరుద్ధమని మీకు ఇదివరకే చెప్పాను.. మరిచిపోయారా?

ఇక బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం అందరి డాక్టర్లు లాగానే నేను కూడా ఐదవ నెలలో స్కానింగ్‌ చేసాను. అందులో పుట్టబోయేది అడపిల్ల అని తెలిసింది. కానీ సెక్స్‌ ఆఫ్‌ ది బేబీ ఎవరో చెప్పమనీ ఒక వేళ ఆడపిల్లయితే ఎబార్షన్‌ చేయమని మీరు కోరారు. కాబట్టి నేను గనుక ఆ విషయం చెప్పను (చట్టవిరుద్ధం కాబట్టి) అని ఉంటే మీరు మరో డాక్టర్‌ దగ్గరకు వెళతారు. కొంతమంది డబ్బుకి కక్కుర్తిపడో లేక మరే కారణం చేతో మీరు కోరినట్లు చేయవచ్చు. కానీ ఆమెతో రిస్క్‌ తో కూడినపని. ఒక్కొక్కసారి తల్లి ప్రాణానికి ముప్పు చూస్తూ చూస్తూ రెండు ప్రాణాలను ప్రమాదంలో పడేయడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. అందుకే మీతో మగపిల్ల వాడని అబద్దం చెప్పాను. ఇదీ జరిగిన విషయం.

‘ఇకపోతే మిస్టర్‌ రాకేష్‌, మగపిల్లవాడే కావాలని మీకెందుకంత పట్టుదల? ఏం మగవాడిని ఈ భూమ్మీదకి తీసుకొచ్చేది ఆడది కాదా? ఆడది లేకుంటే ఈ సృష్టే లేదన్న వాస్తవాన్ని మీరెప్పుడు గ్రహిస్తారు? అయినా మీకో విషయం తెలిసినట్లు లేదు. ఆడగానీ, మగగానీ పుట్టడానికి కారణం స్త్రీకానే కాదు. అందుకు బాధ్యుడు పురుషుడే! స్త్రీ, పురుషుల కలయికలో స్త్రీ యొక్క అండంలో ఉన్న ఎక్స్‌ ఎక్స్‌ క్రోమోజోమ్స్‌ లోని ఎక్స్‌ క్రోమోజోమ్‌ పురుషుని యొక్క వీర్యంలోని ఎక్స్‌ వై క్రోమోజోమ్‌ లోని ఎక్స్‌ క్రోమోజోమ్‌ తో కలిసినప్పుడు ఆడపిల్ల, క్రోమోజోమ్‌ తో కలిసినప్పుడు మగపిల్లవాడు పుడతారన్న బేసిక్‌ నాలెడ్డి కూడా లేకుండా మీలాంటి చదువుకున్నవారే ఇలా ప్రవర్తిస్తే మరిక చదువు జ్ఞానం లేని నిరక్షరాస్యులు మూర్ఖంగా ఆలోచిస్తే అందులో ఆశ్చర్యం ఏముంది?

మీలాంటి వారి వల్ల ఇప్పటికే ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గిపోయి, మగపిల్లల శాతం పెరిగి పోయింది. మగపిల్లల కోసం వెంపర్లాడడం ఇలాగే కొనసాగితే ఈ భూమ్మీద ఆడపిల్లలకే కరువొచ్చి మగపిల్లలకు పెళ్ళి చేసుకోవడానికి ఆడపిల్లలే మిగలరు. అప్పుడు మీరు కలలు కంటున్న మీ పుత్రరత్నం తన భార్యని మరో నలుగురితో షేర్‌ చేసుకోవలసిన దుస్థితి కలుగుతుంది. అటువంటి అనర్థం జరగకుండా ఉండాలంటే కనీసం మీలాంటి చదువుకున్న వారైనా మారాలి. ఆడామగా తేడాలు చూపడం మానాలి. ఈరోజులలో ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఉన్నత పదవులు అలంకరించి ఇటు ఇంటా అటు బయటా ప్రసంశనీయంగా తమ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. నేటి ఆడపిల్లలు ఎందులో తక్కువని మీరు మగపిల్లవాడి కోసం అంత తపించి పోతున్నారు. అంతే కాదు ఈ రోజులలో ‘మగ పిల్లల కన్నా ఆడపిల్లలే తమ తల్లితండ్రుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. అందుకే వెళ్ళండి. మీ భార్యకు అభినందనలు తెలిపి, మీ రక్తం పంచుకుపుట్టిన మీ పాపను అక్కున చేర్చుకోండి” అన్నది.

అయినా ఆమె మాటలు లెక్క చేయకుండా డాక్టర్‌ రూంలోంచి బయటకు వచ్చిన రాకేష్‌ విసవిసా స్వాతీ నర్సింగ్‌ హోమ్‌ బయటకు నడిచాడు.

—–

భర్త తనను, తన బిడ్డనూ చూడడానికి రాకుండా పుట్టింది ఆడపిల్ల అని తెలిసి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడని తెలుసుకుని రాకేష్‌ భార్య రేవతి ఎంతగానో కలత చెందింది. అక్కడే వున్న తల్లితండ్రులకు ఏమని చెప్పాలో పాలుపోలేదు.

అప్పటికే తండ్రి అడగనే అడిగాడు ”అదేంటమ్మా, అల్లుడుగారు నిన్నూ పాపను చూడకుండానే వెళ్ళిపోయారు?”

”ఏం లేదు నాన్నా ఆయనా, మా అత్తమామలు మగపిల్లవాడు పుడ్తాడని ఎంతో ఆశపడ్డారు. అందుకే వాళ్ళకు ఇదొక పెద్ద షాక్‌. మెల్లిగా వాళ్ళే కోలుకుంటారులెండి. మీరేం వర్రీ కాకండి” అని వారికి నచ్చ చెప్పింది రేవతి. అయినా ఆయన కన్విన్స్‌ అయినట్లు కనిపించలేదు.

నర్సింగ్‌ హోమ్‌ నుంచి డిశ్చార్జ్‌ అయి తల్లితండ్రులతో పుట్టింటికి వెళ్ళే ముందు రేవతి డాక్టర్‌ సవితని పర్సనల్‌ గా కలిసింది. అప్పుడు డాక్టర్‌ సవిత చెప్పిన కొన్ని విషయాలు విని అవాక్కయింది.

”రేవతిగారూ, మీరు డెలివరీకి ముందు చెకప్‌ లకు వచ్చే రోజులలో మీ భర్త నన్ను కలిసి మీకు పుట్టబోయేది మగా, ఆడా తెలుసుకునేందుకు స్కానింగ్‌ చేయమని కోరారు. కోరటమే కాదు ఆడపిల్లయితే అబార్షన్‌ చేయమని కూడా చెప్పారు. అందుకు నేను ఒప్పుకోలేకపోతే డబ్బాశ కూడా చూపించారు. నాకప్పటికే పుట్టబోయేది ఆడపిల్లని తెలుసు. అందుకే నాకా పని చేయడం ఇష్టం లేక స్కానింగ్‌ లె పుట్టబోయేది మగపిల్లవాడని తేలిందనీ, కానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమనీ ఆయనకు చెప్పాను. ఎందుకంటే పుట్టబోయేది ఎవరో ముందే చెప్పడం చట్టవిరుద్ధం అని చెప్పాను. అందుకే మీ వారూ, మీ అత్తమామలు డెలివరీ అయ్యేదాకా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. కాబట్టి నా సలహ ఏంటంటే ఆడపిల్లంటే అంత విముఖంగా ఉన్న మీ భర్త ముందు ముందు ఏం చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. మీ శ్రేయోభిలాషిగా నేను చెప్పే సలహా ఇదే” అని చెప్పడం ముగించింది.

ఆమె మాటలు విన్న రేవతి ఆలోచనలో పడింది. తన పెళ్ళై అత్తవారింట అడుగు పెట్టినప్పుడు ఆ ఇంట్లో అత్తమామలూ, భర్తతో సహా ఓ ఆడపడచు కూడా ఉంది. పేరు మాధవి. ఆమెది కూడా దాదాపు తన వయస్సే తన పెళ్ళైన ఓ నాలుగైదు నెలల తేడాతో మాధవి వివాహం జరగడం ఆమె అత్తవారింటికి వెళ్ళడం జరిగి పోయాయి. ఇక ఆ ఇంట్లో మిగిలింది అత్తమామలతో పాటు భర్త తనే!

ఆ తరువాత తను గర్భవతి అయ్యాక మనవడు పుడ్తాడని అత్తమామలంటుంటే అందరిలాగే వాళ్ళు కూడా వంశోద్ధారకుడు కావాలని కోరుకోవడం సహజమేగా అనుకుంది. కానీ తన భర్త మగపిల్లవాడి కోసం భ్రూణ హత్యకే తలపడేంత నీచానికి దిగజారే మనస్తత్వం కలవాడన్న ఊహ తనకు కలగలేదు. అందుకే డాక్టర్‌ సవిత చెప్పిన మాటలు విని తన చెవులను తనే నమ్మలేక పోతోంది. తనకు ఇది ఒక పెద్ద షాక్‌. ఇలా ఆలోచిస్తూ అన్యమనస్కంగానే డాక్టర్‌ కి థాంక్స్‌ చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంది.

* *  *

నర్సింగ్‌ హోమ్‌ నుంచి మొహం వేలాడేసుకొని ఇంటికి వచ్చిన కొడుకు రాకేష్‌ ద్వారా విషయం తెలుసుకున్న సూర్యనారాయణ దంపతులు ఇంతెత్తున ఎగిరిపడ్డారు. మనవడు పుడ్తాడన్న శుభవార్త మోసుకొస్తాడనుకొన్న కొడుకు, పుట్టింది ఆడపిల్ల అని చెప్పగానే ఆ వార్త జీర్ణించు కోలేకపోయారు. తమని ఇన్నాళ్ళ నుంచీ భ్రమలో ఉంచిన ఆ డాక్టర్‌ ని తిట్టిపోసారు.

‘రెండోసారి కొడుకు పుడ్తాడేమో చూద్దాం” అని తల్లిదండ్రులను శాంతింప చేయడానికి ప్రయత్నించాడు రాకేష్‌.

”ఈసారి కూడా ఆడపిల్ల పుట్టదని ఏంటి గ్యారంటీ? అలా ఎంతమంది ఆడపిల్లల్ని కంటావురా? వారిని పెంచి పోషించి పెళ్ళి చేయడం అంటే మాటలా ఈరోజుల్లో?”

ఇక ఏం చెప్పినా వాళ్ళు శాంతించరని అర్థమయిపోయింది రాకేష్‌ కి, ”మరేం చేద్దామంటారు?” అని ప్రశ్నించాడు.

”దీనికి ఒకటే మార్గం ఉంది. అదే విడాకులు తీసుకోవడం.”

”అందుకు వాళ్ళు ఒప్పుకోవద్దూ?”

”ముందు విడాకుల నోటీసు పంపించి చూద్దాం. ఒప్పుకుంటే సరే లేకపోతే నీకేంరా మగాడివి.. అది మరిచిపోకు. నువ్వు ఊఁ అంటే చాలు సవాలక్షమంది ఆడపిల్లల తల్లిదండ్రులు క్యూలో నిలబడతారు. ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వు దాని గురించి వర్రీ కాకు. ముందు విడాకుల నోటీసు పంపించే పనిలో ఉండు” అన్నాడు సూర్యనారాయణ. డాక్టర్‌ సవిత తనకు ఇచ్చిన లెక్చర్‌ మదిలో మెదులుతుండగా ఓ పక్క తండ్రి చెప్పింది చేయడానికి సంకోచిస్తూనే మరో పక్క తండ్రి మాట జవదాటలేకపోయాడు రాకేష్‌.

* *  *

రేవతి పుట్టింటికి వచ్చి దాదాపు నెల కావస్తోంది. కానీ ఇంత వరకూ రాకేష్‌ గానీ, అతని తల్లిదండ్రులు గానీ పాపని చూడడానికి రాలేదు. ఇరవై ఒకటవ రోజు పాపని ఉయ్యాల్లో వేయడం అదీ మామూలుగానే చేసారు. ఇక మిగతాది బారసాలె. అందుకు తండ్రి లేందే చేయలేని పరిస్థితి. అప్పుడే ఇరుగుపొరుగు సన్న సన్నగా చెవులు కొరుక్కుంటున్నారు. పాపను చూసేందుకు అల్లుడు రాలేదేంటని. రేవతి అమ్మానాన్నలని చూచాయగా అడుగుతున్నారు. సమాధానం ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు..

ఓరోజు రేవతి తీరిక చేసుకుని తల్లి అనసూయను, తండ్రి శ్రీనివాసరావుని కూర్చోబెట్టి తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆరోజు నర్సింగ్‌ హోమ్‌ నుంచి వచ్చేటప్పుడు డాక్టర్‌ సవిత తనతో చెప్పిన మాటలను వారికి పూసగుచ్చినట్లు చెప్పి అటువంటి కఠిన హృదయుడితో నూరేళ్ళ కాపురం ఎలా చేయమంటారని నిలదీసింది.

”ఏదో మీ దయవల్ల ఇంత చదువుకొని నా కాళ్ళమీద నేను నిలబడగలిగాను. నా చిట్టితల్లిని ద్వేషించే వాళ్ళతో కలిసి బ్రతకలేను. ఆయనకు విడాకులిచ్చి నా పాపను నేనే పెంచి పెద్దచేస్తాను. మీరు నాకు అండగా వుంటే” అని కన్నీళ్ళతో తల్లినీ తండ్రిని ఆర్జించింది.

కూతురి బాధ చూసి వారి కడుపు తరుక్కుపోయింది. అయినా బాధని దిగమింగుకుని రేవతి తండ్రి శ్రీనివాసరావు ఇలా అన్నాడు. ”అది కాదమ్మా భర్త అండ లేకుండా ఓ బిడ్డని అదీ ఆడపిల్లని పెంచి పెద్ద చేయడమంటే మాటలు కాదు. ఈ సమాజం అనే సూటీపోటీ మాటలు నువ్వు తట్టుకోలేవమ్మా… పోనీ అవన్నీ తట్టుకోగలవని నువ్వనుకున్నా కొంచెం పెద్దయ్యాక నీ కూతురే నిన్ను నాన్న ఏరీ, అందరి పిల్లలాలాగా నాకు నాన్న ఎందుకు లేరు అని దాన్ని ఏం చెప్పి సముదాయిస్తావు…కొంచెం ఆలోచించమ్మా! అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. కొన్నాళ్ళు ఆగి చూద్దాం ఏం జరుగుతుందో!” అని ఆమెను బుజ్జగించాడు. ఆ విధంగా తండ్రి అనునయించడంతో కొంత శాంతించింది రేవతి. తన భవిష్యత్తు భారం దేవుడి మీద వేసి రోజులు గడపడం మొదలు పెట్టింది.

ఇంతలో పిడుగు పడ్డట్లు రాకేష్‌ నుంచి ఓరోజు విడాకుల నోటీసు అందుకుంది రేవతి. రేవతి కన్నా ఎక్కువగా ఆమె తల్లితండ్రులు షాక్‌ తిన్నారు. కానీ రేవతి ఏమాత్రం తొణకలేదు. ”రోగీపాలే కోరాడు. వైద్యుడూ పాలే త్రాగమన్నట్లు. ఎలాగో నేనే ఇద్దామను కుంటున్నాను కదా! ఆయన కోరినట్లు విడాకులు ఇచ్చేద్దాము నాన్నా. అటువంటి మనిషితో జీవితం గడపలేను. నా మాట వినండి నాన్నా అని తండ్రిని బ్రతిమి లాడింది. కానీ శ్రీనివాసరావు అందుకు ఒప్పుకోలేదు. ”చూద్దామమ్మా. మనం ఇవ్వకపోతే ఏం చేస్తాడో అదీ చూద్దాం” అన్నాడు పంతంగా! చేసేది లేక తండ్రిమీదే భారమంతా వేసేసింది రేవతి. అనుకున్నట్లుగానే విడాకుల నోటీసుకి ఏ సమాధానం ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండసాగారు.

* *  *

ఈలోగా ఓ రోజు మాధవికి మూడవ నెల అన్న శుభవార్త తెలిసింది సూర్యనారాయణ దంపతులకు. ఆ వార్త విన్న వారు ఎంతగానో సంతోషించారు. ఏడో నెలలో మాధవిని పుట్టింటికి తీసుకు వచ్చి సీమంతం చేసి పురుడు పోయాలని నిశ్చయించుకున్నారు. అప్పటి నుంచీ మాధవి తల్లి ఆదిలక్ష్మికి చేతి నిండా పనే పుట్టబోయే బిడ్డ కోసం స్వెట్టర్లు అల్లడం, జుబ్బాలు పక్కబట్టలు తయారుచేయడంలో బిజీగా ఉంది. చూస్తుండ ‘గానే రోజులు ఇట్టే దొర్లిపోతున్నాయి. మాధవికి నాలుగువెళ్ళి ఐదవనెల వచ్చింది.

ఆరోజు ఆదిలక్ష్మి వంటపని ముగించి మాధవి బిడ్డ కోసం మేజోళ్ళు అల్లుతోంది. అప్పుడే ఫోను మోగింది. అక్కడే ఉన్న సూర్యనారాయణ ఫోను ఎత్తాడు. అవతలి వైపు నుంచి ఏం కబురు విన్నాడో తెలియదు కానీ ఆఁ అంటూ ఒక్కసారిగా విరుచుకు పడిపోయాడు. సోఫాలో కూర్చున్న ఆదిలక్ష్మి కంగారుగా ఏమయిందండీ అంటూ ఒక్క ఉదుటున భర్త దగ్గరకు వెళ్ళి ఆయనను లేపడానికి ప్రయత్నించి విఫలురాలైంది. ఇంతలో ఏదో స్ఫురించి లేచి వెళ్ళి ఓ గ్లాసుతో నీళ్ళు తీసుకుని ఆయన ముఖం మీద కాసిని నీళ్ళు చల్లింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచాడు. ఆదిలక్ష్మి ఆదుర్దాగా భర్తను అడిగింది. ”ఏమి టండి? ఎవరు ఫోను చేసారు?” అని.

”మనమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారట. అదీ… పరిస్థితి చాలా సీరియస్‌ గా ఉందట… వెంటనే మనని బయలుదేరి రమ్మన్నారు. వాళ్ళ ఊరెళ్ళాక అన్నీ చెప్తారుట…” అన్నాడు.

అది వినగానే ఆదిలక్ష్మి శోకాలు మొదలు పెట్టింది. ”అయ్యో నా చిట్టితల్లికి ఎంత కష్టమొచ్చిందండీ…అసలే ఉత్త మనిషి కూడా కాదు… కొంప దీసి మనమ్మాయికి ఏం కాలేదు కదా” అంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం మొదలుపెట్టింది.

అప్పటికి పూర్తిగా తేరుకున్న సూర్యనారాయణ భార్యకు ధైర్యం చెప్పాడు. ”ఊరుకో ఆది. ఇది ఏడ్చి శోకాలు పెట్టే సమయం కాదు. మనం వెంటనే మాధవి వాళ్ళ ఊరు బయలు దేరాలి. అందుకు కావలసిన ఏర్పాటు చూడు… ఈలోగా నేను రాకేష్‌ కి ఫోన్‌ చేసి మనకి అర్జంటుగా వైజాగ్‌ వెళ్ళడానికి రెండు ఫైట్‌ టిక్కెట్లు కొనమని చెప్తాను. ఈరోజే మనం బయలు దేరాలి” అన్నాడు.

ఫోన్లో తండ్రి మాటలు విన్న రాకేష్‌ ఆఘమేఘాల మీద పరుగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూ రెండు ఫ్లైట్‌ టికెట్స్‌ వైజాగ్‌ కి ఆన్‌ లైన్‌ లో ఆ రోజు సాయంకాలానికే బుక్‌ చేసి వాటి ప్రింటవుట్‌ లు కూడా తీసుకు వచ్చాడు.

రాకేష్న చూడగానే ఆదిలక్ష్మి దుఃఖం ఆపుకోలేకపోయింది. కొడుకుని వాటేసుకుని బావురుమంది.

.”అమ్మా… చెల్లికి ఏం కాదమ్మా. నువ్వు అప్‌ సెట్‌ కాకు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఆయన మీద భారం వేసి బయలుదేరండి” అంటూ తల్లి ధైర్యం చెప్పాడు.

కారులో తల్లిదండ్రులను ఎయిర్‌ పోర్టుకి తీసుకెళ్ళి ఫైట్‌ ఎక్కించి వైజాగ్‌ చేరగానే చెల్లికి ఎలా ఉందో ఫోన్‌ చేయమన్నాడు. అలాగేనంటూ భారమైన హృదయాలతో బయలుదేరారు సూర్య నారాయణ దంపతులు.

* *  *

ఎయిర్‌ పోర్టుకి అల్లుడు ఉమాకాంత్‌ వచ్చాడు. రిసీవ్‌ చేసుకోవడానికి. అల్లుడ్ని చూస్తూనే అమ్మాయికి ఇప్పుడెలా వుంది బాబూ?” అని ఆందోళనగా అడిగారు అత్తమామలు.

ముందు మీరు కారులో కూర్చోండి. అన్నీ వివరరంగా చెప్తాను అని వాళ్ళిద్దర్నీ కారులో ఎక్కించుకుని కారు నడుపుతూ ఇలా అన్నాడు ఉమాకాంత్‌.

”అసలేమయిందంటే … పుట్టబోయేది అమ్మాయా/ అబ్బాయా అని తెలుసుకోవాలని మా అమ్మానాన్న పట్టుబడ్తే మాధవికి స్కానింగ్‌ చేయించాను. అందులో ఆడపిల్లని తేలింది. ఆడపిల్లయితే మాకు అక్కరలేదు. మాకు మగపిల్లవాడే కావాలని మా అమ్మానాన్న మొండిగా ఉండటంతో అబార్షన్‌ చేయమని డాక్టర్‌ కి చెప్పాం.

అలా అబార్షన్‌ చేయడం వల్ల పరిస్థితి విశమించి తల్లి ప్రాణానికే అపాయకరమైన స్థితి ఏర్పడింది. ఇదంతా మా తల్లిదండ్రులు చాదస్తం అనండి, మూర్ఖత్వమనండి. అందువల్లే జరిగింది. మాధవికి బాగా రక్తస్రావం అవడంతో రక్తం కూడా ఎక్కించాల్సి వచ్చింది. అయినా పరిస్థితి ఇంకా సీరియస్‌ గానే వుంది. కానీ ఈ టైంలో హాస్పిటల్లో పేషెంట్‌ కి చూడడానికి అనుమతించండీ అందుకే మిమ్మల్ని నేరుగా ఇంటికే తీసుకెళ్తున్నాను. మాధవిని రేపు చూడవచ్చు” అని అల్లుడు చెప్పగానే అవాక్కయ్యారు అత్త మామలు. ఇంటికి వెళ్ళేదాకా స్తబ్దుగా ఉండి పోయారు.

కారు దిగి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆదిలక్ష్మి శోకాలు మొదలు పెట్టింది. వియ్యపురాలు పద్మావతి వచ్చి ఆదిలక్ష్మి చేతులు పట్టుకుని, ”మేం ఇలా జరుగుతుందని ఊహించలేదు వదిన గారూ… తప్పయిపోయింది మమ్మల్ని క్షమించండి’ అన్నది గద్గదస్వరంతో.

ఐదో నెలలో అబార్షన్‌ అంటే తల్లి ప్రాణానికే ముప్పని మీకు తెలీదా? మాతో ఒక్క మాటైనా చెప్పకుండా అలా ఎలా చేసారండీ…ఇప్పుడు మా కూతురికి ఏదైనా అయితే మీరు పోస్తారా ప్రాణాలు? అంత కఠినంగా ఎలా ఉండగలిగారండీ? మీలాంటి వారిని ఊరికే వదలకూడదు. పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తాం ఇప్పుడే వెళ్ళి.. ఏం స్తారో చేస్కోండి” అంటూ సూర్యనారాయణ వియ్యంకుడు రంగనాధాన్ని దులిపేసాడు కోపంతో రగిలిపోతూ.

అదే సమయంలో పక్కగది తలుపులు తీసుకుని మాధవి బయటకు వచ్చి తాపీగ్గా చేతులు కట్టుకుని నిలబడి ”మరైతే మీరు చేసింది ఏమన్నా బావుందా?” అన్నది తల్లితండ్రులను ఉద్దేశించి.

మాధవిని చూడగానే వారికి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లయింది. ఆనందం పట్టలేక ఆదిలక్ష్మి అమ్మా మాధవి బానే ఉన్నావా” అంటూ మాధవి దగ్గరకు వెళ్ళబోతున్నదలా ”ఆగమ్మా!” అన్న మాధవి మాటలతో చేష్టలుడిగిన దానిలా అలాగే నిలుచుండి పోయింది.

”ముందు నేను చెప్పేది వినండి.. నేనడిగినదానికి జవాబివ్వండి. మా అత్తమామలను అంతగా నిలదీసారే, మరి మీరు చేసిన నిర్వాకం ఏంటి? వదినకు డెలివరీ చేసిన డాక్టరు మంచిది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఏమయ్యేదో తలుచుకోవడానికే భయంగా ఉంది. అన్నయ్య ఆ డాక్టరుకి డబ్బాశ చూపించి ఐదో నెలలో స్కానింగ్‌ చేసి ఒకవేళ ఆడపిల్ల అయితే అబార్షన్‌ చేయమని అడిగాడట కదా! ఆవిడే కనుక డబ్బుకి కక్కుర్తిపడి అన్నయ్య చెప్పినట్లు చేసి ఉంటే ఏం జరిగేదో కొంచెమైనా ఆలోచించారా?

ఏం మీ కూతురనగానే బెంబేలు పడి, శోకాలు పెడుతూ పరిగెత్తుకొచ్చారే. మరి వదిన కూడా మరో తల్లి కన్న బిడ్డేకదా? ఆమెకేమైనా అయితే వదిన తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పేవాళ్ళు? చెప్పండమ్మా! అంతటితో ఆగక మనవరాలిని చూడడానికి కూడా వెళ్ళకుండా వదినకు విడాకుల నోటీసు పంపడంలో మీ ఉద్దేశ్యమేమిటి? అన్నయకు మరో పెళ్ళిచేసి మరో కోడలు వస్తే వరుసగా మగపిల్లలు పుట్టుకొస్తారా? ఆడకానీ, మగగానీ పుట్టటానికి ప్రమేయం లేదనీ, పురుషుడే అందుకు కారణమనీ ఇంత చదువుకున్నారు మీకు కూడా తెలీదా నాన్నా? మీలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు నేను సిగ్గుతో తలవంచుకోవలసి వస్తోంది మా అత్త మామల ముందు. తనదాకా వస్తేగానీ తెలియదన్న సామెత మీ పట్ల అక్షరాలా రుజువైంది ఈ రోజు. ఇప్పటికైనా గ్రహించారా మీరెంత స్వార్థపరులో మా అత్తగారు, మామగారు దైవ స్వరూపులు. మీలాగా ఆడామగా వివక్ష చూపించే కుసంస్కారులు కారు. మీకు కనువిప్పు కలగాలనే మేమంతా కలిసి ఈ నాటకం ఆడాం.

‘అంతే కాదు. ఈ మగపిల్లల పిచ్చి మానుకోమని మీ పుత్రరత్నానికి గట్టిగా చెప్పండి… ఈ రోజులలో ఎన్నో చోట్ల కొడుకులు పట్టించు కోకపోతే కూతుళ్ళే తలకొరివి పెడ్తున్నారని వింటున్నాం. సమాజంలో ఇన్ని మార్పులు వస్తుంటే మీరింకా పాత కాలపు భావాలు పట్టుకుని వేళ్ళాడ్డం ఏమంత విజ్ఞత అనిపించు కుంటుంది?” అని అవాక్కయి వింటున్న తల్లినీ తండ్రిని గట్టిగా మందలించింది మాధవి.

ఆ మాటలకు ఆదిలక్ష్మి కూతురిని వాటేసుకుని అపరాధిలా తలొంచుకుని ఇలా అంది. ”నిజమే నువ్వు చెప్పింది. ఏదో వంశోద్ధారకుడు కావాలన్న చాదస్తంతో మీ వదిన పట్ల అమానుషంగానే ప్రవర్తించామమ్మా… మాది తప్పే! దానికి ఏ శిక్ష విధించినా అనుభవించ డానికి సిద్ధంగా ఉన్నాం” అన్నది కన్నీళ్ళతో.

”అవునమ్మా అమ్మ చెప్పినట్లు మాకు ఏ శిక్ష విధించినా తక్కువే” అన్నాడు సూర్యనారాయణ.

”సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేద్దామనుకుంటున్నారో అది చెప్పండి ముందు” అని వారిని నిలదీసింది.

”నువ్వు ఇంతగా చెప్పిన తరువాత కూడా ఏం చేయాలో మాకు తెలిసిరాకపోతే ఇక మమ్మల్ని చెప్పుచ్చుకు కొట్టాల్సిందే! చచ్చిన పాముని ఇంకా ఎందుకమ్మా చంపుతావు… మా ప్రవర్తన వల్ల మీ వదినా, ఆమె తల్లిదండ్రులూ ఎంతగా కుమిలిపోయారో… తక్షణం వెళ్ళి వాళ్ళకు క్షమాపణలు చెప్పి మా మనవరాలిని ఎప్పుడెప్పుడు గుండెలకు హత్తుకుందామా అని తహతహలాడిపోతున్నామమ్మా! హైదరాబాదు వెళ్ళగానే నాకోడలినీ, మనవరాలిని సాదరంగా మనింటికి తీసుకువస్తానమ్మా. ఆ తరువాత ఘనంగా బాలసారె ఏర్పాట్లు చేస్తాం. బావగారూ, చెల్లెమ్మా బాలసారె డేట్‌ ఫిక్స్‌ కాగానే మీకు కబురు చేస్తాం. మీరంతా వచ్చి మా చిరంజీవికి మీ ఆశీస్సులు అందచేయాలి ఏమంటారు?” అన్నాడు సూర్యనారాయణ.

”మీరంతగా చెప్పాలా బావగారూ, బాలసారెకు మేమంతా తప్పక వస్తాము శుభం” అన్నాడు రంగనాథం.

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా కాలు

దొరసాని