మావి చిగురు తిన్న కోయిల ‘కుహు కుహు’ రావం, ఫలభారంతో నిండు గర్బిణిలాంటి గున్న మామిడి చెట్లు, తెల్లటి వేపపూతతో సువాసన వెదజల్లుతూ ఠీవిగా ఉన్న వేపవృక్షరాజం, దాహార్తులకు దాహం తీర్చే లేత కొబ్బరి నీరు, మధురాతిమధురమైన చెఱకురసం, చల్లటి తాటి ముంజలు, సంధ్యా సమయంలో వీచే చల్లటి గాలితో గుబాళించే పున్నాగ, జాజి, విరజాజి, మల్లెల సౌరభం చెప్పకనే చెప్తాయి వసంతాగమనం.
వసంత ఋతువులో, చైత్రమాసపు తొలిరోజైన పాడ్యమి తొలి పండుగ ‘ఉగాది’.
‘ఉగస్య ఆది అనేది ఉగాది’ . ఉగ అనగా నక్షత్ర గమనం. జన్మ ఆయుష్షు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు ‘ఉగాది’.
‘ఉగాది’, ‘యుగాది’ లేదా సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర దినం.
ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనబడే ఆయన ద్వయం సంయుతం ‘యుగం’ (సంవత్సరం).
వసంతానికి గల అవినాభావ సంబంధం, సూర్యుని సకల ఋతువులకు, సంబంధం, సూర్యుని సకల ఋఃతువులకు, ప్రాతఃసాయంకాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపం.
భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా సృష్టి జరిగిందని పురైతికంగా చెప్పబడింది.
విలిప్త కాలం నించీ లిప్తకాలం (లిప్తం అనగా కనురెప్పపాటు. విలిప్తం అనగా కనురెప్పపాటుకు ఇంకా ముందు) వరకూ ఋషులు కాలాన్ని గణన పెట్టి సంవత్సరం అనేది అత్యంత ప్రధానమైన ప్రమాణం ఋషులు విధించి ఉన్నారు. సంవత్సరాలు 60. ప్రభవ, విభవతో మొదలిడి ఆదిగా కలవి….
ఉగాది రోజున కొన్ని విధులు ఋషులు నిర్దేశించారు. అందులో మొట్టమొదటిది
- సూర్యోదయానికి పూర్వం తైలాభ్యంగన స్నానం చేయాలి. దీనివలన ఇంద్రియాలకి పటుత్వం కలుగుతుంది.
- నూతన వస్త్రధారణ: వ్రస్తం ఆయుర్దాయానికి కారకమై ఉంటుందని శాస్త్ర వాక్యం. ‘బ్రతికి బట్ట కట్టాడు’ అనే నానుడి ఉండనే ఉంది. మనిషి బ్రతికి ఉంటేనే బట్ట అవసరం.
- పెద్దవారికి నమస్కారం చేసి వారి దీవెనలు తీసుకొనవలెను. వారి దీవెనలు మనకు అంగరక్ష. తదుపరి ఒక కాషాయ వస్త్రంతో ధ్వజారోహణం చేయవలెను. అది ఇంటిమీదకానీ లేదా పూజామందిరం మీద కాని.
- దమనం పత్రితో పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు, ఇష్టదైవానికి పూజ చేయవలెను.
- నింబకుసుమ బక్షణం: వేపపువ్వు, బెల్లం, క్రొత్త చింతపండు, మామిడి ముక్కలు, తేనె లేక చెఱకు రసంతో (వారి వారి ప్రాంతీయ ఆచారాలతో) ప్రసాదం చేసి నివేదన చేయవలెను.
ఈ విధమైన ప్రసాదం చేయటానికి కారణం దేవీ భాగవతంలో వ్యాసమహర్షి “ద్వావృదోయవదం” అనే శ్లోకంలో ఈ విధంగా ఉదహరించారు.
యముని రెండు కోరలలో ఒక కోర వసంత ఋతువులోను, రెండవ కోర శరదృతువునందు ఉద్భవించటం వలన ఆయా ఋతువులలో క్రిమికీటకాలవల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ప్రజలు బాధపడతారు. కావున ఈ ప్రసాదం దానిని నివారిస్తుందని చెప్పబడింది.
ఈ ప్రసాదం గ్రహించునప్పుడు ఈ శ్లోకం తప్పక చెప్పుకోవాలని సూచించటమైనది.
శ్లోకం : యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం
బక్షితం పూర్వయామేతు ప్రదతాతి సుఖం పరం
శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశా నింబకం దళ బక్షణం.
- పంచాంగ శ్రవణం: పంచాంగం అనగా 5 అంగములని అర్థం. తిథి, వారము, కరణము, యోగము, నక్షత్రం.
తిథి : రెండు చంద్రోదయాల మధ్య కాలం. అంటే చంద్రుణ్ణి అనుసరించి ఏర్పాటు చేసుకున్న దినమే తిథి.
అమావాస్య తదుపరి పాడ్యమితో మొదలయి పౌర్ణమివరకూ (శుక్లపక్షమనీ) పౌర్ణమి తదుపరి మరల పాడ్యమితో మొదలయి అమావాస్యవరకూ (కృష్ణపక్షమనీ) అంటారు.
వారం : సూర్యోదయం నించీ మళ్ళీ సూర్యోదయం మధ్య కాలం ఆధారంగా నిర్ణయించబడినవి వారాలు. ఆది, సోమ, మంగళ ఇత్యాది ఏడువారాలు.
నక్షత్రం : చంద్రుని గమనం ఆధారంగా నిర్ణయింపబడినవి నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తికగా గల 27 నక్షత్రాలు.
యోగం : యోగాలు 27. శుభ సమయాలు. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్ మొదలుగా గలవి. ఒక్కో యోగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు. శుభ సమయాలను యోగాలన్నప్పటికీ విష్కంభం, అతిగండం, శూలా మొదలుగా గల యోగాలను శుభమైనవిగా పరిగణించరు.
కరణం : తిథిలో సగం కరణం. రెండు కరణాలు కలిస్తే ఒక తిథి అవుతుంది. కరణాలు మొత్తం 11. కింస్తుఘ్న, భవ, బాలవ, కౌలవ మొదలైనవి. వీటిని శివుని వివిధ రూపాలతో ముడి పెడతారు.
పంచాంగ శ్రవణ ఫలితాన్ని ఋషులు ఈ శ్లోకంలో పొందుపరిచారు.
శ్లోకం : శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్సప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం॥
పంచాంగం వినడంవలన మంచి గుణాలు సిద్ధిస్తాయి. శ్రతు నాశనం జరుగుతుంది. చెడు కలల దోషం తొలగిపోతుంది. గంగాస్నానం అంత విశేష ఫలితం లభిస్తుంది. గోదానం చేస్తే వచ్చే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. ఉత్తమమైనది.
ఈ విధంగా భగవత్కృపకు ఆధారమైన ఉగాదిని నేటికీ ప్రజలు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తమ శక్తి మేరకు రూపుకుంటున్నారు.
శ్లోకం :
యుద్ద్రదవ్య మపూర్వంచ పృథ్వివ్యాం మతిదుర్లభమ్
దేవ భూపార్హ భోగ్యంచ తద్రవ్యం దేవి గుహ్యతామ్॥
అన్నట్లు దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఎంతటి ఎత్తయిన, ఆధునిక, ఆకర్షణీయమైన భవనాలలోనూ, అధిక సాంద్రత కలిగిన నగరం లేదా పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ తప్పక ప్రసాదానికి కావలసిన వేపపువ్వు, మామిడి కాయలను సమకూర్చుకొని, వీలైనంత సాంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు జరుపుకొనటం చాలా సంతోషకరమైన విషయం.
పంచాంగ శ్రవణం దగ్గరలో ఉన్న గుడిలో కాని లేదా తి.తి.దే వారు నిర్వహించే పంచాంగ శ్రవణం వినటం నేటి ఆచారంగా మారింది.
తరుణి పాఠకులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.