ఎవరో వస్తారని

కథ

కట్టెకోల విద్యుల్లత

ఖమ్మం పట్టణంలోని ఒక చిన్న వీధిలో నడుస్తున్న చిన్న ఫ్యాన్సీ దుకాణం రామారావుది. కుటుంబ అవసరాలకు సరిపడినంత సంపాదనతో ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, కొడుకు. ఇదే అతని జీవితం. అదే వీధిలో నివసిస్తున్న 15 సంవత్సరాల అమ్మాయి శర్వాణి. ఆమె తల్లి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. తండ్రి లేడు.

శర్వాణి చిన్న వయసు నుంచే తను పెద్ద నృత్య కళాకారిణి కావాలని కలలు కంటూ ఉండేది. కానీ దాని కోసం నగరానికి పంపించి తర్ఫీదు ఇప్పించే ఆర్థిక స్తోమత తల్లి సునీతది కాదు కనుక, తనే టీవీలో వచ్చే నృత్య కార్యక్రమాలు అన్నీ చూస్తూ, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. కనీసం స్మార్ట్ఫోన్ అయినా కొనివ్వమని అడిగితే చదువు పాడైపోతుందని, తల్లి ససేమిరా అంది .

వారి వీధిలోనే సత్య అనే ఓ ఛోటా రాజకీయ  నాయకుడు నివసిస్తున్నాడు. డిగ్రీ వరకూ చదువుకున్న సత్య, కాలేజీలో ఉండగానే రాజకీయాల పట్ల, ప్రత్యేకించి ఒక పార్టీ సిద్ధాంతాల వైపు ఎక్కువగా ఆకర్షితుడై, అందులో కార్యకర్తగా చేరి, అంచలంచలుగా చిన్న నాయకుడిగా ఎదిగాడు.

ఒకే వీధిలో నివసిస్తున్న వీరెవరికీ నిజానికి ఒకరితో ఒకరికి పరిచయం లేదు. బిజీగా ఉన్న నేటి గజిబిజి గందరగోళ జీవితాల్లో, ఇరుగుపొరుగుతో సంబంధాలు ఎవరికి?

ఓ రోజు సాయంకాలం సన్నగా వర్షం కురుస్తోంది. ఇక కస్టమర్లు ఎవరూ రారు అని నిశ్చయించుకుని రామారావు కొట్టు మూసేసి ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా, పరిగెత్తుకుంటూ వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కుని హడావిడిగా బయటకు వెళ్ళింది శర్వాణి .ఆమె వెళ్లగానే షాప్ మూసేసి తనూ బయలుదేరాడు రామారావు. వర్షం కారణంగా రోడ్లు బురదగా మారడంతో, ఇంటికి వెళుతూ ఉండగా కాలు జారి కింద పడింది శర్వాణి. మడిమ వద్ద బెణకడం వల్ల లేచి నిలబడలేక పోతోంది. అప్పుడే అటుగా వస్తున్న రామారావు ఆమెను లేపి నిలబెట్టాడు. కానీ ఆమె పాదం వద్ద వాపు రావడం చూసి, తిన్నగా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు.

మడిమ దగ్గర నరం మెలిక పడటం వల్ల అలా వాపు వచ్చిందనీ, ఫ్రాక్చర్ ఏమీ కాలేదని, కొన్ని రోజుల పాటు బ్యాండేజ్ తో ఉంటే తగ్గిపోతుందని, పింక్ బాండేజ్ కట్టారు డాక్టర్. ఆమెను ఇంటి వద్ద దింపాడు రామారావు. ఆమె ఏడుస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు. “పర్లేదు లేమ్మా ,చిన్నదే అని చెప్పారు కదా డాక్టర్లు త్వరగానే తగ్గిపోతుంది, బాధపడకు,” చెప్పాడు.

“కాదంకుల్ , రేపు నాకు స్కూల్లో డాన్స్ ప్రోగ్రాం ఉంది. నాట్యం అంటే నాకు ప్రాణం. గురువుగారి దగ్గర నేర్చుకుని, పెద్ద స్టేజీల పైన డాన్స్ చేసే అవకాశం నాకు ఎలాగో లేదు. కనీసం ఇలా స్కూల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనగలిగితే అదే నాకు గొప్ప వరం అని అనుకుంటూ ఉంటాను. అలాంటిది ఇప్పుడు అది కూడా కుదరదు,” తన బాధని చెప్పుకుంది.

“నీ పేరు?” అడిగాడు రామారావు. “శర్వాణి,” చెప్పిందా అమ్మాయి.

“సరస్వతీ దేవి పేరు. చాలా బావుంది తల్లీ. మరి నాట్యం అంటే అంత ఇష్టమైతే, హైదరాబాదో, విజయవాడో, వెళ్లి శిక్షణ తీసుకోవచ్చు కదా?” అడిగాడు అతను.

“నాన్న లేరు. అమ్మ ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందుచేత నేను వేరే సిటీలో ఉండి ట్రైనింగ్ తీసుకునేంత అవకాశం లేదు,” చెప్పింది శర్వాణి.

“ఔనా! అయితే మరి అసలు నీకు నాట్యం గురించి ఏం తెలుసు? అందులో ఏదైనా సాధించగలనని నమ్మకం నీకుందా?” అడిగారు రామారావు ఆ అమ్మాయిని.

“నా మనసు, ధ్యాస ఎప్పుడూ నాట్యం మీదే ఉంటుంది. టీవీలో చూస్తూ నేను సొంతంగా ముద్రలు,జతులు అన్నీ నేర్చుకున్నాను. నాకు తెలుసు, నేను మంచి గురువుగారి దగ్గర నేర్చుకుంటే చాలా మంచి డాన్సర్ అవ్వగలనని,” ఆ మాటలు చెప్పినప్పుడు అమ్మాయి కళ్ళలో మెరుపు రామారావు దృష్టిని దాటిపోలేదు. మౌనంగా బయటికి వెళ్లిపోయాడు అతను.

ఆ తర్వాత నాలుగు రోజుల వరకు అతను మౌనంగా, ముభావంగా ఉండడం చూసి ఏమైందని అడిగింది భార్య. సమాధానం ఇవ్వలేదు అతను.

ఐదవ రోజు శర్వాణిని వాళ్ళ ఇంటి దగ్గర కలిశాడు. “నీకు నేను డబ్బు ఇస్తాను. విజయవాడలో ప్రముఖ గురువు గారితో మాట్లాడాను. ఆయన నీకు నాట్యం నేర్పిస్తానని చెప్పారు. మీ అమ్మా , నువ్వూ ఉండేందుకు ఏర్పాటు చేస్తాను. అక్కడే నాకు తెలిసిన ఒక స్కూల్లో మీ అమ్మకు ఉద్యోగం కూడా మాట్లాడాను. నీకూ, మీ అమ్మకి అభ్యంతరం లేకపోతే, వీలైనంత త్వరలో బయలుదేరి విజయవాడ వెళ్ళండి,” చెప్పాడు రామారావు.

తమకు ఏమాత్రం పరిచయం, సంబంధం లేని ఒక మనిషి ఎందుకు తమ కోసం ఇదంతా చేస్తున్నాడు, అని అనుమానం కలిగింది శర్వాణి తల్లి సునీతకి. “ఈరోజుల్లో సొంత వారే, అడిగినా కూడా సాయం చేయట్లేదు కదా! మరి మీరెందుకు మా అమ్మాయి విషయంలో ఇంత శ్రద్ధ వహిస్తున్నారు? దీని వెనక మీకు ఇంకేదైనా ఆలోచన ఉందా?” అడిగింది ఆవిడ.

“మీ అనుమానం నిజమే, మీరు జీవితంలో చాలా దెబ్బలు తిని ఉంటారు కనుక అనుమానించడంలో తప్పులేదు. నాకు శర్వాణి విషయంలో ఎటువంటి స్వార్థమూ లేదు. ఆమెని చూస్తే, కొన్నేళ్ల కిందట నన్ను నేను చూసుకున్న భావన కలిగింది. నాకు కూడా చదువుకునే వయసులో డాన్స్ నేర్చుకుని సినిమాల్లో నటించాలని చాలా కోరికగా ఉండేది. కానీ మా నాన్న తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నన్ను ప్రోత్సహించలేకపోయారు. అప్పుడు ఆ యవ్వనంలో నా కోరిక తీర్చలేని నాన్న మీద కోపం ఏ విధంగా చూపించాలో తెలియక, అది చదువు మీద చూపించాను. చదువుని నిర్లక్ష్యం చేశాను. దాంతో ఇంటర్ ఫెయిల్ అయ్యాను. ఇదిగో ఇప్పుడు ఇలా ఈ ఫ్యాన్సీ షాప్ నడుపుకుంటున్నాను.  నాలాగా తన జీవితం కాకూడదని, నెరవేరని ఆశలతో నిస్సారమైన జీవితం గడపడం ఎంత దుర్భరమో నాకు తెలుసు కనుక, ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజానికి నేను కూడా ఆర్థికంగా గొప్ప స్థితిలో ఏమీ లేను. కానీ నేను చేయలేని, నాకు సాధ్యపడని విషయం శర్వాణి అయినా సాధిస్తే, ఆమె గెలుపులో నా ఆనందాన్ని వెతుక్కోవాలనే స్వార్థమే తప్ప నాకు మరే ఇతర చెడు ఆలోచనా లేదు,” నిజాయితీగా చెప్పాడు రామారావు.

****************

ఒక వారం తర్వాత తల్లీకూతుర్లు రామారావు షాప్ దగ్గరికి వచ్చారు. తను ఇన్నేళ్లుగా పనిచేసిన స్కూల్ వాళ్ళు తనకు విజయవాడలోని బ్రాంచికి ట్రాన్స్ఫర్ ఇస్తామన్నారని, అందువల్ల తన ఉద్యోగం గురించి దిగులు లేదని, తాము ఉండేందుకు ఇల్లు, శర్వాణి నృత్య పాఠశాలకు దగ్గరలో దొరికితే బాగుంటుందని చెప్పారు వాళ్లు.

అలాగే ఏర్పాటు చేశాడు రామారావు. అయితే ఈ విషయం రామారావు ఇంట్లో తెలిసిన రోజు పెద్ద తుఫాను చెలరేగింది. “తాదూరకంత లేదు, మెడకో డోలు అన్నట్లు,మనమే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్నాం, మనకి ఇప్పుడు ఈ లంపటం అవసరమా?” అని అతని భార్య చాలా గొడవ చేసింది. అతని తల్లిదండ్రులు కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించినా, తను ఆ విషయంలో నిర్ణయం తీసేసుకున్నానని, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తను అదే చేస్తానని, మొండిగా చెప్పాడు రామారావు.

శర్వాణి సునీతలు విజయవాడ చేరారు. అక్కడ ప్రముఖ నాట్య కళాశాల ‘కూచిపూడి నాట్యనిలయం’లో ఆమెకు అడ్మిషన్ దొరికింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. తానే నాట్యం నేర్చుకుంటున్నంతగా సంతోషించాడు రామారావు.

అయితే రామారావు అలా వేరే అమ్మాయి గురించి అంత డబ్బు ఖర్చు పెట్టడం నచ్చని అతని భార్య, ఏదో విధంగా సాధించాలనే సంకల్పంతో, ఇదివరకు లేనివిధంగా చీరలు, నగలు, ఇంకా ఇంట్లోకి వస్తువులు కొంటూ డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెట్టింది. ఏదైనా అడిగితే వీధిలో నిల్చుని, “బయటి వాళ్ల కోసం డబ్బు ఖర్చు పెడతారు, భార్య ఖర్చు పడితే బాధపడతారు,” అంటూ రాద్ధాంతం చేస్తోంది. అప్పటివరకూ ఎంతో పరువుగా బతికిన రామారావుకి తలకొట్టేసినట్లు ఉండేది.

అలా వాళ్ళ ఇంట్లో ఓ రోజు భార్యాభర్తలకు గొడవ జరుగుతుండగా, “ఏం జరిగింది? ఈ మధ్య ఏమిటి తరచుగా మీ ఇంట్లో నుంచి ఇలా గొడవలు వినిపిస్తున్నాయి?” అడిగాడు సత్య.

అతను ఓ రాజకీయ నాయకుడని తెలుసు కనుక రామారావు భార్య తన అక్కసంతా అతనితో వెళ్లగక్కింది. భార్యాపిల్లల కోరికలు తీర్చలేని వాడు ఊరిని ఉద్ధరించడం ఎంతవరకు సబబు? అంటూ ప్రశ్నించింది.

ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సత్యకి. మౌనంగా నిష్క్రమించాడు.

ఆ తరువాత రామారావు షాప్ కి వెళ్లి అతనిని కలిసి విషయం అంతా వివరంగా కనుక్కున్నాడు సత్య. తను ఎందుకు శర్వాణికి సాయం చేశాడో రామారావు చెప్పగా విని, అతడిని అభినందించకుండా ఉండలేకపోయాడు . ఇప్పుడు అతని ఆర్థిక పరిస్థితి ఏమిటో అడిగాడు.

“ ఎప్పుడూ దిగువ మధ్యతరగతి  కుటుంబమే సార్. ఇప్పుడు ఈ అనుకోని ఖర్చు, దానికి తోడు నా భార్య చేస్తున్న ఖర్చు వల్ల పరిస్థితి మరింత దిగజారేలా ఉంది. ఏం చేయాలో తెలియదు. రాబోయే ఐదారు సంవత్సరాల వరకు శర్వాణి నాట్యానికి సంబంధించిన ఖర్చు ఏ ఆటంకం లేకుండా భరించగలిగితే చాలు,” అంటున్న రామారావు పై ఒక సద్భావన కలిగింది సత్యకి.

నేటి స్వార్థపూరిత సమాజంలో అందరూ నేను, నాది అని మాత్రమే ఆలోచిస్తున్న పరిస్థితుల్లో నిస్వార్ధంగా ఇతరుల కోసం తపిస్తున్న రామారావు పై ఒక గౌరవభావం కలిగింది అతనికి. తనకున్న పలుకుబడి ద్వారా రామారావుకి బ్యాంకు లోన్ వచ్చేలా ఏర్పాటు చేసి, అతని బిజినెస్ మరికాస్త పెద్దదయేలా ఏర్పాటు చేశాడు. అలాగే, “ఇప్పుడు వ్యాపారం పెరిగింది కనుక, మీ భార్యని కూడా మీతో పాటు షాపుకు వచ్చి కూర్చోమని చెప్పండి,” అని సలహా ఇచ్చాడు.

వ్యాపారం పెరిగింది, అదేవిధంగా తను షాపులో కూర్చొని ఉంటుంది కనుక రేణుక చేసే అనవసర ఖర్చు తగ్గింది. ధన్యవాదాలు చెప్పాడు రామారావు సత్యకి. “మీరు చేస్తున్న పని ముందు నేను చేసినది చాలా తక్కువ,” వినయంగా చెప్పాడు సత్య.

*************************

కళాశాలలో చేరిన శర్వాణి మొదటి రోజు నుంచీ తన ధ్యేయం మరవకుండా నాట్య సాధన చేసింది. గురువు నేర్పే ప్రతి ఒక్క అంశం అందరికన్నా చాలా త్వరగా నేర్చుకుంటూ, గురువుగారి మన్ననల్ని పొందింది. సాధారణంగా ఏడు సంవత్సరాలు, ఆపైన నేర్చుకోవాల్సిన అంశాలన్నీ తను ఐదు సంవత్సరాల లోపే పూర్తి చేసింది. ఎప్పటికప్పుడు తన ప్రగతిని రామారావుకి ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉండేది. శర్వాణి కళాశాలలో చేరి మూడు సంవత్సరాలైన దగ్గర్నుంచి, వాళ్ళ కళాశాల వివిధ ప్రదేశాల్లో ఇచ్చే నాట్య ప్రదర్శనలో శర్వాణిని భాగస్వామ్యురాలిని చేసి ప్రోత్సహించారు ఆమె గురువు.

ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ, మంచి నర్తకిగా పేరు తెచ్చుకుంటోంది శర్వాణి. ఐదు సంవత్సరాల తర్వాత శర్వాణి తల్లిని, రామారావును పిలిచి అరంగేట్రం చేయిస్తానని, దానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు గురువుగారు.

తన అరంగేట్రం విజయవాడలో కాక ఖమ్మంలోనే చేస్తానని చెప్పింది శర్వాణి. సరేనన్నారు గురువుగారు.

అరంగేట్రం ఖర్చుతో కూడుకున్న పని కనుక ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు రామారావు.

ఈ ఐదు సంవత్సరాల్లో సత్య రాజకీయంగా బాగానే ఎదిగాడు. ఈసారి ఎలక్షన్లో అతనే తమ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని కూడా విన్నాడు రామారావు. అతని సహాయం అడుగుదామా అని అనుకున్నాడు కానీ స్వతహాగా మొహమాటస్తుడు,ఆత్మాభిమానం ఎక్కువ కలవాడు కనుక ఆ పని చేయలేకపోయాడు.

తనే తన పరిధిలో తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాడు రామారావు. తన ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్ అడగడానికి వెళ్ళాడు. నిస్వార్ధంగా ఎవరైనా ఒకరికి మంచి చేయాలని భావిస్తే, విశ్వం తన వంతు సహాయం చేస్తుందన్నట్లుగా రామారావు అక్కడికి వెళ్లిన సమయంలోనే, తమ పార్టీ క్యాడర్ మీటింగ్ కోసం ఆ హాల్లో ఏర్పాటు చేస్తున్న సత్య, రామారావును చూసి ఆప్యాయంగా పలకరించాడు. “మీరేంటి సార్ ఇక్కడ?” అడిగాడు.

విషయం చెప్పాడు రామారావు. “అదేంటి నాతో ఒక మాట చెప్పచ్చు కదా! మన శర్వాణి అరంగేట్రం అంటే ఇది కాదు, మన పట్టణంలోనే పెద్దదైన కళాక్షేత్రం బుక్ చేస్తాను. మాకు ఫ్రీగానే ఇస్తారు లెండి. అలాగే టికెట్స్ అమ్మించే పూచీ నాది. ఇక మిగతా ఏర్పాట్లు మీరు చేసుకోండి,” హామీ ఇచ్చాడు సత్య.

పొంగిపోయాడు రామారావు. ఏర్పాట్లన్నీ చకచకా పూర్తయ్యాయి. అనుకున్న రోజు రానే వచ్చింది. టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. తాను ఖర్చుపెట్టిన దాని కన్నా ఎక్కువగానే డబ్బు తిరిగి వచ్చింది. శర్వాణి నృత్యం ఆరంభమైంది. సత్య మనుషులు ఇస్తున్న టికెట్ కనుక తప్పని మొహమాటంతో తీసుకున్న వారు కూడా ఆమె నాట్యం చూస్తూ తన్మయత్వం పొందారు. పురివిప్పిన మయూరిలా నర్తిస్తున్న ఆమెను చూస్తూ ఆనందభాష్పాలు రామారావు కంట. ఆమె స్థానంలో తన్ను తాను ఊహించుకని పొంగిపోయాడు.

ప్రదర్శన అయిపోయిన తర్వాత రామారావుకి, సత్యకి తన కృతజ్ఞతలు తెలుపుకుంది శర్వాణి. ముఖ్యంగా రామారావు గారు తనని ప్రోత్సహించి ఉండకపోతే తన కళ తనలోనే నిద్రాణమైపోయేదని, జీవితాంతం తను ఆయనకి రుణపడి ఉంటాను అని చెప్పింది ఆమె.

అలాగే తను ఈ ఊర్లోనే నృత్య కళాశాల ఆరంభించి, ఏటా తనలా ఆర్థిక పరిస్థితి బాగాలేక తమలోని కళను చంపేసుకుంటున్న వారికి ఒక నలుగురైదుగురు విద్యార్థులకు ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తానని ప్రకటించింది.

కరతాళ ధ్వనులతో పాటు, ఆరంభించబోయే కళాశాలకు తమ వంతు డొనేషన్లు కూడా ప్రకటించారు కొందరు బడా వ్యాపారవేత్తలు, కళాపిపాసులు.

చివరగా సత్య మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం నేను ఏ రాజకీయ లబ్ధి కోసం చేయలేదు, రామారావు లాంటి మంచి వ్యక్తులు, నిస్వార్ధంగా ఇతరులకు సాయం చేసే వాళ్ళు అరుదుగా ఉంటారు. అటువంటి వారికి నేను ఎంతో కొంత అండగా నిలవాలని భావించినందు వల్లే ఇది చేశాను,” అని చెప్పాడు.

“నిజానికి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూస్తూ ఉండే కన్నా సమాజంలో ప్రతి మనిషీ, తనకు సాధ్యమైనంతలో సాటివారికి సాయం అందిస్తూ ఉంటే, సమిష్టి అభివృద్ధి సాధ్యపడుతుంది, దానికి మా కథే సాక్ష్యం,” అని చెప్పాడు సత్య.

“రామారావు శర్వాణికి సాయం చేశాడు, అతనికి నేను సాయం చేశాను. అప్పుడే నాకు ఇలా అవసరంలో ఉన్నవారికి నాకు సాధ్యమైన సాయం అందించడం అలవాటుగా మారింది. అది నా రాజకీయ ఎదుగుదలకు సాయపడింది. ఇప్పుడు శర్వాణి తనలా నృత్యం నేర్చుకోవాలనుకునే వారికి సాయం చేస్తానని చెప్పింది.ఇలా పరస్పర సహకారం వల్లనే సమాజ శ్రేయస్సు. ఇది ప్రతి ఒక్కరూ ఆచరణలో పెడితే సమ సమాజం, నవ సమాజం ఏర్పడే రోజు ఎంతో దూరంలో లేదు,” తన ప్రసంగం ముగించాడు సత్య.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నవయుగాది

బహురూప చిత్రాలు