నుగాగమ సంధులు-
( వాటి భేదాలు )
తెలుగులో నుగాగమ సంధులు పలు రకాలుగా ఏర్పడుతుంటాయి. వాటిని ఈ భాగంలో చూద్దాం!
సూత్రం1.ఉదంత తద్ధర్మార్థక విశేషణములకు అచ్చు పరమగునప్పుడు నుగాగమగు.
ధాతువు (క్రియ) యొక్క ధర్మమును తెలిపేది తద్థర్మము. ఆ తద్థర్మమునకు చెందిన విశేషణాలను తద్థర్మార్థక విశేషణాలు అంటారు. అలాంటి ఉత్వం చివర కలిగినటువంటి తద్థర్మార్థక విశేషణాలకు అచ్చు పరమైతే న్ ఆదేశంగా వస్తుందని సూత్రార్ధము.
విను, పోవు, చదువు, కొట్టు. వచ్చు, చేసెడు వినెడు, పోయెడు, చదివెడు మొదలైనవి ఉదంత తద్థర్మార్థక విశేషణాలు
చేయు+ అతడు
చేయు+న్+ అతడు -చేయునతడు
వచ్చు+ అప్పుడు- వచ్చునపుడు
విను+ అంత- వినునంత
చేసెడు + అతడు- చేసెడునతడు
పోయెడు+అప్పుడు- పోయెడునప్పుడు
సూత్రం 2:- షష్ఠీ సమాసములందు ఉకార, ఋకారములకు అచ్చు పరమగునప్పుడు నుగాగమగు
షష్టీ తత్పురుష సమాసంలోని ఉకార, ఋకారములకు అచ్చు పరమైనప్పుడు నుగాగమం వస్తుందని సూత్రార్థము.
రాజునాజ్ఞ అన్నప్పుడు రాజు యొక్క ఆజ్ఞ అని షష్టీతత్పురుష సమాసం. ఇలాంటి షష్టీ తత్పురుష సమాసంలో మొదటి పదంలోని ఉత్వమునకు అచ్చు పరమైనది కనుక న్ ఆగమంగా వస్తే
రాజు+న్+ ఆజ్ఞ ….రాజునాజ్ఞ అవుతుంది.
ఇలాగే విధాతృ + ఆనతి.. విధాతృనానతి.
ఇక్కడ మొదటి పదం చివరి ఋకారము ఉంది కాబట్టి దానికి న్ వచ్చి
విధాతృ+న్+ఆనతి… విధాతృనానతి అవుతుంది.
సూత్రం 3:- సమాసములందు ఉదంతములగు స్త్రీసమములకు, పుంపులకు, పరుష సరళములు పరమగునప్పుడు నుగాగమగు.
సమాసంలో ఉదంతములైన స్త్రీసమములకు, అనగా ప్రథమావిభక్తి ఏకవచనం లోపించిన పదములకు, పుంపులకు పరుషములు గానీ సరళములుగానీ పరమైతే నుగాగమం వస్తుందని సూత్రార్ధము.
చిగురు ,తళుకు , కోట ,పేట, నాన్న, తాత, బావ మొదలైనవి స్త్రీసమాలు.
చిగురు+కైదువు
ఇక్కడ చిగురు అనేది స్త్రీసమం. దీనికి క అనే పరుషం పరమవుతుంది కాబట్టి నుగాగమం వస్తే చిగురు+న్+ కయిదువు… అవుతుంది.
తర్వాత ద్రుతకార్యాలు జరిగి
చిగురుంగయిదువు
చిగురుఁగయిదువు
చిగురున్గయిదువు
అనే రూపాయలు ఏర్పడతాయి.
సరళం పరమైతే కూడా నుగాగము వస్తుంది. తళుకు+ గజ్జెలు
తళుకు+ న్+గజ్జెలు
తళుకుం గజ్జెలు
తళుకుఁ గజ్జెలు
తళుకున్గజ్జెలు అనే రూపాలు వస్తాయి.
ఇలాగే పుంప్వాదేశంలో కూడా నుగాగమం వస్తుంది.
సింగము + కొదమ
సింగపు+న్+ కొదమ
సింగపుంగొదమ
సింగపుఁ గొదమ
సింగపున్గొదమ
అనే రూపాలు ఏర్పడతాయి.
సూత్రం 4
ఉదంత స్త్రీసములకు పుంపులకు అదంత గుణవాచకములకు తనము పరమగునప్పుడు నుగాగమం వస్తుంది.
హ్రస్వమైన ఉకారముగల స్త్రీసమ పదాలకు, పుంపులకు మరియు అదంతమైన గుణవాచకములకు తనము అనే పదం పరమైతే నుగాగమం వస్తుందని సూత్రార్థము.
సొగసు +తనము
ఇక్కడ సొగసు అనేది ఉదంత స్త్రీసమం కాబట్టి దాని మీద నుగాగమం వస్తే
సొగసు+న్ +తనము అని వస్తుంది. తరువాత ద్రుతకార్యాలు జరిగి
సొగసుందనము
సొగసుఁదనము
సొగసున్దనము అనే రూపాలు వస్తాయి.
అలాగే
తెల్ల+తనము
తెల్ల+న్+తనము
తెల్లందనము
తెల్లఁదనము
తెల్లన్దనము
అనే రూపాలు ఏర్పడుతాయి.
సశేషం