ఒక గంట సేపట్లో తిరిగి వచ్చింది మహేశ్వరి మహేశ్వరితో పాటు మరో ఇద్దరు మంగా ,భవాని ఇద్దరు వచ్చారు.
తెల్లటి పంచలు చక్కగా ఉతికి ఆరేసినవి తెచ్చి వంటింటి వెనకాల ఉన్న పెద్ద వరండాలో అన్ని పరిచి ఉంచారు ..అక్కడే కట్టెల పొయ్యి కూడా సిద్ధంగా ఉంది.. కట్టెల పొయ్యి చుట్టూ అలికి ముగ్గులు పెట్టి ఉంది… ప్రతిరోజు మనకు భోజనం సిద్ధం కావడానికి అగ్నిహోత్రుడి అనుమతి..ఆశీస్సులు అవసరం… ఆ అగ్నిహోత్రునికి వంట చేసే ముందు నమస్కరించుకోవడం మన విధి… వంట చక్కగా జరిగేలా చూడు స్వామి భోజనం చేసే వారందరికీ ఏ ఇబ్బంది రాకుండా చూడు స్వామి! అని మనసులో నమస్కరించుకోవాలి. ఏ పండగ అయినా ఏ ఫంక్షన్ అయినా ఎక్కువ మంది భోజనాలు చేస్తారు కాబట్టి ఏదైనా పొరపాట్లు జరగవచ్చు అందుకని ముందుగా అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకోవాలి..
నీలాంబరి వచ్చి చక్కిలాల పిండినీ మొత్తం ఒక పెద్ద గిన్నెలో పోయించి అందులో ఆ పిండికి సరిపడా నువ్వులు ఉప్పు వాము వేసి చక్కగా కలిపేసి పెట్టమని చెప్పింది.
తర్వాత చుట్టుపక్కల ఇళ్ల నుండి వచ్చిన ముత్తైదువులు అందరూ కూర్చున్నారు అందరికీ బొట్టు పెట్టి ఒక పరిచిన బట్టలో ముందుగా గౌరీదేవిని చేసి పసుపు కుంకుమలు వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరికీ బొట్టు పెట్టి మొదటి చక్కిలం చేయడం ఆరంభించారు… ఎవరికి వాళ్లు చిన్న గిన్నెలో పిండి తీసుకొని నీళ్లు కలుపుకొని పరిచిన అన్ని బట్టల్లో వరుసగా చేసుకుంటూ వెళుతున్నారు… చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి చక్కని సున్నితమైన మహిళల చేతి నుండి జాలువారుతున్న పిండి తీగలు ఒళ్ళు తిరుగుతూ బట్ట మీద గుండ్రంగా తీర్చిదిద్దబడుతున్నాయి… ఇలా ఒక రెండు గంటల సమయంలో మొత్తం చకిలాలు చుట్టబడ్డాయి…. ఒక ఇద్దరు కూర్చుని కట్టెల పొయ్యి వెలిగించి పెద్ద బాండ్లీ పెట్టి నూనె వేసి ఆరిపోయిన చక్కిలాలను నూనెలో వేసి వేయిస్తున్నారు. ఇలా కాసేపు కూర్చొని నీలాంబరి పనులన్నీ పర్యవేక్షించి లోపలికి వెళ్ళిపోయింది…
సాయంత్రం వరకు చక్కిలాల కార్యక్రమం పూర్తి అయిపోయింది… అన్నిటిని పెద్దపెద్ద ఇత్తడి డబ్బాలలో పేర్చి గట్టిగా మూతలు పెట్టి దొంతుల అర్రలో పెట్టించింది నీలాంబరి.. దొంతుల అర్ర అంటే స్టోరేజ్ రూమ్… ప్రతి ఇంటిలో ఒక పెద్ద గది ఉండేది సామాన్ అంతా అందులోనే నిలువ చేసుకునేవాళ్లు…
“మహీ! రేపు అరిసెల కార్యక్రమం పూర్తి కావాలి. అరిసెల కార్యక్రమం చాలా సున్నితమైన పని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మా అత్తగారి ఉండుంటే చాలా చక్కగా చెప్పేవాళ్లు పరవాలేదులే రేపు మా అమ్మగారు వస్తా అన్నారు తాను ఎలా చేయాలో దగ్గరుండి చూపిస్తారు కాబట్టి దానికోసం ఇలాగే బియ్యం నాన పోసి పెట్టు… మళ్లీ రేపు పిండి దంచాలి.. ఒకవేళ మీకు అలసటగా ఉంటే ఊళ్లో మిల్లు కూడా వచ్చిందట అందులో పట్టించుకోని రా! ఆరోగ్యాలు చూసుకోవడం ముఖ్యం… లక్షణమని మొదటిసారి మాత్రము అన్ని దంచించాను” అని చెప్పింది నీలాంబరి.
” అదేం లేదమ్మా ఇంట్లోనే దంచేద్దాము ఇంకో ఇద్దరినీ ఎక్కువగా తీసుకొని వస్తాను ఇంట్లోనే చేసుకుందామమ్మా అలేఖ్యమ్మ సీమంతం కదా! నాక్కూడా ఉత్సాహంగానే ఉంది ఒకవేళ చేతకాకుంటే చెప్తానమ్మా” అని చెప్పింది మహేశ్వరి.
” సరే అయితే రాత్రి భోజనాలు అయిన తర్వాత ఐదు కిలోల బియ్యం నాన పోసేయ్ తెల్లవారి 6 గంటలకు వచ్చి వాటిని వడగట్టేసి ఆరబెట్టేసి నిన్నటి లాగే పనులు పూర్తి కావాలి” అని చెప్పింది నీలాంబరి.
సాయంత్రం పనులన్నీ చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది మహేశ్వరి.. ఎక్కువ పనులేమీ చేయకున్నా కూడా మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల కొంచెం అలసటగానే అనిపించింది నీలాంబరికి…
” అమ్మా! అన్ని పిండి వంటలు ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు కదా ! ఇవన్నీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు.. బోలెడంత శ్రమ ఎంత పని వాళ్ళతో చేయించిన నువ్వు చేయకుండా ఊరుకోవు మళ్లీ ఫంక్షన్ వరకు నువ్వు అలసిపోతావమ్మా!” అన్నది అలేఖ్య.
” ఏం కాదమ్మా రేపటి వంట ఒక్కటే కొంచెం కష్టతరం మిగతావన్నీ సులభంగానే అయిపోతాయి.. మహేశ్వరి మిగతా ఇద్దరు పనివాళ్ళు కలిసి చేస్తారు… ఇంట్లో చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం ఒక శుభకార్యం అంటే ఇవన్నీ ఇంట్లో తయారు చేస్తుంటే ఆ వాతావరణం అంతా ఎంతో బాగుంటుంది పండగలా అనిపిస్తుంది ..బయట కొనుక్కుంటే ఏముంది ప్లాస్టిక్ పూలలాగే కదా నిజం పూలు ఉన్నట్లు ఉంటాయా!!” అని చెప్పింది నీలాంబరి.
సాయంత్రం ఫోన్ చేసి అలేఖ్య అత్తమామలతో మాట్లాడింది నీలాంబరి సీమంతం ఎలా చేయాలనుకుంటున్నారో వివరించింది.. వారి కుటుంబాన్ని ముందుగానే రమ్మని ఆహ్వానించింది అలాగే భూపతి కూడా వాళ్ళందరితో మాట్లాడారు… అలేఖ్య అత్తగారి తాలూకు బంధువులందరికీ ఆహ్వానం పంపించింది నీలాంబరి.
నీలాంబరి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది శ్రీపతి మరియు అఖిలేశ్వరి ఇద్దరు విషయం తెలుసుకొని సంతోషించి రేపు ఉదయం బయలుదేరుతామని చెప్పారు… నీలాంబరి పుట్టింటి నుండి గోపాలపురం రావడానికి గంట మాత్రమే ప్రయాణం.
అలేఖ్య పొద్దున్నే లేచి ఇంటి వాకిలిలో పెద్దపెద్ద ముగ్గులు వేయ సాగింది చిన్నప్పుడు రోజు తానే పెద్ద ముగ్గు వేసే స్కూలుకు వెళ్ళేది ఎప్పుడైనా తనకి కుదరకపోతే ఆరోజు ఎంతో బాధపడేది అలా అలేఖ్యకు ముగ్గులు అంటే చాలా ఇష్టం… సుధీర్ కూడా అత్తవారింట్లో ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు కాబట్టి అతనికి కూడా ఈ వాతావరణమంతా చాలా అందంగా అనిపిస్తుంది అలేఖ్య ముగ్గులను చూసి రోజూ ముచ్చట పడుతున్నాడు సుధీర్..
” అలేఖ్య! నీకు ఇంత మంచి ముగ్గులు వస్తాయా నాకు తెలియనే తెలియదు అక్కడ అయితే రోజు వంటింట్లో పనులకు నన్నెపురమాయిస్తున్నావు… ఇక్కడైతే నిన్ను కొత్తగా చూస్తున్నాను…” అని అన్నాడు సుధీర్.
” అవును సుదీర్ చిన్నప్పటినుండి నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ ఇలా వేయడం నువ్వు చూడలేదు కదా! అందుకే నీకు కొత్తగా అనిపిస్తుంది పెరిగిందంతా ఈ ఊళ్ళోనే కదా అందుకే పల్లెటూరి వాతావరణం అంతా నాకు అలవాటే.. కొంచెం పట్నవాసం పనులకే కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను. అందులో అమెరికాకు వచ్చాక ఎందుకో ఒంటరితనంగా అనిపించింది ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నా వంట నాకు నచ్చడం లేదు అందుకే నిన్నే వంటింట్లోకి ఎక్కువగా పంపిస్తున్నాను. ఏమీ అనుకోవు కదా!” అన్నది అలేఖ్య.
” చ చ అలా అనుకోవడం ఎందుకు నేను ఎవరి కోసం చేసి పెడుతున్నాను నా భార్యకి రేపు నా పుట్టబోయే బిడ్డకే కదా అంత మాత్రం నేను చేయలేనా? ఊరికే సరదాకి అలా అన్నాను” అని నవ్వాడు సుధీర్.
తెల్లవారుజామున ఇంటి ముందుకి కారు వచ్చి ఆగింది… కార్ డ్రైవర్ డోర్ తీయగానే లోపలి నుండి నీలాంబరి తల్లిదండ్రులు కారు దిగారు…
వారిని చూడగానే చేతులెత్తి నమస్కరించే లాగా ఉన్నారు… వయసు ఎక్కువ కావడం వల్ల కొంచెం బలహీనంగా కనిపించినా కూడా హుందాగా ఉన్నారు ఇద్దరు… శ్రీపతి గారు తెల్లని లాల్చి ధోతి కట్టుకున్నారు… ముఖంలో చక్కని కాంతితో ప్రశాంతంగా ఉన్నారు…
నీలాంబరి తల్లి అఖిలేశ్వరి వంగపండు రంగుచేనేత చీర కట్టుకొని .. కొప్పునిండా కనకాంబరాలు పెట్టుకొని నుదుట కాసంత కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి లాగా కనిపిస్తున్నారు… అప్పటికే వారి కోసం ఎదురుచూస్తున్న నీలాంబరి బయటకు వచ్చింది… తల్లి తండ్రి దగ్గరికి వెళ్లి వాళ్లను చేతితో పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చింది లోపలికి రాగానే వాళ్ళిద్దరి కాళ్లకు నమస్కరించి అలేఖ్యను పిలిచింది… అలేఖ్య చూడగానే అమ్మమ్మ తాత మొహంలో సంతోషం వెళ్లి విరిసింది మనవరాలుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది అఖిలేశ్వరి.
” అలేఖ్య అమ్మమ్మ తాత కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో!” అని చెప్పింది.
“కడుపుతో ఉన్న పిల్లవంగి దండం పెట్టడం ఎందుకమ్మా వద్దులే నేను ఆశీర్వాదం ఇక్కడి నుండే ఇస్తాను అని అలేఖ్య తల మీద చేయి పెట్టింది..”
” ఏం కాదమ్మమ్మా”! అని కాళ్లకు నమస్కారం చేసింది అలేఖ్య.
ఇంట్లో ఉన్న పని వాళ్లు వెళ్లి కారులో ఉన్న సామాను అంతా తెచ్చి లోపలికి పెట్టారు… వారి తోటలోనుండి తెచ్చిన కొబ్బరి బోండాలు అప్పుడే ఎండాకాలం మొదలైనందువల్ల అప్పుడే కాస్తున్న మామిడి కాయలు తోటలోని మల్లెపూలు అన్ని బుట్టలో తెచ్చి లోపల పెట్టారు.
” అబ్బ ఇల్లంతా పూలతో ఘుమఘమలాడుతుంది అమ్మమ్మ” అన్నది అలేఖ్య.
నవ్వుతూ లోపలికి వెళ్లి ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు… నీలాంబరి లోపలికి వెళ్లి తనే స్వయంగా చాయ్ చేసి కప్పుల్లో పోసి తెచ్చి ఇచ్చింది…
అఖిలేశ్వరి ఒకపక్క నీలాంబరిని ఒకపక్క అలేఖ్యని కూర్చోబెట్టుకొని సోఫాలో కూర్చుంది ఇంతలో లోపల నుండి వచ్చిన భూపతి…
” ఎప్పుడొచ్చారు అత్తయ్య మామయ్య.. బాగున్నారా” అని అడిగి కాళ్లకు నమస్కరించారు.
“ఇప్పుడే వచ్చాం నాయనా మీరు బాగున్నారా!” అని అడిగాడు శ్రీపతి.
” అందరం బాగున్నాం మామయ్య మీ అమ్మాయే మీకోసం బెంగపెట్టుకుంది.. అమెరికా నుండి వచ్చినప్పటి నుండి తనకు తీరికలేని పనులు తన చిత్రలేఖనము ఇవన్నీటి గురించి మీకు చెప్పే ఉంటుంది అందుకని రావడానికి కుదరలేదు” అన్నాడు భూపతి.
” అమ్మాయి అంతా చెప్పింది మాకు కూడా వయసు అయిపోయింది కదా ప్రయాణాలు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎలాగూ అలేఖ్య వస్తుంది కదా అప్పుడే వద్దామని అనుకున్నాము” అన్నాడు శ్రీపతి.
సోఫాలో కూర్చున్న అఖిలేశ్వరి నీలాంబరి అలేఖ్యను చూసి ముచ్చటపడ్డాడు భూపతి..
” ముగ్గురు ముచ్చటగా ఉన్నారు మరికొన్ని నెలల్లో మరొకరు వస్తారు మీ సీట్లోకి” అని నవ్వాడు భూపతి.
కాసేపు శ్రీపతి మరియు అఖిలేశ్వరి విశ్రాంతి తీసుకున్న తర్వాత టిఫిన్ చేసి పెరట్లోకి వెళ్ళింది అఖిలేశ్వరి.
అరిసెలకి పాకం ఎలా పట్టాలో చూపించి పాకం అంతా పట్టించి అందులో దంచిన బియ్యం పిండిని పోసేసి పెట్టేసింది… అరిసెలు ఒక్కొక్కటి ఎలా వత్తాలో చూపించి అవి వేగిన తర్వాత వాటిని నూనె పోయేలా ఎలా వత్తాలో చూపించి పైన గసగసాలు చల్లించి కొన్ని అయ్యేవరకు అక్కడే కూర్చుని వారికి నేర్పించింది.
సాయంత్రం వరకు అరిసెల పని కూడా పూర్తయింది…
తెల్లవారి కరియలు చక్రాలు అప్పాలు పనిని పూర్తి చేశారు…
పోచంపల్లి నుండి తెప్పించిన చీరలను ఒక్కటి ఒక్కటిగా చూసి ఎంపిక చేసుకుంది అలేఖ్య చక్కని ఆకుపచ్చని రంగు చీరకి ఎర్రని అంచు చీరంతా జరీబూట ..అంచు మీద హంసలు.. చీరంతా ఎంతో బాగుంది… సుధీర్ చెప్పాడు వారి తరఫున కూడా ఒక చీర తీసుకోమని… ఈసారి ఎర్ర చీరకి ఆకుపచ్చ అంచు ఉన్న చీరను ఎంపిక చేసుకున్నది అలేఖ్య…
నీలాంబరి తనకు తల్లి అఖిలేశ్వరికి మరియు వియంపురాలికి పట్టుచీరలు కొన్నది… వచ్చే బంధువుల కోసం చాలామందికి కాటన్ చీరలు జాకెట్ బట్టలు కొనేసింది…
ఊళ్లో ఉన్న గాజుల రాజయ్యను పిలిపించి ఎన్ని గాజులు కావాలో ఎన్ని సైజులు కావాలో చెప్పింది అన్ని ఆకుపచ్చ ఎరుపు రంగులో మాత్రమే కావాలని చెప్పింది.
ఊళ్లో మేదరి వాళ్లు అల్లే బుట్టలని రకరకాల సైజులు తెప్పించింది ఫలహారాలకి స్వీట్లకి పండ్లకి పూలకి గాజులు వేయడానికి అందరికీ తాంబూలం ఇయడానికి చిన్న బుట్టలు ఇలా అన్ని ఊర్లోనే తీసుకుంది ఊరి వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది కదా అని తన అభిప్రాయం… ఇలా సీమంతం పనులన్నీ జరిగిపోతున్నాయి..
ఇంకా ఉంది