పంతొమ్మిది ,ఇరవై శతాబ్ద మధ్యయుగ కాలంలో మహిళలు కొంతవరకు కొన్ని రంగాల వరకే పరిమితమై ఉండేవాళ్ళు. దీనికి ప్రధాన కారణం చదువు లేకపోవడం. ఇంటి పనికి వంట పనికి అంకితమై ఉండేవాళ్ళు. మధ్యతరగతి, సగటు స్త్రీల విషయం ఇది. కానీ కూలి నాలి చేసుకునే ఆడవాళ్ళ విషయంలోనూ వ్యవసాయదారుల విషయంలోనూ ఆడవాళ్ళ పరిస్థితి ఇంచుమించు అప్పటినుంచి ఇప్పటివరకు ఒకే విధంగా ఉన్నది. క్రమంగా చదువుకోవడం అనేది మొదలుపెట్టిన స్త్రీల కు కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉండేది కాబట్టి ఉద్యోగాలు చేయడానికి బాగానే పోరాటాలు చేయాల్సి వచ్చేది. టీచర్ ఉద్యోగం వంటి వాటికి అభ్యంతరాలు చెప్పే వాళ్ళు కాదు. పాలిటెక్నిక్ ,జర్నలిజం, ఇంజనీరింగ్ వంటి చదువుల దగ్గర ఇంటి వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు తక్కువగా ఉండేది. వాళ్ళు ఉన్న ప్రాంతానికి దూరాలలో కళాశాలలు ఉండంవల్ల చదువుకోడానికి వీలయ్యే పరిస్థితి లేకపోయేది. అమ్మాయిల ను ఒంటరిగా ఇల్లు కిరాయి తీసుకొని పెట్టి చదివించలేక తల్లిదండ్రులు సతమతమైన కాలం ఉండేదపుడు. ఎవరో కొంతమంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేసి చదువుకోవాలనుకునేవాళ్ళు. వ్యయప్రయాసలకు ఓర్చి, ఆర్థిక భారాన్ని భరించే శక్తి అన్ని కుటుంబాలకు ఉండేది కాదు.
స్త్రీలు అబలలు అని బలహీనులని సమాజం ఒక గాటన కట్టి పెట్టే పరిస్థితులు అవి .కానీ, ఇప్పుడు స్త్రీ సబల ,సర్వ స్వతంత్రురాలు.
ఒకప్పుడు పదవ తరగతి ఇంటర్మీడియట్ వంటి చదువులు చదివితేనే గొప్పగా ఉండేది. డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ సర్టిఫికెట్ ని ఫ్రేమ్ కట్టించి, ఇంట్లో గోడకి వేలాడ వేసుకునే వాళ్ళు. ఆడవాళ్లే కాదు పురుషులదీ ముఖ్యంగా ఈ పరిస్థితినే చూసేవాళ్ళం. బాగా చదువుకున్న అమ్మాయికి వరుడు దొరకడం కష్టం అయ్యే రోజులవి తల్లిదండ్రుల ఆలోచన విధానమే వాళ్ళని అలా అణచివేసింది .ఎక్కువ చదువుకుంటే ఎక్కువ చదువుకునే వాడిని తీసుకురావాలంటే కష్టం. ఆర్థికంగా వరకట్నాల ఎక్కువ అడుగుతారని అంచనాలన్నీ అధిగమించిపోతాయని వాళ్ళు భయపడేవాళ్లు.
అయితే కాలం క్రమం గా ఆలోచనలో మార్పులు వచ్చాయి.అబ్బాయిల తల్లిదండ్రుల వైపు నుంచి చూస్తే కొంచెం భిన్నంగా మనకు కనిపిస్తుంది. ఆడపిల్ల అంటే, ఆ వచ్చే కోడలు చదువుకున్నదై ఉండాలి, ఉద్యోగం చేసేది అయి ఉండాలి అని ఆలోచనలు మొదలయ్యాయి. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా…. ఆర్థికంగా ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుంటే కుటుంబాలను బాగా అభివృద్ధి చేసుకుంటారు అనే ఆలోచనలతో చదువుకున్న అమ్మాయిలు కోడలుగా రావాలని కోరుకున్నారు. దీనివల్ల ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడానికి ఒక మెట్టు ఎక్కువ ఎక్కేందుకు అవకాశం కలిగింది. ఆడపిల్లల తల్లి దండ్రులు కూడా డిగ్రీ చదివించడం ,మెల్లి మెల్లిగా ఉద్యోగాలకు కూడా పంపడం చేసారు .ఉద్యోగాలకు పంపే ముందు ఆ కొందరు వేరే విధంగా కూడా ఆలోచించారు. MA,బిఎడ్ చేసిన అమ్మాయిని చేసుకున్నల్టయితే సులభం అవుతుంది అని అనుకున్నారు. కొందరు ఉద్యోగానికి పంపకుండా చదువు చదివించి ఖాళీగా పెట్టేవాళ్ళు. ఇటువంటి సోపానాలన్నీ కూడా ఆడవాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకోకుండానే ప్రవేశించాయి.
కోడలు ఉద్యోగస్తురాలు కావాలనుకున్నరే కానీ కొడుకు ఆమెకు ఇంటి పన్నులో సాయపడాలని అనుకోని తరం ఆ తరం. దీనివల్ల ఇటు ఇంటి పని,అటు ఉద్యోగం రెండు ఆడవాళ్ళపై పడ్డాయి. ఒత్తిడి నుంచి తట్టుకోలేక అసలే పిల్లలు కలగడంతో వచ్చిన శారీరక మానసిక మార్పుల వల్ల కలిగిన అశాంతి కలిగేది.ఇవి అన్ని ఆడవాళ్ళని ఏర్పడని కష్టాల్లోకి నెట్టాయి. వీటి వలన కొందరు ఉద్యోగాలు మానేశారు. కొందరు ఎదిరించారు. దీనివలన రెండు విధాల నష్టపోయింది ఆడవాళ్ళే. కాలం మారుతున్న కొద్ది కుటుంబాలలో ప్రణాళికలు పథకాలు ఆయా ఇళ్లల్లో ఉండే లోటుబాట్లను సర్దుకుంటూ అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేశారు సమర్థవంతులైన ఆడవాళ్లు. ఇలా అన్ని రంగాల్లోకి విస్తరించడం మొదలైన తర్వాత వీళ్ళ చురుకుదనాన్ని వీళ్ళ తెలివిని చూసి తట్టుకోలేని పురుష ప్రపంచం వీళ్ళని అవమానాల పాలు చేయడానికి, గద్దరి తనమనీ, గయ్యాళి అని చెడ్డ వాళ్లని ఇలాంటి పేర్లతో ముందే ఓ ప్రచారం చేసి పెట్టారు.అగ్నిలో ఆజ్యం లా తమకు తెలియకుండానే అత్తగారు, తల్లిగారు తమ వంతు చెడును చేసేసారు. వీటికి తోడు మతాల వలన సంప్రదాయాల వలన ఇంకా శ్రమకు లోనయ్యారు. ఇవన్నీ చేయొచ్చు, అన్నీ భరించి వచ్చు కానీ ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వాల్సినంత విలువ ఇవ్వకపోవడం వల్లనే చిక్కులు వచ్చి ఎదురు తిరగడం ప్రారంభించారు.
క్రమంగా అమ్మాయిలలో సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది. మంచి వయసులోనే ముసలితనంలా ప్రయత్ని ప్రవర్తించాల్సి వస్తోందని, శారీరక మార్పులు వస్తున్నాయని ఇంతా చేస్తే సరైన రెస్పెక్ట్ లేదని అమ్మాయిలనుకునేలా కుటుంబ సమాజాలు తయారయ్యాయి. ఆధునికతను తన సొంతం చేసుకొని ఆర్థికంగా తనంతట తానుగా ఎదిగిన తర్వాత,తనకు ఇంపార్టెన్స్ ఇవ్వకుంటే ఒప్పుకోలేక పోయారు. తన స్వేచ్ఛని అడ్డుకుంటే ఊరుకోకుండా ఎదురుతిరిగడం నేర్చుకున్నారు.ఈ వైవాహిక సంబంధ బాంధవ్యాల్లోని కమిట్మెంట్ తగ్గిపోతున్నది అని గ్రహించలేకపోయే అన్యాయమైన situations create చేసారు. దీనివల్ల ఈ లాస్ ని తట్టుకోలేక ఒకరితో పెళ్లి ఒకరితో ప్రేమ కొనసాగించే శైలి అలవర్చుకుంటున్నారు హై సొసైటీ వారిలో ఇవి ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇదే సగటు కుటుంబాల్లోకి కూడా జొరబడింది. ఇంటి పనిలో పరస్పర సహకారం లేకపోవడం వల్ల ఈ గ్లోబలైజేషన్ మార్పుల వల్ల మానసిక ఒత్తిడి పెరిగాయి.రెడీ మిక్స్ లు తెచ్చుకొని వంటలు చేసుకునే పరిస్థితులకు దారులు వేసిన ఈ సమాజం తనను తాను ప్రశ్నించుకొని సమానత్వం అనే ఉన్నతమైన భావాన్ని తనది చేసుకున్నప్పుడు కుటుంబాలు నిలుస్తాయి, వైవాహిక జీవితాలు సఫలమవుతాయి.
_____*****____