దొరసాని

ధారావాహికం 24 వ భాగం

బయటకు వచ్చి అలేఖ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది… అందరికీ కంచాలు పెట్టి వడ్డన చేసింది మహేశ్వరి…

టమాటా ఆవకాయ, బెండకాయ వేపుడు, పాలకూర పప్పు , పచ్చి పులుసు… ఇంట్లో పెట్టిన వడియాలు వేయించి పెట్టింది.

వడ్డించడం చూస్తూనే..”ఆహా! ఎన్నాళ్లైందమ్మా ఇలాంటి భోజనం తిని ముందుగా ఆవకాయ అన్నం తింటాను” అన్నది అలేఖ్య.

” కారంగా ఉన్నవి మొదట తినకూడదు కడుపులో మంట వేస్తుంది… ముందుగా ఉత్త అన్నంలో నెయ్యి వేసుకుని మొదటి ముద్ద తినాలి తర్వాత నీకు ఏది ఇష్టముంటే అది తిను” అని చెప్పింది నీలాంబరి ..

నీలాంబరి తానే నెయ్యి వేసి మొదటి ముద్ద తినిపించింది..

తర్వాత పప్పు కలిపి ముద్దలు తినిపిస్తుంటే చిన్నపిల్లలా నవ్వుతూ తిన్నది అలేఖ్య..

” లేఖా! కొద్ది రోజుల్లో నీ చేతుల్లో బిడ్డ ఉంటుంది అప్పుడు ఈ పనులన్నీ నువ్వు చేయాలి కదా !నా తల్లి అప్పుడే ఇంత పెద్దదయిందా అనిపిస్తుంది” అన్నాడు భూపతి అలేఖ్యను మురిపంగా చూస్తూ ..

“అవును నాన్న అమ్మ దగ్గరే అన్ని నేర్చుకుంటాను”

” ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లగాడు పుడతాడా! ఎవ్వరు పుట్టినా మాకు సంతోషమే మహాలక్ష్మి లా ఆడపిల్ల పుడితే ఇంకా సంతోషం” అన్నది నీలాంబరి.

” అమెరికాలో ముందే చెప్పేస్తారమ్మ మొన్న మేము టెస్ట్ చేయించుకున్నప్పుడు చెప్పారు” అన్నది అలేఖ్య.

” చెప్పొద్దు చెప్పొద్దు” అన్నది నీలాంబరి.

” ఏం చెప్పద్దమ్మా అంత కంగారు పడుతున్నావు?” అన్నది అలేఖ్య..

” అదే అమెరికాలో ఏ పిల్ల పుడుతుందో చెప్తారు అన్నావు కదా ఇప్పుడే చెప్పొద్దు పుట్టిన తర్వాత చూసుకుంటేనే ఆ ఆనందం వేరు ఎవరు పుడతారో ముందే తెలిస్తే ఆ ఆరాటం ఉండదు ..మీకు తెలిసినా సరే మాకు చెప్పొద్దు” అన్నది నీలాంబరి.

” ఓ అదా సరేలే చెప్పను పుట్టిన తర్వాత నువ్వే చూసి నాకు చెప్పు సరేనా! ” అన్నది అలేఖ్య.

అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనాలు చేశారు…

అలేఖ్య అత్తగారు మామగారు అలేఖ్యను చూడడానికి వస్తామని ఫోన్ చేశారు… వారంలోనే సీమంతం ముహూర్తం ఉంది కాబట్టి అప్పటికే వస్తే రెండు కలిసి వస్తాయి అని సుధీర్ ఫోన్ చేసి చెప్పాడు.. ఒక రెండు రోజులు ముందుగా వస్తే కలిసి ఉన్నట్లు ఉంటుంది అని చెప్పాడు…

ఆరోజు సాయంత్రం నీలాంబరి, అలేఖ్య పెరట్లోకి వెళ్లారు… మువ్వను చూసి ఎంతో సంబరపడిపోయింది అలేఖ్య..

” అమ్మా! ఎంత ముద్దుగా ఉందో కదా భలే మెత్తగా ఉంది “అని దాని దగ్గరికి తీసుకొని దాని తలను ఒడిలో పెట్టుకుంది అలేఖ్య.

” నువ్వు వేరే వ్యాయామాలు ఏమీ చేయనవసరం లేదు చక్కగా రోజు పొద్దున సాయంత్రం మువ్వతో ఆడుకో అందులో గోవుల పరిసరాల్లో మనం ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది శాస్త్రీయంగా కూడా నిరూపణ జరిగింది” అని చెప్పింది నీలాంబరి.

” సరే అమ్మా! నాక్కూడా మువ్వతో ఆడుకోవడం ఇష్టమే ఆవులకు గడ్డి తినిపించడము ఇవన్నీ నాయనమ్మతో కలిసి నేను చేసే దాన్ని.. అప్పుడప్పుడు తైదరొట్టే కూడా తినిపించే వాళ్ళం కదా” అని అన్నది అలేఖ్య.

” అవును నువ్వు స్కూలుకు వెళ్లేటప్పుడు తప్పకుండా దూడలకు ఏదైనా తినిపించి వెళ్లే దానివి వచ్చాక కూడా ముందుగా పశువులపాకకే వెళ్లే దానివి. .. పశువుల మీద అభిమానం ప్రేమ ఉండాలి వాటితో మనం ఎన్నో చేయించుకుంటాము ..మన బిడ్డల్లాగా వాటిని చూడాలి.” అని చెప్పింది నీలాంబరి.

కాసేపు అక్కడ గడిపాక ఇంట్లోకి వచ్చారు నీలాంబరి అలేఖ్య..

రాత్రి భోజనాలయ్యాక సీమంతం ఎలా చేయాలి అనేది ఒక ప్రణాళిక వేసుకున్నారు నీలాంబరి భూపతి.

బంధువులు స్నేహితులు ఊళ్లోవాళ్లు అందరిని పిలిచి అందరి చేత ఆశీర్వాదం ఇప్పించాలని అనుకున్నారు నీలాంబరి భూపతి..

ముందుగా భోజనాలకి ఎంత మంది అవుతారు ఏమేమి తయారు చేయాలి అనేది ఒక లిస్టు తయారు చేసుకున్నారు…

తర్వాత అందరికీ తాంబూలాలు ఏమి ఇవ్వాలి అనేది ఒక లిస్టు చేసుకున్నారు.

సీమంతంకు కావలసిన పిండి పదార్థాల ఏర్పాటును ఎప్పుడు చేయాలి అనేది ఒక లిస్టు తయారు చేసుకున్నారు.

ముఖ్యమైనది అందరికీ నచ్చేది షాపింగ్… సీమంతం చీర, గాజులు ఎక్కడ కొనాలి అని ఆలోచించారు..

” అలేఖ్య! నీకు పోచంపల్లి ఇక్కత్ చీర తెప్పించాలని అనుకుంటున్నాను వాళ్లు కొన్ని చీరలు తీసుకొని ఇక్కడికి వస్తారు అందులో నీకు ఇష్టం ఉన్నది ఎంపిక చేసుకో” అని చెప్పింది నీలాంబరి..

” పోచంపల్లి చీరలా! అవి పెద్దవాళ్ల చీరల్లాగా ఉంటాయి కదమ్మా నాకు బాగుంటుందా” అని అడిగింది అలేఖ్య.

” ఇప్పుడు చేనేత రంగంలో కొత్త కొత్త మార్పులు వచ్చాయమ్మా ఎన్నో రకాలు డిజైన్స్ తో నేస్తున్నారు చాలా చాలా బాగుంటున్నాయి మనము చేనేత వాళ్ళ దగ్గరే కొనాలి ..చేనేతకు చేయూతనివ్వడం మన కర్తవ్యం ..ముందు తరాలకు కూడా ఈ చేనేత సాంప్రదాయాన్ని అందించాలంటే మనము వాళ్లను ప్రోత్సహించాలి అందుకే నేను ఇంట్లో కట్టుకునే చీరలు కూడా వాళ్ల దగ్గరే తీసుకుంటాను.. మగ్గాల మీద నేసే చీరలు ఎంతో అందంగా ఉంటాయి ఆనైపుణ్యం మన దగ్గర ఎన్నో జిల్లాలలో ఉంది నువ్వే చూద్దువు గాని చీరలు ఎలా ఉంటాయో! ” అన్నది నీలాంబరి.

తెల్లవారి సీమంతం కోసం కావాల్సిన ముఖ్యమైన పిండి వంటకం చక్కిలాలు చేద్దామని అనుకున్నారు.. సీమంతంలో వడిలో పెట్టడానికి ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాల తీపి పదార్థములు ఐదు రకముల పండ్లు ఐదు రకముల పువ్వులు పెట్టడం ఆనవాయితీ పిండి వంటల్లో తప్పకుండా ఉండాల్సినవి చక్కిలాలు, అరిసెలు, కరియలు, శనగపిండి చక్రాలు మరియు అప్పాలు… స్వీట్స్ ఐదు రకములు ఏవైనా పెట్టుకోవచ్చు.. పండ్లలో అరటి పండ్లు తప్ప మిగతావి ఏవైనా కూడా పెట్టవచ్చు అందులో విత్తనాలు ఎక్కువ ఉన్న పండ్లు అయితే శ్రేష్టం అని అంటారు దానిమ్మ లాంటివి.

మహేశ్వరితో చెప్పి పదికిలోల బియ్యం నానబోయించింది నీలాంబరి… రాత్రంతా నానిన బియ్యాన్ని తెల్లవారి వడకట్టి కొంచెం ఆరిన తర్వాత రోకన్లతో పోటేసి దంచుతారు…

ఉదయం అందరి అల్పాహారాలు అయిన తర్వాత రోలు రోకండ్లు కుందన సిద్ధం చేసింది మహేశ్వరి బియ్యం దంచడానికి తనకు తోడుగా మరొక ఇద్దరిని పిలుచుకున్నది.

నీలాంబరి స్నానం పూజ అనంతరం రోలు రోకలికి కుంకుమ పసుపు పెట్టి అలంకరించి మరొక ఐదుగురు ముత్తయిదువులను పిలిపించి వారికి పసుపు బొట్టు తాంబూలం ఇచ్చింది అలాగే మహేశ్వరి తో పాటు వచ్చిన వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చి..

” ఇక మొదలు పెడదాం” అని చెప్పింది నీలాంబరి.

” ముందుగా 5 దోసిల్ల బియ్యం రోట్లో పోసి .. అలంకరించిన రోకళ్ళతో అందరూ ఐదేదు సార్లు పోటు వేశారు… తర్వాత మహేశ్వరి మరో ఇద్దరితో కలిసి బియ్యం దంచడం మొదలుపెట్టారు..

” సువ్వి సువ్వి అంటూ చక్కని పాటలు పాడుకుంటూ పిండి దంచుతున్నారు…

అలేఖ్య సుధీర్ వాకిట్లో కుర్చీలు వేసుకుని కూర్చుని అదంతా వీడియో తీసుకుంటున్నారు “ఇలాంటి సాంప్రదాయాలు కనుమరుగైపోతాయేమో” అని అన్నది అలేఖ్య.

” అలా కాకూడదు ఇప్పుడు మీ అమ్మగారు చేసినవి మనం చూస్తున్నాం కదా అలాగే భవిష్యత్తులో మనం కూడా మన పిల్లలకు అన్ని సంప్రదాయంగా చేయాలి. సాంప్రదాయాన్ని కాపాడడం అందరి కర్తవ్యం ఇందులో శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి అందుకనే వీటిని మనము మరిచిపోవద్దు” అని చెప్పాడు సుధీర్.

వీళ్ళ సంభాషణ అంతా వింటున్న నీలాంబరి మనసులో తృప్తి పడింది.

” మన సాంప్రదాయాలని కాపాడాలని తపన వీళ్ళకి కూడా ఉంది నాకు ఇంకా నిశ్చింతనే” అని అనుకున్నది…

పిండంతా నలిగిపోయిన తర్వాత దానిని చక్కగా జల్లించి పెద్దపెద్ద స్టీల్ బేసిన్లలో నింపి పెట్టారు…

” మహీ! మీరు ముగ్గురు వెళ్లి ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకొని రండి రాగానే మనం బాండ్లి పెట్టి చక్కిలాలు చేయడం మొదలు పెడదాం” అని చెప్పింది నీలాంబరి.

” సరేనమ్మా” అన్నారు ముగ్గురు.

” మీరు ముగ్గురు భోజనాలు ఇక్కడే చేసి ఇంటికి కూడా తీసుకెళ్లండి ఇంట్లో ఏమి పనులు పెట్టుకోవద్దు’ అని చెప్పింది నీలాంబరి.

వాళ్లు సరేనంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమెరికాకుక్.

మార్పు దిశగా – The New Generation