ఎడారి కొలను 

ధారావాహికం – 12వ భాగం

(ఇప్పటివరకు : విజయమ్మ గారు జస్టిస్ గ ఉన్న  ఫస్టుక్లాస్స్ మెజిస్ట్రేట్  కోర్ట్ లో ( గృహ హింసనుండి మహిళల రక్షణ చట్టం, (2005) కింద కేస్ ఫైల్ చేయబడింది. ఇన్స్పెక్టర్ రమణమూర్తి గారు మైత్రేయి  కేసు వివరాలు తెలియచేసాడు. మైత్రేయి  తరఫున లాయర్ ఎవరు అని జస్టిస్ అడగగానే, లాయర్  వసుంధర తనా  కేసు వాదించటానికి పర్మిషన్ తీసుకుంది.  మైత్రేయి తరఫున లాయర్ వసుంధర ఇన్ కెమెరా ప్రొసీజర్ కోసం అనుమతి కోరింది. అందువలన ఆమె కేసుని మరుసటి  రోజుకి వాయిదా వేయడం జరిగింది)  

ఆ రోజు సాయంత్రం  విజయమ్మ గారు టేర్రకోట బొమ్మలు అమ్మే కుమ్మరి  కాలనీ వైపు వెళ్లారు.అనుకోకుండా అక్కడ జరిగిన ఒక సంఘటన ఆమెను ఆలోచింపచేసింది. ఒక వైపు చాలా బొమ్మలు ఉండడంతో అక్కడే నిలబడి బొమ్మలు చూస్తున్నది ఆమె. ఇంతలో ఎటువైపు నుండి వచ్చారో ఒక నవవయస్కులయిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు రోడ్డు మీద పడికొట్టు కుంటున్నారు. చూస్తే ఇద్దరికీ జోడి ఉన్నట్టుగా ఉంది. అక్కడే కుమ్మరి పనిచేస్తూ బొమ్మలు అమ్మతారనిపించింది వాళ్ళను చూస్తే విజయమ్మ గారికి. వాళ్ళేదో భాష  అది అరవమో ,హిందీ లోనో అయితే స్పష్టం గ అర్ధం కాలేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ పిల్లాడిని ఈడ్చి తంతున్నది. వాడేమో దాని జుట్టు పట్టుకొని వదలటం లేదు. ఇద్దరు రెండు పోట్లగిత్తల్లాగా కొట్టుకుంటున్నారు.

అలా కొట్టుకోవటం తన ముందే కావటం చేత చూస్తూ ఊరుకోలేక, “అయ్యో ఇదేంటి అకస్మాత్తుగా. పోలీసులని పిలవండి. వాళ్లిద్దరూ అలా కొట్టుకుంటే చస్తారు”’ అంటూ ఫోన్ తీసింది ఆమె.

“అయ్యో! మీరు జరా ఆగండమ్మా ! ఈళ్ళేమి ఇలా సావరు. మమ్మల్నందరిని ఇలా రోజు సంపక పోతే  ఆళ్ళకి పొదెట్టా కూకుద్ది.” అంటూ అక్కడే కూర్చొని సోద్యం చూస్తున్న ముసల్ది పరుగున వచ్చింది.

“అంటే వీళ్ళిలా రోజు కొట్టు కుంటూనే ఉంటారా?”

“ఆవ్ మల్ల “

“మీరు ఈళ్ల కి నచ్చచెప్పరా!”

“ఏటి సెప్పేది. పొద్దుకుంకినాక సూడాల  ఆళ్ళ బాగోతం. ఇద్దరు సుబ్బరంగా తాగి ఒకళ్ల  మీద ఒకళ్ళు పందుల్లా పడి ఏడ బడితే ఆడ  నిద్దర పోతారు. పోద్దునే లేచిన కాడ నుంచి  కలిసి కూలి నాలి సేసుకుంటారు. కాసింత పైసలొచ్చిన రోజున ఇలా నాకంటే నాకేనని  కొట్టుకొని సస్తారు. ఆ పైసలతోనే కదమ్మా మా బతుకులు లాగదీసేది.”

“మీకు నలుగురు చూస్తారేమో నన్న భయం కానీ, పోలీసులు పట్టుకు పోతారన్న భయం గాని   లేదా!”

“మాకెందుకమ్మా భయం. మా జీవితాలిలా రోడ్డమ్మటే గడిచిపోతుంటాయి. ఆ నలుగురు   . మాకేమన్న కూడిస్తారా! గుడ్డిస్తారా! రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళం. పోలీసోళ్ళను సూసి ఎందుకు దడవాలా. మేమేమి దొంగతనం సేయడం లేదే?” అని చెప్పి,”  మీరిలా ఈ బల్ల పైన కూకొండమ్మ ! ఇలాగ పోయి అలాగా వచ్చేస్తా!”అంటూ అప్పటివరకు ఆమెతో మాట్లాడిన ముసల్ది లగేత్తు కుంటూ వాళ్ళిద్దరి మధ్యకెళ్ళింది.

“ఎదవనాయాలా! నీకేం పోయే కాలమొచ్చిందిరా దాన్నలా జుట్టు పట్టు కొని  కొడతుండావు1 ఇడువ్!” అంటూ దగ్గరలో పడున్న కట్టే తీసుకొని ఒక దెబ్బ వేసింది. వాడు “చంపావు కదే ముండ !” అంటూ దాన్ని వదిలేసి పరిగెత్తాడు.

“నీకేం పోయేకాలమొచ్చిందే. బేరాలన్నీ పొతుండై, లెగు!”అంటూ జబ్బ పుచ్చుకొని లాక్కో చ్చింది దాన్ని.

“అది నవ్వుకొంటూ ఆ ముసల్దాని వెంటే బొమ్మల కాడికి వచ్చి, “సెప్పండి అమ్మగారు! ఈ బొమ్మ కావాలా మీకు!”అంటూ ఏమి జరగనట్లు గీరుకు పోయిన  ముంజేతులను ఊదు కొంటూ అడిగింది. ముసుగు తో తలమీద కుండ పెట్టుకొన్న రాజస్థానీ  అమ్మాయి బొమ్మ కొనుక్కొని  ఆమె వెళ్లి పోయింది ఆ క్షణం, కానీ మనసంతా ఆలోచిస్తూనే ఉన్నది.

‘ఈ సమాజం తన కట్టుబాట్లను పట్టించుకునే వారి మీదనే రుద్ది , వారి లో ఇంకా బలహీనులని ఇంకా భయపెట్టేస్తుంది. సమస్య ఒక్కటే. కానీ పరిష్కారం మాత్రం వేరు.ఏది సభ్య సమాజం? ఆ ముసల్ది చెప్పగానే ఆమె  మాటను గౌరవించిన వీళ్లదా? లేక పరువు మర్యాద అంటూ నాలుగుగోడల మధ్యన చేసే అరాచకాలను ఆపలేక భయంతో రెపరెపలాడుతూ,  మనందరి చుట్టూ ఉన్న ఈ సభ్యసమాజమా! దీనికి ఎలాటి పరిష్కారం చూపాలి. సమాజంలో మార్పురావాలి. సరే ! మరి ఎక్కడ్నుంచి రావాలి ఈ మార్పు. నా నుండా? మరి మీ నుండా? ముందుగా ఎవరు మారాలి? సమాజమా  లేక  సమాజమే తయారుచేసుకున్న చట్టమా? ఎన్ని చట్టాలు చేసిన సరయిన తీరులో పరిరక్షించలేకపోతే అర్ధమే లేదు. నిత్యం గృహహింసకు గురవుతున్న అనేక మంది స్త్రీలకు రక్షణ ఎలా కల్పించటం? ఎక్కువమంది ఆర్థికంగా మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కి చెందిన వారి కుటుంబాలలోని ఇలాటి కేసులు చాల వస్తుంటాయి. చట్టం, న్యాయం అంటే సరిపోదుకదా! సామాజిక సంస్కరణ జరగాలి.  అందుకు స్త్రీలే ముందుకు రావాలి, వాళ్ళే  నిరోధించాలి ఇలాటి హింసని. భయం తో ఏమి చెప్పుకోలేని మైత్రేయి లాంటి వారికీ న్యాయం ఎలా జరిపించాలి. తనకు జరిగిన అవమానం, తనకు కలిగే బాధని చెప్పుకోలేక, ప్రతి విషయంలో స్త్రీ లే సర్దుకుపోతుంటే స్త్రీకి స్వేఛ్చ ఉందని ఎలా అనుకోవాలి? సమాజపు సంకెళ్లు బొమ్మలను అమ్ముకునే ఆ పిల్లనేమి చేయలేదు. అది తిరగబడి తన సత్తా చూపించింది. కానీ మైత్రేయి లాంటి అమ్మాయిలు సిగ్గుతో, అవమానంతో ముందుగానే ఈ చట్రంలో ఇరుక్కుని ఈ సామాజిక కట్టుబాట్లకు శాశ్వత ఖైదీలుగా ఉండిపోతున్నారు. వీళ్ళు బయటకు రాగలిగితేనే మార్పు తీసుకురాగలుగుతాము. ఇలాటి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి లోను ఇలాటి సమస్యల పట్ల అవగాహన ఉండాలి.’

‘వేళ్ళు పాదుకొని మహా వృక్షమల్లె తయారయిన ఈ సామాజిక బంధాల నుండి స్త్రీ బయట పడగలిగితే, వారు వారి ఆలోచన ధోరణిలో మార్పు చేసుకోగలిగితే కొంత సామాజిక పరివర్తన తీసుకురావచ్చు. దానికంటే ముందు ప్రతి మహిళా విద్యావంతురాలవ్వాలి. చదువుకున్న అమ్మాయికి స్వతంత్ర భావాలూ, ఆలోచనలు కలుగు తాయేమో నని చదువు కోనీయకుండా చేసే తల్లి తండ్రులు మారాలి! అది ఎప్పటికి జరిగేది? చదువు కున్న అమ్మాయిని కుటుంబం, పరువు, ప్రతిష్ట లాంటి భయాలను మనసులో పెంచి, వారి కాళ్ళకు బంధాలు వేస్తున్నారు. వారు ధరించాల్సిన బట్టలను కూడా నిర్దేశిస్తున్నారు. పాపిట్లో కుంకుమ పెట్టు కోవడం, మంగళసూత్రం ధరించడం లాంటివే ఒక వివాహిత స్త్రీ కి గుర్తులని అంగీకరించి, వివాహం అయింది కాబట్టి, ఇష్టమున్న, లేకపోయిన స్త్రీ తన భర్త యొక్క వైవాహిక హక్కు , అంటే భార్యతోటి సుఖం అనుభవించడం, లాంటివాటిని నిరోధించే హక్కు భార్యగా స్త్రీ కి లేదని చెబుతున్నంతకాలం  చట్ట పరంగ కూడా స్త్రీ కి రక్షణ ఎక్కడ దొరుకుతుంది?’   ఇలాటి ఎడతెగని   మానసిక పోరాటం విజయమ్మ గారి మనసులో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. “చట్టం చేతిలో  తాను  కూడా ఒక విధంగ బందీనే” అన్న భావన ఆమెను వేధిస్తూనే ఉంటుంది

(ఇంకావుంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సరస కవయిత్రి “పవన సందేశము

మనోవేదన