సరస కవయిత్రి “పవన సందేశము

వ్యాసం

సరస కవయిత్రి గా పేరు గాంచిన శ్రీమతి గంటి కృష్ణ వేణమ్మ గారు ” పవన సందేశము “ను రచించారు. పవన సందేశం ప్రణయ సందేశ కావ్యాలలో ప్రథమ గణ్యమైనది. కృష్ణవేణమ్మ గారు ఈ సందేశ కావ్యాన్ని స్వతంత్రంగా రాసారు. గంటి కృష్ణ వేణమ్మ ప్రొద్దుటూరు లో నివసించారు.
“ధరణి విమర్శకాగ్రే /సర బిరుదాంచితుడు కుప్పుస్వామ్యారుడు మ
ద్గురువర్యునెంచుచు నమ
స్కరింతు సంఫుల్ల చిత్త సారసమందున్”
అన్నారు. గురువు గారి ఆశీర్వాద బలం చేత బాల్యం నుండి కవిత్వాన్ని రచించారు. వారు రాసిన జ్ఞాన ప్రసూనాంబికా శతకానికి గాను గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని పొందారు.
కృష్ణ వేణమ్మ గారు గిరిజా కల్యాణం అనే అయిదశ్వాసాల ప్రబంధాన్ని , రాజ రాజేశ్వరీ శతకం, సైరంధ్రి పద్యకావ్యాన్ని, దుర్యోధనుని ఆత్మ గతాన్ని, హంపి శిధిలాలను చూచిన” తలపోత ” లను రచించారు.
వారు రచించిన పవన సందేశం రాధ పవనుని యాచించి కృష్ణునికి ప్రణయ సందేశాన్ని పంపిన వృత్తాంతాన్ని తెలుపుతుంది. “ప్రేమే దైవము,దైవమె / ప్రేమ యనుచు దెల్పుచుంద్రు పెద్దలు ధరలో
ప్రేమకు నీవాదర్శము
కామినులకు రాధికయును గాదెయెంచంగన్” అని రాధా మాధవుల ప్రేమ దివ్యమైనదని పెద్దలు తలచిన భావనను పూజనీయముగా అంగీకరించారు.
కృష్ణుడు మధురలో ఉన్నాడు. రాధ మధుర నుండి వచ్చిన వారి వల్ల అక్కడి వైభవాన్ని గురించి, కృష్ణుని మోహన రూపాన్ని గురించి తెలుసుకుంది.
పవనునితో ఏ విధంగా నైనా కృష్ణుని వేడుకుని తన వద్దకు వచ్చునట్లు కావించమంది.
కవయిత్రి, ఒక స్త్రీ గా మరొక స్త్రీ వేదనా భరితమైన హృదయాన్ని ఆవిష్కరించారు. వారి స్వానుభవాన్నే రాధ మూలకంగా వర్ణించి హరి భక్తి పూర్వకంగా పుణ్యాన్ని, పురుషార్థాన్ని సాధించారు.
తరుగని యా వియోగ జనితానిల దు:ఖ దవానలంబు చే ….
విరహ భరంబు చే వనరి వేసరి యే దరి గాన లేక యీ
వెరవున విరహ వేదన యున్ వలిగాడ్పు దౌత్యమున్
హరికథ యంచు వ్రాసితిని అర్పణ చేసెద త్వత్పదక్షితిన్ -అంటూ ఈ పవన సందేశాన్ని వేంకట రమణుని పాదాలకు అంకితం చేసారు.
కృష్ణవేణమ్మ గారు పవనునికి మధురకు పోయే మార్గ నిర్దేశం కావించ లేదు. రాధ బృందావనాన్ని విడిచి ఎచ్చటకు పోని ముగ్ధ కాబట్టి కవయిత్రి దానిని పరిహరించి ఉండవచ్చు.
మధురా నగర వైభవాన్ని ఇతరుల వల్ల విన్నది కాబట్టి అక్కడి సౌధాలను గురించి పూదోటలను గురించి అతి లోక సౌందర్యవతులైన స్త్రీలను గురించి పవనునికి వర్ణంచి చెప్పింది.
అలకా పురాన్ని తలపించే మధురలో కృష్ణుడు ఎక్కడ ఉన్నడో పవనుడే కనుగొనాలని రాధ అభ్యర్థించింది
కృష్ణుని ఆన వాళ్ళను
“నల్ల నైన వాడు, నగుమోము గలవాడు, …..
వెడద యురము వాడు కడు దీర్ఘ బాహుండు,
కుటిల కుంతలుండు కోమలుండు …ఇత్యాదిగా నాల్గు కంద పద్యాలలో కృష్ణ వేణమ్మ గారు రాధతో మనోహరంగా పలికించారు. లలిత పదాలతో కూడిన వర్ణన మహా కవుల సాదృశ్యం గా ఒప్పారింది.
రాధ తాను పంపిన సందేశాన్ని వినినప్పుడు కృష్ణుని మదిలో కలిగిన హావ భావాలను ఆతని మోమును చూసి గుర్తించమంది. ఎందుకంటే ముఖం మనసుకు అద్దం కదా!
హృదయ గత భావములు వెల్వరించి చూప
వదన బింబమె అద్దము వంటిదౌను,
గాన నీ మాట లాలింప గలిగినపుడు
అతనిముఖ వైఖరుల గాంచి అరయుమయ్య …అని అరమరికలు లేక పవనునితో సంభాషించింది.

కృష్ణుడు అలసి ఉన్నట్లయితే చల్లగా ఆతని మేను సోకి సేద దీర్చి చెప్పమంది.
ప్రభువు లెప్పు డెట్లు బరగుదురో వారి
మనసు దెలిసి మనము మన వలయు
అని సమయానుకూలముగా విసిగించక తన సందేశాన్ని వినిపించ మంది.
సందేశ హరునితో చక్కని కానుకను కూడా పంపి మనసును రంజింప చేయ దలచింది. తానున్న స్థితి కృష్ణునికి తెలిసేటట్లుగా హిమ కణ పూరితమైన కమలాన్ని తీసుకుని పోయి ఆతని పాదాల వద్ద ఉంచ మంది. కృష్ణుని వీడి ఉన్న రాధ
“వాడి వత్తులుగా నేలబడిన యట్టి
మాలతీ లత గొని చని మాధవునకు
పాదముల జుట్టి కోమల వల్లి రాధ
నిన్ను గానక ఇట్టులే యున్నదనుము .-అని దూతకు చెప్పిన మాటలలో ప్రార్థన తో బాటు వేదనను తెలియ జేసింది. ప్రియుని తలచి తలచి పెంచుకున్న చనువుతో తనను నిరాదరించిన ఆతని పై కినుకను కూడ ప్రకటించింది.

ముందుగా సందేశాన్ని కొని పోయే దూతకు తగిన ప్రవర్తనా పద్ధతులను విశదీకరించింది. భావోద్వేగం లో పలు పలు విధాల విరహార్తిని వినిపించింది. తన నాతుడు వంచించాడని పలవరించింది.
ఊహలలో మందార మాలతీ మంజుల మాధవీ
పొదల చాటున ప్రొద్దు పుచ్చు నాడు,
బృందావనాటవీ సుందర తరు లతా
మందిరమ్ముల కూర్మి మసలు నాడు,
యమునా నదీ తీర కమనీయ సైకత స్థలుల కేళీ లీల తరలు నాడు . ఇత్యాది గా మధుర సం యోగ సమయాలను తలచి ఆ వియోగ దు:ఖానికి వగచింది.
కలలోనైనా ప్రియుని చూద్దామని ఆశ పడితే కంటికి నిద్దుర రావటం లేదు. తాను పల్లె సీమలో పుట్టింది. కల్లా కపటం లేని ప్రణయ విరహాన్ని వివరించింది. తల్లీ తండ్రీ, ప్రియుడు, సర్వస్వం శ్రీ కృష్ణుడని తలచింది, బాధ వలన కలిగిన కోపంతో శ్రీ కృష్ణుని దూషించింది. తరువాత పాశ్చాత్తాప పడింది.
చనువుగ నీపై గల
ఘన మోహంబుననొ కన్ను గానక నిను నే
ననిన విరసోక్తులెదనెం
చి నను క్షంతవ్య నేమి చేసెదొ సామీ
అని నొచ్చుకుంది. తన అవివేకాన్ని, అల్పత్వాన్ని, మన్నించమంది
ఈ కావ్యం లో నూట ముప్పై మూడు పద్యా లున్నాయి. వాటిలో దాదాపు ఎనభై పద్యాల వరకు సుదీర్ఘ సందేశం ఉంది.
రచయిత్రి రాధ సందేశం లో ఆమె ముగ్ధ ప్రణయాన్ని క్రమంగా పరిపక్వమైన భక్తిలో తాదాత్మ్యం కావించారు. . ఆమెకు దక్షిణ నాయకుడైన కృష్ణుని పై కలిగిన ఈర్ష్య కృష్ణ తత్వం తెలిసిన పార లౌకిక భక్తి లో ఉన్మీలితం అయింది. కృష్ణుడు తన వాడు అనుకుని అహంకరించిన రాధకు అతడు సర్వాంతర్యామి అని తెలిసి వచ్చింది. అతని పాదాబ్జ సేవనం లోనే తృప్తి పడ దలచింది. అతడు తన వద్దకు రాకుంటే అతడి పాద రేణువునైన తీసుకుని రమ్మని పవనుని కి విన్నవించింది. ఆ ధూళిని శిరమున దాల్చి ధన్యతను పొందాలను కుంది.
నిగమాగమ సంచారా
అగణిత దివ్య స్వరూప !యభివేశ నినున్
మగువను తెలియ గలనా
స్రగలంకృత కంధర రతిరాజ మనోజ్ఞా !
కృష్ణ వేణమ్మ గారు తమ ముందు మాటలో బుధ జనులకు, “తన కవిత నడక నేర్వనిదని, పలుకుల యెడ నేర్పు లేదని, రీతుల నెరుగదని సుంతేని అడుగిడ నేరని చిన్నదని ” తెలిపారు.అలా వినయం లోనే కావ్య రచనకు కావలసిని శైలీ భాషా విషయాది విజ్ఞతను ప్రకటించారు.
కృష్ణ వేణమ్మ గారు అణకువ లోనే పద్య రచనలోని మెలకువలను ప్రదర్శించారు. రాధ హృదయ పరి పక్వతలో తమ కావ్య గౌరవ ప్రతిభను నిరూపించుకున్నారు.

ఉర్విని ధనమున్నప్పుడు
గర్వంబున లెక్క సేయ గలరే మూర్ఖుల్
సర్వము బోయిన వెనుకనె
గర్వముడిగి లెక్క సేయు కాసేపదిగా…అంటూ సందేశ కల్పనలో మానవ స్వభావ వైఖరిని వివరించారు.
86 ఏండ్ల జీవన యశస్సును పొందిన గంటి కృష్ణవేణమ్మ గారి తల్లి శ్రీమతి కర్రా సుబ్బ లక్ష్మమ్మ గారు రచించిన చంద్ర కళా విలాసము కావ్యం విద్వాన్ పరీక్షకు పాఠ్య గ్రంథం గా అర్హతను పొందింది. …..రాజేశ్వరి దివాకర్ల
(ఆధారం -తెలుగు సందేశ కావ్య సమాలోచనం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కుంకుమ బరిణ –

ఎడారి కొలను