మన మహిళామణులు

అక్షర యాన్ లో కీలకపాత్ర పోషిస్తున్న నిగర్వి డాక్టర్ సమ్మెట విజయగారు…

అధ్యాపకురాలిగా రచయిత్రి గా ఆమె చిరపరిచితులు.

ఓ జలప్రవాహంలా సాగిన ఆమె రచనను చదవండి.

నా పేరు డాక్టర్ సమ్మెట విజయ. చిన్నతనం నుంచి చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు . నేను పుట్టింది నవంబర్ 16, 1964 హైదరాబాద్ లో . మా కుటుంబంలో నేను నాలుగవ సంతానం. మా కుటుంబంలో నాతోపాటు ఇద్దరక్కలు ఒక అన్నయ్య ఒక చెల్లి . నాన్న ప్రభుత్వ ఉద్యోగి అమ్మ గృహిణి. ఇల్లంతా ఎప్పుడూ సందడిగానే ఉండేది.
నాలో సాహితీ బీజాలు నాటిన తొలిగురువు మా అమ్మే . ఉద్యోగ రీత్యా నాన్న ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవ్వడం మేము వేరేవేరే ఊర్లు మారడమూ అక్కడ పెరగడం జరుగుతుండేది.


ఈ క్రమంలో నిజామాబాద్, పోచంపాడు ( నేడది శ్రీరాం సాగర్) , కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల , మహబూబ్ నగర్, హైదరాబాద్ , ఆదిలాబాద్ వరకూ చదువు రకరకాలుగా విస్తరించింది.పది వరకు తెలుగుమీడియం , ఇంటర్ ఇంగ్లీష్ మీడియం తిరిగి డిగ్రీ తెలుగు మీడియం ఇలా రకరకాల మాధ్యమాలు ..డిగ్రీ అవగానే బి.యిడి మహబూబ్ నగర్ లో తిరిగి ఆదిలాబాదులో అటు ఉపాధ్యాయురాలిగాను ఇటు ఆల్ ఇండియా రేడియోలో కాజువల్ అనౌన్సర్ గాను పగలు సాయంకాలాలు ఉద్యోగం కొనసాగించాను. చదువుకు ఖాళీ ఏర్పడిందని పిజి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ లో ఓపెన్ యూనివర్శిటీ ద్వారా ప్రతి రెండవ శని , ఆది వారాలు స్టేట్ గవర్నమెంట్ లో లేబర్ ఆఫీసర్ గా చేస్తున్న నాన్న ఇంకెందుకమ్మా చదువు అనకుండా నాతో పాటు కాచిగూడ కాలేజికి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు సంవత్సరమంతా తోడు వచ్చారు . హైదరాబాద్ లో పెద్దక్క దేవకి దేవి ఉండేది ..అక్కని చూడటం చదవటం రెండూ ఆనందాలైతే నాన్నతో ప్రయాణం . మరో ఆనందం . ఆడుతూ పాడుతూ పిజి డిప్లొమా పూర్తయింది..ఆదిలాబాద్ లో సెంట్ జోసఫ్ కాన్వెంటు స్కూల్ నాకు ఉపాధ్యాయురాలిగా చక్కని అనుభవాలను అందించింది . అన్నీ తెలుసుకోవాలనే తపన నన్ను నిత్య విద్యార్థిగా మార్చింది. అక్కడ సీనియర్ ఉపాధ్యాయులు, నన్స్ నాకు ఎన్నో నేర్పించారు.
సోదరుడు సమ్మెట నాగమల్లీశ్వరరావు. శ్రీశ్రీ పుస్తకాలు, కొడవటిగంటి , తిలక్ , రవీంద్రనాథ్ ఠాకూర్, కృష్ణశాస్త్రి ..ఇలా రచయితల పరంగా వారి పుస్తకాలు బొత్తిగా తెచ్చుకుని చదివి వారిపట్ల ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవడం, నచ్చిన పుస్తకం గురించి రాసుకోవడం ..ఇది నాకు కొత్తప్రపంచాన్ని చూపించింది.
అప్పుడే ఆదిలాబాద్ లో లోకల్ రేడియో స్టేషన్ ప్రారంభమైంది. అక్కడ కాజువల్ అనౌన్సర్ గా పనిచేస్తూ పగలు పాఠశాలలో బోధన సాయంకాలం రేడియో స్టేషన్ లో రకరకాల కార్యక్రమాలలో పాల్గొన్నాను . కథలు , వ్యాసాలు , నాటికలు , జానపదగేయాలు వంటి కార్యక్రమాలలో పాల్గొన్నాను.
మరో పక్క ప్రభుత్వ ఉద్యోగం కడెం , జిల్లాపరిషత్ పాఠశాలలో , సింగరేణి కాలరీస్ పాఠశాలలో ఒకేసారి రావడం అదే సమయానికి హైదరాబాద్ నుంచి పెళ్ళి సంబంధం ఒకేసారి వచ్చాయి.. చివరికి ఎన్నో అవకాశాలున్న హైదరాబాద్ కి వివాహం చేసుకుని వచ్చేసాను. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ ..హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ పాఠశాలలో( తక్షశిల పబ్లిక్ స్కూల్) తెలుగు ఉపాధ్యాయురాలిగా జీవనం కొనసాగించాను.
ఆకాశవాణి అనుభవంతో హైదరాబాద్ యువవాణి లో పాల్గొని దూరాభారం వల్ల మానేసాను. అప్పటికే ఎం.ఏ తెలుగు రెండవ సంవత్సరం కడుపుతో ఉండి పరీక్షలు రాసాను . బాబు పుట్టాక కొంత కాలం ఆగిన చదువు ఉద్యోగం చేస్తూ తిరిగి ఒకటిన్నర యేళ్ల తర్వాత ఎం.ఫిల్ ప్రవేశ పరీక్ష రాయడంతో మలుపు తిరిగింది. పరీక్షలో మెరిట్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీట్ రావడంతో చేరేందుకు అప్పటి నా పరిస్థితులు వేరు . ఒక పక్క ఉద్యోగం వదులుకోవాలి .రెండవది చిన్నబాబు..మూడవది అత్తగారింట్లో చదువు కొనసాగింపు. నా అదృష్టం నేను పని చేస్తున్న పాఠశాల వారు నాకు పర్మిషన్ ఇస్తూ తిరిగి అదే పాఠశాలలో పనిచేసే అవకాశం ఇస్తాననడం .. భర్త శ్రీ గజ్జల శ్రీనివాస్ , మామగారు శ్రీ గజ్జల రాధాకృష్ణ గారు నాకు అండగా నిలబడి సహకరించడం ..వీటితో నేను ఎం.ఫిల్ లో చేరగలిగాను.
జీవితంలో మధురమైన అనుభూతి సెంట్రల్ యూనివర్శిటీలో ఎం ఫిల్ ద్వారా కలిగింది. మొత్తం 13 మంది విద్యార్థులం . డా. జి.వి . సుబ్రహ్మణ్యం గారు తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ .డా.శరత్ జ్యోత్స్నాదేవి గారు నాకు సూపర్ వైజర్.నేను ఆమె తొలి విద్యార్థిని. డా. రవ్వా శ్రీహరి, డా. సి.ఆనందారామం, డా.భీమయ్య గార్లు గురువులు. వారి పాఠాలు వేదాలు. ముఖ్యంగా ఆచార్య డా. జి.వి. సుబ్రహ్మణ్యం గారి బోధన జన్మలో మరిచిపోలేను. 216 U బస్ లో చిన్నబ్రీఫ్ కేస్ చేత్తో పట్టుకుని వారి రాక, పాఠం చెప్పే విధానం , చెప్పే విధానంలో స్పష్టత నాలో నిండైన ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అబ్బూరి ఛాయాదేవి కథల మీద నా సిద్ధాంతాన్ని తయారుచేయడానికి భూమిక సోదరుడు సమ్మెట నాగమల్లీశ్వర రావు ( ఇరువురము అదే యూనివర్సిటీ లో చదివాం -తెలంగాణ సాయుధపోరాట కథలపై తన పరిశోధన)సూపర్ వైజర్ గా ఆచార్య డా.శరత్ జ్యోత్స్నాదేవి సహకారం అన్నింటికీ మించి స్వయంగా నన్ను బైక్ పై పదే పదే శరత్ జ్యోత్స్న గారింటికి దింపుతూ వెన్నంటి నిలబడింది మా శ్రీవారే.
1993 లో ఎం.ఫిల్ పూర్తి చేసిన నేను చిన్న బాబుతో 3 బస్సులు ఎక్కి తిరిగి ఇంటి పనులు వీటన్నిటితో చాలా అలసిపోయాను. ఇక కొన్నాళ్ళు చదువు పక్కన పెట్టాలనిపించేంత అలసట ..1994 లో అమ్మాయి పుట్టడం మా కుటుంబంలో కొండంత బలంగా ఉన్న మామగారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం చిన్న వయసులో ఉన్న నామీద, మా వారిమీద కుటుంబబాధ్యతలు పడడం ఇవ్వన్ని కాలం ఊపిరితీసుకోకుండా ముందుకు కదిలించాయి..మనసులో ఎం. ఫిల్ తో అసంపూర్ణంగా నిలిచిన చదువు తొలుస్తూంది..1997 లో నేను కోరుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రైల్వే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నన్ను వరించింది. అదీ సికింద్రాబాద్ లోనే..కొత్త ఉద్యోగం .. పిల్లలపెంపకం కాస్త కొలిక్కి వచ్చాక 2000 లో స్కూల్ లో ఉద్యోగం చేస్తూ ఎం.ఇడి కి డిస్టెన్స్ మోడ్ లో అప్లై చేసాను. వేసవి సెలవులలో తరగతులకు వెళ్ళి పరీక్షలు రాసి డిస్ట్ంక్షన్ లో పాసయ్యాను. సెంట్రల్ యూనివర్శిటీ కి 3 బస్సుల్లో వెళ్లే శ్రమ కాకుండా 2 కి.మీ దూరంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లో సీట్ వస్తే నే పి.హెచ్ డి చేయాలని నిర్ణయించుకున్నా. ఫలితంగా 2001 లో డా.ఎల్లూరి శివారెడ్డి గారు పర్యవేక్షకులుగా నాకు సీట్ వచ్చింది.. నాటకరంగం 1991 నుంచి 2000 వరకు వచ్చిన నాటకాలపై పరిశోధన . ఈ పరిశోధన నాకు చాలా అనుభవాలను మిగిల్చింది. డా.ఎల్లూరి శివారెడ్డి గారు డా. పి.వి . రమణ గారిని కలవమన్నారు..పి.వి.రమణ గారితో నా పరిచయం తదనంతర సమావేశాలు నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయి. వారు గండవరం సుబ్బరామిరెడ్డిగారిని పరిచయం చేసారు తెలుగు యూనివర్సిటీలో.. సుబ్బరామిరెడ్డి గారు సాక్షాత్తూ నాటకరంగ విజ్ఞాన సర్వస్వమే..వారిని ఆ తరువాత ఎన్ని సార్లు కలిసానో లెక్కలేదు. సుబ్బరామిరెడ్డి గారి దగ్గర పుస్తకాలు తీసుకుని చదివి నోట్సు రాసుకుని పలువురిని కలిసి ఇంటర్వ్యూలు చేసి నేను పరిశోధన చేసాను. డా.ఎల్లూరి శివారెడ్డి గారి పర్యవేక్షణ లో నా పరిశోధన అందరి ప్రశంసలకు పాత్రమయింది.
ఒకప్పుడు డాక్టర్ కావాలని బైపిసితో చదువు కొనసాగించిన నేను తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసాను. నాకు లభించిన మరో అదృష్టం నా పి.హెచ్ డి . అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కాన్వకేషన్..ముఖ్యఅతిథి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ గారు , వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గార్ల సమక్షంలో డాక్టరేట్ తీసుకోవడం. నా జన్మలో మరిచిపోలేని రోజు..కలామ్ గారి ప్రసంగం నాలుగడుగుల దూరంలో వినడం . ఒక ఆత్మవిశ్వాసం పట్టుదల ఆ రోజునుంచే అలవరుచుకున్నాను ఆయన మాటలను ఆదర్శంగా తీసుకుని.
1984 లో మంచిర్యాల డిగ్రీ కళాశాలలో టాపర్ గా గోల్డ్ మెడల్ సాధించాను. వెంటనే మంచిర్యాల పబ్లిక్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా చేరాను . బి.యిడి సీటు మహబూబ్ నగర్‌లో రావడంతో అది డిస్టింక్షన్ లో పాసయి ఆదిలాబాద్ సెంట్ జోసఫ్స్ పాఠశాలలో పనిచేసాను. 1989 లో వివాహానంతరం హైదరాబాద్ కు వచ్చి తక్షశిల పబ్లిక్ స్కూల్ ( CBSC ) లో పది సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేసాను. 1997 లో రైల్వే బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయనిగా చేరి 2007 లో రైల్వే మిశ్రమోన్నత పాఠశాలలో బదిలీపై వచ్చి ప్రస్తుతం అదే పదవిలో తెలుగు బోధన చేస్తున్నాను.
వివాహం 1989లో జరిగింది . భర్త గజ్జెల శ్రీనివాస్, ప్రైవేట్ గా రబ్బర్ కంపెనీలో మార్కెటింగ్ మానేజర్ గా చేసి పదవీవిరమణ చేసారు. ఇద్దరు పిల్లలు కొడుకు మనీష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కోడలు శ్రీనిజ డాక్టరు ఆస్ట్రేలియా లోని సిడ్నీలో. కూతురు లాస్య , అల్లుడు సందీప్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హైదరాబాద్ లో . వీరికొక కొడుకు వియాన్ ఆర్యవ్.
నాకు పుస్తకాలు చదవడం , సాహితీ సంబంధమైనా ఏ అంశమైనా ఎంత ఇష్టమో, సంగీతం కూడా అంతే ఇష్టం . బయట ప్రదేశాలు తిరగడం నాకు మా శ్రీవారికీ ఇష్టం కానీ భవభవ బంధాలతో అది సాధ్యంకాదు ..అతి కష్టం మీద ఒక నెల రోజులు అబ్బాయి దగ్గరికి ఆస్ట్రేలియా లోని సిడ్నీ కి వెళ్ళి వచ్చాము.

పి హెచ్ డి అయ్యాక ఆ పుస్తకం “తెలుగులో నాటక రచన 1991-2000 “ అభినయ జాతీయ నాటక రంగ సంస్థ అభినయ శ్రీనివాస్ గారి నిర్వహణలో డా . సి . నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.
“భావనాంజలి” కవితా సంపుటి బిక్కికృష్ణ గారి నిర్వహణలో ఆవిష్కరించబడింది.
ఇంటర్మీడియెట్ నుంచి నేను సమ్మెట విజయ సౌజన్య పేరుతో రాసిన వ్యాసాలు దాదాపు 40 కి పైగా ఆంధ్రజ్యోతి , ఆంధ్రప్రభ, వనిత , ఆంధ్రపత్రికలలో ప్రచురితమయ్యాయి. పరిశోధనా వ్యాసాలు అనేకం రాసాను. పత్రసమర్పణలు ఉస్మానియా , తెలుగు, ఆదికవి నన్నయ్య, ద్రవిడ విశ్వవిద్యాలయాలలో సమర్పించాను.
ఆ రచనలు ఒక వ్యాస సంకలనంగా తేవాలన్నది కోరిక . కానీ పుస్తక ప్రచురణ కోసం వెచ్చించలేక పక్కన పెట్టాను. ఇంతకు పూర్వం రాసి సిద్ధంగా ఉన్న తెరవెనుక ఆవిష్కరణ కు సిద్దంగా ఉంది .
“అనుటెక్స్ శ్రీ రామకృష్ణారావు గారి జీవిత చరిత్ర” నేను రచించినటువంటి జీవిత చరిత్ర ప్రముఖ వ్యాపారవేత్త అయిన అనుటెక్స్ అధినేత శ్రీ రామకృష్ణారావు గారి జీవితం గురించి రచించినటువంటి రచన.
కవయిత్రిగా కవితలు విరివిగా రాసాను . అనేక కవిసమ్మేళనాలలో పాల్గొన్నాను. హైదరాబాదుతో పాటు యానాం లోను ఖమ్మం లోనూ బహుమతులు అందుకున్నాను. నేను పనిచేస్తున్న రైల్వే మిశ్రమోన్నత పాఠశాలలో కవితలపరంపర కొనసాగుతూనే ఉంది.
అబ్బూరి ఛాయాదేవి గారి కథల మీద ఎం. ఫిల్ చేసిన నేను కథలు చదవడం రాయడం అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమి వారి బహుమతికి ఎంపికైంది. వివిధ కథా సంకలనాలలో నా కథలున్నాయి.
వ్యాసరచయిత్రిగా భూమిక నుంచి బహుమతులు గెలుచుకున్నాను. సంచిక లో నవతెలంగాణ లో వ్యాసాలు పుస్తక సమీక్షలు వచ్చాయి. డా.ప్రభాకర్ జైని రచించిన హీరో నవలపై నేను రచించిన సమీక్షకు ప్రత్యేక బహుమతికి ఎంపికైంది.
నాటకరంగ పరిశోధకురాలిగా పలు నాటకాలు చూసి వ్యాసాలు రచించాను. తెలంగాణ నాటక సాహిత్యం గ్రంథంలో తెలంగాణ నాటకరంగంలో మహిళలగురించి వ్యాసం రాసాను.
బడి నేపథ్యంలో రచించిన నవల బడే నాలోకం నా తొలినవల . నేను పాఠాలు చెప్పే బడిలో మా పిల్లలకు పుస్తకావిష్కరణ ఎలా జరుగుతుందో చూపించడం కోసం మా పాఠశాల వేదికపై పిల్లల మధ్య జరిపి ఆ పుస్తకాన్ని పిల్లలకు అంకితం ఇచ్చాను.
తెరవెనుక నాటకరంగానికి చెందిన నా రెండవ రచన . నాటకరంగంలో సాంకేతిక నిపుణుల ప్రాధాన్యత గురించి చాటి చెప్పే రచన .
అక్షరయాన్ రూపొందినప్పటి నుంచి నేటి వరకూ మహిళా కవయిత్రులను సంఘటితంగా ఒక విశిష్ట సంస్థగా రూపొందాలనే తపనతో వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి గారితో కలిసి పలు సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను . హైదరాబాద్ కు జిల్లా ప్రతినిధి గా రెండు సంవత్సరాలు చేసి పత్రికా ప్రతినిధిగా సేవలలో నా వంతు సహకారాన్ని అందిస్తున్నాను. అక్షరయాన్ లో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. అక్షరయాన్ వెలువరించిన పుస్తకాలలో నా రచనలు కూడా చోటు చేసుకున్నాయి .
పలు సత్కారాలు పురస్కారాలు లభించాయి నా బాధ్యతను మరింతగా పెంచాయి.
సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో మక్కువ ఉన్న నన్ను తెలుగు భాషకు సేవచేసే అవకాశం కలిగించింది . సభా నిర్వహణ నాకు ఇష్టమైన అంశం. అందుకు అక్షరయాన్ బాసటగా నిలిచింది. నా ఉద్యోగ బాధ్యతలు , కుటుంబ బాధ్యతలు అప్పుడప్పుడూ రచనలు చేసే విషయంలో కొంత విరామం కలిగించినా నాటకరంగం , కథలు , కవితలు అన్ని మాధ్యమాల్లో నేను పరిశీలించి అధ్యయనం చేస్తూనే ఉంటాను. ఆయా రచయితల రచనలకు స్పందన తెలియజేస్తాను. కనుక సాహిత్యంతో నా జీవితం మమేకం . సాహిత్యానికి ఈ జీవనం అంకితం . మరిన్ని మంచి రచనలు చేయడానికి నన్ను నేను మెరుగులు దిద్దుకుంటాను . సాహిత్యం సామాజిక చైతన్యం లక్ష్యంగా నేను సాహితీ యానం కొనసాగిస్తున్నాను. చేయాల్సిన రచనలు చాలా ఉన్నాయి . నా శాయశక్తులా ఒక మంచి సాహిత్యాన్ని అందించే దిశలో చేసే నా ప్రయాణం సాఫీగా సాగాలని ఆశిస్తున్నాను.
కొనసాగిస్తున్నాను. చేయాల్సిన రచనలు చాలా ఉన్నాయి . నా శాయశక్తులా ఒక మంచి సాహిత్యాన్ని అందించే దిశలో చేసే నా ప్రయాణం సాఫీగా సాగాలని ఆశిస్తున్నాను.
ఆమె జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకోవాలని తరుణి శుభాభినందనలు తెలియజేస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వస్తువు, విషయం – subject and content

తరం మారింది