తెలివి సమయస్ఫూర్తి తెగువ ఉత్సాహమూ అనేవి జీవితాన్ని తీర్చిదిద్దేందుకు సాధనాలు. యుద్ధ భూమికి వెళ్తున్న సైనికుల తీరు తీరొక్క దారుల్లో పయనమౌతూ సాగాలి. ఏ జాతి వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎవ్వరికైనా తప్పనిసరి. ఆడా మగ తేడా లేదు. బ్రతుకు బండి సజావుగా సాగేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏవి తోడవుతున్నాయో తెలియకుండా ఎవ్వరు ఉండరు. ఆ అవసరాలను బట్టి మనుషులు నడుచుకోవాలి. నడుచుకుంటుంటారు. అయితే స్త్రీ విషయంలో మరింత ఆలోచనా బద్ధంగా ఉండాలి.ఈ ఆధునిక కాలంలో, పెరిగిపోయిన ఆకర్షణ వికర్షణలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ పయనం చేయాలి.
ఆడవాళ్ళకు ఆర్ధిక స్వాతంత్ర్యం చాలా అవసరమని ప్రకటిస్తున్న భావ స్వాతంత్ర్యాన్నే పురుష ప్రపంచం నచ్చడం లేదు.ఇక ఆర్థిక సౌకర్యాలేం కల్పిస్తారు?కల్పించరు. దీనికి కారణం ప్రధాన కారణం మగవాళ్ల లోని అభద్రతా భావమే .మరలాంటప్పుడు ఏం చేస్తే సాధిస్తారు? సాలోచన చేయాలి.అదేంటి మగవాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా అనే ఆశ్చర్యం కలుగుతుంది.అవును ఇదే ప్రధాన కారణం.ఆర్థిక స్వాతంత్ర్యముంటే మమ్మల్నెక్కడ వదిలేసో,అధిగమించో ముందుకెళ్తారన్న భయం !!ఈ భయాలకు కారణం కూడా ఊహించవచ్చు. కొన్ని పనులు వాళ్ళు చేయలేరు,చేసుకోరు.సుఖవంతమైన జీవితం కావాలంటే పెళ్ళి,తనదైన సంతానం,వారసులు కావాలి.ఇవన్నీ స్వచ్ఛంగా సుభిక్షంగా, భద్రం గా ఉండాలని కోరుకుంటారు.ఇవన్నీ తన గుప్పిట్లో ఉంటే సురక్షితంగా ఉంటుందని భావిస్తారు.సరే ఎవరి భద్రత వాళ్ళది. సంసారం అంటేనే, కుటుంబ పరంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యం అనుకుంటారు.ఇది సత్యం. బాగానే ఉంది. కానీ,తన జీవితంలో సగభాగం గా మంచిచెడులు పంచుకునే స్త్రీ వల్లనే ఇవన్నీ సమకూరుతాయి అనుకున్నప్పుడు ఆమెకు తగిన గౌరవం, విలువ ఇస్తున్నారా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు
ఇవ్వడానికీ ఇష్టపడరు. ఇదే పెద్ద సమస్య. దీనివల్లనే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్న తపన స్త్రీ లకు తప్పటం లేదు. ఏ ఇంట్లోనైతే ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటారో ఆ ఇల్లు ఖచ్చితంగా నవ్వుల గట్లపై ఆనందం గా గెంతుతున్నట్టు, పచ్చని పంట పొలాలపై అందంగా ఎగురుతున్న జంట పక్షుల స్వైర విహారం లా అందంగా ఉంటుంది.కానీ అంతటా సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితిని గమనించి, మహిళా శక్తి ని చాటేలాతన కుటుంబాన్ని స్వంతం చేసుకోవాలి.
తనదైన తెలివికి కాస్తంత పదును పెట్టేస్తే చాలు . ఈ కుటుంబం అనే సామ్రాజ్యాన్ని మహారాణి లా పాలించగలదు. వంట చేసినంత సులువుగా తనవైపు తిప్పుకోగలదు.పని అనే గిన్నెలో కూరచేసేప్పుడు పోపు అనే ఆప్యాయత ను ఓపిక అనే ఉప్పును,పసుపు అనే ప్రేమ ను, కలివిడి గమనాన్ని పదార్థాన్ని కలిపినట్టు కలిపేసి పెనవేసుకునే బంధం లా సరిచేసి, చిరునవ్వు మెరిసినట్టు కంచంలో వడ్డించేస్తే సరి ఇంటోళ్ళంతా బలమూ బలగమూ అయిపోరూ!!
చేయాల్సిందల్లా వెక్కరితలనూ కొక్కిరింతలనూ విని వదిలేయడమే! మనసు మీదికి తీసుకోవద్దు. పది రూపాయలు మిగిల్చే ప్రయత్నం చేయాలి. అవి తన కోసం దాచుకోవాలి. ఇంటి ఖర్చులు, పిల్లల పెంపకం ఖర్చులు ఉన్నాగాని, తన ఆలంబనగా కొంత కాలన్ని , కొంత ధనాన్ని కొంత స్వాభిమానాన్ని మిగుల్చుకోవాలి. పనులు చేయడం తప్పు కాదు , తప్పదు.
ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. వీలైతే ఓరోజో,ఓ గంటో ముందే చేసేసుకోవాలి. అప్పుడే తనకు ఇష్టమైన పనులు తాము చేసుకోగలుగుతారు. తన అభిరుచి గల కళలను తాము సాధించుకోగలుగుతారు. ఒక మంచి పుస్తకం చదువుకోగలరు.
తన ఇష్టం గా తాను ఉండాలని అనుకోగలుగుతారు.
ఆధునిక మహిళ లు చాలా తెలివైన వాళ్లు. ఈ కాలానికి ఇలా ఉండాల్సిందే. విద్యావంతులైన యువత మందు ఎన్నో సమస్యలున్నవి. అధిగమించడం అలవర్చుకోవాలి. కాస్త మెలకువ కాస్త మెళుకువ ఉంటే తాను సంపాదించుకుంటున్న సంపాదనను తగినవిధంగా వినియోగం చేసుకోగలరు. టెక్నాలజీ పై అవగాహన ఉండడంతో మేలైన విధానం ఏదో గమనింపుకు తెచ్చుకోగల నైపుణ్యం ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తన
ఉద్యోగ,వ్యాపారాలలో సంపాదించుకున్నది తగు రీతిలో ఖర్చు చేస్తూ, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం వంటివన్నీ చాలా సమర్థవంతంగా పనిచేసేలా ఆలోచిస్తారు. ఈ తెలివిడిని ఈ జ్ఞానాన్ని నలుగురు స్త్రీలకు నేర్పించినప్పుడే స్త్రీల సాధికారతకు న్యాయం చేసిన వారు అవుతారు.
ఇది సత్యం.