భారతదేశపు మొదటి మహిళా న్యాయమూర్తి (1937) .ప్రపంచంలో రెండవ హైకోర్టు న్యాయవాది (1959 )గా వినుతికెక్కారు.
వీరు మే 4,1905న కేరళలోని ట్రావెన్కోర్ ప్రదేశంలో ,ఆంగ్లియన్ – సిరియన్, క్రిస్టియన్ దంపతులకు జన్మించారు. 1928 లో న్యాయ శాస్త్ర విద్యలో పట్టా పొందిన మొదటి కేరళ మహిళగా రికార్డుకెక్కారు. ట్రావెన్కోర్ దివాన్ అయిన సి. పి. రామస్వామి అయ్యర్ చే జిల్లా న్యాయమూర్తిగా1937లో నియమించబడి రికార్డు సాధించారు. వీరి భర్త బీ.సీ.చాందీ.పోలీస్ అధికారికాగా వీరికి ఒక కుమారుడు .
ఈమెను తొలి తరం స్త్రీవాదిగా అభివర్ణిస్తారు. వీరు 1932 – 34 లో శ్రీములామ్ పాపులర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి గెలుపొందారు. స్త్రీల హక్కులను ప్రోత్సహించే దిశగా’ శ్రీమతి’ అనే ఒక పత్రికను ఏర్పాటు చేసి, దానికి వ్యవస్థాపక సంపాదకురాలుగా వ్యవహరించారు. ‘లా కమిషన్ ఆఫ్ ఇండియా’లో పనిచేశారు. వీరు తమ ఆత్మ కథను రాసుకున్నారు. 1971లో మలయాళ మనోరమ తమ పత్రికలో ధారావాహికగా ప్రచురించింది. 1930లో ‘మిస్సెస్ ‘ పత్రిక ప్రారంభించి, స్త్రీ స్వేచ్ఛ ,వితంతు వివాహాలు, మహిళాసాధికారతలపైఎన్నో కథనాలు రాశారు .వేతనాల్లో లింగ వివక్ష,గర్భనిరోధం,మానవ హక్కుల కోసం విశేష పోరాటం జరిపారు. జైల్ల దుస్థితి తలవంచేలా ఉందని వీరు వ్యాఖ్యానించారు. ‘క్రిమినల్ లా ‘లో నిపుణులు.
మహిళా రిజర్వేషన్ కోటాను డిమాండ్ చేయాలని తన సమకాలీనులైన టి. కె.వేలు పిళ్ళై వంటి ప్రసిద్ధ మేధావులకు బహిరంగంగా సవాలు విసిరారు. ఆమె తన పదవీకాలంలో వెలువరించిన తీర్పులు చారిత్రాత్మకమైనవి. న్యాయ సూత్రాలను సరైన రీతిలో వినియోగించే పట్టున్న న్యాయమూర్తి అని విమర్శకులు సైతం కొనియాడారు.
” ఆడవాళ్లు బలహీనులు అన్నది ముమ్మాటికి అవాస్తవం, అందులో కొంత కూడా నిజం లేదంటారు. ప్రోత్సహిస్తే పురుషులతో సమానంగా అన్నీ సాధించగలరు కొన్ని సార్లు అధిగమించనూగలరని” వారి అభిప్రాయం.
ఆమె రాజకీయ ప్రవేశ సమయంలో సమాజం నుండి ఎన్నో అవరోధాలు , అవమానాలు విమర్శలు ఎదుర్కున్నారు . ‘శ్రీమతి ‘పత్రికలో విమర్శకులపై వారికి వ్యతిరేకంగా సంపాదకీయాలు రాశారు. చట్టం స్త్రీ, పురుషులను సమానంగా చూడాలనేది వీరి అభిప్రాయం. 1935లో ట్రావెన్కోర్ రాజ్య చట్టం మహిళలను’ ఉరిశిక్ష’ నుండి మినహాయించడాన్ని కూడా ఆమె విభేదించారు.
మహిళలకు తమ శరీరంపై హక్కు ఉండాలని” ఆలిండియా ఉమెన్ కాంగ్రెస్” లో భారతదేశ వ్యాప్తంగా మహిళలకు గర్భ నిరోధక సాధనాలు, పిల్లల ఆరోగ్యం గూర్చి తెలియజేసే క్లినిక్ లు ఉండాలన్నారు. ఈ సందర్భంలో ఆమె స్వయంగా మహిళల నుండే వ్యతిరేకత ఎదుర్కొన్నారు.
ఇలా మహిళా సాధికారత, అభ్యున్నతి కోసం కృషి చేసిన శ్రీమతి అన్నాచాందీగారి సేవలు మరువలేనివి. స్త్రీలను జాగృత పరిచే దిశలో వారిని చైతన్యవంతున్ని చేస్తూ గొంతెత్తిన వీరి ఆకాంక్షను మనం అభినందించకుండా ఉండలేం ,వారి సేవలకు కృతజ్ఞతగా అందించే చిరు అక్షర అభివాదాలు..