సావిత్రి

వ్యాసం

           దేవనపల్లి వీణావాణి

మార్కండేయుడు స్వీయ ప్రయత్నం ద్వారా, నచికేతుడు తండ్రి యథాలాపంగా అన్న మాటతో యముడి ద్వారా మరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. వీరు ఇరువురికీ తమ పరిస్థితి అది ఎదుర్కునే వరకు తెలియదు. ఇందుకు భిన్నంగా సావిత్రికి తాను ఏం చేయాలనుకుంటూదో ముందే తెలుసు. యే సాధన ద్వారా తాను సూక్ష్మ శరీరధారి కాగలదో, దానితో ఏమి సాధించగలదో తెలుసు. ఆమెకు తెలుసు కనుకనే అల్పాయుష్కుడు అని తెలిసినా సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది. తన సాధన మీద తనకంత నమ్మకం ఉంది గనుకనే తన అభీష్టాన్ని నెరవేర్చుకోగలిగింది కేవలం తన భర్త ప్రాణాలనే కాకుండా తన మామగారు, తండ్రి గారి అభిష్టాలను కూడా వరాలుగా పొందగలిగింది.

సావిత్రి, మద్ర దేశ అధిపతి అయిన అశ్వపతి కుమార్తె. అశ్వపతి సంతానం కొరకు 18 సంవత్సరాలు రోజుకి పదివేల గాయత్రీ మంత్రాలను అనుష్టానం చేస్తూ తపస్సు చేస్తాడు అతనికి సవిత్రమూర్తి ప్రత్యక్షమై సావిత్రి పేరుతో కుమార్తెగా జన్మించగలదని వరం ఇస్తుంది. అశ్వపతి తనకు పుత్రుడు కావాలని కోరుతాడు అందుకు సవిత్రమూర్తి ఈ కుమార్తె ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తుంది.

అశ్వపతి సావిత్రిని అపురూపంగా పెంచుతాడు ఆమె యుక్త వయసుకి సత్యవంతుని గురించిన సమాచారం తెలుస్తుంది అప్పటికే ఆమెకు సత్యవంతుడు తన భర్త అయితే బాగుంటుందని అభిప్రాయం ఏర్పడుతుంది. సావిత్రి యొక్క ప్రతిభాపాటవాలకి ఆమెకు తగిన వరుణ్ణి తానే ఎన్నుకోవాల్సిందిగా తండ్రి అయిన అశ్వపతి సూచిస్తాడు. సావిత్రి తాను సాల్వ రాజ్యానికి చెందిన ద్యుమత్సేనుని కొడుకు సత్యవంతుణ్ణి వివాహం చేసుకోగలనని అంటుంది. నారదుడు సత్యవంతుడు అల్పాయుష్కుడని ఒక సంవత్సరం మాత్రమే అతనికి ఆయుష్యు ఉందని అతను ఫలానా రోజు మరణిస్తాడని ముందే తెలియజేస్తాడు. అయినప్పటికీ సావిత్రి తాను సత్యవంతున్నే వివాహం చేసుకోగలనని చెప్తుంది. తండ్రి అశ్వపతి కూడా కూతురు నిర్ణయాన్ని వ్యతిరేకించడు.

అతను సావిత్రిని, సత్యవంతునికి ఇచ్చి వివాహం చేస్తాడు. సావిత్రి వివాహం చేసుకునేటప్పటికీ సత్యవంతుడు రాజ్యం కోల్పోయి అంధత్వంతో ఉన్న తండ్రి, అరణ్యంలో మునివాసం చేస్తూ బ్రతుకుతున్న పరిస్థితి. అందునా అతను అల్పాయష్కుడు. అతను అల్పాయుష్కుడన్న విషయము అతనికి గాని అతని తల్లిదండ్రులకు కానీ తెలియదు కానీ సావిత్రికి తెలుసు. అన్నీ తెలిసి సావిత్రి సత్యవంతుని జీవితంలో ప్రవేశిస్తుంది. అదే సావిత్రి గొప్పతనం. ఆమె తన సాధన మీద ఆమెకున్న నమ్మకం.

సావిత్రి సత్యవంతులు సంవత్సర కాలం ఆనందంగా జీవిస్తారు. సత్యవంతునికి మరణ సమయం ఆసన్నమవుతుంది. యధావిధిగా అరణ్యంలో కట్టెలు సేకరించడానికి సత్యవంతుడు బయలుదేరుతాడు. తాను వస్తానని సావిత్రి అంటుంది. అతనితో బయలుదేరుతుంది. అరణ్యంలో కట్టెలు సేకరిస్తూ ఉన్నఫలంగా సత్యవంతుడు పడిపోతాడు. సావిత్రికి దీని గురించి ముందే తెలుసు కనుక ఆమె అంతకుముందు మూడు రోజుల నుంచి త్రైరాత్ర వ్రతం చేస్తుంటుంది. త్రైరాత్ర వ్రతం అంటే మూడు రోజులు పగలు రాత్రి సాధనలో ఉండడం. సావిత్రి పరిస్థితిని అర్థం చేసుకొని అతని శరీరాన్ని ఒక భద్రమైన చోటుకు మార్చి తాను అక్కడే ఉండి, తన సూక్ష్మ శరీరం ద్వారా సత్యవంతుని ప్రాణాలను తీసుకున్న యమునితో ప్రయాణం చేస్తుంది. యముడు తనతో రావద్దని వారిస్తాడు. సావిత్రి యమునితో తన భర్త ప్రాణాలు తనకు ముఖ్యమని అందుకనే తను సూక్ష్మ శరీర దారియై తనతో ప్రయాణం చేస్తున్నానని చెప్తుంది ఈ లోకాల వెంట రాకూడదని యముడు పదేపదే చెప్తాడు. అందుకు ప్రతిగా నాలుగు వరాలను కోరుకో, కానీ ఈ ప్రయాణం మానుకో అని చెప్తాడు. అప్పుడు ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో అంటాడు.

మొదటి వరంగా సావిత్రి తన మామగారి అంధత్వం పోవాలని, రాజ్యం రావాలని కోరుకుంటుంది.తన తండ్రికి నూరు పుత్రులు కలగాలని కోరుకుంటుంది నాలుగవ వర సమయంలో యముడు ‘నీ పతి ప్రాణాలు తప్ప’ అన్నమాట అనడు. అప్పుడు ఆమె తన భర్తని పునరుజ్జీవున్ని చేయాలని కోరుతుంది.

ప్రసన్నుడైన యముడు నాలుగు వందల సంవత్సరాల పాటు ఎందుకంటే అది కృతయుగం కనుక కృతయుగంలో మానవుని ఆయుషు నాలుగు వందల సంవత్సరాలు కనుక నాలుగు వందల సంవత్సరాలు నూరుగురు పుత్రుల్ని కలిగి సుభిక్షంగా బతకమని వరం ఇస్తాడు. ఆ విధంగా సావిత్రి తన మామగారి చూపుని, రాజ్యాన్ని, తన తండ్రికి పుత్రుల్ని, తన భర్త ఆయుష్షుని యముని ద్వారా పొందగలిగింది. ఆమె తిరిగి తన సూక్ష్మ శరీరంతో తనదేహానికి ప్రవేశిస్తుంది అలాగే సత్యవంతుడు యొక్క ప్రాణాలని యముడు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ విధంగా యముడికి సావిత్రి కి మధ్య జరిగిన ప్రయాణం శుభప్రదంగా ముగిసి సత్యవంతుడు పూర్ణాష్కుడై చిరకాలం ఆనందంగా జీవిస్తారు. ఇది సావిత్రి కథ. ఇది మార్కండయుడు ధర్మరాజుకి చెప్పిన ఉపాఖ్యానం.

మాస్టర్ పార్వతీ కుమార్ గారు రాసిన తన ప్రసంగ పాఠం పుస్తకం మరణ రహస్యం -2 లో సావిత్రి సంబంధించిన అంశాలని ఇలా విశ్లేషిస్తారు. సవిత్రు మండలం అంటే 12 సూర్యులని కలిగినటువంటి ఒక మండలం. ఇలాంటి 12 సవిత్రు మండలాలు కలిసి ఒక భర్గో మండలం. సావిత్రి అన్న పదానికి అర్థం సాయం సంధ్య లో ఉన్న వెలుగు అది శక్తివంతమైనది. సావిత్రి వెలుగు యొక్క ప్రతిరూపం. అందుకే గాయత్రి మంత్రంలో ” భర్గో దేవస్య ధీమహి ” అని ఉంటుంది. వెలుగు ప్రతిరూపమే సావిత్రి అది అనుష్టానం చేయడమే గాయత్రి. అశ్వపతి అనే పదానికి అర్థం ప్రాణాలకు అధిపతి అయిన జీవుడు. ఈ అశ్వపతి తపస్సు చేయడం కోసం మిగిలిన కథలలో లాగా శివుడినో, విష్ణువునో ధ్యానం చేయలేదు. అవ్యక్త రూపమైన వెలుగు. సృష్టి లో ఏది వెలుగు ను ప్రకటిస్తుందో అది.
అతను సవిత్ర మండలంలోని వెలుగును, సావిత్రిని పొందడానికి 18 సంవత్సరాలు గాయత్రీ మంత్రోపాసన చేశాడు. ఆ సవిత్ర మండల వెలుగే సావిత్రిగా అశ్వపతికి జన్మించింది. ఆ వెలుగు సూక్ష్మ శరీరాన్ని ధరించగలిగే సాధన కూడా పొందగలిగిన ప్రజ్ఞ. తనకు భవిష్యత్తు తెలిసిన ఆమె వెరవలేదు తన వెలుగు దేహంతో ముందు లోకాలకు సైతం ప్రయాణం చేసి తాను సాధించాలనుకున్న వాటిని సాధించింది.

ఆమె సాధించిన వాటిలో మొదటిది మామ గారి అంధత్వం పోవడం. మామగారు ధ్యుమత్సేన రాజు జ్ఞానముతో మూడో కన్ను కూడా కలిగిన వాడు, కానీ తన అహంకార ప్రభావం చేత తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. సావిత్రి అతని అధంత్వం పోవాలని అంటే తిరిగి జ్ఞానం రావాలని కోరుతుంది. సత్యవంతుడు అసలు పేరు చిత్రాశ్వుడు అంటే చిత్రంగా ప్రాణాలని నిలుపుకోగలిగినటువంటివాడు. వ్యవహార శైలి వలన అతనికి సత్యవంతుడు అనే పేరు వస్తుంది. అతని జన్మతః వచ్చినటువంటి పేరు చిత్రాశ్వుడు లాగానే చిత్రంగా సావిత్రి వల్ల తన ప్రాణాలను పునరుద్ధరించుకోగలుగుతాడు. సావిత్రి యమునితో చేసిన సూక్ష్మలోకాల ప్రయాణం షట్ చక్రాల ప్రయాణమే. చక్రాలు ఒక్కొక్క లోకానికి ప్రతీకగా చూపబడతాయి వాటి ప్రయాణము అనుభవము అరవిందుడు మరింత విపులంగా రాస్తాడు.
పరోక్షంగా సావిత్రి యొక్క ఉపాఖ్యానమంతాను సూక్ష్మదేహధారియై ప్రయాణించగలిగేటువంటి శక్తి సాధన దాని యొక్క ఫలితాలు, శక్తి వంటివి చెప్పడం.

మార్కండేయుడు, నచికేతుడు, సావిత్రి కథల వల్ల అర్థం చేసుకోగలిగింది ఏదైనా ఉంది అంటే అది పరోపకారం, లోక శ్రేయస్సు. మరణం సత్యం, దానిని వాయిదా వేయగల శక్తి వారి వారి సంకల్పాలకు ఉంది. అందుకు దైవం సహకరిస్తుంది.దాని కోసం సంకల్ప వృద్ది చేయాలి.దానికి కొరకు సాధన చేయాలి. అలాటి వారు మృత్యువును వాయిదా వేయగలరు. మరణించినా జనుల స్మృతిలో ఉన్నంత కాలం అమరులుగా ఉండగలరు. ఎందుకు మృత్యువును జయించాలి అంటే ప్రతీ జీవి ఎంతో కొంత నాణ్యమైన, భద్రమైన, ఆదర్శమైన జీవనాన్ని తన తదుపరి తరాలకు మిగిల్చి వెళ్ళాలి.అది లక్ష్యం.

అరవిందుడు ఇంకాస్త ముందుకు వెళ్తాడు. తన సాధన ద్వారా ఆయన ప్రయాణం చేసినటువంటి సుక్ష్మ లోకాలు సావిత్రి పాత్ర ద్వారా తన ” సావిత్రి” లో నిక్షిప్తం చేశాడు సావిత్రి ఒక కావ్యానురూప యోగానుభవ ప్రకటన. ఇరవై నాలుగు వేల వాక్యాలు కలిగిన బృహత్ కావ్యం.1872 లో పుట్టిన అరవిందుడు తన 54 వ యేట మౌని గా మారిపోయి తదుపరి 24 యేళ్లు మౌనంగానే ఉండిపోయారు. 1930లో సావిత్రి రచనను మొదలు పెట్టి చాలాకాలం తన యోగానుభవాలను చేరుస్తూ పోయారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారునిగానున్న అరవిందుడు అలీపుర్ కుట్ర కేసులో జైలు శిక్ష అనుభవించే క్రమంలో ఆధ్యాత్మిక అనుభవాలను పొందినట్లు రాశారు. అప్పటినుంచి యోగిగానే జీవించారు. రూపొందించిన భక్తి, కర్మ, రాజ యోగాల ఆచరణ , అది సూప్ర మైండ్ థియరీ లేదా పూర్ణ యోగంగా చెప్పబడింది. మానవ మేధస్సులో అనేక స్థరాలు వున్నాయని దానిని కనుగొనే అవకాశం ఉందని చూపారు. అయితే దీనిని విమర్శించిన వారూ ఉన్నారు. అరవిందుడు దీర్ఘకాలం మౌనంగా ఉండడమూ దీనికి ఒక కారణము.

అరవిందుడు మొదట విప్లవకారుడు, దేశాభిమాని.తన దేశ ప్రజలకు యే సందేశం ఇవ్వలేదా అని అనుకున్నప్పుడు ఒక భావన కలిగింది. “పెద్దపులి ఆత్మకథ ” లో ఆర్కె నారాయణ్ , భారత దేశాన్ని పెద్దపులితో పోల్చుతారు. నాకు అరవిందుడి సావిత్రిలో జ్ఞానంతో మూడు కన్ను కలిగి ఉన్నా అజ్ఞానంతో దానిని కోల్పోయి రాజ్య భ్రష్ఠుడైన రాజు ద్యుమత్సేనుడిగా భారత పాలకులూ, అతని విరోధులుగా పరదేశ పాలకులూ కనిపించారు. మరణించి మళ్లీ జీవించిన సత్యవంతుడు ఈ దేశ స్వాభిమానం , దానిని సాధించిన సావిత్రి అదే ఆ వెలుగు సామాన్యుని సాధన లేక పోరాటం.
మనం మన అస్తిత్వాన్ని మర్చిపోవడమే నిజమైన మృత్యువు, మన ఆస్తిత్వం మనం నిలబెట్టుకోవాలని అనుకుంటే నచికేతుడు వలె ప్రయత్నం చేయాలి, సావిత్రి వలే మన దేశమాతకి చూపునివ్వాలి. స్వాభిమానంతో జీవించాలి.సాధనా సమన్వయంతో ఇది సాధ్యం.ఇది నాకనిపించిన ఒక భావన.

ఇది స్థూలంగా అరవిందుడి సావిత్రిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే సుదీర్ఘ వివరణ. తెలుగులో వచ్చిన సావిత్రిని చదివి సులువుగా అతని కావ్యంలోకి ప్రయాణించవచ్చు. అనుసృజన, అనువాదం రెండూ అందుబాటులో ఉన్నాయి. అందరికీ సావిత్రి అవగాహన సులభతరం అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విజ్ఞాన బాట

తెలుగు సాహితీక్షేత్రంలో విరిసిన సుగంధ కుసుమం