సంధి అంటే…..

5వ భాగం.

       రంగరాజు పద్మజ

రుగాగమ… టుగాగమ సంధులు.

రుగాగమ సంధి:-
తెలుగులో రుగాగమ సంధి రెండు రకాలుగా వస్తాయి. ఆచ్చిక పదాలు అంటే అచ్చతెలుగు పదాలు మీద, తత్సమ పదాలు అంటే సంస్కృత పదాలు మీద రుగాగమ సంధి వస్తాయి.
1)” పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమగునప్పుడు కర్మధారయమునందు రుగాగమగు”
పేద, బీద మొదలైన అచ్చతెలుగు పదాలకు స్త్రీ అని అర్థమిచ్చే ఆలు శబ్దము పరమైతే కర్మధారయ సమాసంలో ‘ ర్’ అనేది ఆగమముగా వస్తుందని సూత్రార్థం.
కర్మధారయం అంటే విశేషణ, విశేష్యాలతో(నామవాచకం) ఏర్పడు సమాసమని భావం.
పేద+ఆలు ఈ పదాల మధ్య సంధి జరిగితే ర్
ఆగమముగా వస్తుంది.
పేద+ర్+ఆలు… పేదరాలు.
ఇలాగే…
బీద+ ఆలు… బీదరాలు
ముద్ద+ ఆలు… ముద్దరాలు
బాలెంత+ ఆలు… బాలెంతరాలు
కొమ+ ఆలు…. కొమరాలు
జవ+ ఆలు…. జవరాలు
ఐదవ+ ఆలు… ఐదవరాలు
మనుమ+ ఆలు… మనుమరాలు
గొడ్డు + ఆలు…. గొడ్డురాలు..
పై పదాలన్నీ అచ్చతెలుగు పదాలు.

ఇక సంస్కృత పదాల మీద వచ్చే రుగాగమ సంధిని చూద్దాం.
2) “కర్మధారయమునందు తత్సమములకు ఆలు శబ్దం పరమగునప్పుడు అత్వమునకు ఉత్వమును రుగాగమగును”
ధీర, గుణవంత మొదలైన సంస్కృత పదాలకు ఆలు శబ్దము పరమైతే పూర్వపదం చివర ఉన్న అత్వమునకు ఉత్వము మరియు రుగాగమం వస్తుందని సూత్రార్థం.

ధీర+ఆలు
ధీర+ఉ+ఆలు
ధీరు+ర్+ ఆలు… ధీరురాలు.
ఇలాగే….
గుణవంత+ఆలు… గుణవంతురాలు
నీచ+ఆలు…. నీచురాలు
శిష్య+ఆలు… శిష్యురాలు
అమాయక+ఆలు.. అమాయకురాలు..
పై పదాలన్నీ సంస్కృత పదాలు.

రుగాగమ సంధిలో ఏవి తెలుగు పదాలు, ఏవి సంస్కృత పదాలు అని తెలుసు కోవడానికి ఒక నియమం ఉంది.
అచ్చతెలుగు పదాలకైతే కేవలం రుగాగమం వస్తుంది. సంస్కృత పదాలకైతే అత్వమునకు ఉత్వము మరియు రుగాగమం వస్తుంది.
మనుమ+ఆలు… మనుమరాలు.. ఇక్కడ కేవలం రుగాగమం వచ్చింది కాబట్టి మనుమ అనేది అచ్చతెలుగు పదం.
ధనవంత+ఆలు…. ధనవంతురాలు.. అన్నప్పుడు అత్వమునకు ఉత్వము మరియు రుగాగమం వచ్చింది కాబట్టి ఇది సంస్కృత పదం.

టుగాగమ సంధి:-
టుగాగమ సంధిలో అనేక సూత్రాలు ఉన్నాయి.
మొదటి సూత్రం
1) “కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమగు”
కర్మధారయం సమాసంలో మొదటి పదం చివర హ్రస్వమైన ఉ ఉండి దానికి అచ్చు పరమైతే ఆ రెండు పదాలు మధ్య ట్ అనేది ఆగంగా వస్తుందని సూత్రార్థం .
కఱకు+ అమ్ము…
కఱకు+ ట్+అమ్ము… కఱకుటమ్ము
అలాగే…
నిగ్గు+ అద్దము… నిగ్గుటద్దము
ఎండు+ ఆకు… ఎండుటాకు
ఇక రెండవ సూత్రం చూద్దాం!

2) “కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునప్పుడు టుగాగమము విభాషగానగు”
కర్మధారయ సమాసంలో పేరు మొదలైన పదాలకు అచ్చుపరమైతే ట్ అనేది విభాషగా అంటే రావచ్చు, రాకపోవచ్చు అని సూత్రార్థం.
పేరు+ ఉరము. రెండు పదాల మధ్య టుగాగమం వస్తే
పేరు+ట్+ ఉరము…. పేరుటురము అవుతుంది. ఒక వేళ టుగాగమం రాని పక్షంలో ఆ రెండు పదాల మధ్య ఉత్వసంధి అంటే ” ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి యగు” అనే సూత్రంతో
పేరు+ఉరము… పేరురము… అవుతుంది.
ఇలాగే.. చిగురు+ఆకు… చిగురుటాకు, చిగురాకు అనే రూపాలు ఏర్పడుతాయి.
పొదరు+ఇల్లు… పొదరుటిల్లు, పొదరిల్లు…అని అవుతాయి.
తేనెటీగ, పల్లెటూరు, పక్కటెముక మొదలైన పదాలు చిన్నయసూరి చెప్పిన పై రెండు సూత్రాలకు కట్టుబడవు.
అందుకే ముక్త లక్షణ కౌముది సూత్రకారుడు వంతారాం రామకృష్ణారావు ఇలా సూత్రికరించారు.
” కర్మధారయములందు ఉదంతేతరములకు అచ్చు పరమగునప్పుడు టుగాగమగు”
చిన్నయసూరి చెప్పిన సూత్రాల్లో పూర్వ పదంలో కేవలం హ్రస్వమైన ఉకారం ఉంటేనే టుగాగమం వస్తుంది. కానీ ఉకారం కానీ పదాలకు కూడా కర్మధారయ సమాసంలో అచ్చు పరమైతే టుగాగమం వస్తుందని చిన్నయ సూరి సూత్రాలను వంతారాం రామకృష్ణారావు సవరించారు.
తేనె+ ఈగ
ఈ ఉదాహరణలో నె లో ఎత్వం ఉంది. దానికి అచ్చుపరమౌతున్నది కనుక ట్ ఆగమంగా వస్తే తేనె+ట్+ఈగ… తేనెటీగ అవుతుంది.
ఇలాగే
పల్లె+ ఊరు… పల్లెటూరు
పక్క+ ఎముక.. పక్కటెముక.. అని అవుతాయి.

సశేషం.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిరాడంబరులు,శాంత మూర్తి, వైద్యులు ఆలూరి విజయలక్ష్మి

విజ్ఞాన బాట