ఇప్పటివరకు: జరిగిన దానివల్ల తనకు మైత్రేయి నుంచి డబ్బులు గుంజగలిగే అవకాశం పోతుందేమోనన్న భయంతో సుబ్బారావు లాయర్ కోదండపాణి గారిని తనకు మైత్రేయి కి మధ్యన కాంప్రమైస్ చేయించమని కోరాడు. ఆ లాయర్ దంపతుల గురించి తెలిసిన కోదండపాణి సందేహిస్తూనే కేసు కోర్ట్ కి వచ్చేముందే లాయర్ వసుంధర ఇంటికెళ్లి వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన ప్రయత్నం విఫలమయింది.
మూడు నెలల తరువాత మే 12 న మీ క్లయింట్ మైత్రేయిగారి కేసు ని కోర్ట్ లో సబ్మిట్ చేస్తాను,” అని సబ్ఇన్స్పెక్టర్ రమణారావు వసుంధరకి చెప్పాడు. డేట్ చూస్తే మే 5. వెంటనే వసుంధర రంగం సిద్ధం చేయడం మొదలుపెట్టింది.
“రాజ్యలక్ష్మి! నువ్వు వెళ్లి ఆ రామలక్ష్మి గారికి చెప్పు 12 తారీకు న కోర్ట్ కి రావలసి ఉంటుందని. రోజు వాళ్ళింటి కెళ్ళి ఆమె ను కోర్ట్ లో మాట్లాడే విధంగా తాయారు చేయి అని చెప్పింది.
మైత్రేయి కి ఫోన్ కలిపింది.
“హలో”. అటునుంచి చాల బలహీనంగా మైత్రేయి స్వరం వినిపించింది.
“మైత్రి! నేనే వసుంధరని! మన కేసు కోర్ట్ కొస్తుంది ఈ నెల 12, వచ్చే సోమావారం నాడు. నువ్వు నన్ను వచ్చి కలుస్తావా? నన్నే రమంటావా ?”
“ నేనే వస్తాను. రేపు హాఫ్ డే లీవ్ తీసుకొని మధ్యాన్నానికల్లా వచ్చేస్తాను” .
“ అలాగే! ఇక్కడకు నేరుగా వచ్చేయ్! కలిసి లంచ్ చేద్దాం!”అంటూ ఫోన్ పెట్టేసింది.
మైత్రేయి లో అలజడి మొదలయింది. ఆ రోజంతా చాల దిగులుగా అనిపించింది.
అక్కమ్మ సాయంత్రాని కల్లా వచ్చింది “అమ్మ !ఏటలా ఉన్నావ్ ?”అడిగింది.
“కోర్ట్ కేసు 12 తారీకు, సోమవారం నాడు, అక్కమ్మ” చెప్పింది.
“అది తెలిసిన విషయమేగా అమ్మ,.గాభరాపడతావెందుకు. అన్ని వసుంధరమ్మ చూసుకుంటుందిలే. నువ్వేమి కంగారుపడమాకు,”అని ధైర్యం చెప్పింది. ఆకలి లేదంటూ ఒక గ్లాస్ హార్లిక్స్ మాత్రమే తాగి పడుకుంది.
“నేను కాలేజ్ కి వేళ్ళాలి ఇంతమంది జనం కూర్చొని ఉంటే ఎలా స్నానం చేయాలి! అమ్మ!అమ్మ! అంటూ అరవటం మొదలెట్టింది.ఎక్కడినించో మాటలు వినపడ్డాయి. “అలాగే చెయ్. నిన్నెవరు చూడొచ్చారు. “తాను అలాగే స్నానానికి తయారయింది పూర్తిగా నగ్నంగ. అమ్మ! ఎవ్వరిని ఇటు రానీయకు””, అంటున్నది. కానీ ఎవ్వరు వినిపించుకోవటంలేదు. ఆమె ముడుచుకొని కూర్చుని ఉన్నది. ఎక్కడ ఆచ్చాదనా లేదు తనకి. అంతలో ఎవడో పొట్ట తన్నుకొచ్చినట్లున్న వ్యక్తి పిచ్చోడికి మల్లె అటు వైపు వచ్చి గెంతటం మొదలు పెట్టాడు. ఇంతలో టైట్ నిక్కరుతో మరె ఆచ్చాదనాలేని ఇంకో వ్యక్తి తన ఎదురుగ బస్కీలు తీయడం మొదలుపెట్టాడు.
“వీళ్లంతా ఎవరు? ఎవరయినా నాకు చుట్టుకోడానికి ఏదైనా ఇవ్వండి” అని తాను అరుస్తున్నది. “అదిగో దండెం మీద వేలాడుతున్నాయిగ ఎదో ఒకటి తీసుకో “అని విని పించింది.
“తాను లేచి నిలబడింది అందుకోవటానికి తాను నగ్నంగా ఉన్నాననిపించింది. అంతలో ముందుగా కనిపించిన పొట్టమనిషి మళ్ళీ కనిపించాడు నన్ను తరుముతున్నాడు. చాలి చాలని ఎదో ఒక బట్టను చుట్టు కొని పరిగెత్తటం మొదలుపెట్టాను. దూరంగ పోతున్న బస్సు కనిపించింది. అదే ఎక్కుదామని పరిగెత్తుతూ రాయి తట్టు కొని పక్కనే ఉన్న పెద్ద గొయ్యిలోకి పడిపోయాను.”
ఉల్లిక్కిపడింది మైత్రేయి నిద్రలోనే. పీడ కల. మేలుకు వచ్చింది. చాల అశాంతిగా అనిపించింది. టైం చూసింది అర్ధరాత్రి 2:17 నిముషాలు చూపిస్తున్నది గోడ గడియారం వెలుగు రావడానికి చాలా సమయం ఉంది. అక్కమ్మ గాఢ నిద్రలో ఉంది లేచెళ్లి కిటికీ తలుపు తెరిచింది. చల్లటి గాలి మొహాన్ని తాకింది. బయటంతా చీకటి. ఎక్కడో ఒంటరి గుడ్లగూబ దూరంగా ఉన్న ఒకే ఒక చెట్టు మీద నుండి కూస్తున్నది. నీలాకాశం చీకటి గుహలాగా కనిపిస్తున్నది. ఎక్కడో ఒక నక్షత్రం కనిపిస్తున్నది. చీకట్లో అటు ఇటు తిరుగుతున్న ఒకటి రెండు గబ్బిలాలు.
ఆ చీకటి లోకి చూస్తూ అలాగే ఎంతసేపు అక్కడే కూర్చుని ఉందొ తెలియదు , అక్కమ్మ లేచేసరికి ఆ కిటికీ దగ్గరే కిందనే ఒరిగి మైత్రేయి కునుకు తీస్తున్నట్లు కనిపించింది. “పిచ్చితల్లి! రాత్రంతా నిద్రపట్టలేదేమొ ,” అనుకొంటూ పనిలోకి వెళ్ళిపోయింది.
బాగా వెలుతురు వచ్చి బయటి సందడి వినిపించటం తో మైత్రేయి లేచేసింది. ఈ రోజు వసుంధరను కలవాలి అని అనుకొంది.
రమాదేవి కాస్త దూరందూరం గానే చూస్తూ వెళ్ళిపోయింది తన నీళ్ల బిందెను చంకన పెట్టుకొని. కొద్దీ రోజులనుండి, అదే! వసుంధర వాళ్ళింటి కెళ్ళి వచ్చినప్పటి నుండి ఆమె నోటికి తాళం తగిలించాడు పంతులు.
(ఇంకా ఉంది)