ఒక వారం రోజులు గడిచాయి శివరాత్రి ఉత్సవాల గురించి ఊళ్లో చాటింపు వేయించారు…
” మన ఊరి ప్రజలకు తెలియజేసేదేమనగా.. ఊళ్ళ శివరాత్రి ఉత్సవాలు మన దేవుని గుడిల జరుగుతాయి… ఆ పనులు చేయడానికి ఎవ్వరైనా ముందుకు రావచ్చు గుడిని శుభ్రం చేయడం.. గోపురాన్ని కడగడం పైన శిఖరాన్ని తుడవడం అవసరమున్న చోట రంగులేయడం దేవుడికి సంబంధించిన ఇత్తడి సామాన్లు కడగడం ..పూలు అల్లడం ఇలా ఎన్నో పనులు ఉంటాయి దీనికి వయసు పిల్లలు వస్తే పనులు తొందరగా అవుతాయి.. పెద్దవాళ్లకు కూడా చేయాలని ఇష్టం ఉంటే ఒత్తులు చేయడం పూలల్లడము అట్లాంటి పనులు చేయవచ్చు రేపే వచ్చి మీ పేర్లు రాయించుకోండి అహో!” అని ప్రతి వీధిలో డమడమ డప్పు వాయించి చాటింపు వేసి వెళ్లారు…
ఎంతోమంది వయసు పిల్లలు పేర్లు రాయించుకున్నారు పెద్దవాళ్లు వారికి చేతనయిన పనులు చేయడానికి ముందుకు వచ్చారు….
కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి గుడంతా ఎంతో వైభవంగా కనిపిస్తుంది పూల తోరణాలు తడక పందిళ్లు నూనె దీపాలు వెలుగుతుంటే కొత్త శోభ సంతరించుకుంది…
నీలాంబరి శివాలయం కోసం ఒక పెద్ద చిత్రాన్ని రూపొందించింది శివపార్వతులు నృత్య మాడుతున్న చిత్రం ఎంతో అద్భుతంగా ఉంది… దానిని గుడి పక్క ఎత్తుగా కర్రలు పాతి కట్టించారు….
శివరాత్రి రోజు భక్తులు ఎక్కువగా వస్తారు కనుక నీలాంబరి భూపతి ముందు రోజు వెళ్లి అభిషేకం చేయించుకుని మనసారా శివుడిని ప్రార్థించుకొని ఇంటికి వచ్చారు…
శివరాత్రి రోజు రాత్రి ఆరు గంటల నుండి చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు చిన్నపిల్లల నృత్యాలు ఏకపాత్రాభినయాలు.. పాటలు తర్వాత హరికథలు ఏర్పాటు చేశారు.. ఎందుకంటే శివరాత్రి రోజు జాగరణ చేస్తారు కాబట్టి అందరికీ పుణ్యకాలం అంతా ఇక్కడే గడుస్తుంది నిద్ర రాకుండా కూడా ఉంటుంది…
శివరాత్రి రోజు ఉదయం నుండి అభిషేకాలతో పూజలతో ఆలయం కిటకిటలాడిపోతుంది భక్తులు “శివోహం శివోహం” అంటూ పారవశ్యంతో పూజలు చేసుకున్నారు… శివరాత్రి ఉపవాసం రకరకాలుగా ఉంటారు ..మన సనాతన ధర్మం మనకు వెసులుబాటు ఎంతగానో కల్పించింది… అందుకే పిల్లలకు వృద్ధులకు బాలింతలకు ఉపవాసాలకు కొంత సడలింపుని ఇచ్చారు… పాలు పండ్లు లేదా సగ్గుబియ్యంతో చేసిన కిచిడి ఇలా వారి శరీర అవసరాలను బట్టి ఉపవాస దీక్ష చేస్తారు. ఎక్కువ శాతం నీరు కూడా తాగకుండా సాయంత్రం వరకు ఉపవాసం చేసి రాత్రికి తీర్థం తీసుకొని పండ్లు మాత్రం తీసుకుంటారు ఇది ఒక రకమైన దీక్ష… ఉదయం నుండి ఉపవాసం చేసి రాత్రికి చిలగడ దుంపలు ( రత్నపురి గడ్డ) సత్తు పిండి …పేలాలు విసిరి చేసుకుంటారు దీనిని ఆరగిస్తారు ఇలా ఎవరికి ఎలా సౌకర్యం ఉంటే అలా చేసుకుంటారు.
నీలాంబరి భూపతి ఉదయం నుండి ఉపవాస దీక్ష చేసి సాయంత్రం శివాలయంకు వచ్చి దేవుడి దర్శనం చేసుకుని పూజారి గారు ఇచ్చిన తీర్థం పుచ్చుకొని అక్కడే వారు ఇచ్చిన పండ్లు ఆరగించి సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి కూర్చున్నారు. పిల్లలు చేసే నృత్యాలు చూసి మురిసిపోయింది నీలాంబరి… లింగోద్భవ కాలం అయ్యేవరకు అక్కడే ఉండి తర్వాత ఇంటికి వచ్చారు..
” నీలా! జాగరణ చేస్తావా నువ్వు?” అని అడిగారు భూపతి.
” లేదండి ముందులాగా నేను చేయలేకపోతున్నాను అలసటగా ఉంటుంది పడుకుంటాను” అని చెప్పింది నీలాంబరి.
” నేను అదే చెప్పుదామని అనుకున్నాను ఆరోగ్యం సహకరించినప్పుడు జాగరణ అవసరం లేదు నువ్వు వెళ్లి పడుకో నేను నాకు వీలైనంత సేపు మెలకువగా ఉండి పడుకుంటాను ..చూస్తాను శివయ్య ఆజ్ఞ ఎలా ఉందో” అని హాల్లో టీవీ పెట్టుకుని కూర్చున్నారు భూపతి….
ఇంట్లో కూర్చోవడం కన్నా గుడిలోకి వెళ్లి హరికథ వినడం బాగుంటుంది కదా నలుగురితో పాటు కూర్చోవచ్చు అని అనుకొని…
” నీలా నేను గుడికి వెళ్లి వస్తాను నీకు తోడుగా మహేశ్వరి నర్సింలు ఇంట్లోనే ఉన్నారు కదా ఈరోజు.. ఇంట్లో ఉంటే నిద్ర వచ్చేలాగా ఉంది” అని చెప్పి గుడికి వెళ్లారు భూపతి…
హరిదాసు శ్రీలంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చక్కగా “శివ కళ్యాణం” చెబుతున్నారు భక్తులంతా మైమరచిపోయి వింటున్నారు ఆ ప్రాంతంలో ఆయన చాలా గొప్ప హరిదాసు.. పట్టణాల్లో కూడా ఆయన హరికథ చెప్తే సినిమా థియేటర్లు వెలవెల పోతాయట.. హరికథ లాంటి మనకున్న ఒక గొప్ప సాంప్రదాయ కళను బ్రతికించుకోవాలనే ప్రయత్నమే ఇలా ఉత్సవాలప్పుడు హరికథలను చెప్పించుకోవడం.. ఇలాంటి వాటిలో భూపతి నీలాంబరి చక్కని ఆలోచనలు చేస్తారు..వీరి ఆలోచన ప్రకారమే శివాలయంలో హరికథకు ఏర్పాటు జరిగింది.. ఊళ్లో కొంతమంది “ఈ రోజుల్లో హరికథలు ఎవరు వింటున్నారు ఎందుకు ఈ హరికథలు “అని వాదించిన వాళ్ళు లేకపోలేదు… అప్పుడు నీలాంబరి భూపతి వారికి తగురీతిగా సమాధానం చెప్పి ఈ కళ గురించి వివరించారు… అదే కాక ఈ శివాలయం భూపతి వారి పూర్వీకులు కట్టించినది కావడం వల్ల ఇంకా ఎవరూ నోరు మెదపక ఊరుకున్నారు. ఇప్పుడు మాత్రం భక్తులంతా అక్కడ కూర్చొని వినడం చూస్తుంటే భూపతికి వాళ్లు తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది… చాలా తృప్తి పడ్డాడు.
కార్యక్రమాలు అన్ని పూర్తి అయ్యాక ఇంటికి వచ్చాడు భూపతి .
తెల్లవారి గుడిలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ..ముందు రోజు ఉపవాసం కాబట్టి ఊళ్లో అందరూ ఇక్కడే భోజనం చేసే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు… శివాలయం చుట్టూ ఉన్న స్థలంలో భోజన వసతి చేశారు… ఉపవాస దీక్ష విరమించడం కాబట్టి ఆ రోజు ఎక్కువగా భోజనం ఎవరూ చేయలేరు అందుకే తేలికగా ఉండే భోజనం తయారు చేశారు… కొబ్బరి పులిహోర ,క్షీరాన్నం, పప్పు, రసం మరియు దోసకాయ భరడా ఇవి భోజనంలోని పదార్థాలు.
గుడి ప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది అందరితో పాటుగా భూపతి నీలాంబరి కూడా అక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనం చేశారు… ఊరి ప్రజలకు నీలాంబరి భూపతి అంటే అందుకే చాలా ఇష్టం వాళ్లు భేషజాలకు పోకుండా అందరితో కలిసి ఉండే తీరు అంటే ప్రజలకి మంచి భావన ఏర్పడింది. అందరూ భోజనాలు చేసి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు…
ఇక శివాలయం వీధిలో జరిగిన జాతర మూడు రోజులపాటుగా సాగింది. ఎన్ని ఊర్లు తిరిగి ఎన్ని వస్తువులు కొనుక్కున్న అద్భుతమైన మాల్స్ ఎన్ని వచ్చినా జాతరలో కొనుక్కున్న వస్తువుల విలువ దేనికి సాటి రాదు..
జాతరలో ముఖ్యంగా కొనుక్కునేటివి కుంకుమ పసుపు గాజులు. రాశులు పోసిన కుంకుమ పసుపు బుకా గులాలు ..తోరణాలుగా కట్టిన నల్ల దారాలు ఎర్ర దారాలు ఇవన్నీ పిల్లల కోసం ఏర్పాటు చేయబడ్డవి… తర్వాత ఆట బొమ్మలు… పుయ్యా పుయ్య ఊదుకునే ఫ్లూటు ఈలలు.. నీటితో ఏర్పాటు చేసిన లాయిలప్పలు.. గాలి ఊదుకునే బుగ్గలు రంగురంగుల కళ్లద్దాలు ఇంకా రకరకాల బొమ్మలు… ఇక తినుబండారాల జోలికి వస్తే మిఠాయి బెండ్లు.. గుండ్లు ..జిలేబీలు ఇవన్నీ పొట్లమ్ల్లో చుట్టిస్తే పిల్లలంతా గుడిపక్కలలో కూర్చుని హాయిగా తినుకుంటూ ..పీకలు ఊదుకుంటూ సంబరపడిపోతుంటే నీలాంబరికి తన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకు వచ్చి నవ్వుకుంది. జాతరలో బొమ్మలు కొనుక్కొని ఇల్లంతా నింపుకునేది…
” పట్టణం నుండి నీకు ఇన్ని ఆట వస్తువులు తెచ్చాను కదమ్మా. ఇంకా ఇవన్నీ ఎందుకు’ అని వాళ్ళ నాన్న అడిగేవారు.
” నాకు మన ఊరి జాతరలోవే కావాలి నాన్న.. నాకు ఇవే ఇష్టం మీరు ఎన్ని బొమ్మలు తెచ్చినా నాకు జాతరలో బొమ్మలంటేనే ఇష్టం” అని చెప్పేది నీలాంబరి.
అలా తలుచుకుంటూ సాయంత్రం సమయంలో మెల్లిగా నడుచుకుంటూ జాతరలోకి వెళ్ళింది నీలాంబరి… ప్రతి సంవత్సరం దుకాణాల వాళ్లు వాళ్లే వస్తారు కాబట్టి అందరూ నీలాంబరిని గుర్తుపట్టారు..
” మా దగ్గర కొనుక్కో అమ్మా!” అంటూ ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు.. ఎవరిని చిన్నపుచ్చకుండా అన్ని షాపుల్లో ఒక్కొక్క వస్తువు కొనుక్కుంది ..రేపు కూతురు సీమంతం చేయాలి కాబట్టి అక్కడే పెద్ద ఎత్తున పసుపు కుంకుమ కూడా కొనుగోలు చేసింది… ఎంతో తృప్తిగా ఇంటికి వచ్చింది నీలాంబరి.
ఇంకా ఉంది