మహిళా మణి అంటే మహిళలందరూ —-మణులు.
స్త్రీ రత్నాలు అంటే
స్త్రీలందరూ —–రత్నాలు.
కలికి తురాయి అంటే
ఆడది ఒక భూషణం
ఇలా అన్నీ రాళ్ళ పేర్లతో పిలిచి
అలంకారాలతో పోల్చి
చివరికి మన జీవితాలు రాళ్ళ
పాలు చేశారే అక్కటా
స్త్రీని భూమాత అని భూమికున్నంత సహనం
ఉందని మన జీవితాలను
భూమిలోకి తొక్కేసారే అక్కటా
ఇంటికి దీపం — ఇల్లాలు
దీపం అంటే అగ్ని అని మన
జీవితాలు అగ్గి పాలు, బుగ్గి పాలూ చేశారే అక్కటా.
గంగా, యమునా,సరస్వతి
అన్నీ మన మహిళా పేర్లే
అందుకే మనబ్రతుకులు
యేటి పాలు చేశారే అక్కటా
కాదు ఎంతమాత్రం కాదు
మన జీవితాలు అగ్గిపాలు,
బుగ్గి పాలు, యేటి పాలు
కారాదు.
భూమిపై ఎందరికో నీడ నిచ్చే పచ్చని చెట్టులా
సెలయేటి పై మిల మిల
మెరిసే తరగల కాంతిలా
ఎందరో జీవితాలకు వెలుగులు
పంచే దీప శిఖలా ప్రజ్వరిల్లాలని !
ప్రజ్వరిల్లుతామని!!
స్త్రీ పురుష సమ్మిళిత సమాజానికి
తరగని అలంకారాలము
అదే మన మహిళల ఆశయం.