మహిళా దినోత్సవం అనగా ఒక పుట్టుకకు ఒక అస్తిత్వానికి, ఒక పునరుద్జీవనానికి, ఒక కొనసాగింపుకు గౌరవం ఇచ్ఛే రోజూ.
మనిషి మనుగడ కోసం స్త్రీ అవసరాన్ని గుర్తించి గౌరవించే రోజూ. భూమి మీద మనిషి అన్నది మిగలడానికి స్త్రీ అవసరం అని గుర్తు చేసే రోజూ. అమెరికా వంటి దేశాలలో చదువుకొని చైతన్యవంతులైన స్త్రీలు సంప్రదాయ చట్టంలో నిర్దేశించ బడిన విధుల కంటే గొప్ప పనులు చేయడానికి తమకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వాళ్ళు గ్రహించారు. అమెరికా బట్టల మిల్లుల కార్మికులు 16 గంటల నుండి 10 గంటల పని సమయం ఉండాలని వీధుల్లోకి వఛ్చి మొట్ట మొదట నిరసన ప్రదర్శన చేశారు.ఆ తర్వాత డెన్మార్కులోని కోపెన్ హగెన్ లో 1910 లో నిర్వహించిన రెండవ నిరసన సమావేశం లో ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని జర్మన్ సోషలిస్టు లూయిస్ జీచ్ ప్రతిపాదించగా, కమ్యూనిస్ట్ నాయకులు క్లారా జట్కిన్ సమర్దించారు.
ప్రారంభంలో మహిళా దినోత్సవాలు వేర్వేరుగా జరిగాయి. అమెరికాలో మార్చి 19 న జరుగగా, రష్యా లో ఫిబ్రవరి 28 న జరిగాయి. 1914 లో సంయుక్తంగా అందరూ మార్చి 8 న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ఒకప్పుడు ఇంటికి పరిమితమైన స్త్రీ నేడు మగాడితో సమానంగా రాణిస్తుంది. అన్ని రంగాల్లోనూ పురుషులకు గట్టి పోటీ ఇస్తుంది మహిళా. ఇలాంటి వారికీ ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు పేపర్ల లోను, టీవీ లలోనూ చూస్తున్నాము. పుట్టుకకు కారణమైన మహిళను చిన్న చూపును చూడకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అయినా గౌరవిద్దాం. స్త్రీలు ఆర్థికంగా పురుషులను గురిగా చేసుకొని యుద్ధం చేసే వీలు లేదు. ఎందుకంటే వాళ్లిద్దరూ రెండు వర్గాలు కారు. స్త్రీలు తాము చైతన్య వంతులవుతూ పురుషులను చైతన్యవంతులుగా చేసుకోవాలి. స్త్రీ వాదానికి, సాహిత్యానికి రెండింటికి జీవితంతో సంభందం ఉంది. కనుక అవి పరస్పర ప్రభావాలకు లోను కావడం అనివార్యం.సమస్థాయి సహ జీవన సంబంధాలు స్త్రీ పురుషుల మధ్య ఏర్పడాలన్న ఉన్నత ప్రజా స్వామిక లక్ష్యం తో వఛ్చిన స్త్రీ వాద సాహిత్య అధ్యయనం ఈనాటి అవసరం. స్త్రీలను కుటుంబానికి పరిమితం చేసి కుటుంబం వ్యక్తులదని తేల్చి స్త్రీల సమస్యలను వ్యక్తిగతమైనవిగా నిర్ధారించి చర్చించదానికి, పరిష్కరించడానికి నిరాకరించిన సామాజిక సాంసృతిక నిర్మాణాన్ని స్త్రీ వాదం తప్పు పట్టింది.అమెరికా వంటి దేశాల మహిళలు కుటుంబం, మతం,రాజ్యం మొదలైన అధికార వ్యవస్థలన్నీ స్త్రీలను అణచి వేసే విధంగానే ఉన్నాయని నిశిత పరిశీలనలో గ్రహించగలిగారు.
తమ జీవితాన్ని తామె నిర్దేశించుకొని స్వతంత్రంగా వ్యవహరించగల జీవిత విధానాన్నినిర్మించుకోవాలని
వాళ్లు పడిన తపన నుండి స్త్రీ వాదఉద్యమం రూపు కట్టుకుంది. స్త్రీల జీవితాన్ని సూక్ష్మ దర్శిని నుండి చూసి విశ్లేషించి చెప్పగల సాధనమే స్త్రీ వాదం.స్త్రీ పురుష అసమానతలకు మూలాలను వెతకటం లో రూపొందిన సిద్ధాంతం. స్త్రీ పురుషులు పుట్టుకతో సమానులే అయినా ప్రత్యేక కౌటుంబిక, సామాజిక పరిస్థితులలో వాళ్ళు స్త్రీలుగా, పురుషులుగా వేరు, వేరు అవసరాలు కలవాళ్లుగా రూపొందింప బడతారు. ఈ అసమానతనే లైంగిక వివక్ష అంటారు.
అనురాగ దగ్ధ సమాధి కవితలో రేవతి దేవి స్త్రీ పురుషుల మధ్య ప్రేమను, అనురాగాన్ని, ఆకర్షణను, వాంఛను వ్యక్తీకరించారు.ప్రేమ గురించి, ఆకర్షణ గురించి, శారీరక వాంఛల గురించి ఇది వరలో చాలా మందే రాశారు. కానీ వాళ్లంతా పురుషులు. తనకు ఒక శరీరం ఉంటుందనీ, దానికి కోర్కెలుఉంటాయానీ స్త్రీలకు తెలియనీయకుండా జీవితాన్ని నిర్దేశించిన సమాజంలో స్త్రీలు కోర్కెలను వ్యక్తీకరించటం మహా నేరం. పురుషుడి కోరికలను వినడానికి తీర్చటానికీ, సిద్ధంగా ఉండవలసిన వాళ్ళు మాత్రమే. ఇటువంటి సామాజిక సంస్కృతి లో స్త్రీలు శారీరక స్పందనలను గురించి మనో చాంచల్యాల గురించి కవిత్వం రాయటాన్ని ఎవరూ ఊహించలేరు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలలో కామం అనే తృతీయ పురుషార్థానికి సంబంధించింది కదా.స్త్రీ పుంసంయోగాన్ని జీవాత్మ, పరమాత్మల అనుసంధానంగా భాసింప చేసింది కదా!కామానికి, మోక్షానికి వైరుధ్యం ఉందని పెద్దలు చెబుతుంటారు కదా!మోక్ష పథంలో ప్రయాణించాలనుకునేవారు కామాన్ని తెగ నరుక్కోవాలని అంటారు. అటువంటప్పుడు కామ మోక్షాలను రెండింటినీ ఒక కవితలో భాగం చేయటం ఎలా సాధ్యం అనే ప్రశ్న వస్తుందిక్కడ. కామ మోక్షాలకు అభావం చేయడానికే ఈ కవిత చివరి భాగం లో ఉంది. శృంగారాన్ని స్త్రీ పురుష సంబంధ విషయాన్ని రహస్యం చేసి దాని చుట్టూ మాయను సృష్టించిన పితృ స్వామిక సంస్కృతి పరమోద్దేశం. స్త్రీలను అదుపులో పెట్టటం. పునరుత్పత్తి మాతృకలైన స్త్రీలను తమ పునరుత్పత్తి శక్తి గురించి న స్పృహ లేకుండా, ఒకవేళ ఉన్నా, అది దోషమనుకొని లోలోపల అణుచుకొని అదుపులో ఉండేటట్లు చేయటానికి కామం తుచ్చమైనదిగా ప్రచారం చేయబడింది. ఈ సంప్రదాయ భావనను నిరాకరించటం ఈ కవిత చేసిన పని.
స్త్రీ పుం సంయోగాన్ని మోక్షానికి పర్యాయ పదంగా చేసి కామ మోక్షాల మధ్య సరిహద్దులు లేవని నిర్దారించటం ఆ రెండింటికీ అభేదాన్ని ప్రతిపాదించటం ఈ సరిహద్దులు లేని ప్రాంతాల విహారం లోనే స్త్రీ పురుషుల స్నేహం, సాన్నిధ్యం శాంతికి కారణమవుతాయని సూచించటం అనురాగ దగ్ధ సమాధి కవిత కు ముక్తాయింపు.
పురుషానురాగంలో తాను కరిగిపోవటం వలన స్త్రీ పొందిన నిశ్చలా, నిరామయ, నిర్వికల్ప ఆనంద స్థితిని అభివర్ణించిన కవిత కావటం వలన అనురాగ దగ్ధ సమాధి అన్న పేరు ఈ కవితకు సరిపోయింది. ఈ అనుభవాన్ని ఒక స్త్రీ – స్త్రీ ముఖంగా, స్త్రీ అనుభూతిగా,హృదయావిష్కరణగా అభివ్యక్తీకరించటం వలన ఆధునిక తెలుగు కవిత్వం లో దీనికొక ప్రత్యేకత లభించింది.
కవిత లక్ష్యం పాఠకున్ని ఆనంద రస డోలికల్లో ఊయలూగించడం కాదని స్థబ్దత ను తొలగించి చీకట్లను వెలిగించి నూతన సమాజ నిర్మాణానికి అవసరమైన చైతన్యాన్ని పెంపొందింప చేయడమే నని అభ్యుదయ కవులు విశ్వసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్బంగా పుట్టుకకు కారణమైన స్త్రీని ఏ విషయం లో నైనా చిన్న చూపు చూడకుండా గౌరవించవలసిన భాద్యత అందరిదీ. అప్పుడే సమసమాజం, నవ సమాజం ఏర్పడుతుంది.