సాయంత్రం కావస్తుంది… ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్న నీలాంబరికి పాటకి చప్పుడు వినిపించింది…. అలా బయటకు చూసింది.. పూజారి గారు ఒక అబ్బాయి అమ్మాయిని తీసుకొని లోపలికి వస్తున్నట్లు గమనించింది..
” మహీ! బయట పూజారి గారు వచ్చారు వాళ్లని కచేరీలో కూర్చోబెట్టు నేను ఒక పది నిమిషాల్లో బయటకు వస్తాను వాళ్లకి మంచినీళ్లు ఇవ్వు” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.
మహేశ్వరి బయటకు వెళ్లి పూజారి గారిని వారితో పాటు వచ్చిన ఇద్దరు పిల్లలని కూర్చోమని చెప్పి లోపలికి వచ్చింది… ట్రేలో మంచినీళ్లు తీసుకొని వెళ్లి ఇచ్చింది.
నీలాంబరి మొహం కడుక్కొని చీర మార్చుకొని… నుదుట కుంకుమ పెట్టుకుని బయటకు వచ్చింది…
ముగ్గురు లేచి నిలబడ్డారు…
” నమస్కారం పూజారి గారు… కూర్చోండి” అని చెప్పి తాను ఒక కుర్చీలో కూర్చుంది.
” అమ్మా! వీళ్లేనమ్మ ఆ ఇద్దరు పిల్లలు.. మీరు అడిగారు కదా అందుకని తీసుకొని వచ్చాను” అని చెప్పారు పూజారి.
” నాకు అర్థమైంది పూజారి గారు వీళ్ళతో మాట్లాడాలని అడిగింది నేనే కదా! మీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఎన్నో పనులు ఉన్న మీరు నా కోసం ఇంత సమయం కేటాయించినందుకు” అన్నది నీలాంబరి.
” మీరు చెప్పారంటే దానిలో మంచి విషయం దాగుందని నాకు అర్థమైంది అమ్మా! మీరు చెప్పడము నేను చేయకపోవడమా!” అన్నాడు పూజారి.
పిల్లల వైపు చూసిన నీలాంబరి “మీ పేరేంటి? మీరు ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు?” అని అడిగింది.
ఆ ఇద్దరు పిల్లల మొహాల్లో కొంచెం భయం కనబడుతుంది…
మొదటగా అబ్బాయి..
” నా పేరు సంజయ్ అండి… నేను పట్నంలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాను. అక్కడ హాస్టల్ లో ఉంటున్నాను” అని చెప్పాడు.
తర్వాత ఆ అమ్మాయి..” నా పేరు కుసుమ అండి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మన పక్కనున్న టౌన్ లో” అని చెప్పింది.
” సరే మీరు ఇద్దరు చెప్పింది బావుంది మీ చదువులు చక్కగా ఉన్నాయి. మరి మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు మీ పరిచయం ఎలా జరిగింది?”అని అడిగింది నీలాంబరి.
ఇద్దరూ ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే కూర్చున్నారు వారి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది.. వారి విషయం ఎవరికైనా తెలిస్తే ఎలా అనే భయం వారిని మాట్లాడనీయడం లేదు.
” చెప్పండి పర్వాలేదు నేను ఎవరికీ చెప్పను” అని చెప్పింది నీలాంబరి.
” మేడం! ఇద్దరిదీ ఒకే ఊరు కావడం వల్ల సెలవులకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి కలుసుకునే వాళ్ళము అలా మా పరిచయము రాను రాను ప్రేమగా మారింది ..మొన్న సెలవులు వస్తే నేను ఇక్కడికి వచ్చాను తాను ఇక్కడే ఉంటుంది కాబట్టి తనని అప్పుడప్పుడు కలుస్తుంటాను” అని చెప్పాడు సంజయ్.
” మీఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా?” అని అడిగింది నీలాంబరి.
” చాలా గొడవలు అవుతాయి కొడతారు తిడతారు ఇంకా ఏదైనా చేయవచ్చు” అన్నాడు సంజయ్.
” కుసుమా! నువ్వు మాట్లాడటం లేదేంటి మీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా!” అడిగింది నీలాంబరి.
” నాది కూడా అదే పరిస్థితి మేడం.. కానీ మేము ఇద్దరం ప్రేమించుకున్నాము ఒకరిని వదిలి ఒకరం ఉండలేము.. అందుకే మధ్య మధ్యలో కలుసుకుంటున్నాము.. మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము” అని చెప్పింది కుసుమ.
” సరే మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను… ఇంట్లో కొడతారు తిడతారు బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తారు.. సరే ఇవన్నీ జరిగినా కూడా మీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అనుకుందాం అప్పుడు బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారు తర్వాత మీ భవిష్యత్తు ఏమిటి? చదువులు ఆగిపోయి ఉద్యోగం లేక బ్రతుకు ఎలా ఉంటుంది! ఎలా బ్రతుకుతారు ప్రేమను తిని బ్రతుకుతారా లేక పాటలు పాడుకుంటూ జీవిస్తారా ఏం చేస్తారు ముందు నాకు సమాధానం చెప్పండి” అని అడిగింది.
” చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేస్తాను మేడం నేను ..ఉన్నదాంట్లో ఇద్దరం జీవిస్తాము” అని చెప్పాడు సంజయ్.
” అవునండి ఏదో ఒక పని నేను కూడా చేసుకుంటాను దాంట్లోనే ఇద్దరం కలిసి బ్రతుకుతాము మేము ఇద్దరం కలిసి ఉండడం మాత్రమే మాకు ముఖ్యం” అని చెప్పింది కుసుమ.
బలవంతంగా కోపాన్ని అనుచుకుంది నీలాంబరి…
కోపాన్ని నిగ్రహించుకొని చిరునవ్వుతో..” అయితే ప్రేమను తింటూ బ్రతుకుతాము అంటారు.. కొంత డబ్బు వచ్చినా చాలు దానితో సంతోషంగా ఉంటాము అంటారు అంతేనా! ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో చదువుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు బాధ్యతలు ఏమీ లేవు మీకు ఇప్పుడు ఆ ప్రేమ పండు వెన్నెలలాగా చక్కని సెలయేరు లాగా పూల తోట లాగా కనిపిస్తుంది ఇది సినిమా కాదు జీవితం సినిమాలలో ఎక్కడో అడవిలో ఒక తడకలతో గుడిసె వేసుకొని హీరో హీరోయిన్లు సంతోషంగా నదీ పక్కన పాటలు పాడుకుంటూ ఉంటారు అది నిజం అనుకుంటున్నారా అక్కడ ప్రొడ్యూసర్ వాళ్లకు తిండి పంపిస్తున్నాడు కొన్ని సీన్లు తీస్తున్నాడు డైరెక్టర్… ఆ తర్వాత వాళ్లు వెళ్ళేది వాళ్ళ ఇళ్లల్లోకి…. అసలు మీ వయసెంతని! ఈ వయసుకే మీకు పెళ్లి అవసరమా! 20 ఏళ్లకు పెళ్లి చేసుకుని 22 ఏళ్ల వరకు పిల్లలను కనేస్తారా వాళ్ల భవిష్యత్తును ఏం చేస్తారు చాలీచాలని డబ్బులతో పోషిస్తారా! కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రేమ కనిపించదు.. అప్పుడు చిరాకు కోపం అన్ని వస్తాయి ఒకరిని ఒకరు నిందించుకోవడం మొదలుపెడతారు… మీవాళ్ళు మావాళ్ళు అంటూ గొడవలు వస్తాయి! ఇవన్నీ ఆలోచించారా! అదీకాక ఈఊర్లో తెలిసిందనుకో ఏమవుతుందో మీకు తెలుసా? అందరూ రోజు మీతో చక్కగా మాట్లాడిన వాళ్లే మిమ్మల్ని వెలివేస్తారు.. అప్పుడు మీకు ప్రత్యక్ష నరకమే కనిపిస్తుంది ప్రేమించుకోవడం తప్పని నేను చెప్పడం లేదు కానీ చదువుకోవాల్సిన వయసులో చదువు ఉండాలి చదువుతోపాటుగా బాధ్యతలు కూడా నిర్వర్తించాలి” అని చెప్పింది నీలాంబరి.
ఒక్కసారి వాళ్ళ ముఖాల్లో భావాలు మారిపోయాయి వాళ్లకు ఈ కోణంలో ఆలోచించే అవకాశం లేకపోయింది కాబట్టి వాళ్లు ఆలోచనలో పడ్డారు.
” కుసుమా! సంజయ్ నా మాట వినండి… ముందుగా మీరు మీ చదువులు పూర్తి చేసుకోండి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి అలాగని మీరు మాట్లాడుకోవద్దని కానీ మీ ప్రేమను చంపుకోమని కానీ నేను చెప్పడం లేదు ఒక స్థాయి మీకు వచ్చిన తర్వాత మీకు ఇళ్లలో మీ విషయం చెప్పే ధైర్యం మీకు వస్తుంది తర్వాత వాళ్లను మీరు కన్విన్స్ చేసుకోండి మొదట్లో కన్విన్స్ కారు కాకపోతే వాళ్ళు ఒప్పుకునే వరకు ఎదురు చూడండి.. మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో నిరూపించుకోండి నిజంగా స్వచ్ఛమైనదే అయితే ఇలా చదువును వృధా చేసుకోరు… మీ చదువులు కొనసాగించండి ఆ తర్వాత కూడా మీ మనసులు ఇలాగే ఉంటే నేను చెప్పినట్లు చేయండి అప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుంటే నేను చేస్తాను మీ పెళ్లి.. అంతేకానీ ఇలా ఇద్దరు కలిసి తిరగడం లాంటివి ఈ ఊర్లో చేయకండి అంటే వేరే ఊర్లో చేయమని అర్థం కాదు నా మాటలు మీకు అర్థమైతే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి మీ నిర్ణయం ఇప్పుడే చెప్పమని నేను అడగడం లేదు ఒక రెండు రోజులు సమయం తీసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి చాలు.. పూజారి గారు ఇకముందు వీళ్ళు గుడికి వచ్చినప్పుడు తీర్థ ప్రసాదాలు ఇచ్చి బయటకు వెళ్లే వరకు గమనించండి మొన్నటిలాంటి సంఘటన ఇంకొకసారి జరగకూడదు” అని చెప్పి సంజయ్ కుసుమను వెళ్ళిపోమని చెప్పింది.
తర్వాత పూజారి గారిని లోపలికి పిలిచి వారితో శివరాత్రి ఉత్సవాల గురించి మాట్లాడి వారికి ఆతిథ్యం ఇచ్చి పంచల చాపు పెట్టి సాగనంపింది నీలాంబరి.
అప్పుడే బయటకు వచ్చిన భూపతి..” ఏంటి నీలా సామాజిక కార్యక్రమాలు బాగానే నిర్వర్తిస్తున్నట్లున్నావ్”? అన్నాడు నవ్వుతూ..
” చూసి కూడా తప్పులు దిద్దకుండా ఎలా ఉండగలనండి చేతనైనంత సహాయం చేద్దామని” అని చెప్పింది నీలాంబరి.
” సరే నీలా నేను కొంచెం మున్సిపల్ ఆఫీస్ వరకు వెళ్లి వస్తాను నాకు కొంచెం పని ఉంది” అని చెప్పాడు భూపతి..
” అవునా మున్సిపల్ ఆఫీస్ వైపు వెళ్తున్నారా నేను మొన్న గుడికి వెళ్ళేటప్పుడు రోడ్లు అస్సలు బాగాలేవు శుభ్రం కూడా చేసినట్టు అనిపించలేదు ఒక్కసారి మీరు ఆ విషయం వారికి చెప్పండి” అని చెప్పింది నీలాంబరి.
” అసలు నువ్వు ఏ విషయం వదలవా అన్ని విషయాలు బాగానే తెలుసుకుంటున్నావు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా ఏంటి?” అన్నాడు నవ్వుతూ.
” అధికారంలో ఉంటేనే చేయాలా మామూలు మనిషిలా ఇలాంటివి చేయకూడదా? ఈ ఊర్లో నేనొక కార్యకర్తను అనుకోండి” అని చెప్పింది నీలాంబరి.
నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు భూపతి.
ఇంకా ఉంది