సంధి అంటే…

తెలుగు వ్యాకరణం – నాల్గవ భాగం

రంగరాజు పద్మజ

ఆమ్రేడితం గురించి చిన్నయసూరి “ద్విరుక్తం యొక్క పరరూపం ఆమ్రేడితము” అని నిర్వచనం చెప్పారు. ద్విరుక్తం అనగా ఒకే పదం రెండుసార్లు రావడమని అర్థం. పరరూపం అనగా సంధి పదంలోని రెండవ పదం. ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితమంటారని సూత్రార్థం.

ఇప్పుడు ఆమ్రేడిత సంధిలోని వివిధ సూత్రాలను పరిశీలిద్దాం….
1) అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి తరచుగానగు.
పూర్వ రూపంలో చివరనున్న అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి ఎక్కువ భాగం జరుగుతుంది. సూత్రంలో తరచుగా అని చెప్పడం చేత కొన్నిచోట్ల వైకల్పికముగా కూడా జరుగుతుందని భావం.
ఔర+ ఔర …ఔరౌర
ఆహా +ఆహా… ఆహాహా
ఊరు +ఊరు… ఊరూరు
అక్కడ+ అక్కడ …అక్కడక్కడ మొదలైనవి.
సూత్రంలో తరచుగా అనడం చేత
ఏమి+ ఏమి… అన్నప్పుడు సంధి జరిగితే ఏమేమి అవుతుంది. సంధి జరిగిన పక్షంలో యడాగమం వచ్చి … ఏమియేమి అవుతుంది.
ఏగి+ ఏగి అన్నప్పుడు ఏగి అనేది క్త్వార్థకం కాబట్టి క్త్వార్థక ఇకారం మీద సంధి రాదు కాబట్టి యడాగమం వచ్చి ఏగియేగి అనే రూపం ఏర్పడుతుంది.
రెండవ సూత్రం చూద్దాం.
2)ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్ల అదంత ద్విరుక్తటకారంబగు.
సూత్రార్థం చూద్దాం! కడ మొదలైన పదాలకు ఆమ్రేడితం పరమైతే పూర్వ పదంలోని తొలి అక్షరం తప్ప దాని మీద ఉన్న అక్షరాలన్నిటికి కలిపి అదంత ట కారం అంటే ” ట్ట” అనేది ఆదేశంగా వస్తుందని భావం.
కడ +కడ …కట్టకడ
చివర+ చివర …చిట్టచివర
పగలు+ పగలు… పట్టపగలు
బయలు+ బయలు బట్టబయలు మొదలైనవి.
కడాదులని క్రింది వాటిని పిలుస్తారు.
కడ, ఎదురు, కొన, చివర, తుద,తెన్ను, తెరువు పగలు, బయలు మొదలైనవి.
ఇంకా మూడవ సూత్రం చూద్దాం!
3)నిందయందు ఆమ్రేడితంలో ఆద్యక్షములకు హ్రస్వ దీర్ఘములకు గి గీ లగు.
నిందను చెప్పే సందర్భంలో ఆమ్రేడితం అనగా రెండో పదంలో మొదటి అక్షరం హ్రస్వం ఉంటే గి వస్తుంది, దీర్ఘం ఉంటే గీ వస్తుంది అని సూత్రార్థం.
రావణుడు +రావణుడు… రావణుడు గీవణుడు ఇక్కడ రెండవ పదంలోని రావణుడు పదంలోని రా కు బదులుగా గీ వస్తే రావణుడు గీవణుడు అని అవుతుంది.
అలాగే కుంభకర్ణుడు+ కుంభకర్ణుడు… కుంభకర్ణుడు గింభకర్ణుడు
పుస్తకం+ పుస్తకం … పుస్తకం గిస్తకం
పూలు+ పూలు… పూలు గీలు అవుతుంది.

ఇక నాలుగో సూత్రం చూద్దాం
4) ఆమ్రేడితం పరమగునప్పుడు విభక్తి లోపం బహుళముగానగు.
మొదటి పదం చివరనున్న విభక్తి ప్రత్యయానికి ఆమ్రేడితం పరమైతే ఆ విభక్తి ప్రత్యయానికి లోపం బహుళంగా వస్తుంది, అనగా అనేక రకాలుగా రాచ్చునని సూత్రార్థం.
అప్పటికిన్ + అప్పటికిన్
ఇక్కడ కిన్ అనే షష్టి విభక్తి మీద సంధి జరిగితే విభక్తి లోపించి అప్పటప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. ఒకవేళ సంధి జరగకపోతే రెండవ పదంలోని మొదటి అచ్చు విభక్తి ప్రత్యయముతో కలిసి అప్పటికనప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. అక్కడన్+అక్కడన్ …అక్కడక్కడన్ లేదా అక్కడనక్కడన్ అని అవుతుంది.
మరొక ఉదాహరణ చూద్దాం!
ఊరన్+ ఊరన్ …ఊరూరన్ లేదా ఊరనూరన్ అని వస్తాయి .
సూత్రములో బహుళమని చెప్పడం చేత ఇంచుక , నాడు మొదలైన పదాలు చివరి అక్షరం లోపించి సంధి జరుగుతుంది.
ఇంచుక + ఇంచుక… ఇక్కడ మొదటి పాదంలో చివరి అక్షరం క లోపిస్తే ఇంచించుక అవుతుంది. క లోపించకుంటే ఇంచుకించుక అవుతుంది. అలాగే
నాడు+ నాడు…. నానాడు లేదా నాడు నాడు అనే రూపాలు కూడా ఏర్పడతాయి.
ఇక ఐదవ సూత్రం చూద్దాం
5) ఆమ్రేడితం పరమగునప్పుడు మధ్యమ ము,డుజ్ లకు లోపం విభాషనగు.
డు, ము, వు,లు మొదలైన విభక్తి ప్రత్యయాలు కాగా డుజ్,రు,వు,రు,ను,ముజ్ అనేవి క్రియా ప్రత్యయాలు. ఈ క్రియా ప్రత్యయాలలో మధ్యమ పురుషను చెప్పేటప్పుడు బహువచనములో ము ప్రత్యయము ఏకవచనంలో డు ప్రత్యయము అనేవి విభాషగా లోపిస్తుందని సూత్రార్థము. ఉండుము+ ఉండుము… సంధి జరిగితే ము లోపించి ఉండుండుము అవుతుంది. సంధి జరగకపోతే ఉండుముండుము అనే రూపాలు వస్తాయి.
ఇలాగే కొట్టుడు+ కొట్టుడు… కొట్టుకొట్టుడు
కొట్టుడు కొట్టుడు అనే రూపాలు వస్తాయి.
ఇక ఆరవ సూత్రం చూద్దాం!
ఆమ్రేడితంలో అనేక రకాలుగా కార్యాలు రావడం వలన అన్ని ప్రయోగాలకు సూత్రాలు నిరూపించడం కష్టం కనుక ఒక నిపాత సూత్రంతో వాటికి సాధుత్వం కల్పించాలని చిన్నయ సూరి ఈ సూత్రాన్ని చెప్పాడు. దాన్ని చూద్దాం!
6) అందదుకు ప్రభృతులు యథాప్రయోగముగా గ్రాహ్యములు.
వివరణ చూద్దాం! అందదుకు మొదలైనవి కవి ప్రయోగాలను యథాతథంగా స్వీకరించాలని సూత్రార్ధము.
అదుకు+ అదుకు….అందదుకు
ఇంకులు+ ఇంకులు..ఇఱ్ఱింకులు
ఇగ్గులు+ ఇగ్గులు… ఇల్లిగ్గులు
చెదురు+ చెదరు …చల్లచెదురు, చెల్లాచెదురు
తురుము+తురుము …తుత్తుమురు
తునియలు+ తునియలు… తుత్తునియలు మిట్లు+ మిట్లు, మిరుమెట్లు మొదలైనవి .
పైన ఉన్న ఉదాహరణలు పరిశీలించండి. ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్కరూపంలో ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం సృష్టించడం కష్టం కనుక ఇలా సూరి తెలివిగా నిపాతం చేశాడు.

సశేషం

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సహజ ఉషస్సు

అపార్ధం