మన మహిళామణులు

దూరదర్శన్ లో కొత్త వెలుగులు నింపిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి యార్లగడ్డ శైలజ గారు సేకరణ… అచ్యుతుని రాజ్యశ్రీ

భారతదేశ ప్రజలకు పరిచితమైన మొట్టమొదటి దృశ్యమాధ్యమం దూరదర్శన్, తెలుగు భాషలో తొలి తెలుగు టీవి ఛానల్ తొలితరం తెలుగు కార్యక్రమాల సరళకి మహిళా దర్శకురాలిగా పాదులు తీర్చిన ధీమాన్య శ్రీమతి యార్లగడ్డ శైలజ.

చేసే పనిని ప్రేమిస్తూ చెయ్యమనే స్ఫూర్తిని తరువాతి తరాలకు పంచి ఇచ్చిన మూర్ధన్య సమర్ధతతో, నిబద్ధతతో అజేయంగా రాణించి వృత్తికి అంకితమవ్వటంలో వరేణ్య అలుపన్నది ఎరగక శ్రమించి నేర్పు, ఓర్పుతో హైదరాబాద్ దూరదర్శన్ చరిత్రలో చెరగని సంతకం చేసిన స్ఫూర్తిదాయిని శైలజ.
తన సృజనాత్మకతతో రూపకల్పనకు తలుపులు తెరుచుకుని అంచులు లేని ఆకాశంలోకి ఉవ్వెత్తున దూసుకుపోయిన మహిళా దర్శకురాలు సమాజహితాన్నీ, గ్రామీణ భవితవ్యాన్నీ, వయోజనుల వికాసానికీ ఉపకరించే కార్యక్రమాలకు రూపకల్పన చేసిన హితైషి.
భావవల్లరితో శ్రవ్య గీతాలకు దృశ్యరూపాన్నిచ్చి లలితగీతాలకు పాటల పల్లకి మోసిన బోయీ ఆమె పదనర్తనంతో మువ్వల సవ్వడితో ప్రేక్షకుల మనస్సులను మంజీర నాదాలతో మురిపించిన సృజనశీలి పెంబర్తి, కలంకారీ వంటి అనేకానేక వృత్తిచిత్రాలు (documentaries)లతో జనజీవితాలను జాగృతం చేసినా, రైతేరాజుని చేసి కర్షకులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించినా గానగాంధర్వంతో శాస్త్రీయాన్నీ లలితగీతాల్నీ జానపదాల్ని ఏకంచేసే రసరమ్య కార్యక్రమాలను దృశ్యీకరించినా ప్రతిభామూర్తుల్నీ, విజ్ఞాన వీచికల వంటి వందలాది లఘు చిత్రాలు నిర్మించినా,

శాస్త్ర ప్రహేళికతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పొహళించినా India Innovates, అన్వేషకులు, గ్రామీణ భారతం, ఆరోగ్య భారతం ఒకటేమిటి! దేనిని ఎంచిచూపితే దాన్ని అందుకుని బుల్లితెరపై అనన్య సామాన్యమైన అంశాలకు ఊపిరిలూదిన ప్రసార ప్రవీణ శ్రీమతి యార్లగడ్డ శైలజ.
పద్మవిభూషణ్‌ డాll మంగళం బాలమురళీ కృష్ణగారు, సాలూరి రాజేశ్వరరావుగారు కళాతపస్వి డాll కె. విశ్వనాథ్‌గారు, డాll అక్కినేని నాగేశ్వరరావుగారు, శ్రీమతి సుశీల, జానకి, వాణీజయరాం వంటి మహామహుల కార్యక్రమాలను భావితరాల ప్రేక్షకుల కోసం రూపొందించి నిక్షిప్తం చేసినవి ఎన్నెన్నో!

International Children Film Festival అయినా, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలయినా, కృష్ణా మహోత్సవాలు, జానపద ఉత్సవాలయినా ఆమె ఉండవలసినదే! దూరదర్శన్ తెలుగు టీవీ ప్రతిష్ఠను తన దర్శకత్వ సామర్థ్యంతో ఆకాశపు అంచులకు చేర్చి ప్రతిష్టాత్మక బంగారు నందులను కైవశం చేసుకున్నారామె. జాతీయ స్థాయి బహుమతులను, తెలుగు భాషా పురస్కారం వంటి అవార్డులెన్నో అందుకుని మహిళా దర్శకురాలిగా విజయకేతనం ఎగరవేసిన బహుముఖీన ప్రతిభాసమాన్విత శ్రీమతి యార్లగడ్డ శైలజ.

వృత్తికి తన వ్యక్తిత్వంతో వన్నెతెచ్చిన దర్శక విదుషీమణి మృదు భాషణం తన నైజం. చిరునవ్వే చిరునామాగా, ఆనందమే ఆనవాలుగా, కల్మషం లేని అరమరికలు లేక ఆత్మీయతను పంచే నారీశిరోమణి! అలంకరించిన పదవులు, అందుకున్న అవార్డులు, ఛేదించిన లక్ష్యాలు, చేరుకున్న గమ్యాలు అనంతమైనా, ఆ కలుపుగోలుతనం కళాకారులకు సంతృప్తికరం. తెలుగు ప్రేక్షకులకు ఆచంద్రార్కం నిలిచిపోయే కార్యక్రమాల రూపకల్పనలో కష్టించిన వైనం చర్విత చరణం!

 

మా స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో గలగలపారే బకింగ్ హామ్‌ కెనాల్ ప్రక్కనున్న ఒక చిన్న గ్రామం గుడినాడ మా నాన్నగారు పిన్నక వేంకటేశ్వరరావుగారు గ్రేడ్-1 తెలుగు పండిట్‌గా కొలకలూరు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పనిచేశారు. అమ్మ చారుమతి గృహిణి. మంచి హార్మోనియం ప్లేయర్. వృత్తి రీత్యా నాన్నగారు ఉపాధ్యాయులైనా ప్రవృత్తి రీత్యా నటులు, దర్శకులు, రచయిత కూడా వ్యవసాయాధారిత కుటుంబం కావడంతో వ్యవసాయం పట్ల కూడా మక్కువ వుండేది. స్కూలు, వ్యవసాయం, నాటక కళాపరిషత్తుల కార్యక్రమాలు, నటులుగానే కాకుండా నాటకాలకు, దర్శకత్వం వహించటంతో మా చిన్నతనమంతా చాలా busyగా వుండేవారు.

మా తల్లిదండ్రులకు మేము ఐదుగురు సంతానం. ఒక అన్నయ్య. ముగ్గురు అక్కయ్యలు. మేం అతి చిన్న పల్లెటూరిలో వున్నా మా అందరినీ ఉన్నత విద్యలు చదివించి, జీవితాల్లో అందరూ స్థిరపడేలా చేశారు అమ్మ, నాన్నగార్లు. భేషజాలు తెలియని సంస్కారవంతులైన ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళం కావడంతో బంధాలకు, బంధుత్వాలకు ఉన్నతమైన విలువనిస్తాం అందరం.

నా ప్రాధమిక విద్యాభ్యాసం మా ఊరికి దగ్గర్లో వున్న కొలకలూరు హైస్కూల్‌లోనే. 10th వరకు చదివిన తరువాత ఇంటర్మీడియెట్ కోసం గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చేరాను. అక్కడే బి.యస్.సి హోమ్‌ సైన్స్ చదివాను. తెలుగు భాషపై మక్కువతో భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజీలో యం.ఎ ‍(తెలుగు) చేశాను. చదువు పూర్తి అవుతుండగానే బాపట్ల అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో డిమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగం రావటం, చేరటం త్వరత్వరగా జరిగిపోయాయి. వృత్తిరీత్యా ఉద్యోగం బాగానే వున్నా నా ప్రవృత్తికి చేరువకాలేని అంశం కొంచెం బాధించేది. అతి తక్కువ వ్యవధిలోనే నాకు నచ్చిన Doordarshanకు వెళ్ళటం సంతృప్తిగా అనిపించింది.

విద్యార్థిగా ఉన్నప్పుడు Schoolలో, Collegeలో ఏ competetions వున్నా పాల్గొనటం బహుమతులు తెచ్చుకోవటం పరిపాటిగా వుండేది. తెనాలి తాలుకా స్థాయిలో జరిగే పోటీల్లో కూడా పాల్గొంటూ వుండేదాన్ని. విజయవాడ ఆలిండియా రేడియో ఆర్టిస్టుగా యూత్ Progలో చేయటం, బాపట్ల Agriculture dept ద్వారా వ్యవసాయదారుల కార్యక్రమాల్లో AIRలో అనేకానేక Progలో చేయటం మరచిపోలేని అనుభూతులే! ఆకాశవాణికి వెళ్ళినపుడు అన్పించేది, ఇలాంటి సంస్థలో పనిచేయటం ఎంత గొప్పవరమో అని! భగవంతుడు ఆవరాన్ని నాకు కూడా ఇస్తాడని ఎన్నడూ అనుకోలేదు!

అమ్మ సంగీత ప్రభావం, నాన్నగారి సాహిత్య ప్రభావం నా మీద ఎక్కువగానే వుండేది. ఎక్కడ నాటక ప్రదర్శనలున్నా హరికథా కాలక్షేపాలున్నా, పౌరాణికనాటకాలకయినా నాన్నగారు వెంట తీసికొని వెళ్లటం, ఆలిండియా రేడియో కార్యక్రమాల్లో పాల్గొనటం నేను సామాజిక మాధ్యమాల పట్ల ఆకర్షితురాలిని కావటానికి దోహదం చేశాయి. ఆ Interestతోనే దూరదర్శన్ లాంటి ఒక అద్భుత దృశ్యమాధ్యమంలోకి అడుగుపెట్టేలా చేశాయి.

హోమ్ Science ప్రధాన అర్హతగా తెలుగు భాష రెండో అర్హతగా నేను Doordarshanకి ఎంపిక కావటానికి ఉపయోగపడింది నా చదువు. భారత ప్రభుత్వం వారి Broadcast Corporation of India వంటి ప్రతిష్ఠాత్మకమైన దూరదర్శన్‌లో Producer అంటే కార్యక్రమాల దర్శకురాలిగా నియమించబడటం జరిగింది. పూణే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇండియాలో దర్శకత్వశాఖలో తీసుకున్న శిక్షణ దృశ్యరూపకల్పనకి ఉన్నతంగా ఉపయోగపడింది.

టెలివిజన్ రంగం వేళ్ళూనుకుంటున్న రోజుల్లో గ్రామీణ స్థాయి ప్రజలకు ఉపకరించే అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలకు దర్శకత్వం వహించే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా నాశాయశక్తులా కష్టపడి పనిచేసి అధికారుల, తోటి ఉద్యోగుల మన్ననలతోపాటు అఖండ ప్రేక్షక కోటి ఆశీస్సులు కూడా అందుకున్నాను. 24 విభాగాలనూ సమన్వయం చేసుకుంటూ ఒక ప్రభుత్వ ఛానెల్ విధివిధానాలను అర్థం చేసుకుంటు ప్రేక్షకులకు ఇష్టమైన కార్యక్రమాలను రూపొందిస్తూ స్టూడియో రికార్డింగ్‌లూ, అవుట్‌ డోర్‌ దృశ్యీకరణలూ క్షణం తీరికలేని వృత్తి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాను.
బాలల కార్యక్రమాలు, వనితల కోసం, వయోజనుల కోసం, వ్యవసాయదారుల కోసం, యువత, సంగీతం, సాహిత్యం, నాటకాలు, నృత్యనాటికలు, ప్రముఖులతో పరిచయాలు, లలితగీతాలు, జానపద గీతాలు, విజ్ఞానం, డాక్యుమెంటరీలు, వార్తాప్రసారాలు ఒక్కటేమిటి! మూడుపదులకు పైగా వున్న వృత్తిజీవితం స్వర్ణయుగంలా గడిచిపోయింది. మొదటితరం మహిళాదర్శకురాలిగా నా స్థానాన్ని సుస్థిరం చేసింది దూరదర్శన్.

డాll బాలమురళీ కృష్ణగారు, డాll కె. విశ్వనాథ్‌గారు, సాలూరి రాజేశ్వరరావుగారు, డాll అక్కినేని నాగేశ్వరరావుగారు, మురళీమోహన్‌గారు, వాణిశ్రీగారు, జమునగారు, రామానాయుడుగారు, యం.యస్‌. రామారావుగారు, రమేష్‌ నాయుడుగారు, పి. లీల, జిక్కీ కృష్ణవేణి, జమునారాణి, వసంత, SP శైలజ, మనో, పి.బి. శ్రీనివాస్ ఒకరా! ఇద్దరా! ఎందరెందరో ప్రముఖులతో రూపొందించిన కార్యక్రమాలు నాకు ప్రేక్షక నీరాజనాలందించాయి.

హైదరాబాద్, గుల్బర్గా (కన్నడ కార్యక్రమాల దర్శకురాలిగా) విజయవాడ దూరదర్శన్ కేంద్రాలలో పనిచేయటం, వేలకొద్దీ కార్యక్రమాలు, వందలాది రికార్డింగ్‌లు చేయగలగటం దూరదర్శన్ ద్వారా నాకు వచ్చిన మహావకాశం. India Innovates అనే జాతీయ కార్యక్రమం, అనేక భక్తిగీతాలు, డాక్యుమెంటరీలు, శాస్త్రీయ నాట్యం, ఢిల్లీ దూరదర్శన్ నుండి ప్రసారమయ్యాయి.

ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఆరు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, నాలుగు జాతీయ స్థాయి అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ తెలుగు బాషా పురస్కార అవార్డు, వివిధ సాంస్కృతిక సంస్థల నుండి వరుసగా ఆరు సార్లు Best Producer అవార్డు అందుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. ఆంధ్రరాష్ట్రంలోని వివిధ సాంస్కృతిక సంస్థలు అందించిన సన్మానాలు, సత్కారాలు, అవార్డులు నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి.

ఈ ప్రయాణంలో సహకరించిన నా కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా ఆసక్తినీ, నా అభిరుచిని గౌరవిస్తూ, ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్నిస్తూ నా వెన్నంటి వుండే నా భర్త యార్లగడ్డ కుటుంబరావు (quality control chemist‌) గారు. తన చదువు, శాస్త్రీయ నాట్యం, యాంకరింగ్, యాడ్స్ ఆర్టిస్ట్‌గా బిజీగా వుండే నా కూతురు యార్లగడ్డ శరద్యుతి. మా అన్న, అక్కయ్యల కుటుంబాలు, అత్తగారి వైపు బంధువులు, నా బలం, బలగం..

దూరదర్శన్‌లో 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతోపాటు పదవీ విరమణ అనంతరం నాకు ఈటీవి అభిరుచి ఛానెల్ హెడ్‌గా అవకాశమిచ్చి నా వృత్తి జీవితానికి కొనసాగింపు నిచ్చిన ఈటీవీ చైర్మన్ శ్రీరామోజీరావుగారికి, ఈటీవీ సి.ఇ.ఒ. బాపినీడు గార్కి సదా ఋణపడి వుంటాను.

ప్రతి క్షణాన్నీ, ప్రతి సందర్భాన్నీ ఒడిసిపట్టుకుని సృజనాత్మకంగా కార్యక్రమాలను రూపొందించి ప్రేక్షకులకు చేరువవటంలో వున్న ఆనందాన్ని ఆస్వాదించాను. ఈ దృశ్య మాధ్యపు మజిలీలో ఎందరో మేధావులు, మరెందరో నిష్ణాతులు, వేవేల కళాకారులు, వందలాది సంస్థల సహకారం, నా జన్మను చరితార్థకం చేశాయి. అందుకు కారణమైన ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు

— మీ యార్లగడ్డ శైలజ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను

మంచి మాట