(ఇప్పటివరకు: సుబ్బారావు పైన 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. సుబ్బారావు ఈ కేసు నుండి బయటపడటానికి లాయర్ కోదండపాణిని ఆశ్రయించాడు. బెయిలు దొరికింది. త్వరలోనే మైత్రేయి కేసుని కోర్ట్ లో సబ్మిట్ చేస్తానని సబ్ ఇన్స్పెక్టర్ రమణారావు వసుంధరకి చెప్పాడు . అది తెలియగానే ఆ రోజే వసుంధర మైత్రేయి ఇంటికి వెళ్ళింది. ప్రత్యక్ష సాక్షిగా మైత్రేయి ఇంటి ఓనర్ రమాదేవి సరైనదని నిర్ణయించుకొని వాళ్ళని తన ఇంటికి ఆహ్వానించింది.)
“పంతులుగారు! మీరొక పెద్ద పని చేసి పెట్టాలి ! అందుకు మీ ఋణం ఉంచుకొనులెండి!”
‘అమ్మో లాయర్ గారెంటీ ఎదో పెద్దపని అంటున్నారు’, ”నేను చేయగలిగెదయితే ! చిత్తం!” నాన్చుతూ చెప్పాడు.
“మా గుడిలో ఆంజనేయ స్వామి వారికి ప్రధాన అర్చకుడిగా మిమ్మల్ని తీసుకుందామని అను కొంటున్నాను. ఏమంటారు?“ కళ్ళలో మెరుపులు మెరిసాయి పంతులు గారికి. చెప్పండి నన్నేం చేయమంటారు?” అయినా ఎదో అనుమానంతో కూడిన భయం ఆయన మనసులో మెదులుతూనే ఉన్నది.
“అంత మంచి అవకాశం ఇస్తానంటే వద్దని చెప్పడానికి నాకు మనసెలా ఒప్పుతుంది,నా పిండాకూడు!”
“అయితే మీరు మాకు ఒక మంచి పనిచేసిపెట్టాలి. అదీ మీ శ్రీమతిగారితో”
“దేనికి? ఎప్పుడు? ఎవరికోసం? అదివోత్తి చాదస్తురాలు లాయర్ గారు, ” భయంగా చూసాడు.
“మీరంతగా భయపడాల్సిందేమీ లేదు. మీకు తెలిసింది చెపితే చాలు . ఏమంటారు ?”
భయం గానైనా పూజారి పోస్ట్ వస్తుందన్న ఆశతో హామీ ఇచ్చి ఇంటికెళ్ళాడు ఆయన అన్యమనస్కంగా.
“రేపు మీ ఆవిడను కూడా తీసుకు రండి”, అంటూ చెప్పింది వసుంధర వెళుతున్న పంతులుగారితో.
ఆ మరునాడే పంతులుగారు,రమాదేవి వసుంధర వాళ్ళింటికొచ్చారు.
“నమస్తే అమ్మ , నమస్తే పంతులు గారు !” అంటూ చాల సాదరంగా వారిని ఆహ్వానించాడు జూనియర్ లాయర్ సుమంత్. వారిని క్లైంట్స్ రూమ్ లో కూర్చోపెట్టి లాయర్ గారికి చెప్పాడు .
“వసుంధర! చూడు ఎవరొచ్చారో, ఒక సారి ఆఫీస్ లోకిరా అంటూ “, ఇంటర్ కమ్ లో చెప్పాడు ఆయన .
“ఓహ్! వచ్చేసారా !”,అంటూ రెండు కాఫీ కప్పులతో వచ్చింది వసుంధర.
తెల్లటి అరగంజచీర మీద పింక్‌కు పూలతో ఉన్న ప్రింటెడ్ చీర, మేడలో పొడవైన మంగళసూత్రంతోపాటు ఉన్న రెండుపేటల నల్లపూసల చైను , డైమండ్ ముక్కుపుడక,కమ్మలు ఒక చేతికి నాలుగు బంగారుగాజులు , మరోచేతికి రిస్ట్ వాచ్ తోటి కోర్ట్ కు వెళ్ళటానికి సిద్ధమయి ఆఫీస్ లోకి వచ్చింది వసుంధర. ఆమె ను చూస్తే ‘’శారదాంబే (దేవతే) నడిచి వస్తున్నట్లుగా అనిపించింది పంతులుగారికి. ఆమెను కాస్త వివరంగానే తన ఎక్స్ రే కళ్ళతో చూసేసింది రమాదేవి.
“సార్! మీకు చెప్పాను కదా మన మైత్రేయి వీరి ఇంట్లోనే ఉంటుంది బాడుగకి. వీళ్లే అక్కడ ఉన్న వాళ్ళందరి మంచి చెడులు చూసుకుంటూ, చాలా సాయంగ ఉంటారు .”, అంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టింది.
ఇంక మౌనంగా ఉండలేక పోయింది రమాదేవి. “అవునండి. మా ఇంట్లో రెంట్ కొచ్చేవాళ్ళు కూడా అంతే. ఎవ్వరు ఒక పట్టాన వెళ్లారు. మేమంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉంటాము, ” అంటూ చెప్పసాగింది.
“అవునండి! మరయితే మైత్రేయి తోటి వాళ్ళాయన, అదే సుబ్బారావు గారు రెండు మూడు నెలల క్రితం గొడవపడ్డారు కదా. అయన చేయి చేసుకున్నాడు కూడా!”’
“అవునండి ! ఆ పిల్ల మాత్రం ఊరికే ఉన్నదా ,నిలువెత్తుమనిషిని లాకోచ్చి వీధి గుమ్మలో పడేసి, లోపల గడియపెట్టు కుంది.”
“మరయితే మీరు సుబ్బారావుని కొడుతుంటే చూడలేదన్న మాట. ”
“అయ్యో లేదండి! అది కూడా చూసానండి,” పంతులు గారు మోచేతితో పొడుస్తూనే ఉన్నారు, కానీ రమాదేవికి అదేమీ పట్టలేదు తనకే చాల తెలుసన్న ఉత్సాహంలో చెప్పుకుపోతున్నది. “మీకెలా తెలిసింది వాళ్ళు గొడవపడటం “,
“మాకు, వాళ్ళ ఇంటికి మధ్యన వరండా ఒక్కటేనండి. వాళ్ళింట్లో చీమ చిటుక్కుమన్నా విన్పించేస్తుంది. పైగా సుబ్బా రావు ఎమన్నా చిన్నగా మాట్లాడాడా! .పదూళ్ళకు వినిపించేట్టు మాట్లాడితేను.ఎంటబ్బా గొడవ అని వరండాలోకి వచ్చి చూస్తే మొగుడు పెళ్ళాం గొడవపడుతున్నారు.”
“అంటే! మీరంతా చూసారన్న మాట!”.
“అవును మరి! సినిమాలాగే కనిపిస్తేను! ఆయన ఆ పిల్లను బాగా చితకబాదాడు.నేననుకోలేదు, హాఠాత్త్గా ఆ పిల్ల కూడా తిరగపడింది. ఎక్కడ కొట్టిందోగాని చెట్టంత మనిషి విలవిలల్లా డిపోయాడు.”
‘’అవును మరి పడుతున్న దెబ్బలకు ఆమె కూడా ఎంత విలవిల్లాడిపోయిందో, అది ఈమె కంటికి కనిపించదు. ఆడవాళ్లకు కూడా నెప్పిపుడుతుంది వాళ్ళుకూడా విలవిల్లాడిపోతారని ఈ ఆడవాళ్లే ప్పుడు తెలుసుకుంటారో “ అని తన స్వగతం లోనే అనుకోంది లాయర్ వసుంధర.
వెంటనే లేచెళ్లి “వేంకటగిరి జరీ చీర , అరటి పండ్ల తాంబులం ఒక జత పట్టు పంచలున్న పళ్లెంతో వచ్చి ఆ దంపతు లిద్దరికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు వసుంధర వెంకటేశ్వర్లు గారు.
“మీరెందుకు పిలిపించారో చెప్పనే లేదు,” అని చాల సంతోషంగా అడిగాడు
“ అదే , మీ శ్రీమతి రమాదేవి గారితోటి ఒక సాక్ష్యం చెప్పించాలండి! అదే రమాదేవిగారీ విషయం మైత్రేయి తరఫున కోర్ట్ లో చెప్పగలుగుతారా !”. ఆమెకి నోటా మాట రాలేదు.
“మీకేమి భయం లేదు. అన్ని నేను చూసుకుంటాను. మీరు నేనే చెప్పమన్నట్లు చెబితే చాలు. ఏమంటారు.” కాస్త సీరియస్ గానే అడిగింది వసుంధర.
“మాకేమీ పోలీస్ వాళ్ళనుంచి భయం లేదుకదా!” అడిగాడు ఆయన అనుమానంగా.
“ఆబ్బె అదేమి ఉండదు. రాజ్యలక్ష్మి రేపు రమాదేవి గారిని కలిసి మనం ఏమి కోర్టు చెప్పాలనుకుంటున్నామో అవన్నీ వివరించు. రమణమూర్తి గారికి కూడా చెప్పు. అవసరమైతే ఆయన కూడా వస్తాడు. రేపు వెళ్ళేటప్పుడు కూరగాయలు తీసుకెళ్లడం మరిచిపోవద్దు”, అంటూ “మరిచి పోయాను మీకు చెప్పటం, నేను పిలిచేదాకా మీరు ఎవ్వరితోను ఈ విషయాలేవీ మాట్లాడకూడదు” చాల సీరియస్ గ హెచ్చరిక చేసినట్లు చెప్పింది వసుంధర. మాకు కోర్ట్ కి టైం అయింది రేపు మా అసిస్టెంట్ మిమ్మల్ని కలుస్తుంది సెలవా మరి అంటూ లేచింది “, కాదు కూడదు అనే అవకాశం వాళ్ళకీయలేదు తను.
దారిలో “వసు! వాళ్ళు ఒట్టి అమాయకులు. వాళ్ళనంత భయపెట్టద్దు.” అన్నాడు లాయర్ వెంకటేశ్వర్లు గారు.
“తప్పదండి . రమాదేవిని మనమే మన గుప్పిట్లో ఉంచుకోవాలి. లేకపోతే ఆ కోదండం ఈమె చేత ఏమేమి వాగిస్తాడో కోర్ట్ లో !” గాఢంగా నిట్టూర్చింది.
(ఇంకావుంది)