దొరసాని

ధారావాహికం – 20 వ భాగం

లక్ష్మి మదన్

సాయంత్రం సంధ్యా దీపం వెలిగించిన నీలాంబరి భూపతిని అడిగింది…

” రాత్రి భోజనం ఏం చేస్తారు చపాతీ చేయమంటారా!” అని అడిగింది..

” వద్దు నీలా మధ్యాహ్నం పులావ్ ఎక్కువగా తినేశాను.. ఏమాత్రం ఆకలిగా లేదు ఏమైనా పండ్లు మాత్రం తింటాను ..అయినా మహేశ్వరి లేదు కదా! ఈ పనులన్నీ ఎందుకు పెట్టుకుంటావు” అన్నాడు భూపతి.

” నాకు కష్టమని మీరు తినడం మానేస్తున్నారా! నాకేం కష్టం కాదు మీకు వండి పెట్టడం కంటే నాకు ఇంకేం కావాలి” అని అన్నది నీలాంబరి.

” అదేం కాదు నీలా ఆకలిగా లేదు మన పెరట్లో జామకాయలు అంజీర కాయలు అవన్నీ మొన్న తెంపి మగ్గ పెట్టాడు కదా నర్సింలు అవే తింటాను మరి నువ్వేం తింటావ్?” అని అడిగాడు.

” నాక్కూడా ఆకలిగా లేదండి మీతో పాటుగా నేను కూడా పండ్లు తిని కొంచెం మజ్జిగ తాగుతాను” అని చెప్పి జామ పండ్లు అంజీర పండ్లు చక్కగా కడిగి ముక్కలు చేసి దేవుడికి నివేదన చేసి ఇద్దరికీ రెండు ప్లేట్లలో పెట్టి ఒకటి భూపతికిచ్చి ఒకటి తాను తీసుకుంది…

రాత్రి ఇద్దరు తొందరగానే పడుకున్నారు.. టీవీలో వచ్చే ఏవో ప్రోగ్రామ్స్ చూడాలని అనుకున్నారు ఏది చూడాలనిపించలేదు కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు..

ఉదయం మహేశ్వరి నర్సింలు ఇద్దరు వచ్చారు మహేశ్వరి ఎప్పటిలాగా మామూలుగానే ఉంది కానీ నర్సింలు మొహంలో కొంచెం భయం కనబడుతుంది.. దొరసాని ఏమైనా తిడుతుందేమో అనే భయం కనిపిస్తుంది…

నీలాంబరి మామూలుగానే ఒక చిరునవ్వు నవ్వి స్నానానికి వెళ్ళిపోయింది…

మహేశ్వరి ఇద్దరికీ చాయ్ చేసి పట్టుకొని వచ్చింది స్నానం చేసి వచ్చిన మహేశ్వరి చాయ్ కప్పు తీసుకొని అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చుంది భూపతి వార్తాపత్రిక చదువుతూ చాయ్ తాగుతున్నాడు..

” మహీ! పని అంతా అయ్యాక 11 గంటలకు నరసింలును తీసుకొని బయట కచేరీలో కూర్చో నేను వచ్చి ఇద్దరితో మాట్లాడతాను” అని చెప్పింది.

” సరేనమ్మా” అన్నది మహేశ్వరి ..ఆ తర్వాత టిఫిన్ చేయడానికి లోపలికి వెళ్ళిపోయింది .

ఎప్పటిలాగానే దీపారాధన పూజ టిఫిన్ చేసే వరకు దాదాపు 11 గంటలు కా వస్తుంది ..మహేశ్వరిని నరసింలును కూడా టిఫిన్ తినేసి రమ్మని చెప్పింది నీలాంబరి.

ముగ్గురు కచేరిలో ఉన్న మూడు కుర్చీలలో కూర్చున్నారు…

” నర్సింలు ఎందుకు ఇంకా పిల్లలు కావాలనుకుంటున్నావు ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలదా! మగ పిల్లవాడు కావాలని ఎందుకు అనుకుంటున్నావు నాకు చెప్పు!” అని అడిగింది నీలాంబరి.

భయంతో చేతులు నలుపుతూ కూర్చున్నాడు నర్సింలు…

” నేను నిన్ను ఏమీ అనను నరసింలు నీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పు” అన్నది నీలాంబరి.

” ఏం లేదమ్మా తలకొరివి పెట్టేది.. రేపు శాతకాకుండా అయితే చూసేది మగ పిల్లలే కదమ్మా అందుకని అట్ల అడిగిన” అన్నాడు నరసింహులు.

“ఇది పాతకాలం కాదు నర్సింలు ఈరోజుల్లో ఆడ మగ అందరూ సమానమే.. సమానంగా చదువుకుంటున్నారు వాళ్ళ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.. ఎంతమంది ఆడపిల్లలు పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు చూసావా… తల్లి గర్భంలో ఆడపిల్లల్ని మగ పిల్లవాడిని సమానంగానే మోస్తుంది పెంచడం కూడా సమానంగానే చేస్తుంది మరి ఈ తేడా ఎందుకు? ఎందుకు నువ్వు ఇంకా ఆవిధంగా ఆలోచిస్తున్నావు రేపు ఈ పిల్లలు నిన్ను చూడరనుకుంటున్నావా! ” అన్నది నీలాంబరి….

” అది కాదమ్మా” నసిగాడు నరసింహులు.

” ఏది కాదురా! చందమామ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆ చందమామ లాగా ఇంట్లో వేయించుకునే అప్పడం ఉందంటే ఎలారా! అందులో పని చేసే ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారో నీకు తెలుసా ఎప్పుడు ఆడపిల్లలని చులకనగా చూడొద్దురా మారండి ఇంకా అలాగే ఉండొద్దు ఒకవేళ నువ్వు మగ పిల్లవాడు కావాలనుకుంటే మళ్లీ ఆడపిల్ల పుట్టిందనుకో ఏం చేస్తావ్!” అన్నది నీలాంబరి..

నీలాంబరి చెప్పే విధానాన్ని అర్థం చేసుకున్న నర్సింలు…

” ఇదంతా అర్థం కాలేదమ్మా అందరూ కొడుకులు ఉండాలే కొడుకులు ఉండాలే అంటుంటే నేను కూడా అట్లే అనుకున్న ఈసారి నుండి మహేశ్వరిని ఏమీ అననమ్మ ఈ బిడ్డలే చాలు మంచిగా చదివించుకుంటా” అన్నాడు నర్సింహులు.

తన మాట విన్నందుకు ఎంతో సంతోషించిన నీలాంబరి…

” నువ్వు అన్ని విధాలుగా మంచోడివి.. ఆ మాట మహేశ్వరి ఎన్నో సార్లు చెప్పింది ఇంట్లో ఎంతో సహాయంగా ఉంటావని కూడా చెప్పింది అలాంటిది ఈ విషయంలో తప్పుగా ఆలోచించావని బాధపడి నిన్ను మందలించాలని పిలిచాను కానీ నీవు తొందరగానే అర్థం చేసుకున్నావు… ఇక వెళ్లి పనులు చేసుకోండి ఇలాంటి గొడవ మీ మధ్య ఎప్పుడూ రాకూడదు” అని చెప్పింది నీలాంబరి.

సంతోషంతో మహేశ్వరి నీలాంబరి కాళ్ళను తాకింది..
” అమ్మగారు నా సమస్య ఇంత తొందరగా పరిష్కారం అవుతుందని నేను అనుకోలేదు..” అన్నది మహేశ్వరి .

“నీది చాలా చిన్న సమస్య.. నీలో నువ్వే ఇన్ని రోజులు బాధపడ్డావు… నాకు చెప్పాల్సింది అయినా నర్సింలు అంత చెడ్డవాడు కాదు చూడు చెప్పగానే ఎంత తొందరగా అర్థం చేసుకున్నాడో ఎంతోమంది మొండిగా వాదించి తాగి ఇళ్లల్లో నానా రచ్చ చేస్తున్నారు వాళ్ళ అందరితో పోలిస్తే నరసింహులు అపోహపడి నిన్ను బాధ పెట్టాడు కానీ ఇప్పుడు నిన్ను ఇంకా బాగా చూసుకుంటాడు ఇంక లోపలికి వెళ్ళు” అని చెప్పింది…

ఇంతలో అలేఖ్య ఫోన్ చేసింది…

” అమ్మా! మొన్న కొంచెం పని ఒత్తిడిలో ఉండి నీకు ఫోన్ చేయడం కుదరలేదు అమ్మ ఇంటికి వెళ్ళాక చేద్దామని అనుకున్న కానీ అలసటగా అనిపించి వెళ్లి పడుకున్నాను ఆ రోజు వంట సుధీర్ చేసి నాకు తినిపించాడు నీవు లేని లోటు నాకు తీరుస్తున్నాడమ్మా ఏం కావాలన్నా కూడా చేసి పెడుతున్నాడు నువ్వు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకు” అన్నది అలేఖ్య..

” అవునా తల్లి చాలా సంతోషం సుధీర్ కూడా నా కొడుకు లాంటివాడే ఇంత మంచి అల్లుడు దొరకడం మా అదృష్టమే. నేను నీ పక్కన లేను అనే బాధ నన్ను నిరంతరం కలిసి వేస్తుంది కానీ తప్పదు…

నీ నోటికి రుచిగా ఉంటుంది కొన్ని పచ్చళ్ళు పంపిస్తాను ఇంకా ఏమైనా పంపించాలా!” అని అడిగింది నీలాంబరి.

” టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇంకా కందిపొడి కరివేపాకు పొడి పంపించమ్మా… నోరు అసలు రుచిగా లేదు ఏం తిన్నా రుచించడం లేదు… అలాగే సీమంతము టైం వరకు అక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాము… మరో రెండు నెలల్లో అక్కడికి వచ్చేస్తాము నేను అక్కడే ఉంటాను సుధీర్ అమెరికా వచ్చి మళ్లీ నా డెలివరీ టైం కి అక్కడికి వస్తాడు అలా ప్లాన్ చేసుకుంటున్నామమ్మ” అని చెప్పింది అలేఖ్య.

ఒక్కసారి నీలాంబరి మొహంలో సంతోషం తాండవమాడింది అంత దూరం నుండి కూతురు వస్తుందంటే సంతోషంగా ఉండదా అందులో సీమంతం కోసం…

” నిజమా అలేఖ్యా! వస్తున్నారా? ఎంత మంచి వార్త చెప్పావు మీ నాన్నకి చెప్తే ఎంతో సంతోషపడతాడు ఇంకా నేను సీమంతం పనులు మొదలు పెట్టుకోవాలి” అని సంతోషంతో చెప్పింది నీలాంబరి.

” నీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయమ్మా నీ ముచ్చటను నేను ఎందుకు కాదంటాను అన్ని ఏర్పాట్లు చేసుకో! అవునమ్మా బాలసదనం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి?” అని అడిగింది.

” పనులు మొదలయ్యాయి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే చకచకానే సాగుతున్నాయి పనులు… ఇంట్లో చిన్నారి పుట్టే వరకు పూర్తవుతుందేమో ప్రారంభోత్సవం నా మనవడితోనో.. మనవరాలతోనో చేయాలి” అన్నది నీలాంబరి.

” అవునమ్మా నా బిడ్డ కూడా అందులో కొన్ని రోజులు ఉండాలి అప్పుడే కదా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని మనకు తెలిసేది మన పిల్లలు ఉంటే ఎలా చూస్తామో అందరి పిల్లల్ని అలాగే చూడగలగాలి నీ తలంపు అదే కదమ్మా” అన్నది అలేఖ్య.

ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఫోన్ పెట్టేసి ఇంట్లోకి వెళ్ళింది నీలాంబరి…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జయము జయము భరతమాత

సమర సేనాని సరిజోడు… కౌసల్యాదేవి !