మనిషి సంఘ జీవి.విచిత్రమైన మనస్తత్వం. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏవో కొత్త ఊహలు చేస్తూ అంతలోనే సంతోషాన్ని అంతలోనే విద్వేషాన్ని రగిలిచ్చేతత్వం. బుద్ధితో ఆలోచించిన మనసుతో అనుభూతి చెందినా తనదైన అస్తిత్వ ప్రకటన కోసం పరితపించే వ్యక్తిత్వం. వెరసి,మనిషి ఓ వింత జంతువు.లోకాన్ని కదిలించాలంటే ముందు మనం కదలాలి కదా అన్నాడు సోక్రటీస్. తిండి తిప్పల నిత్య బ్రతుకు కైనా, ప్రణాళికాబద్ధమైన భావి జీవితానికైనా ముందు నువ్వు కదిలితేనే నీ వెనుక పనులు కదులుతాయి అనేది ఒక చక్కని సందేశం.
అనుకున్న నిర్ణయం సఫలీకృతం కావాలంటే ‘పట్టుదల’ అవసరం. పట్టుదల,మొండి రెండు ఒకటి కాదు.”పట్టుపట్ట రాదు పట్టి విడువరాదు ” అని లోకోతరమైన ఒక పద్యం ఉంది. సక్సెస్ ని అచీవ్ చేయడం అంటే పట్టుదల, persistence కోసం గొప్ప ప్రయత్నాలు చేయడం. పనిని సాధించడానికి దృఢత్వాన్ని, tenacity కలిగి ఉండడం, డిటర్మినేషన్ కలిగి ఉండడం అంటే సంకల్ప బలం గట్టిగా ఉండడం అని అర్థం. పనిని స్థిరీకరించుకునే నిర్ణయం, కావలసిన డిటర్మినేషన్, తగినంత ఓర్పు,సహనం కలిగి ఉండడం ముఖ్యమైనవి. చీకటి పోయి వెలుగు వచ్చే సమయం కాకముందే వేగంగా ఒక నిర్ణయానికి తీసుకొని పరుగులెత్తడం కాదు. మనస్తత్వ శాస్త్రంలో పట్టుదలకు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. నిశ్చయంతో కొనసాగడం లక్ష్యం వైపు నిర్దేశించిన నిరంతర ప్రవర్తన కలిగి ఉండడం, ఆలోచనకు జీవం పోయడం వంటి మాటలు అన్నీ ఎంతో అవసరమైనవి. చెప్పడానికి, వినడానికి, చేయడానికి మధ్య ఉన్న తేడా వంటివి కొన్ని వెనువెంటే వస్తుంటాయి.
తను సాధించాలనుకున్న పనులు ప్రణాళిక బద్ధంగా పెట్టుకోవాలి. ఎలాంటి గందరగోళాలు లేకుండా కార్య రూపానికి తీసుకురావాలి. ఒంటరిగా చేసి సాధించేదా బృందంగా చేసి సాధించేదా, అని ఆలోచన చేయాలి. సంఘ ప్రయోజనమైన విషయాలైతే భేషజాలను వదిలి నడుం బిగించాలి. ప్రారంభించు ఒక్కటే సరిపోదు పూర్తి చేయడం కావాలి. చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలి సమయపాలన కావాలి. అబద్ధాలు ఆడకూడదు! ఎదుటివారి హృదయాన్ని గెలుచుకొనే ఓర్పు ఉండాలి! జయపజయాలు ముందే ఊహించుకోవాలి జయం కోసం కృషి చేయాలి అపజయం ఎదురైతే కృంగిపోవద్దు…. ఉత్తీర్ణత వైపే దృష్టి సారించాలి కానీ ఫెయిల్యూర్ ఆలోచన రానివ్వకూడదు ఫెయిల్యూర్ అయితే మాత్రం మళ్లీ సాధించడం కోసం కృషి చేయాలి. అప్పుడే పూర్ణత్వం సాధించుకుంటుంది.. వేరే వారికి మార్గ నిర్దేశం చేసే శక్తి వస్తుంది. సంతోషం సగం బలం అన్నారు కదా. చేసేవి వ్యాపార వాణిజ్య పనుల విషయాలైతే నైతిక విలువలు లేని వ్యాపారం చాలాకాలం కొనసాగదు. పెట్టుబడి రాబడి రెండు జమిలీ గా ఉండేవే. పెట్టిన అమౌంట్ కంటే నమ్మకము దీనికి మూలధనం. వ్యయ ప్రయాసల అంచనాలు ముందే తెలుసుకోవాలి. ఆర్థిక లాభాలు లావాదేవీలు ఒక పట్టాన సాధారణ మనుషులకు ఒంట బట్టవు. ఈ పోటీ ప్రపంచంలో భౌతికంగా బలమైన స్థితిలో ఉన్నప్పుడే ప్రయోజనం పొందడం సులభం. ఇవన్నీ విజయ సారధిగా కార్యాలలో కనిపించేవి. ఈ ప్రతి అణువు అణువులో ప్రతి అడుగులో పట్టుదల ముఖ్యమైనది.
విద్య తో జ్ఞానాన్ని దించుకోవాలనుకుంటే కావలసింది పట్టుదల. విద్యను ఆర్థించేవాళ్ళకు క్రమశిక్షణ, బాధ్యత ,ఉత్సుకత వంటివి పెట్టని భూషణాలవుతాయి. విమర్శనాత్మకమైన ఆలోచన చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉత్తమ విద్యార్థికి వన్నె తెస్తాయి. ఇవి సాధించి పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి పట్టుదలే ముఖ్యసాధనం.
ఉద్యోగం చేసేటప్పుడు విజయవంతమైన వ్యక్తిగా నిలవాలి అంటే పట్టుదల ముఖ్యం. అవాంతరాలు వస్తుంటాయి. అధిగమించడం నేర్చుకోవాలి. ఇవ్వాళ ఇంట్లో పిల్లలకు చెప్పేవే రేపటిలో ప్రతిబింబిస్తాయి కాబట్టి కొన్ని ప్రాథమిక లక్షణాలను ఒడిసి పట్టుకోవాలి. కోఆర్డినేటర్స్, సబార్డినేటర్స్ తో స్నేహపూర్వక గౌరవ ప్రవర్తన కలిగి ఉండడం, ఉన్నత ఉద్యోగితో జాగ్రత్తగా ఉండడం వలన ఎదుటివారిని ఆకర్షించగలుగుతారు. కొత్త కొత్త విషయాలను నేర్చుకోగలిగితే గ్రేడ్స్ సాధిస్తారు. అధ్యయనం, పరిశ్రమ విజయానికి మెట్లు. ప్రశ్న నీవే జవాబు వి నీవే. మంచి విమర్శలను ఎదుర్కోవాలి. చెడు విమర్శలకు దీటుగా జవాబు ఇవ్వాలి. హౌ టు బికమ్ ఏ బెస్ట్ ఎంప్లాయ్ అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. వర్క్ ఇస్ వర్షిప్ గా నడుచుకున్నప్పుడే నీవే జవాబు అవుతావు. అందమైన ఆలోచనలు ఉత్తమమైన మార్గాలు ఏర్పరుస్తాయి. వీటన్నింటి వెనక గట్టిగా నిలబడేది పట్టుదల ఒక్కటే. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం పట్టుదల వల్లనే సాధ్యం. ఒక ఇల్లాలికైన ఒక భర్త కైనా ఒక యజమానికైనా ఇవి సూత్రాలు. ఏకసూత్రత పట్టుదల!!
****