స్వయంకృషి.

కథ

దేవులపల్లి విజయలక్ష్మి

గోనెసంచి పక్కన పెట్టుకొని మువ్వన్నె జెండా గట్టుమీద తల ఆన్ఛి కూర్చున్నాడు ఈరిగాడు.
ఎదురుగా బోసినవ్వుల గాంధీ బొమ్మ చేతిలో కఱ్ఱతో. ఈదురుగాలి వీచినప్పుడు ఆ కఱ్ఱ ఊగుతూ ఏదో సందేశమిస్తున్నట్లుంటుంది.సాయంత్రం గూటికి చేరే పక్షులు గాంధీబొమ్మ తలమీదనో బుజాల మీదనో వాలి సేద తీర్చకుంటూ ఉంటాయి.ఈరిగాడికి ఆగాంధీ బొమ్మంటే ప్రాణం. ఏదో తెలియని బంధం ఉందనిపిస్తుంది.

“ఈ బొమ్మలోలానే తాత ఉండేటోడు.”స్వగతంలో అనుకోబోయి బైటకన్నాడు. ఆలోచనలు తాత చుట్టూ పరిభ్రమించ సాగాయి.

“తాత ఎప్పుడు కామందు రాజన్న నాయుడింట్లో పేడకడలెత్తుతూ గొడ్లకి సేవ చేసేవాడు. ఈబొమ్మలో తాత లానే తన తాత కూడా చిన్నగోచీ కట్టుకుని తిరగేవాడు.అయితే తన తాత బొమ్మ ఎక్కడాలేదు.” అనుకున్నాడు ఈరిగాడు.

ఈయన బొమ్మ అక్కడెందుకుందో అన్న ఆలోచన రాని అమాయకుడు ఈరన్న. కారణం అది గాంధీ బొమ్మకాదు ఈరిగాడికి.తనకు ప్రాణబిక్ష పెట్టిన ఈ తాతలో తనతాత ఉన్నాడన్న గట్టి నమ్మకం.

ఆ నమ్మకానికి బలమైన కారణం ఉంది. కెళవాతి నుంచి పుంగనూరు వచ్చిన కొత్తల్లో ఎప్పటి లాగే చిత్తుకాగితాలుసీసాలు ఇనపముక్కలు ప్లాస్టిక్ తదితరవి ఏరుకొని ఈరిగాడు గాంధీ బొమ్మ అరుగు మీద చేరగిల పడ్డాడు. చలికాలం తెల్లవారి 4 గంటలకి ఊరు ఇంకా నిద్రపోతోంది. కుక్కల అరుపులూ ఆర్తనాదాలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి . దానికి తోడు కరెంటు పోయింది. వీధ దీపం ఆరిపోయింది. చిమ్మచీకటి.ఈదురు గాలి.12 ఏళ్ళ పసి హృదయానికి చీకటిలో ఒంటరితనంతో ఓదార్పుకి నోచుకోని దుఃఖం.7 దూరాన మసీదులో అల్లాకూత 4గంటల సంకేతం.

ఇంతలో హఠాత్తుగా చీకటి భయాన్ని పటాపంచలు చేస్తూ ధైర్యాన్ని నింపుతూ వీధిదీపం వెలగటం ,తోక మీద నించొని బుసలు కొడుతూ నల్ల త్రాచు అడుగు దూరంలో. …తాతతో పొలంగట్లమీద వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు ఇటువంటి పరిణామం ఏర్పడినప్పుడు “తాతా”అని కాళ్ళను పట్టుకున్నప్పుడు తాత ఓకచేయి తన తల.మీద ఉంచి రెండవ.చేతి లోని పొన్నుకఱ్ఱతో గ్డలాఘవంగా ఆపాముని దగ్గరగా ఉన్న తుప్పల్లో విసిరేసేవాడు.”. అంతే గట్టిగా “తాతా “అంటూ వెక్కిళ్ళ మధ్య గాంధీ బొమ్మని గట్టిగా వాటేసుకున్నాడు. కళ్ళు మూసి తెరిచేలోగా. చేతిలో బ్రొటన వ్రేలికి చూపుడువ్రేలికి మధ్య ఉన్న కఱ్ఱ అలవోకగా కదిలి గాలివాటుకు పాము మీదపడటం ,హఠాత్పరిణామానికి పాము బెదిరి తుప్పల్లోకి జా‌రుకోడం రెప్పపాటులో జరిగింది. ఈరిగాడికితో అదిగట్ఠిగా తనను రక్షించడానికి అదృశ్యరూపంలో తాత కాపాడాడని గట్టి నమ్మకం .
అప్పటినించీ మనస్సు చికాకు గా ఉంటే గోనెసంచి తో అక్కడికి వచ్చి కూర్చుంటాడు.కుటుంబంతో ఉన్నంత తృప్తిగా ఉంటుంది.
ఈరిగాడికి అప్పుడు ఆ బొమ్మ పేరు తెలియదు. ఆయనని “మహాత్మాగాంధీ” అంటారని అసలే తెలియదు.ఈ‌‌రిగాడి లక్ష్యం ఒక్కటే తాను
పెద్దవాడవాలి.ఈరిగాడి దృష్టిలో పెద్దవాడంటే పుష్కలంగా డబ్బు సంపాయించాలి కామందు ర

కెళవాతి ఒక అందమైన కుగ్రామం.రెడ్లు, నాయుళ్ళ రాజ్యం. బెల్లం, వేరుశనగ ఎక్స్పోర్ట్ వ్యాపారానికి ప్రసిద్ది. అక్కడి ప్రజలు కామందులకి ఎస్సెట్. అందుకని వారు వీరిమీద వీరు వారిమీద. ఆధారపడకతప్పదు.పచ్చని పొ‌లాలు పచ్చని కొండలు ఆ గ్రామానికి మరింత శోభ నిస్తాయి.
శేషయ్య రాజన్న నాయుడిగారి పొ‌లం ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొనివ్యవసాయం చేస్తున్నాడు. భార్య లచ్చిమి పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఈరన్నని ,సూరన్నని బాగా చదివించాలని ఆశ పడేది.ఆచ్ఛాదనలేని, సరిఅయిన గురువులు లేని, మధ్యాహ్నం భోజన సదుపాయం ఉన్న గవర్నమెంటు పాఠశాలలో పిల్లలలిద్దర్నీ చేర్పించాడు శేషయ్య.నాయుడు గారింట్లో కసవు ఎత్తి గొడ్ల ఆలనా పాలనా
చేస్తున్న తండ్రి కంటే ఒక మెట్టు ఎక్కవ స్థాయిలో ఎదిగాడనే చెప్పాలి శేషయ్య. కానీ ఆస్థాయి పిల్లల కోరికలు తీర్చగల స్థాయి అయితే కాదు.

దీపావళికి టపాకాయలు కొనమని ఏనాడు వీరన్న (ఈరిగాడు) తండ్రినిసతాయించలేదు. చిన్నవాడైనతమ్ముడీకి అంత ఆలోచన లేక పోవడంతో తండ్రిని అడగలేక ‘అన్నా!టపాసులన్నా ” అంటూ గోముగా కళ్ళనీళ్ళతో అడిగాడు ఎనిమిదేళ్ళ సూ‌రన్న.తమ్ముడు. ‘”అన్నా” అనంగానే హృదయం ద్రవించింది.
కామందుల ఇళ్ళలో వెలుగులు నింపుతున్న దీపా కాంతి తో పూరి గుడిసల్లో దీపం వెలా వెలా పోతోంది. ఎనిమిది ఏళ్ళ తమ్ముడు సూరన్నని నిరుత్సాహ పరచటం ఇష్టం లేక తీసుకొని పదేళ్ళ వీరన్న నెమ్మదిగా ఆ చిరు వెలుతురులో ధనవంతుల ఇళ్ళకేసి అడుగులు వేసాడు. కాల్చేటప్పుడు కాలక
మిగిలిపోయిన టపాకాయలు ఏరుకోవడానికి తమ్ముడు చొక్కా జోలెగా చేస్తే రోడ్డు మీద అక్కడక్కడ పడిన టపాకాయలు ఏరుతున్నాడు.తమ్ముడి కళ్ళలో ఆనందం చూసి ఈరిగాడు సంతోష పడితే,తనకోరికలు తీర్చ కొండంత అండగా అన్న ఉన్నాడని మురిసాడు సూరన్న.
” ‘అన్నా!’ అదిగో అక్కడ,ఇదిగో ఇక్కడ” అంటూ తమ్ముడు ఆనందంతో కాలని టపాకాయలు ఎక్కడెక్కడున్నాయో చూపెడుతూ తన్మయత్వంలో ఉన్నాడు.
అప్పుడే రాజన్ననాయుడు గారింటి నించీ ఇంటి త్రోవ పట్టినరామన్నకి కనుచీకటిలో మనుమలను చూసి జాలి, కోపం కలిగాయి.
“అరేయ్ ఈరిగా! అందులో సగం కాలినవి ఉంటే పేలి సత్తార్రా ఎదవ నాయాలర్రా!” అంటూ
మందలించాడు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ‘ సర్ర్’ మంటూ గతి తప్పిన తారాజువ్వ పసివాడిని తాకటం, వళ్ళో మృత్యువు ని పదిలంగాదాచుకున్న టపాకాయలు పేలటం కేక వేసే అవకాశం ఇవ్వకుండా పసివాడిని పొట్టనపెట్టుకోవడం లిప్త పాటులో జరిగి పోయింది. ఈరిగాడు రామన్నలకు ఏంజరుగుతోందో తెలియకపసివాడి ఆర్తనాదంతో కట్టెలై బిగుసుకు పోయారు.ఊరంతా టపాకాయల మ్రోతతో మారుమ్రోగింది.

తమ్ముడి మరణంతో ఈరిగాడికి ఏమూలో తానే తన తమ్ముడి చావుకి కారణం అని దుఃఖంతోను భయంతోను ఉలిక్కి పడి నిద్ర పోయేవాడు కాదు.

రామన్న మనవడిని పొదివి తన గుండెలకి అదుముకొని పొడుకోపెట్టుకొనేవాడు.ఆవిధంగా ఈరన్న తాతకి మరింత దగ్గరయ్యాడు.

ఈరిగాడికి తాత పక్క‌లో దూరి పడుకున్నప్పుడు
తాత చుట్ట వాసన,కంబళీలో దూరి ఆకాశం లో చుక్కల్ని కంబళీ కన్నాల్లోంచి చూడటం చాలా ఆనందంగా ఉండేది.సంపన్న కుటుంబంలో పిల్లలు
టెలిస్కోపుతో ఆనందించినంత ఆనందించేవాడు. రామన్న ఎండాకాలం ఎండవేడికి తట్టుకోలేని మనవడికి దుప్పటి తడిపి కప్పేవాడు. అతడి దుప్పటి మురికి పట్టి అదొకరకమైన ముక్కవాసన తో కలసి విరగబూసిన పారిజాత పూల వాసన ఈరిగాడి ముక్కుపుటాలకి అలవాటై మత్తెక్కించేది.
★★★

మృదువుగా సాగుతున్న జీవితాల్లోకి ఒక్కసారిగా  ప్రపంచమంతా గడ గడ లాడించే కరోనా మహమ్మారి
విలయతాండవం చేసింది. పల్లెలు,పట్టణాల్లో జనం కరోనా కోరల్లో మృత్యువు వడి చేరారు.పెద్ద, చిన్న
ముసలి ముతక,. రాజుపేద అనే వ్యత్యాసం లేకుండా అందరినీ రాక్షస ప్రేమతో అక్కున
చేర్చుకుంది మృత్యు దేవత. ఈరిగాడు వంటరి వాడయ్యాడు.పాఠశాలలు మూసివేసారు. రోడ్లు శ్మశానాలయ్యాయి. ఇంటిలోంచి అడుగు బయట పెట్టాలంటే గుమ్మం ముందు మృగరాజు కాపుకాసేడన్నట్లు జనంభీతిల్లు తున్నారు. ప్రపంచంలో ఈరిగాడు ఒంటరి వాడై మిగిలాడు. ఉన్నదాంట్లో బిడ్డల కడుపు నింపే తల్లే కరువై  ఆకలికి అల్లల్లాడేడు లోకం తెలియని 11 ఏళ్ళ పసివాడు ఈరన్న .

పట్నం లో పనులు దొరుకుతాయని రచ్చబండ దగ్గర పెద్దోళ్ళంతా మాట్లాడుకుంటుంటే ఊహ తెలిసినప్ప
టినించీ వింటూ వస్తున్నాడు. నెమ్మదిగా. రోడ్డు పైన డుస్తున్నాడు.గమ్యం తెలియదు.ఎండగా ఉంది. హఠాత్తుగా టిప్పర్ ఆగింది.

“ఎటుపోవాలె తంబి.” డ్రైవర్ అడిగిన ప్రశ్న ఎవరూ లేని ఈరిగానికి ఆత్మీయతతో కూడిన పలక‌‌రింపులా తోచింది.నోట మాట రాక ఏడుస్తూ రోడ్డు పై చతికల పడి గుండెలు పగిలేట్టు ,దిక్కలుపిక్కటిల్లేట్లు ఏడటం మొదలు పెట్టాడు. డ్రైవరు ఓదార్పతో గుండె బరువు
తగ్గాక తన కధ చెప్పాడు. తనని పట్నం వరకూ తీసుకెళ్ళమని కాళ్ళను పట్టుకున్నాడు.
డ్రైవరు మునిరాజులు జాలిగుండె కరిగింది.

“ఇంతకీ తంబీ నేను మా యజమాని పని మీద
పుంగనూరు పోతుండా. అది యామి పట్నం కాదు
చిత్తూరు మదనపల్లి పట్నాలేగాని. నాన్ ఆ తోవెంబడి పోయాది లేదా. పుంగనూరు లో దించుతా!నీ అదృష్టముంటె గాని ఆడ ఏ దయగన్న సామైనా నీకు సంగటి ముద్దెట్టి పని లో పెట్టుకుంటారు.నీకిష్టమేనా?”
ఆలోచించి సమాధానం చెప్పే ఓపికలేక సరే అన్నట్టు
తలఊపి టిప్పర్ ఎక్కాడు ఈరిగాడు. ఆకలి, నిద్ర, బహి‌రంగ ప్రదేశంలో ప్రయాణం,పైరులమీదనించీ వచ్తే చల్లనిగాలికి కళ్లు మూతపడుతుంటే ఒక్కసారిగా అమ్మ,నాయనా,తమ్ముడు, తాత గుర్తుకు వచ్చి గుండె వేగంగాకొట్టుకొని నిద్ర
మటుమాయమయ్యింది.అల్లంత దూరాన కొట్లు పలచగా జనం సినిమా టాకీసు ఈరి గాడికి సంతోషం భయం ఒక్కసారి కలిగాయి.
ఇంతలో ముని స్వామి ఈరిగాడినిచూసి ” తంబీ! ఈడ దిగి ఈ రోడ్డు నేరుగాపోతివా ఊరువస్తాది. భయపడద్దు.మంచోళ్ళు ఈ ఊరోళ్ళు.ఈ గుడ్డముక్కున గట్టుకో.ఈ రాతిరి ఏడన్నా గుళ్ళో పడుకో.రేపు గుళ్ళో ప్రసాదం తిని పని ఎతుక్కో.” అంటూ ఒక తలపాగా గుడ్డ ఒకటిచ్చి చిన్న బిస్కెట్ పాకెట్చేతిలో పెట్టి ఇంతకంటే నేను ఇంకేమీ చేయలేనన్నట్లు చేయి ఊపి వెళ్ళి పో‌యాడు.

ఊరు మారాడు.కానీ పని ఎలా సంపాయించాలో తెలియని ప్రాయం.కళ్ళు నిద్రలేమికి మూతపడుతుంటే ఖాళీ కడుపు నిద్రని దరిచేరనివ్వకుండా అడ్డుకుంటోంది.ఇంతలో అల్లంత దూరాన తన ఈడు పిల్లలు ఇద్దరు ముగ్గురు పెద్ద గోనెసంచులతో వస్తూ కనబడ్డారు ఈరిగాడికి. వారి మొహాల్లో ఆనందం .ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ మాట్లాడుతూ వస్తున్నారు.

“అన్నా!అన్నా!’ఆంటూ ఈరిగాడు.వారి దగ్గరకి వెళ్ళి తన కధ వెక్కిళ్ళ మధ్య చెప్పుకున్నాడు.

“అరేయ్ ఈడు మనలాటోడే.చాలాకష్టాల్లో ఉన్నాడు.” అంటూ ఆకష్టాలరుచిని అనుభవించిన వాళ్ళైన చిన్నారులు జాలిగా అన్నారు.
అందులో ఒకడు “మా కూడా రా తంబీ” అంటూ వడివడిగా అడుగులు వేయ సాగారు.

అది ఒక ట్రిస్టార్ హోటల్ భవనానికి దొడ్డిదారి. అక్కడ వాళ్ళు కూర్చుని ఈరిగాడిని తమ ప్రక్కకూర్చో పెట్టుకున్నారు.

ఆప్రదేశమంతా తమలాంటి వారుచాలామంది ఉండటం చూసి ఈరిగాడికి రవ్వంతభయం,కాస్తంత ధైర్యం వచ్చింది.భయం ఇంతమందికి పనులు లేకపోతే తనకి మటుకు ఏం పని దొరుకుతుందనీ, మరొక ప్రక్క తనకొక్కడికే కాదు ఇలాంటి పరిస్థితి అని.

ఈరిగాడి ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ కఠినంగా,గంభీరమైన గొంతొకటి “చిన్నపయ్యన్ ఒకతట్టు ,పెరియవంగ ఇన్నోరు తట్టు లైను లో నిలొంగొ” అంటూ ఆర్డరు జారీ చేసాడు.

ఇంతలో హోటలు దొడ్డి తలుపు తెరచుకొని బక్కెట్లతో ఆరోజు మిగిలిన పదార్ధాలు తీసుకొచ్చారు.బండగొంతుకాయన ఆ పదార్ధాలను తన బక్కెట్లోకి మార్చుకున్నాడు.
ఈరిగాడికి అంతా విచిత్రంగా ఉంది.ఆ బొంగు‌‌రు గొంతాయన గొంతుక బొంగురుగా ఉన్నంత భయంకరంగా లేడు.ఎందుకో ఈరిగాడికి వాడి మేనమామ గుర్తు కొచ్చాడు.లైనులో ఉన్నవాళ్ళందరూ రూపాయో అర్ధో చేతిలో పెట్టి వాళ్ళకి కావలసినవి అడిగి.తీసుకుని తింటున్నారు.
ఈరిగాడికి చేతిలో.చిల్లి కానీ లేదు. అప్పుడే పరిచయం అయిన స్నేహితులు ఈరిగాడిని పరిచయం చేసారుఆ.పెద్ద మనిషికి.

“ఎక్కడ నించీ వచ్చావు?ఏమిటి ?”అని విచారించాడు.ఆ పెద్దమనిషి.

ఈరిగాడు తన కధంతా ఏకరువు పెట్టి, “నేను ఈడ పని దొరుకుతుందాని వచ్చినాను.” అన్నాడు అమాయకంగా.
పకపకా నవ్వాడు ఆ పెద్దమనిషి. ఆ అమాయకత్వంలో ఏదో నిజాయితీ కనిపించింది.”స‌రే ముందు సాపడు తంబీ” అన్నాడు.
“నా కాడ దుడ్డు లెవ్ అప్పా!” నిజాయితీఉట్టిపడే స్వరంతో అన్నాడు ఈరిగాడు.

” ఏమి కాదులే! నీ కాడ దుడ్డున్నప్పుడు ఇద్దువులే! అప్పటి సంజ ( వరకు)ఈడకి వచ్చి తిందుపో!” అంటూ కడుపు నిండా తిన్నంత పెట్టాడు. ఈశ్వరప్ప.

కడుపు నిండిన ఈరిగాడికి కతజ్ఞతో దుఃఖం పెల్లుబికింది.ఈమనిషి తనకి సహాయపడతాడని ఆ పసిహృదయం కనిపెట్టింది.

“మామా నాకేదైనా పని ఇప్పించవా!” అప్రయత్నంగా “మామా”అన్నట్టు ఈరిగాడు గుర్తించలేదు.తనకు ఆప్యాయంగా బువ్వ పెట్టిన మనిషి తన కష్టం తీరుస్తాడు.పోలికలో మనసులో మామ ని తలచుకుంటూ అప్రయత్నంగా వచ్చిన మాట వరమే అయింది ఈరిగానికి.

ముద్దుగారే ముఖం.ఈరిగానిది.అమాయకమైన పెద్ద కళ్ళు కోటేరు ముక్కు, సంస్కారంలేని గిరజాల జుట్టు.అంతా తల్లి పోలికే అనేవారు చుట్టుప్రక్కల వాళ్ళు.
ఉండమన్నట్లు సౌజ్ఞ చేసి మిగిలినది పంచుకోమని పెద్దవాళ్ళకి చెప్పి ఈరిగాడిచేయి పట్టుకుని రోడ్డు దాటించి దగ్గరలో ఉన్న పాత పేపర్లు పనికిరాని వస్తువులు కొనుక్కునే కొట్టుకి తీసుకెళ్ళాడు. అప్పుడే కొట్టు కట్టే పనిలో ఉన్నాడు రామ్ లాల్.ఈశ్వరప్ప రామ్ లాల్ తో ఏదో ఒక పది నిమిషషాలు మాట్లాడాడు. అన్ని టికీ తల ఊపి “అరె ఛోటూ! గల్లీలో తిరిగి ప్లాస్టిక్ ఇనప ముక్కలు ఏరుకు రాగలవా?”అన్నాడు రామ్ లాల్.
కొంత అర్ధమయ్యీ అవక సరే అన్నట్టు తల ఊడిపోయేట్టు ఊపాడుఈరిగాడు.రామ్ లాల్ కి నవ్వు వచ్చింది.
“ఎక్కడ ఉంటావు రాత్రికి? “
ఫుట్ పాత్ ని వేలితో చూపాడు ఈరిగాడు.
” మాటలు రావేమిరా! అన్ని టికీ మూగ సౌజ్ఞలు చేస్తావు? ” కొంచెం విసుగ్గా అన్నాడురామ్ లాల్.

“వచ్చయ్యా!” అని గబక్కున ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో అన్నాడు ఈరిగాడు.

” చీకటితోనే వెళ్ళాలి.పాలవేను రాక ముందే.లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు అన్నీ ఊడ్చేస్తారు.పదిగంటల వరకూ తిరిగి కలక్షను చెయ్యాల.బాద్మే షాపు ఊడ్చి నాకూడ షాపులో సహాయం చేయాల. ఇష్టమేనా?”
సరే అన్నట్టు తల ఊపాడు ఈరిగాఆడు .

“ఛోటూ! నీ పే‌రేంటి?”

“నాపేరు ఈర.. ఈర..వీరన్న.”

” ఆఁ ! నా షాప్ ముందే పడుకో! పక్కనే పబ్లిక్ లాట్రిన్ ఉంది. అక్కడే డ్యూటీ నించి వచ్చినాక నీళ్ళోసుకుందువు.ఆడితో నే చెబ్తా! ఇదో ఈ ,చాదర్ కప్పుకో. ఆ చటాయి వేసుకో!”అంటూ రామ్ లాల్ అనటంతో ఈరిగాడికళ్ళలో ఆనందం. ఈశ్వరప్ప,రామ్ లాల్ సాక్షాత్తు కెళవాతి గుళ్ళో దే వుళ్ళే అనిపించారు.
“అయ్యా!” అంటూ కాళ్ళుపట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఈశ్వరప్ప, రామ్ లాల్ ఏమో కధ ఉంది పాపం అనుకుంటూ ఈరిగాడి తల నిమిరి నిష్క్రమించారు.

అప్పటినుంచి నాలుగున్నర ఐదు గంటలకి లేవడం వీధి వీధి తిరిగి ప్లాస్టిక్,ఇనుము ,అట్టపెట్టెలులాంటి వ్యర్ధపదార్థాలు ఏరుకు రావటం దైనందిన కార్యక్రమం అయింది ఈరిగాడికి.మనస్సు కలత
చెందినప్పుడు గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని గాంధీలో తాతని చూసుకోవటం పరిపాటి అయ్యింది.

ఈరోజు దీపావళి ముందు రోజు నుంచే ఊరిలో షాపులన్నీ దీపాలతో అలంకరించటం , టపాకాయలమోతతో నిద్ర పోలేదు ఈరిగాడు.
తమ్ముడు “అన్నా అన్నా'” అన్న పిలుపు చెవిలో మారుమ్రోగుతోంది. అప్రయత్నంగా “సూరిగా నేనే నిన్ను సంపినానురా! అమ్మా!అయ్యా! ఒక్క తూరి మిమ్మల్ని సూడాలనీ ఉందే” అంటూ తలమోదుకొన్నాడు ఈరిగాడు. ఈరిగాని ఆర్తనాదంటపాకాయలమోతలో కలసి పోయింది.

★★★

కాలగర్భంలో ఐదేళ్లు ఇట్టే గడిచాయి. ఇప్పుడు ఈరిగాడు వీరన్న. శేటుమాత్రం ముద్దుగా “ఛోటూ” అనే అంటాడు.వీరన్న శేటుకి తలలో నాలుకయ్యాడు.శేటుకి పిల్లల్లేరు.హాస్పిటల్ కి వెళ్ళాలన్నా ఛోటూ తోడు కావాలి.ఇంట్లో చిన్నా చితకా పనికి “అరే ఛోటూ”.
చిత్తు కాగితాల షాపుని ఎంతో శుభ్రంగా తీర్చిదిద్దాడు.
పేపర్లన్నీ చక్కగా బొత్తుగా పేర్చడం, ఇనుమూ ,ప్లాస్టిక్, గాజు బాటిల్స్ విడి విడిగా.కంటైనర్సలోకి పట్టటంతో పాటు రోడ్డుమీద కాకుండా వారాని కొకసారి ఇంటింటికీ వెళ్ళి పనికి రాని సామాను కలెక్ట్ చేసికొని.దానికి మూల్యం ఇవ్వడంతో ఊరిలో వారు. చెత్త రోడ్డుపై గిరాటేయకుండా జాగ్రత్థగా పదిలప‌రచి వీరన్నకు ఫోన్ చేరడం చేసేవారు.వెంటనే పనివాళ్ళని కలక్షన్ కి పంపేవాడు.ఈ విధంగా వీరన్న పెద్ధ పెద్ద జవుళీ అంగళ్ళ (బట్టలు షాపు)నించీ ఎలక్ట్రిక్ షాపులు,ఇళ్ళు, బ్యాంకులు
అన్ని హోం సర్వీసుతో మంచిపాప్యులారిటీ సంపాయించాడు.
రీసైక్లింగ్ మటీరియల్ని లారీకి లోడ్ ఎక్కించడం లాంటి పనులలో నిష్ణాతుడయ్యాడు.చుట్టుపక్కల గ్రామాలవారు ట్రాక్టర్ల లో వేస్ట్ మటీరియల్ తెచ్చి మూల్యం తీసుకుని వెళ్ళేవారు.చుట్టుప్రక్కల షాపులనించీ కార్టన్స్ కొని ట్రాన్స్పోర్టేషన్ వారికి లాభానికి సప్లై చేసేవాడు. పాడైపోయినవి రీసైక్లింగ్
యూనిట్ కి పంపటం.లాంటివి వీరన్న డెవలప్ చేసాడు.ఇప్పుడది చిత్తుకాగితాల షాపు కాదు. ప్రక్కనే ఖాళీ స్థళంలో పెద్ద షెడ్ వేసి దానికి
” రీసైక్లింగ్ మటీరియల్ గోడౌన్ ” అని నామకరణం.చేసి ఇంకొక ఇరవై మందికి ఆశ్రయం ఇచ్చాడు.
అందులో ఈ ఊరిలో మొట్టమొదట తాను అడుగు పెట్టినప్పుడు తనకి అన్నం పెట్టించిన శేషప్ప, వెంకటప్ప,కొప్పరన్న లని ఆదుకోవటమేకాక గోనెసంచితో వీధుల్లో ఎవరైనా కనపడితే వారికి
పనివ్వటంతో ఎవ్వరూ పని ఎగకొట్టాలనుకునేవారు కాదు.అందరూ కష్ట పడేవాళ్శు.

వీరన్నకు శేటు ఇంట్లో నే మకాం.శేటుతోనే భోజనం.శేటు పెంకుటింటిని దగ్గరుండి చిన్న మిద్దెగా కట్టటానికి కొడుకులా అండగా నిలిచాడు.శేటుకూడా వాడు పనివాడు వాడికి జీతం ఇవ్వాలనుకోలేదు.మంచి భోజనం మంచి బట్టలు ఆవయసు కొడుకు ఉంటేఎలా చూసుకునేవాడో అలాచూసుకునే వాడు.
ఆదివారాలు షాపు బంద్ ఉన్న రోజున తనకి భోజనం పెట్టి పనిలో పెట్టిన ఈశ్వరప్ప దగ్గరకెళ్ళి
మామా నువ్వుకూచో ఆబక్కెట్టు ఇవ్వు అంటూ చను వుగా అందుకొని చక చకా అన్నార్తులందరికీ పెట్టి, “దా !మామా !అంటూ గాంధీ బొమ్మదగ్గరకు లాక్కెళ్శి వళ్ళోతలపెట్టుకొని గతంలో సంఘఠనలూచెప్పిన వే మళ్ళీ మళ్ళీ చెప్పుకొని ఏడ్ఛేవాడు.ఏ నాడు ఈశ్వరప్ప విసుక్కునే వాడు కాదు.ఆదివా‌రం ఈశ్వరప్ప. ఓదార్పు వా‌రంవరకూ వీరన్నకు బలానిచ్చేది

సంవత్సరమంతా మనస్సుని పనిలో లగ్నం చేయటంతో గతాన్ని కొతవరకూ గెలవ గలిచాడు వీరన్న. నీలి నీడలని మనసు పొరల్లో దాచి ఆనందాన్ని అభినయించేవాడు.దీపావళి వస్తే గతం గుర్తు కొచ్చేది. ప్రపంచమంతా దీపాల వెలుగులో చీకటిని పారద్రోలితే వీరన్న మనసుని గతం చీకటి మేఘాలు కమ్ముకునేవి.దీపావళి రోజున వీ‌రన్న లో దిగులు చూసి వీరన్న కధ విని. శేటు కళ్ళు చమర్చాయి.
ఒకప్పుడు తనూ తింటానికి తిండిలేక పెట్టుబడి లేని ఈ వ్యాపారాన్నిపెట్టాడు.దారిద్ర్యంతో వైద్యం చేయించలేక అనారోగ్యంతో ఉన్న ఒక్కగా నొక్క కొడుకు ను పోగొట్టుకున్న రామ్ లాల్. భగవంతుడే తనకి అండగా వీరన్నని పంపాడని నమ్మాడు.

ఒకరోజు “బేటా! నా వ్యాపారం నువ్వు చూసుకో నేను పెద్దవాడనవుతున్నా! నాకు తాకత్ లేదు.”అని వ్యాపారం వీరన్న చేయతిలో పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు శేటు.

చుట్టు పక్కల , ప్రక్క ఊళ్ళో అంగళ్ళవాళ్ళంతా వీరన్నకి కార్టన్ వ్యాపారం ద్వారా సన్నిహితులయ్యారు. వ్యాపార్ం దిన దినాభి వృధ్ధి చెందటంతో నెమ్మదిగా లీజ్ కి స్థళం తీసుకొని స్క్రాప్ గోడౌన్ తెరిచాడు. పదిమందికి ఉపాధి కల్పించాడు. ఎప్పుడూ తను ఏస్థితి నుంచి వచ్చాడో మరువలేదు. ఒకరకంగా చుట్టుప్రక్క గ్రామాలలో తన మేరకు ఎవరికి ఏసహాయం కావల్సినా అందుబాటులో ఉండేవాడు.మానవత్వం తో తనను ఆదుకోబట్టి తను పట్టెడు అన్నం తినగలుగు తున్నాడు.ఆకలి,నిద్ర కి మించి మనిషి బ్రతకటానికి ముడిసరకు ఏమీ లేదని విశ్వసించేవాడు.

ఎంత ఎదిగినా గాంధీ బొమ్మని మరువలేదు. ప్రపంచానికి జాతిపిత. వీరన్నకి తాత. వయస్సుతో పాటు గాంధీజీ గురిం అవగాహన ఏర్పడి మరింత మక్కువ పె‌రిగింది. ఆగస్టు పదిహేనున బొమ్మచుట్టూ ఊడ్చి అలంకరణ చేసేవారు,జెండా ఎగురేసేవారు. మరుసటి దినం మళ్ళీ చెత్త పేరు కునేది బొమ్మ చుట్టూ.

వ్యాపారం వృధ్ధి చెందిన తరువాతవీరన్న చేసిన మొట్టమొదటి పని వెలసిన గాంధీ బొమ్మకి రంగులు వేయించాడు.చుట్టూ చిన్న పార్కు లాంటిది ఏర్పాటు చేయించాడు. గాంధీ బొమ్మ మీద కాకులు రెట్టలు వేకుండా మండపం కట్టించాడు. తాతకి ఇల్లు
కట్టించినంత సంబర పడి పోయాడు. వీలయినప్పుడు అక్కడకెళ్ళి కూర్చొని, ” తాతా చూడు నీ ఈరిగాడిని.తాతా!నువ్వుంటే నీ చినుగుల దుప్పట లో నించీ నక్షత్రాలని చూడాలని ఉంది.” అని స్వగతంగా అనుకునేవాడు.

కాలం వీరన్నతో పాటు కదులుతూనేఉంది.అప్పుడే
మానవత్వపు విలువలతో పరిపూర్ణ మైన వ్యక్తి గా రూపు సంతరించుకున్న వీరన్న ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఆప్తుడే. చిన్నపిల్లలు పనుల్లోకి వెళ్తే వాళ్ళ తల్లి దండ్రులకు నచ్చ చెప్పి బడికి పంపించేవాడు.తీరికసమయంలో వారితో ఆటలాడి వారిలో సూరన్నని చూసుకునేవాడు.

శేటు ఆరోగ్యం భార్యమరణంతో క్షీణించింది.ఒకరోజు శేటు వీరన్నని పిలిచి “ఛోటూ నాకు నీ పెళ్ళి చూడాలని ఉంది.” అన్నాడు.
“మీ ఇష్టం బాబా!” అన్నాడు వీరన్న .
వీరన్ననోట ఆమోదం వచ్చిందే తడవు రామ్ లాల్ ఈశ్వరప్ప దూరపు బంధువుల పిల్లనిచ్చి. పెళ్ళి చేసాడు.

★★ ★

.వీరన్న అంటే రామ్ లాల్ ఎంటర్ప్రైజెస్ కి ఒక యజమాని గానే కాక అందరినీ కష్టాల్లో ఆదుకునే వ్యక్తి గా ముద్ర వేసుకున్నాడు. రాజకీయనాయకుల దృష్టి వీరన్న మీద.పడింది.వీరన్న ని కౌన్సిల్లర్ గాహ నిలబెట్టారు.ఎటువంటి ప్రచారం లేకుండానే ఎలక్షన్లో
మెజారిటీ తో గెలిచాడు. వెంటనే ఇంటికెళ్ళి తలుపేసుకుని తృప్తి తీరా రోదించాడు. ఎప్పుడూ ఆనందంగాఉండే భర్త ప్రవర్తన అర్ధం కాలేదు గౌరికి.

వాకిట్లో గుంపులు గుంపులుగా జనం
“వీరన్న మా అందరికీ అన్న”,
“వీరన్న మా దేవుడన్న”,
“వీరన్న జిందాబాద్” లాంటి జైజై ధ్వనులలతో మా‌రు మ్రోగుతోంది.
కొంతసేపటికి వీరన్న ఉద్వేగం తగ్గి బయటకు వచ్చాడు.
“వీరన్నా! సంబరం చేసుకుందాం రా అన్నా .” అంటూ అందరూ అరిచారు.
గంభీరమైన స్వరంతో “మనం ఏమిటో మరస రాదు.ముందు చిత్తూ‌‌రు పోయి ఒక ఎయ్యి కంబళీలు తెండి.” అంటూ పురమాయించాడు.

“కిష్టప్పా మన వేన్ లా డీసిల్ ఉండాదా !చెక్ సేయప్పా!”
“పిల్లకాయలందరకీ రేపు బడి తావునే సంగటి ముద్ద పాయసం పెడు తామని పెద్దయ్యోరికి సెప్పు వెంకటప్పా!”అంటూ పురమాయించి రామ్ లాల్ కాళ్ళని తాకి కళ్ళకద్దుకున్నాడు.
వీరన్నమాట కన్నా శరవేగంతో కంబళీలు రానేవచ్చాయి.మరుసటి రోజు ఆ కంబళీలు తీసుకొని చుట్టుప్రక్క గ్రామాల్లో రైతులు, కూలి చేసుకునేవారికి వారి గుడిసెలోకి వెళ్ళి కంబళీలు పంచాడు.వంటి మీద ఆఛ్ఛాదన లేని వారికి వెచ్చని కంబళీ పరమానందమైంది.మనస్ఫూర్తిగా వీరన్నను “సల్లంగుండప్పా !ఏతల్లి కన్న బిడ్డ వో !” అంటూ దీవించారు.
“అందరికీ అందినట్టేనా కిష్టప్పా!” తిరుగు ముఖంలో అడిగాడు.
“అవునన్నా! ఒక్కటే మిగిలినాది.”
“మిగిలినాదా!” చిన్న మందహాసం వీరన్నపెదవులపై.
“మా తాత మిగుల్సుకొనుండాల! బిరీనా తాత తావు బోవాల.” అన్న వీరన్న మాటలకి “అన్నకి సంతోషంలో పిచ్చెక్కినాదా! తాతంటాడే పదేళ్ళ సందె అన్న తాతని సూసిందిలేదు.శేటన్నకా నాయన ఎప్పుడో పోయుండలే!” ఆలోచనలో ఉన్న కిష్టప్ప బండి ఆగటంతో “ఎక్కడా !”అని చూసాడు.

అది గాంధీ బొమ్మ.నెమ్మదిగా వీరన్న కంబళీ పట్టుకుని గాంధీ బొమ్మ దగ్గరకు వెళ్ళాడు. పక్కనే దండలు వేయటానికి పెట్టిన నిచ్చెన ఎక్కి గాంధీ బొమ్మకి కంబళీ కప్పాడు.
“తాతా! చొక్కా లేకుండా జీవితం అంతా గడిపావు. నీ మనవడు ఈరిగాడు పెద్దోడయ్యాడు. అందరికీ కంబళీలు పంచా తాతా! నేను పెద్దోడినయ్యా!” అంటూగాంధీ బొమ్మ కాళ్ళుపట్టుకుని పరవశించాడు.ఆకాశంలో తారాజువ్వలు పువ్వులు రాల్చాయి.
తమ్ముడు ని తలచుకున్నాడు.”తంబీ! నేనిప్పుడు టపాకాయలు ఏరక్కరలే.దుడ్డుతో కొనగలను.నాదగ్గిరకి తిరిగి రా!” అంటూ ఉన్మాది వలె విలపించాడు.

“తాతా! నాకయినంత వరకూ అన్నీ మంచిపనులే చేస్తా తాతా. నా కు కనపడ్డ ఎవ్వరినీ ఆకల్తో ఉండనీయ.ఇంకా ఇంకా చాలా చాలా చెయ్యాలని ఉంది.నువ్వు నాకు తోడుంటావు కదా తాతా!”
దూరాన గుడి గంటలు తథాస్తు అంటూ మ్రోగాయి.
వీరన్న కళ్ళలో పట్టుదల, దీక్ష,నిజాయితీ ప్రస్ఫుటించాయి.కార్యదీక్ష కి కంకణం కట్టు కుని ముందడుగు వేసాడు వీరన్న.

★★★
వీరన్న ఇంటింటికీ వెళ్ళి రీసైక్లింగ్ వేస్ట్ సేకరించటంతో చాలావరకూ ఊరంతా శుభ్రంగాఉంది.రోడ్డుమీద పడేసే ప్లాస్టిక్ కవర్లు, కార్టన్స్ లాంటి వేస్ట్ మటీరియల్స్ ఎంతో కొంత ధర పలుకుతుందని అందరూ కూడబెట్టి వీరన్నకు ఫోన్ చెయ్యడం వీరన్న మనుషులను పంపి అవి సేకరించటంతో మున్సిపాలిటీకి సగం పని తగ్గి పొర్కులతో ఊరంతా
అందంగా తీర్చి దిద్దే పని చేపట్టారు.

ఆరోజు ఆగస్ట 15. ఊరంతా సందడిగా ఉంది. ఎక్కడ చూసినా జెండాల తోరణాలతో ఊరంతా శోభాయమానంగా ఉంది. గాంధీ విగ్రహం దగ్గర అందంగా పెద్ద వేదిక. డిస్ట్రిక్ట్ కలక్టరు గారికి స్వాగతం తెలుపుతూ కటౌట్లు. ప్రక్కన వినమ్రంగా చేతులు జోడించిన వీరన్న కటౌటు.

మీటింగ్ మొదలయింది. ప్రముఖులందరూ వీరన్న ని ఆకాశానికెత్తారు.ఆఖరుగా కలక్టర్ గారి ప్రసంగం ఈ విధంగా సాగింది.
“ముందుగా పుంగనూరు పురవాసులకి అభినందనలు.ఈనగరం నా పరిధిలో ఉండటం మరింత గర్వ కారణం.ఎన్నో పార్టీలు వాగ్దానాలతో ఊళ్ళని అభివృధ్ధి ప‌రుస్తామని ఎన్నికల ముందు మాటిచ్చి ఎన్నికల తరువాత మరచిన దాఖలాలు అనేకం.కొన్ని గ్రామాలు స్వరాజ్యం పూర్వం ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలా నే ఉన్నాయి.
ఏపార్టీకి లోబడక,ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడక ఊరి కౌన్సిల్లందరూ విద్వేషాలు లేకుండా అందరినీ ఒక్కతాటిమీద నడిపించి నగరాన్ని ఎంతో సుందరంగా,కాలుష్య రహితంగాను,బాల కార్మిక వ్యవస్థ ను ప్రతిఘటిస్తూ అక్షర రాస్యత అభివృద్ధికి తోడ్పడి,స్వయంఉపాధికి వివిధ మార్గాలు అన్వేషిస్తూ అందరినీ. చైతన్యవంతుల్ని చేసి ప్రగతి పధానికి బాట వేస్తూ నిస్వార్ధ సేవలందించిన శ్రీ వీరన్న గారికి గవర్నమెంటు పురస్కారమిచ్చి సన్మానించ నిర్ణయించింది. శ్రీ వీరన్న గారితో పాటు కలసి ఐకమత్యంతో పనిచేసిన వార్డ్ కౌన్సిలందరికీ సత్కరించ నిర్ణయం తీసుకుంది. మున్ముందు మీ నగరం మీ ఊరి ప్రజలు మిగిలిన జిల్లాలకి,దేశానికి కూడా ఆదర్శంగా నిలవాలని కోరుతూ శ్రీ వీరన్న గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించటమైంది.”అంటూ గౌరవనీయులు కలక్టరు గారు తన ప్రసంగాన్ని ముగించారు.కరతాళ ధ్వనుల మధ్య వీరన్న ఇద్దరు గార్డ్స్ మధ్య వేదిక మీదకి రాగా స్వహస్తాలతో షాలువా కప్పి వీరన్నకి సన్మానంచేసారు. అభివృద్ధి కార్యక్రమాలకి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందచేస్తుందని,స్వయం ఉపాధిమేరకు గ్రామీణబ్యాంకుల సహకారం ఉంటుందనీ,ఎటువంటి అవసరమొచ్చినా వీరన్న తనను కలవ వచ్చునని ఆప్యాయంగా బుజం తట్టా‌రు.
దూరాన ఉన్న రామ్ లాల్ ఈశ్వరప్ప ఒకరి నొకరు కౌగలించుకొని ఆనందభాష్పాలు రాల్చారు.
తాము పెంచినమొక్క తమకు నీడనిస్తోంది. అమృతతుల్యమైన ఫలాలతో నిండుగా ఉందని.

సభముగిసిన వెంటనే కలక్టర్ వెళ్ళ ఉకపక్రమించారు.
బిరబిరా కలక్టరు గారి దగ్గరకెళ్ళి వీరన్న కలక్టరు గారితో ఏదో మాట్లాడాడు. ఆయన వీరన్న చేతులు పట్టుకుని వీరన్న వెంట నడిచారు. వీరన్న కాళ్ళు వీరన్న రామ్ లాల్ దగ్గర ఆగినాయి. కలక్టరు గారి కళ్ళు చమర్చాయి.
” ఒక పసివానిని సంఘ విద్రోహక శక్తి గానైనా, సంఘసంస్కర్తగా నైనా తీర్చి దిద్దేది సమాజమే.
మీ ఆదరణ వీరన్నని ఒక పరిపూర్ణమైన వ్యక్తి గా తీర్చి దిద్దింది.మీలాంటి పౌరులున్నంతవరకూ భారతదేశం గర్వంగా తలెత్తుకునే ఉంటుంది.”అంటూ రామ్ లాల్ ఈశ్వరప్ప ల చేతులు తన చేతులో తీకుని కళ్ళకద్దుకున్నాడు కలక్టరు.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పగ్గం

వివాహ వ్యవస్థ– పూర్వపరాలు