పగ్గం

(కథ)

కట్టెకోల విద్యుల్లత

“సృజనా ఈరోజు నీ పెళ్లి చూపులు కదా! ఇంకా తయారవ్వలేదు, త్వరగా తెములు.అసలే పెళ్లి కొడుకు వాళ్ళు పట్నం లోని పాత బంగళా నుంచి వస్తున్నారు. కాస్త స్టైల్ గా రెడీ అవ్వు, అర్థమైందా?” చెప్తున్న తల్లిని చూసి, “మన మర్రిమాను చుట్టుపక్కల ఎవరూ దొరకలేదా నీకు? అంత దూరం వాళ్ళు ఎందుకు?” అడిగింది సృజన.
 “సర్లే నీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు తెలుసు కదా! సోది చెప్పక తయారవు,” ఆర్డర్ వేసింది తల్లి. ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉండిపోయింది సృజన.
 తెల్లని మిడీ ఫ్రాక్ వేసుకుని, మోడ్రన్ గా కనిపిస్తున్న సృజనను చూసి మొహం చిట్లించాడు పెళ్ళికొడుకు శ్రేయస్.
 “పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటాం, మీరిద్దరూ అలా ఆ గట్టు దగ్గరికి వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకోండి,” అని మధ్యవర్తి చెప్పడంతో అయిష్టంగానే కదిలాడు అతను.
వరుసగా ఉన్న గట్లు చూస్తూ, ఏ గట్టు దగ్గర ఆగాలో తెలియక వెనక్కి తిరిగాడు. హై హీల్స్ తో నడవలేక ఇబ్బంది పడుతున్న సృజనని చూసి, వెళ్లి ఆమె చేయి పట్టుకుని నడిపించుకు వచ్చాడు.
కొంచెం లోపలిగా ఉన్న గట్టు దగ్గర ఆగింది ఆమె. “ఇక్కడ కూర్చుందాం,” అంది. ఆ గట్టుమీద సృజన అని రాసి ఉండడం చూశాడు శ్రేయస్ . ఆ గట్టు చూస్తూ ఆలోచనలో  ఉన్న ఆమెను పలకరించాడు.
“నువ్వు ఎప్పుడూ ఇలాంటి బట్టలే వేసుకుంటావా? మీ ప్రాంతంలో ఎంచక్కా చీరలోనో, లంగా వోణీ లోనో ఉండే అమ్మాయిని చూడచ్చు అనుకున్నాను,” అడిగాడు.
“నీకు అలా ఉంటే ఇష్టమా? పట్నం నుంచి వస్తున్నారు కనుక ఇలా ఉంటే నచ్చుతుందని మా అమ్మ బలవంతంగా ఇవి చేసుకోమంది . నేను హాయిగా ఎర్రంచు ఉన్న తెల్లచీర కట్టుకుంటాను ఎప్పుడూ ,”చెప్పింది.
ఆ సమాధానంతో తృప్తిగా నవ్వాడు అతను. ఇద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నా, మధ్య మధ్యలో సృజన చూపు ఆ గట్టుమీద రాసి ఉన్న పేరు మీద ఆగటం గమనించాడు.
“ఇది నీదేనా?” అడిగాడు.
“ఔను’” సమాధానం చెప్పింది.
“ఎలా జరిగింది?” అడిగాడు.
“మా ఆయన, అత్తగారు కలిసి చంపేసి, ఉరివేసారు. ఆత్మహత్య చేసుకున్నానని, నేనే చేసిన ఏదో తప్పు దాచుకునేందుకు అలా చేశానని లోకాన్ని నమ్మించారు,” నిట్టూర్చింది సృజన.
“ఔనా! ఐ యాం సారీ, ఏమిటో మా మగ జాతి. సృష్టిలో తమతో సమానం, నిజానికి ఇంకా ఎక్కువ అయిన స్త్రీని గౌరవించడం తెలియదు. ఇలాంటి నీచపు పనులు చేస్తున్నారు కాబట్టే ప్రపంచమంతా ఇలా బాధలు అనుభవిస్తోంది,” వేదనగా అన్నాడు.
“అయితే స్త్రీలంతా గొప్పవాళ్ళని కూడా చెప్పలేము,” అన్నాడు మళ్ళీ తనే.
“ఏం? నీ కథేంటి?” అడిగింది సృజన.
“కాలేజీలో ప్రణవిని ప్రాణం కన్నా ఎక్కువగా  ప్రేమించాను. తనూ ప్రేమించానన్నది. ఇద్దరం మూడు  సంవత్సరాలు కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ఉన్న పాత బంగాళా మా మీటింగ్ ప్లేస్. కాలేజీ ఎగ్గొట్టి అక్కడే కూర్చుని రోజంతా బోల్డు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. నా పాట అంటే చాలా ఇష్టం తనకి. తనకోసం కొత్త కొత్త పాటలు రాసి, పాడుతూ ఉండేవాడిని. ఎప్పటికైనా సింగర్ గా సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సాధించగలనుకునేవాడిని,” ఆగాడు శ్రేయస్.
“మరి ఏమైంది? ఆత్రంగా అడిగింది సృజన. చదువు అయిపోయాక, తన ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూశారని, తన తండ్రిని ఎదిరించే ధైర్యం లేదు కనుక ఆ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది.
“అయ్యో పాపం కదా తను!” అమాయకంగా అంటున్న సృజనను చూసి నవ్వాడు.
“పిచ్చిదానా, అతను నాకంటే డబ్బు ఉన్న వాడు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం, అందుకే చేసుకుంది,” చెప్పాడు.
“మరి నీకేమైంది?” అడిగింది తను.
“ఆ బాధ భరించలేక, అదే పాత బంగ్లాలో పురుగుల మందు తాగేసాను,” చెప్పాడు శ్రేయస్.
“ఎంత స్వార్ధపరుడివి నువ్వు. నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదా? ప్రేమా పెళ్లి మాత్రమే జీవితమా?” కోపంగా అంది సృజన.
“నీకు తెలియనిది ఏముంది? మన చుట్టూ ఉండే మన వాళ్ళల్లో, ఆత్మహత్య చేసుకుని వచ్చిన వారంతా, ఆ నిమిషం ఆవేశంలో ఆ పని చేసి ఆ తర్వాత పశ్చాత్తాప పడుతూనే ఉంటారు కదా! నేనూ అంతే. ఇప్పుడు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేసానో. నామీదే ఆశలు పెట్టుకున్న మా అమ్మానాన్నలు ఇప్పుడు జీవశ్చవాల్లా బ్రతకడం చూసి నా పాపానికి నిష్కృతి లేదు కదా అని ఎంత ఏడ్చానో. నువ్వు చెప్పినట్లు ప్రేమా పెళ్లి మాత్రమే జీవితం కాదు. వాటికోసమైనా, ఇంక దేనికోసమైనా చచ్చి సాధించేది ఏముంది? సవాళ్ళను ఎదుర్కొని ధైర్యంగా బ్రతికి చూపించిన వాళ్ళు కదా ఆదర్శం. ఈ విషయం నాలాంటి యువతకు ఎలుగెత్తి చాటాలని ఉంది. కష్టం వచ్చినప్పుడు అది మన అనేవాళ్ళతో పంచుకోండి. మనసుకు కాస్త పగ్గం వేయగలిగితే ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది “అని నిజాయితీగా చెప్పాడు.
బాధగా చూసింది అతనివైపు సృజన. “అదే కదా శ్రేయస్, మనసుకి పగ్గం, చెడు ఆలోచనలకు కళ్ళాలు సరైన సమయంలో వేయగలిగితే యువత ప్రపంచాన్నే శాసించగలదు. అది తెలియక ఇలా నీలా ఆత్మహత్య చేసుకుని ఆ తర్వాత ఎంత పశ్చాతాప పడినా ఏం లాభం?” సాలోచనగా అంది.
“ఔనూ! నువ్వు తర్వాత వాళ్లపై కక్ష సాధించలేదా?” అడిగాడు ఆమెని, వాతావరణం తేలిక చేసేందుకు.
“ఛీ ఛీ!  మనం ఏమన్నా మనుషులమా? కక్షలు కార్పణ్యాలు అంటూ తిరగడానికి? దెయ్యాలం, మనకంటూ ఓ నీతి ఉంది కదా? వీలైనంత ప్రశాంతంగా జీవించాలనే మన ధర్మం చెప్తోంది కదా!”అంటున్న సృజనను చూస్తే చాలా ఇష్టం కలిగింది శ్రేయస్ కి.
“నువ్వు ఎంత మంచి దానివి. నేను మాత్రం కక్ష తీర్చుకోవాలనే అనుకున్నాను మొదట. కానీ ,” ఆగిపోయాడు.
“చెప్పు,” అన్నట్లుగా చూసింది సృజన.
“పాపం తను అప్పటికే నరకం చూస్తోంది. వాడు ఒక శాడిస్ట్. అనుమానం పిశాచి. పిశాచి అనకూడదు, అనుమానం మనిషి. ప్రతిక్షణం ఆమెను హింసిస్తూనే ఉన్నాడు. అది చూస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా బాధ కలిగుతుంది”చెప్పాడు శ్రేయస్. నువ్వన్నట్లు ఈ మనుషులు మనపై సినిమాలు తీస్తారు గానీ, వాళ్ళకి ఉన్నంత కక్షలు, కోపాలూ మనలో ఉండవు కదా!” సాలోచనగా అన్నాడు.
“పాపం ఆ అమ్మాయి, ఇప్పుడు రోజూ నిన్ను తలుచుకుంటూ ఉంటుందేమో!” మంచినీళ్లు తాగుతున్న అతనికి పొలమారగా సుతి మెత్తగా తలపై తడుతూ అంది సృజన. ఆమె కళ్ళల్లోకి చూశాడు శ్రేయస్ .
ఆ క్షణంలో ఇద్దరు హృదయాలు ఒకటయ్యాయి.
ఇన్నేళ్ళుగా మరిచిపోయిన పాట ఒక్కసారిగా తన్నుకొచ్చింది అతనికి. “కళ్ళల్లో పెళ్లి పందిరి కనపడసాగే,” అంటూ పాడాడు.
సిగ్గుతో మెలికలు తిరిగింది సృజన. దూరంగా ఉండి గమనిస్తున్న దయ్యాల పెద్దలంతా వచ్చి, “అయితే రేపే పెద్దలందరి సమక్షంలో మర్రిమానుకీ, పాత బంగ్లా కి పెళ్లి. ఇద్దరూ కలకాలం సంతోషంగా జీవించండి,” అంటూ ఆశీర్వదించారు.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాహిత్యము – హాస్యరసము

స్వయంకృషి.