(ఇప్పటివరకు:అన్ని ఆధారాలతో సుబ్బారావు పైన పోలీస్ స్టేషన్ లోగృహ హింస కేసు పెట్టించింది వసుంధర మైత్రేయి చేత. సుబ్బారావు కూడా ఒక లాయర్ ని పెట్టుకున్నాడు. ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. ఇరుగుపొరుగువాళ్ళ సూటిపోటి మాటలను మైత్రేయి భరించలేక పోతున్నది. ఆమెకు తల్లితండ్రులనుంచి, అత్తమామల నుంచి బాగా ఒత్తిడి వసున్నది కేసు వాపసు తీసుకోమని. ఆ ఆందోళనలతో మైత్రేయి నిద్ర లో కూడా ఉల్లిక్కి పడుతున్నది. రాత్రులు అక్కమ్మ సాయంగ ఆమె ఇంట్లోనే పడుకొంటున్నది.)
“అయ్యో పాము! పాము! నన్ను తరుముతున్నది! కాపాడండి! కాపాడండి,”అంటూ పెద్దగా పలవరిస్తున్న మైత్రేయి ని బలవంతంగా నిద్దరలేపి కూర్చోపెట్టింది అక్కమ్మ ఇంకోరోజు మధ్యాహ్నం పూట.
“ఏంటో అక్కమ్మ! పడుకోగానే అలజడి మొదలవుతుంది.మంచం మీద నుంచి లేచి పరిగెత్తాలనిపిస్తున్నది. కానీ లేవలేక పోతున్నాను,” అంటుంటే బొటబొటా కళ్లనీళ్లు వచ్చాయి మైత్రేయి కి. అది చూసి అక్కమ్మకు కూడా కళ్ళు చెమర్చాయి.
అప్పుడే “మైత్రి!” అంటూ చనువుగా లోపలికొచ్చింది వసుంధర.
“త్వరలోనే మీ క్లయింట్ మైత్రేయి కేసుని కోర్ట్ లో సబ్మిట్ చేస్తాను,” అని సబ్ ఇన్స్పెక్టర్ రమణారావు వసుంధరకి చెప్పాడు . అది తెలియగానే ఆ రోజే వసుంధర మైత్రేయి ఇంటికి వెళ్ళింది.
కొద్దీ రోజుల్లో కోర్ట్ కి మైత్రేయి హాజరు కావలసి ఉన్నది. ఒక ప్రత్యక్ష సాక్షి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకోవడానికే వసుంధర అక్కడికొచ్చింది. తోడుగా ఉన్న అక్కమ్మను ప్రశంసించింది. అక్కమ్మ మైత్రేయి మానసికంగా పడుతున్న బాధనంతా చెప్పింది.
“అవును అక్కమ్మ! ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చేవరకు ఈ వ్యధ తప్పదు. తానే ధైర్యం తెచ్చుకోవాలి. నేను మాట్లాడతానులే ,”అంటూ భరోసా ఇచ్చింది వసుంధర.
ఆ తరువాత “అక్కమ్మ ! నువ్వయితే ఏది నేరుగా చూడలేదు. ఆ సుబ్బారావు గారు చేసిన నిర్వాకమంతా చూసిన వాళ్లెవరయినా ఉన్నారా? ”అంటూ ఆరా తీసింది.
“ఆయ్! ఉన్నారండి. ఎవరింట్లో ఎం జరిగిన చూడడానికి మా రమాదేవి అమ్మగారు ఉన్నారు గదండీ!
ఆ రోజు కూడ రాగానే ముందీ విసయాలన్నీ సెప్పింది ఆ యమ్మగారేనండి! “
“అవునా! అనుకున్నాను. ఆయన! అదే రమాదేవి గారి మొగుడు ఎం చేస్తాడు?”
“ఆయ్! ఆయన పంతులు గారండీ. అందరిళ్ళలో పూజలు చేయిస్తుంటాడండి!”
“అయితే పద వాళ్ళింటి కెళదాము”, అని అక్కమ్మను లేవదీసింది వసుంధర.
“ఆమ్మో! ఆమె కాడక! ఆమె నోటికి హద్దులేదండి. ఎదోస్తే అదే మాటాడుతాది! మీరు భద్రం అమ్మగారు!” అంటూ వసుంధరను వాళ్ళింట్లోకి తీసుకెళ్లింది.
తలుపు దగ్గర చప్పుడవటంతో బయటికి తొంగి చూసిన రమాదేవి, వసుంధరను చూస్తూనే కొంచం గభరాటయింది. మొహమంతా నవ్వుపులుముకొంటూ, “ఎవర్నే అక్కమ్మ! ఇలా తీసుకొచ్చావు! “ అంటూ చాల ఆప్యాయంగా పలకరించింది.
మడికట్టు లో తొమ్మిది గజాల చిన్నాడం పట్టు చీర కట్టి అర్ధరూపాయి అంత బొట్టు, కళ్ళకి నిండుగా కాటుక, తడియారని చింపిరి జుట్టును ముడి పెట్టి దాని చుట్టూ పెట్టుకొన్న మల్లెపూల చెండు తో కళగానే కనిపించింది రమాదేవి. .కానీ మొఖంలోనే సుఖం లేదని కూడా అనిపించింది ఆమెని చూడగానే వసుంధరకి.
“పంతులు గారు లేరాండి!”అని చాల మర్యాద పూర్వకంగా అడిగింది. ఆ ఉన్నారండి. దేవతార్చన చేస్తున్నారు. పిలుస్తాను. అంటూ వడివడిగ వంటగదివైపు వెళ్ళింది. ఎర్రటి శాలువా కప్పుకొని, ఎర్రటి పంచకట్టుకొని కాస్త పొట్టిగ ఉన్న కోటయ్య పంతులుగారు గదిలోంచి బయటికొచ్చారు.
“మీరు వీలయితే ఈ రోజు సాయంత్రం మా ఇంటికి రావాలండి. మా వారేదో అడగాలని కొంటున్నారు. మీకు తెలుసుకదా అడ్వకేట్ వెంకటేస్వర్లు గారు, అదే రామాలయ ధర్మకర్త. మా వారే!”
“భేషుగ్గా! వెంకటేస్వర్లు గారు తెలియకపోవడమేంటి! నా పిండాకూడు! తప్పకుండ వారిని సాయంత్రమే దర్శించుకుంటానని చెప్పండి. మీరే ఎందుకొచ్చారమ్మ. కబురుపెట్టలేక పోయారా. ”
“పర్లేదండి! ఇటువైపు వస్తున్నాను కదాని నేనే చెప్పిపోదామని వచ్చాను”, అంటూ లేచింది వసుంధర. అక్కమ్మ ఆమె తోటే బయటికొచ్చింది.
కొద్దిసేపు మైత్రేయి దగ్గర కూర్చొని వెళ్ళిపోయింది వసుంధర. ఇంటికి వెళుతూనే తను అనుకొన్న ప్లాన్ గురించి చెప్పింది వెంకటేశ్వర్లు గారికి. ఆయన చిరునవ్వుతో తలాడించారు. సాయంత్రానికల్లా కోటయ్య పంతులు గారు అడ్వకేట్ గారి ఇంటికొచ్చ్చాడు. ఆయనకీ కాఫీ ఇచ్చి మాటల్లోకి దింపారు ఈ లాయర్ దంపతులు.
(ఇంకావుంది)