అక్షరానికి ఆచూకీ లేని చోట వికసించిన విద్యా కుసుమం

నారాయణమ్మ

“నా సంకల సఫాయి తట్ట నా సే తిలో సీపిరి కట్ట…. ” అంటూ పనికి పాటను జోడించి, జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికురాలు, జానపద గాయని అయిన నారాయణమ్మ గురించి తెలుసుకుందాం.

‘ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగెను ఏ చదువు వల్ల చేప పిల్ల ఈద గలిగెను ‘అనే పాట మన అందరికీ తెలిసిందే . మొత్తంగా కాకపోయినా ఈ పాటలోని ఈ చరణం నారాయణమ్మకు చక్కగా సరిపోతుంది.

నిరక్షరాస్యరాలైన వీరు రామాయణ , మహాభారతాల్లోని శ్లోకాలు, పద్యాలను అవలీలగా పాడడమే కాకుండా అద్భుతంగా విశ్లేషించగలరు. తత్వాలు  , కీర్తనలు, మంగళ హారతులు ఆమె గాన మాధుర్యానికి మచ్చు తునకలు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ‘ మాలు ‘ అనే గ్రామంలో జన్మించారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వామపక్ష నాయకుడైన తండ్రి వల్లనే తనకు గానం సంక్రమించిందని చెబుతారు.

వివాహానంతరం భర్తతో కలిసి తీర్థయాత్రల పేరుతో భారతదేశమంతా చుట్టి వచ్చినప్పటికీ ఏ విధమైన ఆత్మసంతృప్తి కలగలేదనీ, దీనికంతటికీ ఆవల ఇంకేదో పరమార్ధం దాగుందననీ, దాన్ని తెలుసుకోవాలన్న అన్వేషణలో భాగంగానే కరీంనగర్ జిల్లా , జమ్మికుంట మండలం , శ్రీరాముల పల్లె గ్రామంలోని ఒక సద్గురువు వద్ద పతీసమేతంగా ఉపదేశం లభించిందననీ, ఆ మంత్రానుష్ఠాన ఫలంగానే ఈ విద్వత్తు ప్రసాదించబడిందనీ చెబుతారు.

“మానవ జన్మముత్తమమని మురిసితే సరికాదో మనసా…. “

“సతి సుత బాంధవ హితులనుచు నీ మతి భ్రమ లేలనె ఓ మనసా…….”

అంటూ ప్రాపంచిక సుఖాలు శాశ్వతం కాదనీ ,   మద్యపానం , జూదం , వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసవకుండా మనసును నియంత్రణలో పెట్టుకోవాలననీ, పరమాత్మ స్వరూపుడైన గురువు అడుగుజాడలే ముక్తి మార్గ సోపానాలనీ హితాన్ని బోధిస్తారు.

“ఈ సొగసగు బంగారు లేడి కావలె నాథా……” అంటూ చక్కని గానాన్ని వినిపించడమే కాకుండా రాజభోగాలన్నింటినీ తృణప్రాయంగా భావించిన సీతమ్మ తల్లి మాయలేడిని చూసి ప్రలోభ పడిన వైనాన్ని అద్భుతంగా విశ్లేషిస్తారు.

“ఉంగరమా ముద్దుటుంగరమా….” అంటూ అంగుళీయకాన్ని అందించిన హనుమంతునితో సీతాదేవి అత్తవారింటి క్షేమ సమాచారం అడిగే వైనాన్ని హృద్యంగా వివరిస్తారు.

“సీత లేదురా లక్ష్మణ చిన్నబో యే  పర్ణశాల……”

అంటూ సీతాదేవి ఏడబాటుకు తల్లడిల్లే రామచంద్రుని వేదనను ఆర్తిగా పలికిస్తారు.

బ్రాహ్మీ ముహూర్తంలో జరిగే ప్రకృతి సంబంధ విషయాలను (ఉన్నత విద్యావంతులైన ఎంతోమందికి తెలియని ఎన్నో విషయాలను) వివరించిన తీరు ఆశ్చర్య చకితులను చేస్తుంది.

తెల్లవారుజామున 3 గంటలకు గురుపాదుకాసేవతో ప్రారంభమయ్యే తన దినచర్య మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్యోగ బాధ్యతలతో ఆ  తర్వాత భజనలతో కొనసాగుతుందనీ, తాను పనిచేసే వీధిలో తననందరూ ఆత్మీయంగా పలకరిస్తారనీ , కుటుంబంలోని వ్యక్తిగా భావిస్తారనీ, అది తనకత్యంత ఆనందాన్ని కలుగజేసే విషయమనీ చెబుతారు.

తనకు ‘జాతీయ కర్మచారి అవార్డు’ వచ్చిన విషయం ప్రప్రథమంగా ‘మైక్ ‘ టీ.వీ.వారి ద్వారా తెలిసిందనీ, రాజకీయ ప్రముఖులు, పలు ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులు తనను మనస్ఫూర్తిగా ప్రశంసించడం, సన్మానించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని వారి మాటల్లో చెబుతారు.

5 లక్షలకు పైగా వీక్షణాలు, 800 కామెంట్లు, 6 వేలకు పైగా సబ్స్క్రైబర్లతో ప్రపంచమంతా తన పేరు ప్రతిధ్వనిస్తుండడం జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయమని చెబుతారు.

తనకు వందలమందికి పైగా శిష్యులున్నారనీ, తనకు తన గురువు ద్వారా ప్రసాదించబడిన ఈ విద్య తనతోనే అంతం కాకుండా, భవిష్యత్తులో ఒక ఆశ్రమాన్ని నిర్మించి, పది మందికి పంచడమే తన ధ్యేయమనీ చెబుతారు. వారి కల ఫలించాలని ఆశిద్దాం.   

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త ఆలోచన

అరటాకు