మనది పురుషాధిక్య సమాజం , పితృస్వా మ్య వ్యవస్థ అన్నది నిర్వివాదాంశం. అసలు సృష్టిలో నే పురుషాధిక్యత అన్నది పురుషునికిగల సహజసిద్ధమైన స్వభావం. కారణం ఇటు జంతువులను చూసుకున్నా, మనిషిని చూసినా స్త్రీ జాతికి, పురుష జాతి కన్నా శారీరిక దారుఢ్యం లోపించడమే అని చెప్పక తప్పదు. అందు వల్లనే స్త్రీ జాతి మానసికంగా ఎంత చాకచక్యం, మేధస్సు కలిగినవారైనా కూడ ఈ దేహదారుఢ్య లోపం వల్ల అనాదిగా స్త్రీ జాతి పురుషులకు దాసోహం అనక తప్పడం లేదు.
ఇక మనిషి విషయానికి వస్తే, స్త్రీల సహజమైన బలహీనతను ఆసరా చేసుకుని, సమాజంలో పురుషుడు తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికై చేయని ప్రయత్నం లేదు. చివరి ప్రయత్నంగా, అతడు సమాజాన్ని ఓ త్రాటిమీద నిలబెట్టడంకోసమని ఈ మానవుడే ఏర్పరచిన వివిధ మతాలనే శాసించడానికి ప్రయత్నించాడంటే, అది ఎంతటి దుస్సాహసమో మనం అర్థం చేసుకోవచ్చు!
మచ్చుకి మన హిందూ మతాన్నే తీసుకుంటే మన పురాణాలలో స్త్రీలను అంటే ద సోకాల్డ్ దేవతలను ఏ విధంగా, ఓ రకమైన బానిసలుగా చిత్రీకరించారో అర్ధం చేసుకున్న స్త్రీ వాదులెవరికైనా సరే, రక్తం మరగక మానదు . అడుగడునా ఏ కథ చూసినా స్త్రీలను చులకన చేసి తమ ఆధిక్యతను చాటుకోవాలన్న ఒకే ఒక ధ్యేయం, అభిలాష కానరావడమే తప్ప మరే లక్ష్యం కనబడదు. అంతేకాదు ఏ పురాణ గాథ విశ్లేషించినా తమ స్వలాభాల కోసమని స్త్రీని, ఆమె వ్యక్తిత్వాన్నీ కించపరచటానికి ఏ మాత్రం వెనుకాడని ఈ పురుష జాతిని చూసి ఏమనాలో తెలియని పరిస్థితి! పురుషుడు సమాజంలో తన స్థానాన్ని బలపరచుకోవడం కోసం ఇంతగా దిగజారడానికిగల కారణాన్ని గనుక మనం వెతికి పట్టుకుంటే మనమందరం విస్మయానికి గురైయ్యే ఓ చిత్రమైన విషయం ఆవిష్కరింపబడుతుందంటే అతిశయోక్తి కాదు.
ఆశ్చర్యపోతున్నారు కదూ! అదేమిటో కాదు పురుషులు ఓ విధమైన మానసిక వ్యాధితో బాధపడటమే అందుకు కారణం! దానినే ఆత్మ న్యూనతాభావం అంటారు . యస్ ! ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాలా నిజం!
ఇప్పుడు బాహ్యంగా పురుషులలో కనపడే నియంతృత్వ ధోరణీ, అధికారం చలాయించే మనస్థత్వం వీటివెనుక, ఓ అమాయక పసిబిడ్డను పోలిన మనస్తత్వం దాగి ఉందంటే నమ్ముతారా? ఇదిగో దానికి నా వివరణ …..!
స్వతహాగా ప్రతీ మనిషీ ఎదుటి వ్యక్తికన్నా, తాను కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలని కోరుకుంటాడు..! కానీ అది సాధించలేనిదని తెలిసిన మరుక్షణం మనిషి ఎంతటి నిరాశా నిస్పృహలకు లోనవుతాడో మనసున్న ఎవరికైనా అర్థం కాక మానదు. అదేమిటా అని విస్మయానికి గురి కావద్దని నా మనవి….అంటే మీకు మనసు లేదనడం నా అభిమతం కాదు సుమా…..!
ఇంతకీ అసలు విషయానికి వస్తే, గ్రహించదగ్గ విషయం ఏంటంటే, పురుషునికి ఉన్న ఆత్మన్యూనతా భావం ఏంటయ్యా అంటే, తనకన్నా శరీర దారుఢ్యం లో బలహీనురాలైన ఓ స్త్రీ ఆఫ్ట్రాల్ ఓ అబలకున్న ప్లస్ పాయింట్ తనకు లేకపోవడమే… అదేమిటో తెలుసా…సోదరీమణులారా…? అదే ఓ స్త్రీ తాను కన్నబిడ్డకు తల్లి తానేనని తలెత్తుకుని సగర్వంగా చెప్పుకోగలదు. కానీ ఆ వరం భగవంతుడు పురుషులకు ప్రసాదించలేదు. తనకు కలిగిన సంతానానికి తానే తండ్రినని, ఈ ప్రపంచానికి చాటి చెప్పటానికి పురుషుడికి స్త్రీ సహాయ సహకారాలవసరం. ఆమె ఏం చెపితే అదే వేదవాక్కు…..అదే శిలాశాసనం! ఇంతకన్నా ఏం కావాలి! ఎవరి ఇగో అయినా దెబ్బ తినడానికి….? ఇక అసలే బలమదంతో విర్రవీగుతున్న పురుషుని విషయంలో అయితే వేరే చెప్పాలా..? స్త్రీ కనుక పురుషుడి మీద ఏ కారణం చేతనైనా పగ లేక ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఒకే ఒక్క మాటతో అతని ఆత్మవిశ్వాసం, అతను కట్టుకున్న ఆశాసౌధాలను సహితం కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించి వేయగల శక్తిని ఆ పరమాత్మ ఆమెకు ప్రసాదించాడు.
గమనించండి అక్కా, చెల్లెమ్మల్లారా..! అదే ఆ ఒక్క మాట , “ ఈ బిడ్డ నీకు పుట్ట లేదు ” అని అనే మాట! ఆ మాట అని తనకు తాను అపకీర్తి మూట కట్టుకోలేదు కానీ ఆ మాట అవసరం అయితే స్త్రీ అనగలదు అనే ఆలోచనే అతను తట్టుకోలేడు. అయితే ఆ మాట స్త్రీ ఎక్కడ, ఎప్పుడు అంటుందోనన్న భయంతో పురుషుడు నిరంతరం ఓ అబధ్రతా భావంతో బ్రతుకు బండి నడుపుతూ గడుపుతాడు. అయితే అటువంటి మానసికబలహీనుడిపట్ల మనం అంటే స్త్రీలు చూపించవలసినది దయాజాలేగానీ విప్లవ దృష్టి కానే కాదు సుమా…! అంతేకాదు ఇటువంటి వారి పట్ల దయ, కరుణ, ఔదార్యమే తప్ప, చూపించవలసినది తిరుగుబాటుతనం కానేకాదు మిత్రులారా! పురుషులు ఎంత మానసికంగా కృంగుపాటుకు గురైన ప్రాణులంటే, వారు తమ అస్తిత్వం కోల్పోకుండా ఉండేందుకు అనాదిగా ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధమైనవారో ఒకసారి మన పురాణాలను క్షుణ్ణంగా పునరావలోకనం చేస్తే తెలుస్తుంది. ఈ ఆధునిక కాలంలో డి. ఎన్ . ఏ . టెస్టు లు వచ్చాయి . నిజ నిర్ధారణ పరీక్షలు చేస్తే, అపరాధ పరిశోధన చేస్తే ఏమో ‘అతని వల్లనే‘ అనేది బయట పడుతుందేమోకానీ, పూర్వ కాలంలో ఇది లేదు. స్త్రీ లే నిజం చెప్పాలంటే వాళ్ళ ఇష్టానికే విలువ ఇస్తారు. ఇదే ! ఇందుకే పురుషులు భయాన్ని బలం గా మలచుకోవడానికి అహంభావాన్ని ప్రదర్శించి , పితృ స్వామ్య వ్యవస్థ ను పటిష్టంగా తయారు చేసాడు.
కాబట్టి , మనమందరమూ వారిపట్ల చూపించవలసిందీ, కురిపించవలసిందీ మాతృభావమే కానీ అన్యం కాదని నా దృఢాభిప్రాయం. అదెట్లాగో ప్రతి స్త్రీ కి వెన్నతో పెట్టిన విద్య …!పరమాత్మ ప్రసాదించిన వరం అంటే అతిశయోక్తి కాదు. కాదనగలరా? ఏ స్త్రీ అయితే పురుషుని తన పరిష్వంగంలోకి తీసుకుని,ప్రేమించి లాలించగల నేర్పు గలిగి ఉంటుందో ఆమెకు విజయం కరతలామలకం కాగలదు!!! విశ్వసించండి ప్రియ సఖులారా!!!