మరుగుపడుతున్న పేర్లు ఆచారాలు

డాక్టర్ మాదిరెడ్డి అండమ్మ.

డాక్టర్ మాదిరెడ్డి అండమ్మ విశ్రాంతాచార్యులు, తెలుగుశాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఆధునిక నాగరికత, శాస్త్రవిజ్ఞానాభివృద్ధి చెందడం, ఉద్యోగరీత్యా సమయం లేకుండా ఉండడం, వృత్తులు, జీవనోపాధులలో మార్పులు రావడం, మతాలు మారడం, వలసలు వెళ్లడం, హేతువాదం మొదలైనవన్నీ ఆచారాలు మారడానికి కారణాలు.

వ్యక్తికి సంకేతం పేరు. అందువల్లనే ప్రపంచంలోని కోట్లాది మనుష్యులకు కోట్లాది పేర్లు ఏర్ప డ్డాయి. ఈ కోట్లాది మనుష్యుల్లో వ్యక్తులను పోలిన వ్యక్తులు ఉండడం అరుదేమోగానీ పేరును బోలిన పేర్లు అనేకంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తులను వారి ఇంటిపేరుతోగానీ, తండ్రిపేరుతోగానీ, ప్రాంతం, రంగు, రూపు, ఆకారస్వరూపం, వయసు మొదలైన వాటిని జోడించిగానీ పిలవడం కద్దు. ఈ సువిశాల ప్రపంచంలోని ఇలాంటి పేర్లను, ఓ పట్టిక రాసి, పరిశీలించిచూస్తే అనేక విషయాలు వెలికి వస్తాయి. కొన్నిపేర్లు చాలా వరకు మరుగున పడిపోయాయి. కొన్నిపేర్లు ఒకనాడు సర్వసాధారణంగా నూ, ఆ తర్వాత అసాధారణంగానూ, ఈనాడు వింతగానూ అనిపిస్తాయి. అంతేగాకుండా ఈ పేర్లను పరిశీలనాదృష్టితో చూసినపుడు వాటిపైన
సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా కనిపిస్తుంది. కొంతకాలం క్రితం వరకు ప్రతి ఒక్కరు ప్రకృతి మీదనే భారం వేసి, ‘నారు పోసినవాడు నీరు పొయ్యడా, కిస్కా కిస్మత్ ఉన్కే సాత్, పుట్టేవాడు రాముడౌతాడో, రావణుడౌతాడో (రాకాసుడౌతాడో’ అని కుటుంబనియంత్రణ పాటించకుండా పిల్లలను కంటూ ఉండేవారు. ఇప్పటికీ కొన్ని మతాలవారు, కొన్ని ప్రాంతాలవారు, మూఢవిశ్వాసాలు అధికంగా ఉన్నవారు, అదే పని చేస్తున్నారు. ఎవరైనా ఇద్దరు కొత్తవారు కలిసినపుడు సర్వసాధారణంగా అడిగే ప్రశ్న ‘మీకు పిల్లలెంతమంది, ఏంచేస్తున్నార’ని. కాని ‘నీకెంత ధనముంది, ఎంత సంపద ఉంది’ అని అడగరు కదా’ అని వారు వారి సంతానాపేక్షను సమర్థించుకుంటారు. వీరి సంతానాపేక్షకు తగినట్టుగానే ఆ కాలంలో అరడజనుకు తక్కువగా పుట్టకపోయే వారు. పిల్లలు కలగని వారికి అసలే కలగక పోయేవారు. కొందరు ఇద్దరు, ముగ్గురు భార్యలను చేసుకున్నా కూడా వారికి సంతానం కలుగకపోయేది. మరి కొందరికి పుడుతూ గిడుతూ ఉండేవారు. పిల్లలు అసలే లేనివారు, పిల్లలు పుడుతూ గిడుతూ ఉండేవారు
ఎదురైన దేవుళ్లకూ, రాళ్లకూ, రప్పలకూ, దయ్యాలకూ భూతాలకూ దండాలు దస్కాలు పెడుతుండేవారు. మరికొందరు నాగుపాము, త్రాచుపాము శాపం తగిలిందనుకునేవారు. అందు వల్లనే గర్భస్రావం అవుతుందనుకునేవారు. పిల్లలను పొందడానికి, వారిని సంరక్షించుకోవడానికి నానా యాతనలు(తిప్పలు) పడుతుండేవారు. ఈ రోజుల్లోనూ సంతానం కోసం కుటుంబ వ్యక్తులు పడేపాట్లను వార్తాపత్రికల్లోనూ, టి.విల్లోనూ వార్తలుగా చూస్తూనే ఉన్నాం. ఈ యాతనలు, తాపత్రయాలు
పురాణాల కాలం నుండి ఈనాటి వరకూ – స్పష్టంగా వారు ఆచరించే ఆచారాల్లోనూ, సంతానానికి పెట్టుకునే పేర్లలోనూ కనిపిస్తున్నాయి. ముందుగా పుడుతూగిడుతూ ఉండే పిల్లలకోసం చేసే ఆచారాల గురించి తెలుసుకుందాం.
గ్రామాల్లో ఇంటివద్ద గర్భిణీస్త్రీ ప్రసవమైతే, శిశువు జన్మించగానే, వారిమీద కలినీళ్లు (కూరాడు కుండలోని నీళ్లు) చల్లి, మెత్తటి బట్టతో తుడిచి, చేటలో ధాన్యం పోసి, మెత్తటి బట్టవేసి, అందులో పడుకో బెడ్తారు. ఇలా చేయడం మన ఆచారం.
పిల్లలు పుట్టి చనిపోతున్నపుడు పెద్దలు చెప్పిన పై ఆచారాలకు భిన్నంగా చేసేవారు. పిల్లలకు అన్ని ‘సాగుబాట్లు’ చేస్తే గిట్టడం లేదనీ, చనిపోతున్నారనీ, అందుకు భిన్నంగా చేస్తేనైనా వారు బతుకుతారేమోనని భావించేవారు. అందుకని ఈ కింద చెప్పిన విధంగా కూడా చేసేవారు. ఆ శిశువును పెంట (చెత్తకుప్ప)మీదనో, బొందలలోనో, గొయ్యిలోనో, గాలిధూళిలోనో
కాసేపు పడుకోబెట్టి, తీసుకొని వచ్చేవారు. లేదా వయసుపండిన వ్యక్తి తిన్న ఎంగిలి విస్తరాకులోనో, పుల్లాకులపైననో పడుకోబెట్టేవారు. కొన్నిసార్లు కడుపునిండా కన్నతల్లికి (అధికసంతానం ఉన్న తల్లికి) దత్తత ఇచ్చేవారు. ఆ తర్వాత వారికి ‘తాలో తౌడో, బియ్యమో నూకలో రూకలో ‘ ఇచ్చి, వారి నుండి కొనుక్కునేవారు. లేదా వారి నుండి ఆ సంతానాన్ని భిక్షంగా అడుక్కునేవారు. మరికొందరు ‘చాకటింటి గుడ్డ చలవ’ అని చాకలింటి నుండి ఓ గుడ్డ తెచ్చి, అందులో పడుకోబెట్టేవారు. ఇవన్నీ కూడా సంతాన పరిరక్షణకోసం చేసే చర్యలే. ఈ విధంగా చేసే వారి పనులను బట్టే ఆ పిల్లలకు పేర్లు బెట్టేవారు.
ఉదా: పెంటమ్మ మీద పడుకో బెట్టేవారిని పెంటయ్య, పెంటమ్మ అనీ, బొందపైన పడుకో బెట్టేవారిని బొందె(ద)య్య, బొందె(ద)మ్మ అనీ, విస్తరి మీద పడుకో బెట్టేవారిని ఇస్తారి, ఇస్తారమ్మ అనీ, పుల్లాకుల మీద పడుకోబెట్టే వారిని పుల్లయ్య, పుల్లమ్మ అనీ, గాలిలో ధూళిలో పడుకోట్టే వారిని గాలయ్య, ధూలయ్య అనీ ఇలా శిశువును దేని మీద పడుకోబెడితే
దాని పేరే పెట్టేవారు.

శిశువును ఎవరికైనా దానం ఇచ్చేవారు. వారిని ప్రతిఫలం ఇచ్చి కొనుక్కునేవారు. ఆ మారకం (ప్రతిఫలం) వస్తువు తాలు, తౌడు, రొక్కం, రూక మొదలైనవి ఏవైనా కావచ్చు. అలా కొనుక్కున్న వారికి ఆయా వస్తువుల పేరు ‘తాలయ్య, తౌడయ్య, రొక్కమ్మ, రొక్కయ్య’ అని పేరు పెట్టే వారు. దానం ఇచ్చి తీసుకున్న వారిని దానయ్య, దానమ్మ అనీ, భిక్షం ఇచ్చి, మళ్లీ అడుక్కొని తెచ్చుకున్నవారిని భిక్షం, బిక్షమయ్య (బిచ్చం, బిచ్చమయ్య), బిచ్చపమ్మ అనీ పేరు పెట్టేవారు.
స్త్రీ ప్రసవించిన తర్వాత అలసటతో నిద్రించినపుడు, తల్లికి తెలియకుండా శిశువును బంధువులు ‘దొంగలు’ ఎత్తుకొనిపోయినట్లు ఎత్తుకు పోయేవారు. మెలకువ వచ్చినతర్వాత శిశువుకోసం తల్లి రోదిస్తున్న సమయంలో ఆ శిశువును వెదకినట్లుగా చేసి, తల్లికి తెచ్చి ఇచ్చేవారు. దొంగలు ఎత్తుకు పోయిన ఆ శిశువుకు ‘దొంగయ్య’ అని పేరు పెట్టేవారు.
కొందరు ఏడు ఇండ్లల్లో భిక్షమడిగి తెచ్చిన సొమ్ముతో పంచలోహాలతీగను, ఒక ముత్యాన్ని, పగు(గ)డాన్ని కొంటారు. ఆ తీగకు పగడాన్ని, ముత్యాన్ని గుచ్చి విడిచెవుకు, విడిముక్కుకు కుట్టించి పెట్టేవారు. కుడిచెవి, ఎడమ ముక్కుకు గానీ-
ఎడమచెవి, కుడిముక్కుకు గానీ కుట్టిస్తే – విడిముక్కు, విడిచెవి కుట్టడం అని అంటారు.

భిక్షం అడిగి సంపాదించిన సొమ్ముతో విడిముక్కు, విడిచెవి కుట్టించిన పిల్లలకు కూడా ‘భిక్షం, భిక్షమయ్య, బిచ్చపమ్మ’ అని పేరు పెట్టేవారు. ఇప్పటికీ ఇలాంటి పేర్లున్నవారు, ఆ తాలూకు చిహ్నాలు ఉన్నవారు మనకు కనిపిస్తుంటారు.
మొగులయ్య, మొగులమ్మ అని పేర్లు రావడానికి అనేక కారణాలున్నాయి. 1) కొంతమందికి ‘మొగుళ్లజబ్బు’ వస్తుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడంతో, కడుపు ఉబ్బి, శ్వాస తీసుకోవడం చాల కష్టంగా ఉంటుంది. ఆ జబ్బువచ్చిన తర్వాత బతికిన వారికి కూడా ‘మొగులయ్య, మొగులమ్మ’ అని పేర్లు పెట్టేవారు. 2) మరి కొందరు మొగుళ్లు (మబ్బులు) వచ్చిన సమయంలో పిల్లలను ఆరుబయట పండుకోబెట్టి వారికి మొగులయ్య, మొగులమ్మ అని పేరు పెట్టేవారు. 3) వానాకాలంలో బాగా మబ్బులు పట్టి, వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు, పసిపిల్లలకు శ్వాసపీల్చుకోవడం చాలా చాలాకష్టమవుతుంది. పిల్లలకు కడుపు ఉబ్బుతుంది. అలాంటి వారికి కడుపు పైన నూనె, పసుపు రుద్ది, జిల్లేడుపాలు గానీ, తమలపాకులు వెచ్చ చేసి గానీ పెడుతుండేవారు. మంత్రాలు వేయించేవారు. ఈ జబ్బువచ్చి, బతికి బట్ట కట్టిన వారికి కూడా ‘మొగులయ్య, మొగులమ్మ’ అని పేరు పెట్టేవారు.
ఇలా అనేక బాలారిష్టాల నుండి శిశువు బయటపడిన తర్వాత కూడా వారు ఎదిగే వరకు చేసే తతంగాలు కొన్ని ఉన్నాయి. ఉదా: వెట్టికి పెంచడం.
పిల్లలను అపురూపంగా, ప్రేమగా పెంచడం వల్ల వారు అపురూపమై పోతున్నారని (మరణిస్తున్నారని) భావించి, వారిని వెట్టికి పెంచుతారు. గారాబంతో చూడరు. వారి పట్ల తగిన శ్రద్ధ తీసుకోరు, వెట్టికి పెంచినట్లు పెంచేవారు. అలాంటి వారికి చీమిడి కారుతున్నా, ఈగలు వాలుతున్నా, ఆకలై ఏడుస్తున్నా వారిని అంతగా పట్టించుకోరు. సరైన బట్టలు గానీ, అందమైన బట్టలు గానీ వేయరు. కొత్తబట్టలు అసలే వేయరు. మంచిపేరు పెట్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిల్లిపాది తమ మనసును, మమతానురాగాలను చంపుకొని, ఈసడించుకుంటూ పెంచుతారు. వారు వెట్టిగా పెంచిన విధానానికి తగినట్టుగానే వారికి ‘ఎ(వె)ట్టయ్య, ఎ(వె)ట్టమ్మ’ అని పేర్లు పెట్టేవారు.
నరదృష్టి (కొందరి చూపు) మంచిది కాదని, వారి దృష్టి ఎక్కడ పడితే అక్కడి వారికి దృష్టిదోషం తగిలి, నష్టం జరుగుతుందని జానపదులు నమ్ముతారు. దృష్టిదోషం తమ సంతానానికి తగలకుండా వారి పిల్లలకు కనుబొమల మధ్యన (ముక్కు,నొసలు కలిసే చోటు) లేదా గదుమ(చుబుకం) మీద పచ్చబొట్టు పొడిపిస్తారు. ఇప్పటికీ ఈ ఆచారం అమలులో ఉంది.
శరీరం పైన ఎలాంటి మచ్చలు లేనివారిని, అంగవైకల్యం లేనివారిని, అందమైన వారిని పూర్వకాలం పెద్దపెద్ద కట్టడాలకు, నిధులకు, చెరువులకు, కుంటలకు తరచుగా బలిచ్చేవారు. అంగవైక ల్యం ఉన్నా, పచ్చలు, మచ్చలు, ఉన్నా బలులివ్వడానికి పనికి రారు.
(అంతా ఒకందుకు మంచిదే అని మనం చిన్నప్పు డు విన్న రాజు, మంత్రి కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు). అంతేగాకుండా అందంగా ఉన్న వారిపై మంత్రాలు నేర్చుకున్నవారు మంత్రానికి ‘పాటి’ చూసుకునేవారు (కుంటారు). పాటి అంటే మంత్రం ఫలిస్తుందా? లేదా? అని ప్రాక్టికల్స్ చేసి, చూసుకోవడం. మచ్చలు ఉంటే పాటి చూసుకోవడానికి కూడా పనికి రారు. అందువల్ల పాటికి పనికి రాకుండా ముక్కుపైన అడ్డంగా పచ్చబొట్టు పొడిపించేవారు.
ఇప్పటికీ లంబాడి వారి ముఖాలను గమనిస్తే ఈ విషయం సుస్పష్టం అవుతది.

మరికొన్ని పేర్లు ఆయా వ్యక్తుల ఉనికిని, సంఘటనలను తెలియజేస్తాయి. రెక్కాడితేగాని డొక్కా డని జీవులు కూలికోనాలికో,
కట్టెకో పిడకకో, చేనుకో చెల్కకో, అడవికో వెళ్తారు. ఇలాంటి పనులు నిండుచూలాలికైనా, పచ్చిబాలెంతకైనా తప్పవు. నిండుచూలాలు పనికివెళ్లి, తిరిగిరావడానికి వీలులేని పరిస్థితుల్లో ఏ అడవి లోనో ప్రసవించాల్సి వస్తుంది. ఆ విధంగా ఆగంగా ఆగంగా జన్మించినవారికి ఆ సంఘటనకు గుర్తుగా ‘ఆగయ్య, అడివయ్య,
ఆగమ్మ అడివమ్మ ‘ అని పేర్లు పెట్టుకుంటారు. పిల్లలు దక్కని వారుకూడా అడవిలో పడుకోబెట్టి, తిరిగి తెచ్చుకొని, అవే పేర్లు పెట్టుకుంటారు.
ఇవేగాకుండా పిచ్చమ్మ, పిచ్చయ్య, బుచ్చమ్మ, బుచ్చయ్య, ఉచ్చమ్మ, రొక్క(ల)మ్మ, రొక్కయ్య
అనే పేర్లు పెట్టుకోవడం ఒకనాడు సర్వ సాధారణం. ఈనాడు ఇవి వింత పేర్లు.

ప్రభుత్వం కుటుంబనియంత్రణా కార్యక్రమం చేపట్టనపుడు కూడా ప్రజలు దానిని ఆచరించినట్లు మనకు తెలుస్తుంది. అందుకుగాను వారు ఆపరేషన్లు చేయించుకోలేదు. భావజాలాన్ని ఉపయోగించుకున్నా రు. భగవంతుని మీద భారం వేసి, పిల్లలు ఇక చాలు, పిల్లలు వద్దనుకొని, అందరికన్నా చిన్నవారికి ‘సాలయ్య, సాలమ్మ (చాలు అయ్య, చాలు అమ్మ)’ అనీ పేర్లు పెట్టుకునేవారు. ‘ముద్దుకు మొద్దోడు’ అని పిలిచినట్లు, ఆ పేర్లు మనకు వింతగా అనిపించినా ఒకనాటి మానవుల మనస్తత్వాన్ని, వారి ఆలోచనాసరళిని, ప్రకృతితో మానవుడికున్న అనుబంధాన్ని, గతం తాలూకు వాసనలను, అనుభవాలను, వాటిని వదలలే ని మానవుడిని మనకు గోచరింపజేస్తాయి. అలాగే కొన్ని పేర్లను బట్టి కూడా
ఆ వ్యక్తులు ఏ ప్రాంతం వారో, ఏ మతం వారో తెలుసుకోవడానికి ఉపయోగపడ్తాయి.
దంపతులకు ‘సంతానం ఇచ్చే దైవం ముఖ్యం గానీ మతం కాదు. ఆ దైవం తమ మతం వాడా, ఇతర మతం వాడా అని కూడా ఆలోచించరు. ఈ కారణంగా తెలుగువారి పేర్లలో ముస్లింమతా నికి చెందిన పేర్లు, క్రిస్టియన్ మతానికి చెందిన పేర్లు కనిపిస్తుంటాయి.
దంపతులు దర్గాల వద్దకు వెళ్లి వచ్చింతర్వాత వారికి జన్మించిన సంతానానికి ఆయా దేవుళ్ల పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకు – జానయ్య, జంగయ్య, జంగమ్మ, సైదయ్య జానపాడ్ సయ్యద్ ను, జహంగీర్, కాశిం మొదలైన పేర్లు అలాంటివే. పిల్లలను గిట్టించుకోవడానికి వింతైన మరో ఆచారం, మరో ప్రయత్నం – లింగ సహజం కాని పేర్లు పెట్టడం. పేరు చివర ‘అమ్మ’ను చేర్చి మగపిల్లలకు ‘అయ్య’ను చేర్చి ఆడపిల్లలకు పేరు పెడుతుండేవారు. ఉదా: కిష్టమ్మ (మగవాళ్లపేరు, వేములకొండ గ్రామం, నల్లగొండజిల్లా) పేర్లను బట్టి కూడా కొన్నిసార్లు – వారు ఏ ప్రాంతం వారో తెలుసుకోవడానికి అవకాశం ఉం టుంది. యాదగిరి పేరు వినగానే ఇది తెలంగాణవారి పేరనీ, మునయ్య, మునమ్మ అనగానే రాయల సీమ వాళ్ల పేర్లనీ, పైడితల్లి, పైడయ్య, పైడమ్మ అనగానే విజయనగరం వారి పేర్లనీ చెప్పవచ్చు. అప్పయ్య, అప్ప లమ్మ. సింహాచలం (శ్రీకాకుళం), మస్తానమ్మ, మస్తానయ్య పేరు వినగనే గుంటూరు ప్రాంతం వారనీ తెలుసుకోవచ్చు. మచ్చుకు:
ఉస్మానియావిశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సుదీర్ఘకాలం తన సేవలందించిన కీ.శే. ఆచార్య నాయనికృష్ణకుమారి గారిని ఆమె ఇంటివారు, బంధువులు ‘మస్తానమ్మ’ అనే పిలిచేవారు. మొట్టమొదటి మన హైకోర్టు న్యాయాధిపతి పేరు మస్తానయ్యనే.

తెలుగువారు సాధారణంగా శిశువు జన్మించిన పదకొండవరోజు ‘పురుడు’ చేస్తారు. ఆ రోజు పేరంటాళ్లను పిలిచి, మంతస్రానితో శిశువుకు ‘పేరు’ పెట్టిస్తారు. మగపిల్లలకైతే ఆ రోజు ‘మొలదారం, మొల్దారం’ కడ్తారు. అకాలమృత్యువు పొందే పిల్లలకు నిర్ణీతదినం(11 వరోజు) కాకుండా ‘దొంగ పురుడు’ లేదా ‘కుక్కపురుడు’ చేస్తారు. అంటే పురుడును పదకొండ(11)వ రోజున గాకుండా ముందుగానే – 3, 5, 9రోజుల్లో ఏదో ఒక రోజు చేస్తారు. బంధువులకు ఎవరికి తెలియకుండా చేసేది దొంగపురుడు. బంధువులను పిలిచి, విందు మొదలైనవి చేయకుండా కుక్కకు అన్నం పెడితే అది ‘కుక్క పురుడు’. కాలక్రమేణ ప్రజలు విద్యావంతులు కావడంతోనూ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరగడంతోనూ, మూఢ విశ్వాసాల ప్రభావం తగ్గడంవల్లనూ
పైన చెప్పుకున్న ఆచారాలు తగ్గినాయి. ఇలాంటి (ఒకనాటి) ఆచారాలు, పేర్లు మరుగునపడిపోతున్నాయి.
ఇటివల కాలంలో 21వరోజు నామకరణ మహోత్సవమని చేస్తున్నారు. కాని నిజానికి అది డోలారోహణ మహోత్సవం.

21వ రోజు శిశువు తల్లిని (బాలెంతను) బావికి తీస్తారు. ఆ రోజు నుండి బాలెంత ఇంటి పని చేసుకోవచ్చు.
పెద్దవారిని వరసవాయి, పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా, ఎవరినైనా పేరు పెట్టి పిలిస్తే – ఏమిరా! ‘బొడ్డుగోసి పేరు పెట్టినావురా?’ అని తిడ్తారు.

కొన్ని కుటుంబాల్లో సంతానం కలుగుతున్న కొద్ది, ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున తగ్గించుకుంటూ పురుడు, బారసాల చేస్తారు. ఉదా : ‘పాశం’ ఇంటి పేరు కలిగిన గౌండ్లవారు. వీరిది ముకునూరు గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా.

ఇలాంటి ఎన్నో ఆచారాలు, మూఢవిశ్వాసాలు నేడు తగ్గుముఖం పట్టినాయి. పేర్లలోన ఆధునికత చోటుచోసుకుంటున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

ఎడారి కొలను