విద్యావేత్త ,అధ్యాపకురాలు, వక్త, కుప్పం విశ్వవిద్యాలయ ఉపకులపతియైన వీరుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ లో జన్మించారు .ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీమతి భాగీరథి వీరి తల్లిదండ్రులు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1990 లో యం. ఏ.లో బంగారు పతకంతో పట్టాను, 1995 లో తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి.ని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం నుండి చేశారు. 1985లో రాష్ట్ర భాషా- 2 , 1987 లో అభిజ్ఞ – 2, ఆంధ్ర యూనివర్సిటీ నుండి అనువాదంలో పి .జి .డిప్లమా -1996లో, ఎస్కేయూ నుండి తమిళంలో పీజీ డిప్లమా చేశారు. 1993లో అధ్యాపక వృత్తి మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రొఫెసర్ గా చాలా కాలం పని చేసి, ఇటీవల కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయం ఉపకులపతిగా డిసెంబర్ 27, 2023 న నియమితులైనారు.
వీరివి ప్రముఖ జర్నల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ లో 77 పరిశోధక కథనాలు ప్రచురితమైనాయి. 15 అంతర్జాతీయ సదస్సులు, 185 జాతీయ సెమినార్లు, కాన్ఫరెన్స్‌లలో పాల్గొని పరిశోధక పత్రాలను సమర్పించి ,ఆరు సెమినార్లు నిర్వహించారు. వీరి పర్యవేక్షణలో ఎంతోమంది డాక్టరేట్, యం. ఫిల్ చేసారు, చేస్తున్నారు.
వీరు 23 పుస్తకాలు ప్రచురించారు. వాటిలో నాన్న, బెజవాడ గోపాల్ రెడ్డి కవిత్వం – సౌందర్యం, తెలుగు సాహితీ వాస్తు పరిణామము, సాహిత్య వీక్షణం, దండోరా – అంబేద్కర్ అభీష్టం, శ్రీ తాళ్ళపాక సాహిత్యానుశీలనం, పిడికెడు సాహిత్యం, పిడికెడు ఆలోచనలు, పాఠ్య సాహిత్యం , ఆచార్య సాహిత్యం, దళిత సాహిత్య సౌందర్య తత్వం ,స్త్రీవాద సాహిత్యము – సామాజిక అవసరం, ఆధునిక తెలుగు సాహిత్యం – దళిత సంస్కృతి , గుప్పెడు తలపులు, అమ్మమ్మకో అప్పగింత మొదలైనవి.
పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షురాలిగా, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుగా, ఉన్నత భారత అభియాన్ సంస్థకు సమన్వయకర్తగా, పలు రేడియో ప్రసంగాలు ,పత్రికా ప్రచురణలు, ప్రసంగాలు నిర్వహించారు.
వీరి ప్రతిభకు ఎన్నో అవార్డులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. 2011లో రాష్ట్ర ఉపాద్యాయ అవార్డు, గుర్రం జాషువా అవార్డు, 2016లో ఉగాది పురస్కారం తో విజయవాడలో ప్రభుత్వం సత్కరించింది. 2017లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వివిధ
సంస్థలచే 11 అవార్డులను కైవసం చేసుకున్నారు.
ఒక రచయితను గూర్చిఅంచనా వేయాలంటే ఒక పుస్తకం చదివితే సరిపోదని, వారి సాహిత్యాన్ని చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుందనే వీరు జానపద సాహిత్యాన్ని చాలా ఇష్టపడతారు. సంపూర్ణత్వంలోనే సౌందర్యం ఉంటుందంటారు. విమర్శల్లో సైద్ధాంతికత లేకపోవడం వారిని బాధించే అంశం. నాన్నే తన బలం అంటూ ఆయనపై ప్రేమతో ‘నాన్న’ పుస్తకాన్ని వెలువరించారు .ఇనాక్ గారి కుటుంబ చరిత్రను, వారి జీవితానుభవాలను, విధినిర్వహణలో ఆటుపోట్లను, ఉపకులపతిగా చేసిన విద్యా సంస్కరణల సమాహారంగా ఈ పుస్తకాన్ని మనం చూడొచ్చు.
తాళ్ళపాక అన్నమయ్య 520వ వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొన్న మధు జ్యోతి గారు అన్నమయ్య సామాజికత అంశంపై మాట్లాడుతూ : నాటి సమాజంలో హెచ్చుతగ్గులు లేక అందరూ సమానంగా చూడబడ్డారని, ‘ అందరికీ శ్రీహరే అంతరాత్మ’ అంటూ అన్నమయ్య చెప్పారని, రాయలసీమ మాండలికాలను ఎక్కువగా ఉపయోగించారని, అన్నమయ్య కీర్తనలతో వ్యక్తిత్వం వికాసవంతమౌతుందని పేర్కొన్నారు.
ఆధునిక స్త్రీ సాహిత్యం పై స్పందిస్తూ – స్త్రీ సాహిత్య సేవ అపరిమితం అంటూ, ఆధునిక సమాజంలో దేశకాల పరిస్థితుల్లో మార్పులతో స్త్రీల్లో కూడా మార్పు వచ్చిందంటూ, స్త్రీవాదం రాకముందునుండే స్త్రీలలో చైతన్యం వచ్చిందంటూ ,బండారు అచ్చమాంబ రచనలను ఉటంకిస్తూ ‘త్రయోదశి ‘ కథ ద్వారా సంసారాన్ని చక్కదిద్దుకున్న భార్య కథలో ఎంతో ముందుచూపు కనపడుతుందంటూ అలాగే తాటి నాగమ్మ గారి ‘ముద్దు ‘ కథ తన దృష్టిలో నేటికీ అద్భుతమైన కథంటూ పేర్కొన్నారు. విదేశీ వస్త్ర ,వస్తుబహిష్కరణ నేపథ్యంలో సాగిన కథలో ప్రచారం చేసే స్త్రీతో ఒక వ్యక్తి ముద్దు అడుగగా, విదేశీ వస్త్ర ,వస్తు బహిష్కరణలో భాగమౌతానంటే సోదరునిగా తలచి ముద్దు పెట్టడానికి అభ్యంతరం లేదంటూ ఇచ్చే సమాధానంతో సాగిన కథలో పరిస్థితులకనుగుణంగా ఎలా ప్రతిస్పందించాలో నాడే చెప్పడంద్వారా రచనల్లో పరిణతి కనిపించిందంటూ, ఇంత అద్భుతమైన కథ ఇప్పటివరకూ రాలేదని పేర్కొన్నారు . సంఘసంస్కరణల్లో భాగంగా స్త్రీ విద్య, రాజకీయ, ఆర్థిక చైతన్యంతో ఎన్నో రచనల్ని ఎంతోమంది చేశారంటూ మాలతీ చందూర్ లాంటి వారెందరో తమ రచనలతో సమాజాన్ని ప్రభావితం చేశారని ఆమె పేర్కొన్నారు.
ఉపకులపతిగా,సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో మాట్లాడుతూ : సంఘసంస్కర్త, భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా విధి నిర్వహణలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా దిగులుపడక రెట్టించిన ఉత్సాహంతో ఎంతోమందిని విద్యావేత్తల్ని చేశారని కొనియాడారు.
ఇలా అనేక సందర్భాలలో తమ ప్రసంగాలతో అలరిస్తూ, అద్భుత మైన తమ మేధాపాటవాలతో అబ్బురపరుస్తూ ముందుకు సాగుతున్న వారి అక్షర యాత్ర నిరాఘాటంగా సాగాలని, తెలుగు సారస్వత లోకంలో ఉజ్వలమైవెలుగొందాలని ఆకాంక్షిస్తూ…